Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 6

 

      ఆవేశంగా తనను ప్రశ్నిస్తున్న హేమాద్రిశర్మ ముఖంలోకి చూసింది చీఫ్ మినిస్టర్ త్రిభువనేశ్వరీదేవి.
    
    "అధికారుల్లో చిత్తశుద్ది లేకపోవడం వల్లేగదా....సారా నిషేధం అమలు కాకపోవడం..."
    
    "అదే కాదు మేడమ్... ప్రభుత్వాధినేతలకు కూడా చిత్తశుద్ది లేక పోవడమే... తనని, తన పదవిని నిలుపుకోడానికి కృషి చేసే ఒక సి.ఎమ్. ఆ పదవిలో ఎన్నాళ్ళుంటాడో తెలియని పరిస్థితిలో....డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోడు. తీసుకునే సి.ఎమ్...ఆ పదవిలో ఎన్నాళ్ళో ఉండడు..."
    
    ఆ మాటకు సి.ఎమ్ కి కోపం వచ్చింది.
    
    "నో మిస్టర్ హేమాద్రి శర్మ... మన రాష్ట్రానికి సంబంధించినంత వరకే ఆలోచించండి....1968 వరకు మధ్యనిషేధం అమల్లో ఉండేది. ఏదయితే లోటుబడ్జెట్ అని మీరంటున్నారో, ఆ లోటు బడ్జెట్ అప్పుడు లేదా?
    
    1937లో తొలిసారిగా మద్యనిషేధాన్ని అమల్లోకి తెచ్చారు.
    
    అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చీఫ్ మినిస్టరుగా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) మధ్యనిషేధం వల్ల రాష్ట్ర ఆదాయానికి వచ్చే లోటును పూడ్చదానికి తొలిసారిగా రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలోనే తొలిసారిగా అమ్మకం పన్ను (సేల్స్ టాక్స్) ను ప్రవేశపెట్టారు. ఆనాటి మద్యనిషేధ చట్టం ప్రకారం వైద్య రసాయన రంగాల్లోనే ఆల్కహాల్ వాడాలి....ఆల్కహాల్ నిషేధమే 1937 నాటి లక్ష్యం. 1968 అక్టోబర్ 1న రాష్ట్రంలో ప్రొహిబిషన్ ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఎత్తేసారు.
    
    హేమాద్రిగారూ... అన్ని రంగాలలోనూ ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ లన్నీ సక్రమంగా వసూలు చేయగలిగిన రోజున సారా ద్వారా గవర్నమెంట్ కొస్తున్న ఆదాయానికి మించిన రెట్టింపు ఆదాయం గవర్నమెంట్ కు వస్తుంది...అవునా కాదా....అలాంటప్పుడు..."
    
    ఆమె మాటలకు అడ్డుగా వచ్చాడు హేమాద్రిశర్మ.
    
    "అమ్మా! మీకు కోపం రాకపోతే నేనో విషయం చెపుతాను....వింటారా?"
    
    "ఎందుకు వినను? మీతో ఈ విషయంలో పోట్లాటకు దిగడానికే ఎర్లీ మార్నింగే మిమ్మల్ని రమ్మన్నది" సి.ఎమ్ పెదవుల మీద చిన్న నవ్వు కదలాడింది.
    
    "ఒకప్పుడు సారా ఒక వ్యసనం.... కానీ ఇప్పుడు అదొక వ్యవస్థ గవర్నమెంటుల్ని, ప్రభుత్వాధినేతల్నీ శాసించగలిగే వ్యవస్థ ఎన్నికలకూ, ఓట్లకూ పునాదుల్లా నిలుస్తున్న వ్యవస్థ....మద్యాలు అమ్మేవారిపై ఎక్సయిజ్ అధికారులు జరుపుతున్న దాడులు.... కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగులుతున్నాయని మీకు తెలుసు- చాలామంది ఎక్సయిజ్ అధికారులే స్వయంగా సారా దుకాణాలను బినామీ పేర్లతో పాదుకొని నడుపుతున్న విషయం....జగమెరిగిన సత్యం. ఆ మధ్య హుజురాబాద్ లో ఎక్సయిజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ మొహిసిన్ ఆలీబేగ్, సబిన్స్ పెక్టర్ ఇబ్రాహీంలను, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ దొంగ సారా రవాణా చేస్తుంటే రెడ్ హేండెడ్ గా పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతటా చాలా జరుగుతున్నాయి. ఈ అధికారులకు... మీ పొలిటీషియన్స్ అండదండలే వున్నాయి. రాష్ట్రంలో వందమందికి పైగా ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మధ్యవ్యాపారంతో సంబంధాలు వున్నాయి.... కర్నూలు జిల్లాలోని 13 మంది ఎమ్మెల్యేల్లోనూ 9 మందికి ఈ వ్యాపారం వుంది. చిత్తూరులోనూ అంతే! తమ వ్యాపారాలకి ఏమాత్రం హాని జరిగినా వీరు ప్రత్యర్దులను ప్రాణాలతో వదలరు....ఈ బడా వ్యాపారస్తులు...సారా కాంట్రాక్టర్ల చేతుల్లో కీలుబొమ్మలు నిజానికి మనరాష్ట్రంలో అధికారం మొత్తం మద్యం చుట్టూ కేంద్రీకృతమై వుంది...
    
    అదొక విషనాగుల వలయం....ఆ వలయాన్ని ఛేదించడం....ఇప్పట్లో సాధ్యం కాదు....కావలిస్తే మీ మంత్రుల్ని అడగండి.....మంత్రులంతా ఎందుకు....ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్యగారినే అడగండి....చెపుతారు.
    
    ఆ వలయాన్ని చేదించాలనుకోవడం, అబ్బయ్యనాయుడు లాంటి వారికి ఎదురు నిలవాలనుకోవడం అసాధ్యం....దుస్సాహసం కూడా... ఇది నాకు తెల్సిన నిజం చెపుతున్నాను.....తర్వాత మీ ఇష్టం" చెప్పి తల వొంచు కున్నాడు హేమాద్రిశర్మ.
    
    "ఏ మినిస్టర్ని అడిగినా, ఏ ఎమ్మెల్యేని అడిగినా, ఏ.ఐ.ఎ.యస్. ఆఫీసర్ని అడిగినా, ఏ పోలీస్ అఫీషియల్ ను అడిగినా మాటాడితే అబ్బయ్యనాయుడు- అబ్బయ్యనాయుడు అంటారు! ఎవడండీ వాడు? ఆఫ్ట్రాల్ ఓ సారాకాంట్రాక్టరు అంతేగదా.... ప్రభుత్వం ఒక వ్యవస్థ.... పటిష్టమయిన ప్రజల వ్యవస్థ. ఆ వ్యవస్థ వ్యక్తులకు భయపడితే యెలాగండి...."త్రిభువనేశ్వరి మాటల్లో ఎంతో చిత్తశుద్ది వుంది. ఎంతో బాధ వుంది.
    
    ఆ బాధను అర్ధం చేసుకున్నాడు హేమాద్రిశర్మ.
    
    "ఈనాడు ఒక్కొక్క సారా కాంట్రాక్టరు ఒక్కొక్క వ్యవస్థ అమ్మా....ఈ వ్యవస్థ తయారుచేసిన వికృత రూపమే అబ్బయ్యనాయుడు- మీ గవర్నమెంట్ రానంతవరకూ గరవ్నమెంటు జీవోలన్నీ అబ్బయ్యనాయుడు ఇంటినుంచే విడుదల అయ్యేవి.... ఇది ముప్పయ్యేళ్ళ ఆంద్ర రాష్ట్ర చరిత్ర. ఇరవై యేళ్ళ వరకూ అబ్బయ్యనాయుడు తండ్రి జగపతినాయుడు ఈ సారా మాఫియా ముఠాకి నాయకుడు.... పదేళ్ళుగా అబ్బయ్యనాయుడు ఆ యంత్రాంగాన్ని నడుపుతున్నాడు....రాష్ట్ర మొత్తమ్మీద జరిగే సారాపాటలు-ప్రవహించే అక్రమ సారా.... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హూచ్, గుడంబా, ఫెనీ, నకిలీ సారా, ఇక్కడ జరిగే ఎలక్షన్ లు... గెలిచే నాయకులు కదిలే ఎక్సయిజ్ డిపార్టు మెంటు మొత్తం వ్యవస్థకు.... సుప్రీం అబ్బయ్యనాయుడు అదొక ప్యారలల్ గవర్నమెంట్ వ్యవస్థ- అందుకే మిమ్మల్ని ఆచితూచి అడుగేయమంటున్నాను. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను."
    
    త్రిభువనేశ్వరికి కోపం రాకుండా యదార్ధ పరిస్థితిని చెప్పుకొచ్చాడు హేమాద్రిశర్మ.
    
    "నాకు మీరు పిరికిమందు నూరిపోస్తున్నారు. ఈ రాష్ట్రం సారా కాంట్రాక్టర్లది కాదు. ఈ రాష్ట్రం సాధా ప్రజలది. వాళ్ళకు న్యాయం జరగనప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గా వుండటం అనవసరం" అని లేచి నిలబడింది త్రిభువనేశ్వరీదేవి.
    
    మరేం మాట్లాడలేదు హేమాద్రిశర్మ.
    
    హాల్లోంచి బయటకొచ్చింది సి. ఎమ్. పి.ఎ. అరవింద్ విష్ చేశాడు వినయంగా.
    
    ఆమెకోసమే ఎదురుచూస్తున్న ఇంటెలిజెన్స్ ఐజి, ఎక్సయిజ్ కమీషనర్ ఆమె రాగానే లేచి నిలబడ్డారు వినయంగా.
    
    "మేడమ్... ఒక్క నిమిషం..." ఎక్సయిజ్ కమీషనర్ అడుగు ముందుకేసాడు.
    
    "ఇవాళంతా ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ తోనే గడిచిపోయేట్టుంది" హేమాద్రిశర్మవైపు చూస్తూ జోక్ వేసి, కమీషనర్ వైపు తల తిప్పి చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "వాట్స్ ద మేటర్? చెప్పండి"
    
    "నెల్లూరు నుంచి మెసేజ్ వచ్చింది మేడమ్!" నెల్లూరు అన్న మాటను వినగానే సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి ఆసక్తిగా ఒకడుగు ముందుకేసింది.
    
    "చెప్పండి..."
    
    "సారా కాంట్రాక్టర్ అబ్బయ్యనాయుడు యాక్టివిటీస్ మీద నిఘా క్సోం హెడ్ క్వార్టర్స్ నుంచి మనం నెల్లూరు పంపించిన ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీకర్... నిన్న రాత్రి దారుణంగా చచ్చిపోయాడు మేడమ్...
    
    భువనేశ్వరీదేవి ముఖంలో అంతవరకూ ఉన్న భావాలన్నీ ఒకసారిగా చెదిరిపోయాయి.
    
    "ఎలా జరిగింది?" విస్తుపోతూ అడిగింది.
    
    "అతను....అవసరమైన డాక్యుమెంట్స్ సంపాదించి, తుఫాన్ కారణంగా, లోకల్ ఆఫీసుకు రాలేకపోతున్నానని, హైద్రాబాద్ వెళ్ళిపోతున్నానని నెల్లూరు...ఎక్సయిజ్ సూపరింటెండెంట్ కి రాత్రి పదిగంటల ప్రాంతంలో ఫోన్ చేసి చెప్పాడట మేడమ్.

 Previous Page Next Page