దీప పెదవి కొరుక్కుంటూ తల వంచేసుకుంది.
దీపకి ఆత్మాభిమానం ఎక్కువని తెలుసు అన్నపూర్ణమ్మకి. మధ్య మధ్య ఆదిలక్ష్మమ్మ డబ్బుకోసం, బియ్యం పప్పు, ఆ సమయానికి ఏ దవసరమో దానికల్లా అప్పు తెమ్మని పిల్లలని పంపిస్తుంటుంది. మళ్ళీ తీరుస్తుంటుంది.
దీప ఎప్పుడొచ్చినా అప్పు తీర్చటానికి మాత్రమే వస్తుంది. కాని అప్పు అడగటానికి రాదు. ఎన్నోసార్లు మాటల మధ్యలో "అత్తయ్యా! ఈ అప్పు తీసుకోవటం అనే దురలవాటు కూలీ జనం, మధ్యతరగతివారు, ధనవంతులు, కుబేరులు, ఆఖరికి దేముడయినా ఆ వెంకటరమణుడికి తప్పలేదు. ఎందుకంటావ్?" అనేది.
"ఎంతటి వారికయినా ఏదో ఒకనాడు అవసరం తప్పదు. అప్పు చేయక గడవదు .అవసరం అంటూ లేకపోతే అప్పుదాకా ఎవరూ పోరు" అంది తను.
"అవసరమే లేకపోతే?" అంది దీప.
"మనషన్న తర్వాత అవసరం పడకుండా వుండదు. ఆఖరికి ప్రాణంపోయిన తర్వాత కూడా ఆ కట్టెని తగలేయటానికి మరో మనిషి అవసరం వుంది. అది అంతే" అంది తను. "నిజమే. మనిషికి మనిషి అవసరమే కాని అప్పు చేయకుండా బ్రతకటమే గొప్ప. ఉన్నంతలోనే కలో గంజో తాగి పడుంటమే మరీగొప్ప" అంది దీప తనన్న దానికి ఓ పక్క ఆమోదించి.
ఆ రోజు సమయానికి ఇంట్లో పిల్లలు లేరో ఏమిటో దీపని పంపించింది. "అత్తయ్య, అత్తయ్య" అంటూ కబుర్లు చెబుతుంది, నవ్విస్తుంది. అలాంటిపిల్ల అడగటానికి అభిమానం అడ్డొచ్చి హరికథ చెప్పేసింది. "పిచ్చిపిల్ల" అనుకుంది అన్నపూర్ణమ్మ.
అన్నపూర్ణమ్మ మాట్లాడకపోవటం చూసి దీప మెల్లగా తల యెత్తి చూసింది.
ఆదిలక్ష్మమ్మ ఎప్పుడు అప్పుకి పంపినా అయిదూ, పదీ తప్ప ఆపై అడగలేదు. యాభయ్ రూపాయలు అడిగిందంటే, ఇంటికెవరైనా వచ్చుండాలి. లేక పెద్ద అవసరమే పడి వుండాలి.
"మీ యింటికెవరైనా వచ్చారా దీపా?"
"అవును. అక్క వచ్చింది."
"చెప్పావు కాదేం?"
"ఏదీ నన్ను చెప్పనిస్తేనా? ఏదో మాటొచ్చింది. ఇప్పటిదాకా హరికథ చెప్పటం సరిపోయిందాయె" నవ్వటానికి ప్రయత్నిస్తూ అంది దీప.
"ఊ... సరేలే మాటలు మాత్రం మాబాగా నేర్చావు. డబ్బులిస్తాను వెళ్లేటప్పుడు పట్టుకెళుదువుగాని!"
"ఊ."
"అవునూ ఉన్నట్లుండి లలిత ఎందుకొచ్చింది? అమ్మా నాన్నని చూసిపోదామనా?"
"అక్క మళ్ళీ తల్లి కాబోతుంది."
"లలితకి కడుపా? నాకు తెలీదుసుమా! పోనీలే ఈ తఫా అన్నా పండంటి బిడ్డను కని అత్తారింటికి తల్లీ పిల్ల వెడితే సరి!"
"ఒకతిగా వచ్చి యిద్దరుగా వెళ్ళితే మంచిదే" అనుకుంది దీప.
అన్నపూర్ణమ్మ, దీప మరో పావుగంట ఆ కబురు, ఈ కబురు చెప్పుకున్నారు. వెళతానంటూ దీప లేచింది.
"మనూ గదిలో వున్నాడు. వెళ్ళి మాట్లాడిరా వెళ్ళేటప్పుడు డబ్బిస్తాను మరచిపోయి వెళ్ళేవు" అంది అన్నపూర్ణమ్మ.
ఊ కొట్టింది. మన్ మోహన్ వుండేగది మేడమీద వుంటుంది. మెట్లవైపు నడిచింది దీప.
దీప వెళ్ళిన వైపే చూస్తూ "పిల్ల కుందనపు బొమ్మ" అనుకుంది అన్నపూర్ణమ్మ.
5
గదిలోకి వచ్చిన దీపని మన్ మోహన్ చూడలేదు.
గదంతా నిశితంగా పరీక్ష చేస్తూ గుమ్మంలోనే ఆగిపోయింది దీప.
మన్ మోహన్ కాలుమీద కాలు వేసుకుని మంచంమీద పడుకున్నాడు. ఓ చేత్తో ఏదో ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ తిరగేస్తున్నాడు. మరోచేత్తో సిగరెట్ కి పని కల్పిస్తున్నాడు. మ్యాగ్ జైన్ లోని అర్ధనగ్నం బొమ్మని చూస్తూ "వండ్రఫుల్" "వండ్రఫుల్" అన్నాడు పైకి.
"ఏమిటో ఆ వండ్రఫుల్!" అంది దీప.
మన్ మోహన్ చటుక్కున మంచంమీదనుంచి లేచాడు. దీపని చూసి, సిగరెట్ ని, మ్యాగ్ జైన్ ని కంగారుగా దాచే ప్రయత్నం చేయబోయాడు. అది విఫలం కావటంతో ఓ పక్కగా పెట్టి "ఎప్పుడొచ్చావ్, ఏమిటీ అడిగింది!" అన్నాడు.
"ఈ అలవాటు ఎప్పటినుంచి అని అడిగాను" సిగరెట్ వైపు చూస్తూ అంది దీప.
"ఇదా! ఇది... ఇది... ఆ...అప్పడప్పుడు ఫ్రెండ్స్ కాలుస్తూ ఇస్తే సభ్యతకోసం తీసుకుని తాగటం నేర్చుకున్నాను. భలేదానివి దీపా! నాకేం అలవాటయిందను కుంటున్నావా! ఉహూ నాకే దురలవాట్లూ లేవు."
"ఒక్క అబద్ధాలాడటం తప్ప."
"ఉహూ, అదయినా ఎంతో అవసరం అనిపిస్తే అప్పుడప్పుడు."
"ఎంతో అవసరమయినవి అప్పుడప్పుడు... అంతేనా?"
"అవును దీపా! అంతే ప్రామిస్."
"అతి స్వల్ప విషయానికి ప్రామిస్ దేనికిలే. ఇది కూడా అప్పుడప్పుడు అలవాటేమిటి ఖర్మ."
దీప పకపక నవ్వుతుంటే బలవంతం బ్రాహ్మణార్ధంలా తానూ నవ్వాడు మన్ మోహన్.
"కూర్చో దీపా!" అన్నాడు మన్ మోహన్ నవ్వటం ఆపుచేసి.
దీప మోడా లాక్కుని కూర్చుంది. "పట్నం కబుర్లేమిటి మనూ!" అంది.
"పల్లెటూరి కబుర్లేమిటో?"
"ముందు అడిగింది నేను, అక్కడి విశేషాలు చెప్పు."
"విశేషాలేమున్నాయి అన్నీ పాతవే. డొక్కు హాల్సు, డొక్కు సినిమాలు. చైతన్యం లేనట్లున్న రోడ్లు బాంబే, కలకటా, మద్రాస్ చూడు హెవీ రష్. కొత్త కొత్త పోకడలు, పెరుగుతున్న నాగరికత, క్షణక్షణానికి మారుతున్న ఫాషన్స్..."
"ఆగాగు, ఇవన్నీ చదువుకోటానికి అవసరమా?"
మన్ మోహన్ రెండు గుటకలు మింగి "అవసరం కాదనుకో" అన్నాడు.
"అన్నట్లు, నువ్వెప్పుడు బాంబే, కలకటా, మద్రాస్ చూశావు మనూ?"
"చూశానని నే చెప్పలేదే, అదేం అలా అడిగావు!"
"ఇందాక ఆ వూళ్ళ గురించి చెప్పావుగా!"
"ఓహో, అదా! అన్నీ చూడాలేంటి, చెప్పుకుంటుంటే వింటంలేదా! నీకేం తెలియదు దీపా!"