గబగబా చీటీల్ని విప్పారు.
ముగ్ధ చేతిలోని చీటీమీద 'తెలివితేటల్ని, నేర ప్రవృత్తిని అడ్డం పెట్టుకుని బ్రతికే యువకుడు.'
నీలిమ చేతిలోని చీతీమీద 'ఉద్రేక స్వభావి.'
ఆ ముగ్గురు వ్యక్తిగత అభిరుచులకు భిన్నంగా వున్నాయి ఆ చీటీలు.
రెండు నిమిషాలసేపు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. తీవ్రమైన విద్యుద్ఘాతం తగిలినట్లుగా అయిపోయారు. తాము కోరుకునే మనస్థత్వాలకు వ్యతిరేకమైన వాళ్ళు జత కాబోతున్నారు.
అందుకే ముగ్గురూ పైకి కనిపించకపోయినా డీప్ షాక్ కి లోనయ్యారు.
చాలాసేపటివరకూ కోలుకోలేకపోయారు. ఒక అసత్యం కొన్ని లక్షల అసత్యాలకు దారితీసినట్లుగా, ఒక నిర్ణయం ఎన్నో విషమ పరిస్థితులకు హేతువు కాబోతోంది.
పక్కనున్న అబ్బాయిలు, అమ్మాయిల్లో గుసగుసలు.
"ఓ.కే. ఫ్రెండ్స్! చీటీల్లో వచ్చిన వ్యక్తులు ఎలాంటివారయినా, మన వ్యక్తిగత అభిరుచులకు వ్యతిరేకంగా వున్నవాళ్ళయినా మన షరతులకు మనం లోబడి వుండాలి. అబ్బాయిల్ని ఎంచుకోవడం మొదటి కార్యక్రమమైతే, వాళ్ళని మనవేపు తిప్పుకోవడం, వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడం రెండో కార్యక్రమం. దీని గడువు ఒక ఏడాది. ఈ ఆధునిక స్వయంవారం ప్రారంభమైన రోజునుంచి, అంటే పన్నెండు నెలలు, అంటే మూడువందల అరవై ఐదు రోజులు. 8,760 గంటలు. 5,25,600 నిమిషాలు. 3,15,36,000 క్షణాలు మన జీవితంలో అతిముఖ్యమైనవిగా మనం గుర్తుంచుకోవాలి. జీవితమనే రాకెట్ ను, వ్యక్తిత్వ మనే ఆకాశంలోకి ప్రవేశపెడుతున్న అరుదైన సమయమిది. ప్రతిక్షణం, ప్రతీ నిమిషం మనకు అతి విలువైనదన్న విషయం మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఎల్లుండి ఆదివారం డిసెంబర్ 31 ఆరోజు అర్దరాత్రి 'జీరో' అవర్స్ దగ్గర్నించి మన ఉద్యమం ప్రారంభమౌతుంది. సరిగ్గా ఏడాది తర్వాత డిసెంబర్ 31 జీరో అవర్స్ లో చంద్రగిరి కోటలో మనం కలుసుకుంటాం. ఏ పరిస్థితుల్లో వున్నా, ఎలా వున్నా, ఈ ప్రయోగంలో విఫలమైనా, సఫలమినా మనం కలుసుకోవాలి. మనం అభిమానించే వ్యక్తుల్ని, మనం ప్రేమించే వ్యక్తుల్ని మనం పెళ్ళిచేసుకోవాలనే రూలేం లేదు. ఆ వ్యక్తుల్ని పూర్తిగా నమ్మినవాళ్ళు, ఆ వ్యక్తుల్ని పూర్తిగా మనకు అనువుగా మలుచుకొన్న వాళ్ళు చేసుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. కానీ ప్రతీ నెలకూ ఒకసారి మనం ఎక్కడవున్నా కాంటాక్ట్ చేసుకోవాలి. రిటన్ గా మన ప్రోగ్రెస్ కు సంబంధించిన రిపోర్టు పంపుకోవాలి. మనం మర్చిపోకుండా చెయ్యాల్సిన పనుల్లో యిదొకటి" ముగ్ధ నోటంట చకచకా వస్తున్న మాటల్ని ఆ ముగ్గురూ విస్మయంగా వింటున్నారు.
"ఏ ఒక్కరి ప్రయోగమైన ఫెయిలైతే!" అలక అడ్డుప్రశ్న వేసింది.
"పిరికితనం వుండకూడదని మొదటే చెప్పాను. ఇక మనం యిష్టపడిన వాళ్ళు, మనల్ని యిష్టపడినవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత మనకు ద్రోహం చేసిన పక్షంలో, మనకెదురయిన పరిస్థితిని మనమే తీర్చిదిద్దుకోవాల్సిన స్థయిర్యం, ధైర్యం మనకున్నాయని నేను నమ్ముతున్నాను."
ముగ్ధ మాటకు మరెవ్వరూ యింకే ప్రశ్న వెయ్యలేదు.
"మన ఈ ఆధునిక స్వయంవరాన్ని తిరుపతి కొండమీద పెడితే బావుంటుంది. ఏమంటారు?" మళ్ళీ అంది ముగ్ధ.
"గుడ్.... ఐడియా... ఎస్... ఇట్స్ ఏ కరెక్ట్ ప్లేస్ అక్కడైతేనే రకరకాల మనస్తత్వాలు మనకెదురౌతాయి. వైడ్ ఛాయిస్ వుంటుంది. అందులోంచి మనం ఎంచుకోవచ్చు..." హేపీగా అంది అలక.
"అయితే ముహూర్తం."
"అనుకున్నాం గదా ఎల్లుండి డిసెంబర్ 31 ఆదివారం కూడా"
"ఓ.కే. ఓ.కే. డన్."
చినుకు చిన్నదే అయినా, ఆ చినుకు నదిలో పడితే నడిలాగా, సముద్రంలో కలిస్తే స్ముద్రంలాగా, వరదలో కలిస్తే వరదలాగా కన్నీళ్ళలో కలిస్తే కన్నీళ్ళలాగా, ముత్యపుచిప్పలో కలిస్తే ముత్యంలాగా మారుతుంది.
అలాంటిదే జీవితంలోని ఒక్క క్షణం.
రోడ్డు మీద వెళ్ళేవాడి మనసులో ఒక్కక్షణంలో ఓ ఆలోచన పుడుతుంది. పక్కనున్న దుకాణంలో కెళ్ళి లాటరీ టిక్కెట్ కొంటాడు. మరుసటి రోజు వడి జీవన స్వరూపమే మారిపోతుంది. మరొకడు మాయచేసి, మోసంచేసి, కుట్రలూ, హత్యలు చేసి లక్షలు లక్షలు సంపాదిస్తాడు. దేవేంద్ర భవనంలాంటి దివ్య భవనంలో కూర్చొని తన తెలివి తేటలు, తన అదృష్టం ముందు ఏ ఒక్కడూ పనికిరాడని ఆనందిస్తుంటాడు. మరుక్షణంలోనే పునాదులు కూలిపోతాయి. కట్టుకున్న స్వంత భవనమే వాడిని కబళిస్తుంది. రోడ్డుమీద పూట గడవక తిరిగిన మార్లిన్ మన్రో ప్రపంచ శృంగార రసాధి దేవతగా మారడానికి ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం ఫలితమే. ప్రపంచాన్ని శాసించిన సద్దాంహుసేన్ పతనానికి ఆ ఒక్క క్షణమే కారణమవుతుంది. ఆశకూ, దురాశకూ మధ్య గీతే ఒక్కక్షణం నిరాశకు, నిరాశలోంచి పుట్టిన ఆత్మవిశ్వాసానికి మధ్యనున్నది ఒక్క క్షణమే.
అదృష్టానికి, దురదృష్టానికి మధ్య ఒక్కక్షణమే మానవ జగతిని శాసించేది ఆ ఒక్కక్షణమే.
ఆ ఒక్క క్షనంలోకి ఆ నలుగురమ్మాయిలూ మరో ముప్పైగంటల్లో ప్రవేశించబోతున్నారు.
* * * * *
ఆ రోజు డిసెంబర్ 31 ఆదివారం.
ముందుగా ఫోన్ చేసి, బుక్ చేసిన తిరుమలలోని ఆ కాటేజ్ లోకి అడుగుపెట్టింది ముగ్ధ.
ముగ్ధ నల్లగా ఉన్నా తన నలుపు రంగుకి తానేమి బాధపడదు. ఆమె నలుపులోని ముగ్ధత్వం చాలా అరుదు. మొదటి చూపులో వయసు పరమయిన ఒంపు సొంపుల ఆకర్షణే కనిపించినా, ఆ పైన చూసిన కొద్దీ ఆమెను శాశ్వతం చేసుకోవాలనిపిస్తుంది ఎవరికయినా! ఆమెలోని చిలిపితనం, వల్నరబిలిటీ, సెన్సాఫ్ హ్యూమర్, కవ్వించే కళ్ళు, టెమ్ట్ చేసే అద్భుతమైన వైటలోస్టాటీస్టిక్స్ ఆమె పరమయిన ఆకర్షణలు.
చంద్రగిరినుంచి వచ్చిన తర్వాత్య తాము తీసుకున్న నిర్ణయంవల్ల వచ్చే పరిణామాల గురించే ఆలోచించింది.
మనసులో ఏదో ఎక్కడో సహజంగా వుండే చిన్న జంకు తనని చిన్నప్పటి నుంచీ పెంచిన అన్నయ్య వదిన ఏమంటారు? ఎక్కడో ఒరిస్సాలోని భువనేశ్వర్ లో వున్న అన్నయ్యకు ఫోన్లో చెప్పి, అనుమతి తీసుకుంటే? కనీసం వదినతోనైనా చెప్తే? ఫోన్లో ఏమని చెపుతుంది?
తీసుకున్న నిర్ణయం ప్రకారం క్రైమ్ బ్రాంచ్ లో ఉద్యోగం వచ్చిందని, ఈ విషయాన్ని అతిరహస్యంగా వుంచాలని, ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుందని మధ్యలో ఒకసారి వస్తానని, అన్నయ్యకు ఉత్తరం రాసేసింది రాసేసి ఆలోచనలో పడింది- బెంగ- ఆ బెంగతో ఒక పూట భోంచెయ్యలేదు కూడా.
కానీ ఇది తన జీవితం తన జీవితానికి సంబంధించిన విషయం. అనుకోని అవాంతరం వస్తే, తన జీవితాన్ని తను సర్దుకోగలనన్న ధీమా వుంది.
ఆ నమ్మకమే ధైర్యాన్నిచ్చింది ముగ్ధకు.
కాటేజి వరండాలో కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న ముగ్ధ.
"హాయ్" అని పలకరింపు వినబడేసరికి తలెత్తి చూసింది ఎదురుగా అలక, పసుపు పచ్చని పసిడి ఛాయ.