Previous Page Next Page 
ముగ్ధ పేజి 8

   

     ఐ.ఎ.ఎస్. అధికారులు ఎక్కడో ఒకటో, ఆరో ప్రభుత్వ దుర్నిర్ణయాల్ని తప్పని పరిస్థితుల్లో అమలు చేసేవాళ్ళుంటారుతప్ప, ఎక్కువ మంది స్వతంత్ర నిర్ణయాలతో పనిచేసేవాళ్ళేనని, అందుకే రాజకీయ నాయకుల కన్నెర్రకు వాళ్ళు తరచూ గురవుతూ వుంటారని తండ్రి వాదన.
    
    కూతురితో ఈ వాదన జరిగిన మర్నాడే-
    
    ఒక స్కూటర్ ఏక్సిడెంట్లో నీలిమ తండ్రి దారుణంగా చనిపోయాడు.
    
    ప్రతి పక్షాలకు అడ్డంకుగా ఉనందని ఈ హత్యా చేయించారని కొంత మంది గుసగుస లాడారు.
    
    కాదు అధికార పార్టీకి చెందిన కొంతమంది కంట్రాక్టర్లు ఈదారుణానికి బాధ్యులని మరికొంతమంది.
    
    ఈ విషయమై న్యూస్ పేపర్లలో చాలా గొడవ జరిగింది.
    
    ప్రభుత్వాధికారులు మొట్టమొదటి సారిగా ఒక ఊరేగింపు జరిపారు.
    
    పర్యవసానంగా ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీ కొన్నేళ్ళుగా దర్యాప్తు చేస్తూనేవుంది. కానీ నేర నిరూపణ జరగలేదు. తండ్రి దారుణ హత్యకు కదిలిపోయింది నీలిమ.
    
    ప్రభుత్వంమీద, ఈ రాజకీయ పార్టీలమీద, న్యాయ వ్యవస్థమీద, న్యాయ వ్యవస్థను తమ టోపీల్లో పెట్టుకుని పదిలంగా కాపాడుతున్న పోలీసులమీద నమ్మకం పోయింది నీలిమకు.
    
    అప్పుడే మొట్టమొదటిసారి నిర్ణయించుకుంది ఐ.ఎ.ఎస్. కావాలని.
    
    ఏ స్ట్రిక్టు ఆశయాలతో, వ్యక్తిత్వంతో నిలిచి తండ్రి అకాల మరణానికి గురయ్యాడో, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు తను ఆదర్శంగా నిలబడాలని, ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థను ఎదిరించాలని నిర్ణయించుకుంది.
    
    కానీ-
    
    చంద్రగిరి కోటలో స్నేహితురాళ్ళమధ్య జరిగిన చర్చలు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం విషయమై రెండ్రోజులు సీరియస్ గా ఆలోచించింది నీలిమ.
    
    తను సాధించే లక్ష్యాన్ని, ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం బలిగొంటుందా?
    
    తను, తన స్నేహితులతోపాటు తీసుకున్న నిర్ణయంలో ఓ థ్రిల్ వుంది. ఆ థ్రిల్ వెనక సాహసం వుంది.
    
    అలాంటి సాహస కార్యాలు చేయడమంటే చిన్నప్పటినుంచీ సరదా నీలిమకు.
    
    అందుచేత తనూ "ఓ.కే." అంది.
    
    ముగ్ధ, అలక, సురభి, నీలిమ.
    
    నిండు సున్నాని నాలుగు భాగాలుచేస్తే నలుగురూ నాలుగు రకాలుగా కనబడతారు.
    
    ముగ్ధ అతి గారాబంగా పెరిగింది. ఉన్నతంగా బతకాలని ఆశవున్నా, దాన్ని ఎప్పటికయినా సాధిస్తాననే నమక్మంతో బతుకుతున్న అమ్మాయి.
    
    అలక-ఆమెకు బతుకంటే పేదరికం. ఈ పేదరికంలోంచి చటుక్కున పైకి రావాలనే ఆశ ఆమెను నిరంతరం వేధిస్తూనే వుంటుంది. నిద్ర పోనివ్వని కోరికలతో బతుకున్న నరకంలోంచి బయటపడాలని అనుక్షణం ప్రయత్నిస్తూ, అందుకు ఏమైనా చెయ్యాలని నిర్నయించుకున్న అమ్మాయి.
    
    సురభి-బలమైన ఆశయంతో, దృఢమైన మహా సంకల్పంతో ఏమైనా సాధించగలనన్న నమ్మకంగల అమ్మాయి.
    
    నీలిమ-సాహసమే ఆశయంతో జీవితానికి పునాది. ఎవ్వరెదురాయినా, స్వయం వ్యక్తిత్వంతో ప్రకాశించగలననే ఆత్మ విశ్వాసంకల అమ్మాయి.
    
    జీవితం ఎప్పుడూ నాలుగు దారుల కూడలి-క్రాస్ రోడ్స్.
    
    ఆ క్రాస్ రోడ్స్ మధ్యన ప్రస్తుతం ఆ నలుగురమ్మాయిలూ నిలబడ్డారు.
    
    "ఇళ్ళల్లో ఎవరయినా చెప్పారా" ముగ్ధ అడిగింది మిగతా ముగ్గుర్నీ.
    
    "నేను యింట్లో ఏ విషయమూ చెప్పనని నీకు తెల్సుకదే" అంది అలక.
    
    సురభి, నీలిమ, ముగ్ధ హాస్టల్ లో వుంటున్నారు.
        నీలిమకు మాత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళక్కకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది. కానీ ఆ ఆలోచనను విరమించుకుంది.
    
    "రెండ్రోజుల్లో మా అక్కకు ఉత్తరం రాస్తాను" అంది నీలిమ.
    
    "నేను ఇంటికి ఉత్తరం రాసేసాను" చెప్పింది ముగ్ధ.
    
    నలుగురమ్మాయిలూ గెస్ట్ హౌస్ నుంచి కదిలారు.
    
    అటూ ఇటూ అందంగా తీర్చిదిద్దిన గార్డెన్ మధ్య సిమెంట్ దారి.
    
    ఆ సమయంలో తిరుపతిలో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి.
    
    ఎక్కడ చూసినా భక్తులు....భక్తులు.
    
    అదొక మినీ భారతదేశంలా వుంది. ట్రావెలింగ్ బ్యాగ్ లతో విదేశీ టూరిస్టులు.
    
    ఎన్నెన్నో వేల కళ్ళు, ఆ నలుగురు అమ్మయిలమీదే వున్నాయి. అరవిరిసిన యౌవనంతో నిండుగా కన్పిస్తున్న వాళ్ళని చూస్తూ ఎవరో కురరాళ్ళు విజిల్స్ వేస్తున్నారు.
    
    వయో తారతమ్యం లేకుండా వాళ్ళవేపు ఆశగా చూస్తున్నారు.
    
    "ఇంతమంది ఎవర్నని ఎంచుకోవడం? మనిషిని చూస్తాం ఓ.కే. గానీ ఆ మనస్థత్వం తెలుసుకోవాలంటే వ్యవహారం ఇబ్బందిగా వుండేటట్టు వుందే" అలక నాలుగువేపులా చూస్తూ అంది.
    
    "ప్రపంచంలో అద్భుతమైన వస్తువేమిటో చెప్పు" నీలిమ అడిగింది సురభిని.
    
    "చాలా వున్నాయి. ఎన్నని చెప్పను" అంది సురభి ఆలోచిస్తూ.
    
    "కాదు ఒకటేవుంది. కొంచెం బుర్రకు పదునుపెట్టు. నీకు తెలిస్తే నువ్వయినా చెప్పొచ్చు" ముగ్దని చూస్తూ అంది నీలిమ.
    
    ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.
    
    "నీ క్విజ్ లు చాలుగానీ నువ్వే చెప్పవే ముగ్ధ" అంది నీలిమతో.
    
    "జీవితం లైఫ్ ఎస్! లైఫ్ ఈజ్ ది ఓన్ లీ వండర్ ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎందుకంటారా? అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగదు చిన్న చిన్న విషయాల దగ్గర్నించి, పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ వరకూ లైఫ్ లో ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. మనం బస్టాపులో సిటీబస్ కోసం నిలబడ్డా మనుకో, మనం వెళ్ళాల్సిన బస్సు మాత్రం రాదు మిగతా బస్సులన్నీ జట్లు జట్లుగా వస్తుంటాయి. ఇష్టమైన వస్తువుని కొనుక్కోవడానికి షాపింగ్ కి వెళ్ళామనుకో. మనక్కావలసిన వస్తువుని అప్పుడే, ఒక్క క్షణం క్రితమే ఎవరో కొనుక్కొని వెళ్ళిపోతారు. సముద్రం ఒడ్డున నించున్నామనుకో, నీళ్ళొస్తున్నాయను కుంటాం. కానీ నురగొచ్చి కాళ్ళమీద పడుతుంది. భలే విచిత్రం కదూ? ఆలోచిస్తున్న కొద్దీ ఎన్నెన్నో విచిత్రాలు. అలాగే నేను జీవితంలో ఒక ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ని కావాలనుకున్నాను. దేశాలన్నీ చుట్టిరావాలనుకున్నాను. మా ఫాదర్ మరణంతో అన్నీ తారుమారయిపోయాయి. అనుకున్న దొకటి- జరుగుతున్న దొకటి. ఒక ఉద్రేక స్వభావంగల యువకుడ్ని నేను మార్చాలి. సమాజానికి అనువుగా మలచాలి" నీలిమ అంది ఒకింత నిట్టూర్పుతో.
    
    "బాధపడుతున్నావా?" ఓదార్పుగా అంది ముగ్ధ.
    
    "బాధ కాదు ముగ్దా! జస్ట్ ఫీలింగ్ అంతే" అంది నీలిమ.
    
    "నా ఆలోచనలకు సెలెక్షన్ విరుద్దంగా వచ్చిందా లేదా? థ్రిల్ అంటే యిదే ఫీలింగులు పెట్టుకుంటే లస్క్యం దెబ్బతింటుంది. స్థిరమైన  లక్ష్యమున్న నాడు దేన్నీ పట్టించుకోకూడదు" ముగ్ధ మాటల వెనక అపారమైన విశ్వాసం వుంది. బతుకుపట్ల అపారమైన ప్రేమ వుంది.
    
    "అమాయకుడనుకుని బుట్టలో పడతావేమో చూసు నిన్ను కాల్చుకుతినే దుర్మార్గుడు దొరుకుతారు. మాయలమరాఠీ దొరుకుతాడు చూడు" అల్లరిగా ఆ మాట అన్న అలకవేపు చాలా సీరియస్ గా చూసింది ముగ్ధ.

 Previous Page Next Page