4. ఇంద్రదేవా! మేము నీకు సమర్పించు సామములు, నదులు సముద్రమును వలె నిన్ను చేరుచున్నవి. అందు వలననే నిన్ను మించిన వాడు లేకున్నాడు.
5. గాయకులగు 'ఉద్గాత' లు బృహత్సామమున ఇంద్రుని స్తుతింతురు. అర్చించు హోతలు 'ఉక్ద' లచే స్తుతింతురు. మిగిలిన వారు 'యజస్సు' లచే నుతింతురు.
6. మాచే ఆవిధముగా స్తుతించబడిన ఇంద్రుడు సర్వశ్రేష్ఠ ధనదాత. మాకు అన్నము కలిగించుటకు గాను సోమపానమున దైవత్వము సాధించిన ఋభువులను మా వద్దకు పంపును గాక. బలశాలి ఇంద్రుడు మాకు బలము కలిగించుటకు తన తమ్ములను పంపును గాక.
7. ఇంద్రుడు నిశ్చలుడు. విశ్వద్రష్ట. అతడు మహా భయములను లెక్కచేయడు. వాటిని పారద్రోలును.
8. ఇంద్రా! నీవు స్తుతియోగ్యుడవు. మేము అభిషవించిన సోమములు, మా స్తుతులు దూడలను చేరు గోవుల వలె నిన్ను చేరుకొనుచున్నవి.
9. ఇంద్ర, పూష దేవతలను మేము ఆహ్వానించుచున్నాము. వారు మాకు శుభములు కలిగింతురు గాక. మిత్రులు అగుదురు గాత. మాకు అన్నపానములు కలిగింతురు గాక.
10. వృత్రహంత ఇంద్రా! నిన్ను మించిన వారు దేవలోకమున లేరు. నీకు సరివచ్చు ప్రఖ్యాతుడు లేనే లేడు.
పదవ ఖండము
ఋషులు :-1,4. త్రిశోకుడు. 2. మధుచ్చందుడు. 3. వత్సుడు. 5. సుకక్షి. 6,9 వామదేవుడు. 7 విశ్వామిత్రుడు. 8. గోషూక్యశ్వుడు. 10. శ్రుతకక్షి.
1. ఇంద్రుడు పుత్రపౌత్రాధులను తరింపచేయువాడు. శత్రువులను భయపెట్టువాడు. పశువంతుడు. అన్నవంతుడు. అట్టి ఇంద్రుని మేము నిరంతరము స్తుతింతుము.
2. ఇంద్రదేవా! నేను నీ స్తుతులను రచించినాను. నీవు స్వర్గవాసివి. వరదుడవు. సోమపాయివి. నా స్తుతులు నిన్ను చేరినవి. నీవు వానిని స్వీకరించినావు.
3. ద్రోహము ఎరుగని మరట్టులు, ఆర్యమ, వరుణుని రక్షణలుగల నరుడు చక్కని చూపు కలవాడు, ప్రసిద్దుడు అగుచున్నాడు.
4. ఇంద్రదేవా! నీవు స్థిరపురుషుని యందు ఏ ధనమును, ఏ స్థిరత్వమును ఏ సహనమును స్థాపించినావో అట్టి అభిలషణీయ ధనమును మాకు ప్రసాదించుము.
5. ఇంద్రుడు ప్రసిద్దుడు. వృత్రహంత, వేగవంతుడు. మహా ధనము ప్రసాదించుమని అట్టి ఇంద్రుని కీర్తించుచున్నాము.
6. ఇంద్రా! నీవు వీరుడవు. నీ యశస్సు వినదగిన చోటునకు మేము చేరుదుముగాక. ఇతరులను మించిన నీ కీర్తి గల చోటునకు చేరుదుముగాత.
7. ఇంద్రదేవా! మేము సమర్పించు హవియందు పేలాలున్నవి. పెరుగు కలిపినా సత్తు ఉన్నది. పురోడాశమున్నది. వానిని నీవు ప్రాతః కాలమున ఆరగించుము.
8. ఇంద్రా! నీవు సంస్థ అసురసేనలను గెలిచినావు. నీతి నురగతో 'నముచి' తలను నరికినావు. అజేయుడవు అయినావు.
9. ఇంద్రా! నీ కొరకు సముపార్జించిన సోమముల చేతను, సముపార్జించనున్న సోమముల చేతను విశేష ధనములు గల నీవు ప్రసన్నుడవగుము.
10. కాంతిరూప ధనము నిచ్చు ఇంద్రా! నీ కొరకు సోమము సిద్దము చేసినాము. కుశాసనము పరచినాము. ఆసీనుడవగుము. సోమము త్రాగుము. మాకు సుఖములు కలిగించుము.
పదకొండవ ఖండము
ఋషులు :- 1. శునశ్సేపుడు. 2. శ్రుతకక్షి. 3.త్రిశోకుడు. 4,9 మేధాతిథి. 5. గోతముడు. 6. బ్రహ్మాతిథి. 7. విశ్వామిత్రుడు. 8. ప్రస్కణ్వుడు.
1. శునశ్శేపులమగు మేము అన్నము అభిలషించువారము. శతక్రతు, పరమపూజ్య ఇంద్రుని-పొలమును నీటితో నింపినట్లు - సోమముతో నింపి సంతోషపరుతుము.
2. ఇంద్రదేవా! ద్యులోకము నుండియే వందల బలములను, వేల అన్నములను, బహురుచులను వెంటపెట్టుకొని మాకు ఎదురై మా వద్దకు విచ్చేయుము.
3. ఇంద్రుడు బాణము పట్టియే పుట్టినాడు! ఈ లోకమున ఎవరెవరు వీరులున్నారని తల్లిని అడిగినాడు!!
4. లోక రక్షకుడును, దీర్ఘబాహువు, జగత్పాలకుడు, ధనదాత, బృహత్ స్తుతులు గల ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
5. మిత్రావరుణులు దివా రాత్రముల దేవతలు. వారు గమ్యమును ఎరింగిన వారు. వారు మమ్ము సన్మార్గమున గమ్యమునకు చేర్చెదరు గాక. ఆర్యమ సహితము అట్లే గమ్యమునకు చేర్చును గాత.
6. దూరమున - ఆకసమున - తూర్పున ఉషస్సు మనముందే ఉన్నట్లు ఉదయించును. తన వెలుగులను సకల దిశలందు పరచును.
7. సత్కర్మల మిత్రా వరుణులారా! మా గోవులను, మా గృహములను పాడితో నింపుడు. మా పరలోక ధామములను కూడ పాడితో నింపుడు.
8. మాటలు పుట్టించు మరుత్తులు యజ్ఞములందు జలములను విస్తరింపచేసినారు. విస్తరింపచేసిన జలమును త్రావించుటకు అంబారావములు చేయు గోవుల తలలు వంచినారు.
9. విష్ణువు త్రివిక్రముడు అయినాడు. ఈ సమస్త జగముల మీద మూడు అడుగుల వేసినాడు. ఈ జగములు విష్ణువు యొక్క పాదధూళి రేణువులు అయినవి.
పన్నెండవ ఖండము
ఋషులు :- 1,7,8 మేధాతిథి. 2. వామదేవుడు. 3,5. మేధాతిథి, ప్రియ మేధాతిథి. 4,9. విశ్వామిత్రుడు. 6. దుర్మిత్రుడు. 10. శ్రుతకక్షి.
1. ఇంద్రదేవా! క్రోధమున సోమరసము పిండు వానిని వదులుము. చక్కగా రసము పిండు వానిని పంపించుము. ఈ యజమాని సమకూర్చిన యజ్ఞసంబంధ సోమమును పానము చేయుము.
2. మహా జ్ఞానసంపన్నుడగు ఇంద్రుని స్తోత్రమున దోషములు ఉన్నను అని ప్రశంసలు అగును గాత. ఆ స్తుతులు యజమానిని వర్ధిల్లచేయును గాత.
3. ఇంద్రుడు తనను స్తుతించని వానిని శత్రువు గా భావించును. ఉక్దములు చదువు వారిని గుర్తించును. గాయత్రి సామ గాయకులను తెలిసికొనును.
4. ఇంద్రుడు అన్నవంతుడు. అన్నపతి. హర్యశ్వవంతుడు. అతడు హోతల స్తోత్రములకు ఆనందించును. సోమములకు మిత్రుడు అగును.
5. ఇంద్రదేవా! మేము సమకూర్చిన సోమముచే పరిగ్రహింపుము. భార్య గలవాడు ఇతర స్త్రీలను వలె - పరుల సోమమునకు ప్రలోభ పడకుము.
6. ఇంద్రా! నీవు వ్యాపకుడవు. మా స్తుతులను స్వీకరింపుము. ప్రవహించునదిని నిలిపినట్లు మేము సమర్పించు సోమము కొరకు ఎప్పుడు నిలుతువు? ఎప్పుడు స్వీకరింతువు?
7. ఇంద్రా! బ్రాహ్మణ ప్రశంసిత ధనభృత పాత్ర యందలి సోమమును త్రావుము. దానిని ఋతువులను అనుసరించి సేవించుము. ఋతువులు నీకు మిత్రులు కదా!
8. ఇంద్రా! నీవు స్తుతి వచన యోగ్యుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. సోమ పాయి ఇంద్రా! నీవు మమ్ము సంతృప్తులను చేయుము.
9. ఇంద్రా! నీవు యుద్దములందు శత్రు సంహారకుడవను విషయము జగత్ప్రసిద్దము. నీవు శూరుడవై ఒకే చోట స్థిరముగా నిలిచి దూరపు శత్రువును సహితము వధించగలవు. అందువలననే నీ మనసు ఆరాధ్యము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత పూర్వార్చికమున
రెండవ అధ్యాయము సమాప్తము