Previous Page Next Page 
ముగ్ధ పేజి 7

   

     కుర్తా పైజామాలో అప్పుడే బొంబాయి నుండొచ్చిన హిందీ స్టార్ లా వుంది. చూడగానే ఎవరిలోనయినా పోకిరి ఆలోచనల్ని రేకెత్తించే స్టన్నింగ్ బ్యూటీ.
    
    "ఎంత సేపయింది వచ్చి ఏరీ మనవాళ్ళు రాలేదా బొత్తిగా టైమ్ సెన్స్ లేదు."
    
    కుర్చీ లాక్కుని కూర్చుంది అలక.
    
    అలక ఇంట్లో అలక నాలుగో అమ్మాయి తండ్రి దేవస్థానంలో చిరుద్యోగి. ఒకన్నయ్య ఉన్నాడు. కానీ వాడెప్పుడో చిన్నప్పుడే సినిమాల వ్యామోహంలో పడి మద్రాసు వెళ్ళిపోయాడు. ఇప్పటికీ తిరిగి రాలేదు.
    
    నలుగురు ఆడపిల్లల్లో ఏ ఒక్కరికి పెళ్ళి చేయలేకపోయాడు అలక తండ్రి. పెద్ద కూతురు తనకిక పెళ్ళి చెయ్యరని తెలిసి పెళ్ళి కాదని నిర్ణయించుకుని, బ్రహ్మోత్సవంలో దేవుడ్ని చూడ్డానికి వెళతానని చెప్పి, మరి రాలేదు.
    
    తర్వాత దేవుడి ఊరేగింపు రధంకింద పడి చచ్చిపోయిందని ఎవరో చెప్పడంతో, ఇంటిల్లిపది భోరుమంటూ వెళ్ళారు.
    
    నిన్నటి వరకూ కళకళ్ళాడిన అక్క - అక్క శవాన్ని చూడలేకపోయింది అలక.
    
    బ్రహ్మోత్సవంలోగా తనకి పెళ్ళి సంబంధం కుదరకపోతె, నీ ఎదుటే రధం ముందు పడి చచ్చిపోతానని దేవుడితోనే సవాల్ చేసిందని, ఆ ప్రకారమే చేసిందని ఆ ఇంట్లోని వాళ్ళెవరికీ తెలీదు.
    
    అందరూ హాయిగా, ఆనందంగా బతుకుతుండగా, తమ బతుకులు ఎందుకలా అధ్వాన్నంగా, అన్యాయంగా ఉన్నాయో ఎప్పుడూ అర్ధంకాని మిస్టరీ అలకకు.
    
    అందుకే అలక తనచుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించింది. బతకడానికి, హాయిగా బతకడానికి, తన చుట్టూ ప్రపంచాన్ని తిప్పుకొంటూ బతకడానికి, శాసిస్తూ, బతకడానికి తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి, తన వయసుని తన జీవితానికి కాపలాగా పెట్టి బతకాలని ఎప్పుడో నిర్ణయించుకుంది.
    
    అందుకే సరయిన సమయంకోసం ఎదురు చూస్తోంది అలక.
    
    I am not interested in money- I just want to be wonderfull.
    
    అన్న ఆశతో, ఆకలి కేకలమధ్య, దుర్భరమైన పేదరికం మధ్య పెరిగి, హాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగిన మార్లిన్ మన్రో అంటే ఇష్టం అలకకు. జపాన్ లో బార్ సర్వర్ గా వుంటూ, తన అందంతో ఇండోనేషియా ప్రెసిడెంట్ డాక్టర్ సుకర్నోని ఆకర్షించి, ఇండోనేషియాకి 'ఫస్ట్ లేడీ' అయింది రత్నసరిదేవి. ఆ రత్నసరిదేవి ఆటోబయోగ్రఫీ అంటే చాలా ఇష్టం అలకకు.
    
    అలాగే నేటి మేటి సంచలన హిందీనటి రేఖ-భానురేఖా అని పిలవబడే రేఖ గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామానికి చెందినా అమ్మాయని ఎందరకు తెలుసు?
    
    ఒక వ్యక్తిని ప్రేమించి, అతని నిరాదరణకు గురయిన తల్లి, మాజీ నటి పుష్పవల్లినే కాక ఆరుగురు కుటుంబ సభ్యుల్ని పోషించాల్సిన బాధ్యత, పదిహేనేళ్ళ రేఖమీద పడింది. సన్నగా, అశోక వృక్షంలా అందంగా మెరిసే రేఖ జీవితాశయం కూడా అదే. ఎలాగయినా పైకి రావాలని తన అందానికి పరిధి బొంబాయని నిర్ణయించుకుని అక్కడకు బయలుదేరింది. ఇవాల్టి రేఖ వెనక ఉన్న నిన్నటి రేఖ జీవితాన్ని చూస్తే, మార్లిన్ మన్రో, సోఫియాలారెన్ కనిపిస్తారు.
    
    అందుచేతే అలకకు రేఖంటే ఇష్టం.
    
    కానీ వాళ్ళలా అందలం ఎక్కడానికి, సంవత్సరాల కాలం తను వెయిట్ చెయ్యలేదు.
    
    "హలో! ఇప్పుడేనా రాక" సురభి, నీలిమ ఒకేసారి అక్కడ ప్రత్యక్షమయ్యారు.
    
    సురభి కుదురుగా ఒకింత బొద్దుగా వుంటుంది. తెలంగాణలోని నల్గొండ ఆమె స్వగ్రామం.
    
    ఇద్దరక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి నిజాం నవాబు కెదురుగా పోరాడినవ్యక్తి. తండ్రి చనిపోయాక కుటుంబాన్ని ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న తల్లే లాక్కొస్తోంది. ఇద్దరక్కలకూ పెళ్ళిళ్ళయిపోయాయి. తమ్ముడు బ్యాంక్ లో వుద్యోగం చేస్తున్నాడు.
    
    ఒక ఆశయం, ఒక సిద్దాంతమే జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుందని తండ్రి నమ్మేవాడు. ఆ నమ్మకమే సురభికి కూడా వచ్చింది. ఆ అమ్మాయికి చిన్నప్పటినుంచి సంప్రదాయ బద్దంగా ఉండడం ఇష్టంలేదు. గాంధీజీ వెనక కస్తూరిబాయి, నెహ్రూ వెనక కమల, రామకృష్ణ పరమహంస వెనక శారదాదేవి, శివాజీ వెనక జిజియాబాయి.
    
    పురుషుడు సాహ్దించే విజయానికి స్త్రీ బలమైన ఆసరా కావాలి. అందుకు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నాయి.
    
    ఒక మగవాడికి తను ఇన్ స్పిరేషన్ కావాలి. ఆ మగవాడి ఉనికి ప్రపంచపు ఉనికి కావాలి. ప్రపంచంలో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించదానికి ఒక మగవాడిని తను పురికొల్పాలి.
    
    సురభి లక్ష్యం అదే. ఆ లక్ష్యం ఆమెలో ఎప్పుడు ఏర్పడిందో తెలీదు. కానీ అది ఆమె వయసుతోపాటు ఎదుగుతూనే వుంది. తనకు కావలసిన మనిషిని ఆమె వెతుకుతూనే వుంది. ఆఖరికి ఆమె అన్వేషణ ఫలించింది. అందుకు శ్రీధర్ ని ఎంచుకుంది.
    
    "ఏమిటే ఇంతాలస్యం" ముగ్ధ అడిగింది సురభి.
    
    "నాపని నేను కానిచ్చే వచ్చేను" అంది కుర్చీలో కూర్చుంటూ సురభి.
    
    "అంటే" నీలిమ ఆశ్చర్యపోయింది.
    
    "అంటే.... నా.... మరిక్కడ మన కుర్రాళ్ళను మనం వెతుక్కోవాలి గదా. నా కుర్రాడు నాకున్నాడు గదా ఆ కుర్రాడ్ని ఇక్కడకు రమ్మని, అర్జంటుగా మాట్లాడాల్సి వుందని చెప్పి వచ్చాను" నవ్వుతూ అంద్బి సురభిని.
    
    "ఏమన్నారు" అందరి నోటంతా ఎక్సయిటింగ్ గా ఆ మాట వచ్చింది.
    
    "ఆయనకేం అర్ధం కాలేదు. మనం లేబరేటరీలో మాట్లాడుకుంటే సరిపోదా అన్నారు. కాదుసార్.... నా జీవితానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయం సార్ అన్నాను. నీ లైఫ్ కి సంబంధించిన పాయింట్ అయితే వస్తానులే. అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" చెప్పింది సురభి.
    
    "అయితే నీ లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట..." అలక అంది.
    
    "ఫస్టు నుంచీ సూపర్ ఫాస్టు కదా" నీలిమ అంది నవ్వుతూ.
    
    నీలిమ-
    
    నీలిమ తండ్రి ఓ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. చాలాకాలం సెక్రటేరియట్ లో చాలా పోస్టుల్లో పనిచేసాడాయన.
    
    ఆయనకు ఇద్దరూ ఆడపిల్లలే. పెద్దమ్మాయికూడా ఐ.ఎ.ఎస్. ఆఫీసరే. పిల్లల్ని ఆయన చాలా క్రమపద్దతిలో పెంచాడు. ప్రతి విషయాన్నీ శాస్త్రీయంగా ఆలోచించడం, ప్రతి అడుగునీ ఆలోచించి చేయడం తండ్రి దగ్గర్నుంచే నేర్చుకుంది నీలిమ.
    
    తండ్రిలా, అక్కలా తను ఐ.ఎ.ఎస్. కావాలని అనుకోలేదు నీలిమ. ఈ ఐ.ఎ.ఎస్. అధికారులకు స్వతంత్రత వుండదని నీలిమ వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వాన్ని నడిపించే పార్టీల చెప్పుచేతల్లో పెద్ద పాలేర్ల లా పనిచేసేవాళ్ళే ఇలాంటి అధికారులని తండ్రి అనుభవం ద్వారా తెల్సుకుంది నీలిమ.
    
    ఖాకీ దుస్తులేస్తే పోలీసు అధికారులు, వాటిని తీసేస్తే ఐ.ఎ.ఎస్. అధికారులు అంతే తేడా.
    
    మామూలు మనిషికి ఈ ఇద్దరివల్లా వరిగేదేమీ లేదని, నీలిమ నిశ్చితాభిప్రాయం. ఆ విషయంలోనే తండ్రి, కూతురితో సరదాగా వాదించేవాడు.

 Previous Page Next Page