Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 7


    
    అవసరం తీరిపోయింది. లేచి ఫ్యాంట్ జిప్ సరిచేసుకున్నాడు. ఇవతలకి రాబొతూ తల ఎత్తాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి.

 

    మూసేసిన బుకింగ్ తలుపులు మళ్ళి తెరిచివున్నాయి చెమిటి మాస్టర్ బుకింగ్ లో వున్నాడు. అదికాదు అతని ఆశ్చర్యానికి కారణం బుకింగ్ ఇవతల వరదరాజులు వున్నాడు.

 

    వరదరాజులు గౌతమ్ స్నేహితుడు. వాళ్ళిద్దరూ కలుసుకుని చాలాకాలం అయింది. ఇంటర్ తో చదువు ఆపి ఇంటికి వెళ్ళిపోయాడు వరదరాజులు. ఆ తరువాత నలుగయిదుసార్లు కలుసుకున్నారు. ఆరునెలల క్రితం ఇదే ఉళ్ళో కనపడి "తన చదువుకి ఏ జాబ్ రాలేదని అందువల్ల పెళ్ళి కూడా చేసుకోలేదని టి పొట్లాలు, బిస్కట్లు, బిళ్ళల ప్యాకెట్లు షాపుల కేసి నెలకి నూటయాభై రెండువందలదాకా సంపాదించి తన బ్రతుకేదో తను బతుకుతున్ననని ఇంట్లో పోట్లాడి బయటికి వచ్చేశానని" చెప్పాడు.

 

    "పాతిక ముపై రూపాయలకు రూమ్ చూసుకుని వుండాలి" అని వరదరాజులు చెబితే "ఎక్కడో ఎందుకు మా ఇంట్లో వుండు రూమ్ దొరికిందాకా" అన్నాడు గౌతమ్. "నీకే ఇది లేదు నా బరువుకూడా దేనికి ఇక్కడే వుంటాకదా మళ్ళి కల్సుకుం దాం" అని చెప్పి వెళ్ళిన వాడు మళ్ళి తిరిగి కలుసుకోలేదు. "నాకు కూడా నీలాంటిదే చిన్నదో చితకదో ఉద్యోగం చూడరా" అంటే "తప్పకుండా అని మాట ఇచ్చాడు.

 

    ఆరునెలల క్రితం కలిసిన వరదరాజులు మళ్ళి ఇన్నాళ్ళకి ఈ చోట కనపడటం ఆశ్చర్యంగా లేదు అతనికి, బుకింగ్ మూసేసిన అతడు మళ్ళి బుకింగ్ తెరవటం వరదరాజుతో మాట్లాడటం అంతేకాదు వరదరాజులు చెయ్యి జేబులోకి బయటికి వస్తూనే మళ్ళి బుకింగ్ కంతలోకి వెళ్ళి ఇరువురు ఏదో మాట్లాడుకున్న తరవాత గుప్పెటతో ఏదో తీసుకుని వరదరాజులు జేబులో పెట్టుకుని చిరునవ్వుతో ఏదో అని లోపలికి నడిచాడు.

 

    ఈ తఫా మరింత ఆశ్చర్యపోయాడు గౌతమ్.

 

    మరొకతను పదవంత కారులో వచ్చి అక్కడ దిగాడు. సరాసరి బుకింగ్ దగ్గరకు వెళ్ళి అతనితో ఏదో మాట్లాడాడు. అతను కూడా జేబులోంచి ఏదో తీసి బుకింగ్ లో చేయిపెట్టి మళ్ళి జేబులో ఆ చేతినలాగే వుంచుకుని హాలులోకి నడిచాడు.

 

    గౌతమ్ చెత్తకుండి చాటుగా నుంచోటం వల్ల గౌతమ్ ని ఎవరు చూడటానికి లేదు. గౌతమ్ కి మాత్రం అంతా కనిపిస్తున్నది గౌతమ్ అలా వుండిపోయాడు అక్కడే.

 

    ఆ తర్వాత మరో యిద్దరు రావటం బుకింగ్ లో చేతులు పెట్టి ఆపై హాలులోకి వెళ్ళటం జరిగింది. వాళ్ళు వెళ్ళిం  తర్వాత బుకింగ్ లో అతను బుకింగ్ తలుపులు మూసేసి గేటు కూడా వేసి అవతలికి వెళ్ళిపోయాడు.

 

    గౌతమ్ చాలా అనుకున్నాడు.

 

    వరదరాజుకి కూడా టిక్కెట్టు లేదు అంటాడు. అప్పుడు వాడు హాలు బయటికి వస్తే "సినిమా చూడటానికి వచ్చావా రాజులూ! టిక్కెట్లు అయిపోయాయి కదూ! నన్ను కలుసుకోకుండా సినిమాకి వస్తే అంతే మరి: అంటూ గెలిచేద్దామనుకున్నాడు.

 

    ఆ పని చేయలేకపోయాడు గౌతమ్.

 

    "టిక్కెట్లు అయిపోయాయి హాలు నిండింది అన్నాడే మరి నలుగురికేలా టిక్కెట్టు యిచ్చావు! వాళ్ళనెలా హాలులోకి పంపించావు?" అని అడుగుదామనుకున్నాడు.

 

    ఆ పని చేయలేక పోయాడు గౌతమ్.

 

    మొదటిసారిగా అతనికి ఏదో అనుమానం వచ్చింది. హాలు మొత్తం మీద ఎవరు కనపడలేదు. బుకింగ్ లో వున్న అతనొక్కదూ తప్పించి తనతో మాట్లాడేటప్పుడు చెమిటి వాడిగా నటించాడు. వచ్చిన నలుగురితో బాగానే మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే హాలులో సినిమా ఆడుతుందా లేక మరేదైనా! ఆ విషయం ఏది అతను చెప్పలేదు హాలు నిండింది అన్నాడు.

 

    గౌతమ్ అక్కడే వుండి అదేమిటో తేల్చుకుందామనుకున్నాడు. చెత్తకుండి పక్కన నుంచుని ఆ కంపు భరిస్తూ వుండేకన్నా సందు మొదట్లోకి వెళ్ళి నుంచోటం బెటర్ అనుకుని యివతలికి వచ్చేశాడు.

 

    ఆ సినిమా హలులోంచి జనం బయటికి వచ్చిం తరువాత సందులోంచి యివతిలికి వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కాల్సిందే సందుకి అటువేపు వెళ్ళడానికి లేదు ఏదో ఆఫీస్ తాలూకా బిల్డింగ్ అడ్డంగా వుంటుంది. వరదరాజులు హలులోంచి యిటు పక్కకి రావాల్సిందే.

 Previous Page Next Page