Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 6

                        

                                                 ఆరవ అనువాకము
                                            మొదటి సూక్తము - 29

   
వినియోగము:-
   
    1.  శత్రు మర్దిత రాజ్యాభివృద్దికి మొదటి నాలుగు మంత్రములచే చక్రనేమి మణిని సంపాతిత, అభిమంత్రితములు         చేయవలెను. 5,6 మంత్రములు చదువుచు "ఉత్తమాభ్యాం" ఉత్తమములందు కట్టవలెను.

    2.  లోహము, సీసము, వెండి, రాగితో కూడిన స్వర్ణ నాభిని పెరుగు, తేనెల గిన్నెలో త్రయోదశి నుంచి         మూడు రోజులు ఉంచవలెను. 'అభివర్తేన' అను మొదటి సూక్తముతో కట్టవలెను. దారము లోనికి         తొడిగి దర్భలపై ఉంచి, హోమము చేసి ఉత్తమములకు కట్టవలెను.
   
    3.  మహేన్ద్రం రాజ్య కామస్య అద్భుతోత్పత్తి వికారేషుచ.
   
1.    ఇంద్రుడు ఏ మహిమగల మణి వలన వర్దిల్లినాడో అట్టి మణి మాకు లభించును గాక. బ్రహ్మణస్పతీ! అనుగ్రహింపుము. మా రక్షణలందు శత్రుభయ రహిత రాజ్యమును వర్ధిల్ల చేయుము.
   
2.    అభివర్తమణీ! మాకు బంధువుల వంటి స్వాభావిక శత్రువులున్నారే వారిని ఎదిరించి ఓడించుము. మా రాజ్యమును, ధనమును అపహరించ దలచిన శత్రుసేనను కూడ నీవే ఎదిరించుము. ఓడించుము.
   
3.    మణీ! సూర్యుడు నిన్ను వర్ధిల్ల చేయును గాక. సోమదేవత వర్ధిల్ల చేయును గాక. సకల చరాచర ప్రాణులు నిన్ను వర్ధిల్ల చేయుచున్నవి. నిన్ను ధరించిన పురుషుని ప్రతాపమును తన రాజ్యమునందును, అన్య రాజ్యములందును వ్యాపింప చేయుచున్నావు.
   
4.    మణీ! నీవు అభివర్తన సాధనవు. శత్రుదమనవు. శత్రుక్షయము చేయుదానవు. నీవు శత్రుపీడిత రాజ్యమును ముందు అభివృద్ధి చెందించుము. తదుపరి శత్రువును నాశము చేయుము.
   
వ్యాఖ్య:-    రాజ్యము యుద్దము వలన ధ్వంసమైనది. శత్రువశమైనది. ముందు ప్రజ, దేశము వర్ధిల్ల వలె. అప్పుడే కదా రాజ్యము నిలుచునది. కావున శత్రువు ఏలుబడిలో ఉన్నను రాజ్యము అభివృద్ధి చెందవలెననుట ఉదాత్త ఆశయము!
   
5.    ఉదయించినాడు సూర్యుడు. వెలువడినది నానుండి శత్రుపరాభవ మంత్రము. నేను అభివర్త మణిని ధరించినాను. శత్రువును హతమార్చు వాడనైనాను. నా వాక్కు, సూర్యుడు ఉభయులు ఉదయించినారు.
   
6.    నేను శత్రునాశకుడను అయినాను. నా ప్రజ కోరికలు తీర్చువాడను అయినాను. స్వ, పర రాజ్యములకు ప్రభువును అయినాను.
   
    మణీ! నేను మణిని ధరించిన వాడను. మరల మరల శత్రువును అణచివేయుచుందును గాక. పూర్వము నన్ను బాధించిన సేనకు, నాసేనకు, అన్య ప్రజకు నేను అధిపతిని అగుదును గాక.
   
                                            రెండవ సూక్తము - 30
   
వినియోగము:-

   
      1. ఆయుష్కర్మయందు స్థాలీపాకమును మూడు ఘ్రుత పిండములు చేయవలెను. సంపాత అబిమంత్రణముల     తరువాత వానిని తినవలెను.
   
      2. ఉపాకర్మమున వటువు నాభిని తాకి జపించవలెను.
   
      3. ఆయుష్కామపు వైశ్వదేవయాగమున, దాని ఉపస్థానమున
    
      4. అధ్యాయపు ఉత్సర్జన కర్మయందు, ఘ్రుత హోమమున.
   
      5. ఐరావతాఖ్య మహాశాంతి యందు.
   
      6. మూడవ మంత్రము దర్శ పూర్ణమాసములందు.
   
1.    విశ్వదేవతలలారా! వసుదేవతా! ఇతడు ఆయుష్యము కోరుచున్నాడు. ఇతనిని రక్షించండి. ఆదిత్యులారా! ఇతని విషయమున అప్రమత్తులై ఉండండి. దేవతలచే రక్షించబడుచున్న ఈతడు సమస్త బాధల నుండి విముక్తుడై జీవించును గాక.
   
2.    దేవతల పితరులారా! పుత్రులారా! నా వాక్కును సావధానులై ఆలకించండి. శుభములు కలిగించమని ఇతనిని మీకు వప్పగించుచున్నాను. ఇతనిని వార్ధక్యము వరకు రక్షించండి.
   
3.    ద్యులోకము నందలి దేవతలారా! పృథివి మీది దేవతలారా! అంతరిక్షము నందలి దేవతలారా! ఓషధులు, పశువులు, జలములందున్న దేవతలారా! ఈ ఆయుష్కామి ఆయువును వార్ధక్యము వరకు పెంచండి. ఇతడు నూరేళ్ళు జీవించును గాక. ఇతని అపమృత్యువును నివారించండి.
   
4.    ప్రయాజ, అనుయాజ, హుతభాగ, ఆహుతి గ్రహీత దేవతలారా! అయిదు దిశల అధిష్టాన దేవతలారా! ఈ ఆయుష్కామికి ఆయుర్వర్ధనాదులు కలిగించుటకు మిమ్ము అతనికి తోటి వారిని చేయుచున్నాను.
   
వ్యాఖ్య -
1. ఛందోదేవత 2. ఋతుదేవత 3. పశుదేవత 4. ఆత్మదేవత 5. అగ్నిదేవతలు ప్రయాజ దేవతలు.
   
    ప్రధాన యాగము తరువాతి మూడు యాగముల దేవతలు అనుయాజులు.
   
    ఆహుతులందు భాగము గల ఇంద్రాదులు హుతభాగులు.
   
    అగ్నిలో కాక వేరుచోట పడిన హవి భక్షకులు ఆహుతి గ్రహీతలు.
   
                                            మూడవ సూక్తము - 31
   
వినియోగము:-

   
      1. నిత్య, నైమిత్తిక, కామ్యములగు 22 సవనయజ్ఞ విధానము చెప్పబడినది. ఈ సూక్తముచే నిరుప్త     హవి యొక్క అభిమర్శన, సంపాత, దాతృవాచన, దానములు చేయవలెను.
    సవన యజ్ఞములు:- 1. బ్రహ్మఔదన, 2. స్వర్గౌదన, 3. చతుఃశరావౌదన 4,5     శతౌదనములు 6. అషౌదన 7. పంచౌదన, 8. బ్రహ్మాస్యౌదన 9. మృత్యుసవ 10, 11.     అనుడుత్సవ 12. కర్కి 13, 14. పృశ్ని 15. పౌన 16. సిల, 17. పవిత్ర 18.     ఉర్వర 19. ఋషభ 20. వశ 21. శాలా 22. బృహస్పతి.
   
      2. ధూమకేతు దర్శనము అయినపుడు ఈ సూక్తముచే దిగ్దేవతకు బహురూప అజ అవదానము చేయవలెను.     ఆ దేవతకు చరు పురోడాశములచే హోమము చేయవలెను.
   
      3. గ్రామ, నగర, దేశ, ప్రాకారములు భిన్నమైనపుడు - 3 వ మంత్రము కాక - మిగత సూక్తముచే     పురోడాశ, పాషాణములను నిఖననము చేయవలెను.
   
      4. సకల వ్యాధుల చికిత్స యందు ఈ సూక్తపు మొదటి మంత్రముచే స్నాన, అవసేచన, పాయనాదులు     చేయవలెను.
   
      5. బ్రహ్మ అస్వమేధమున విడిచిన అశ్వమును ఈ సూక్తముచే అను మంత్రణము చేయవలెను.
   
      6. "అంహోలింగానాం ఆపోభోజన హవీంషి"
   

      7. అద్భుత మహాశాంతి యందు దిగ్దేవతకు తొలి మంత్రము వినియోగము.
   
      8. సర్వస్వస్త్యయనము కోరువాడు 4వ మంత్రముచే రాత్రిపూట ఉపస్థానము చేయవలెను.
   
1.    అమృతములగు నాలుగు దిక్కులకు, దిక్పాలకులకు, భూతముల అధి దేవతలకు ఈ చతుఃశరావ యాగమున హవిస్సులు అర్పించుచున్నాము. సేవించుచున్నాము.
   
2.    నాలుగు దిశలను పాలించు దిక్పాలులారా! మీరు మమ్ము మృత్యు పాశము నుండి రక్షించండి. అన్య పాశముల నుండి కూడ రక్షించండి.
   
3.    ధన దేవతా! నా శ్రమను లెక్కచేయక నీకు హవిస్సులు అర్పించుచున్నాను. 'శ్రోణ' వ్యాధి విముక్తుడనై ఘ్రుతాహుతులు అర్పించుచున్నాను. దిక్పాలకులందలి నాలుగవ దేవత మాకు ప్రసన్నుని అగునుగాక. కోరిన ధనములను ప్రసాదించును గాక.
   
4.    మా తల్లికి, తండ్రికి, గోవులకు, సమస్త లోకములకు స్వస్తియగును గాక. మా తల్లి మున్నగు వారు శోభన ధనవంతులు అగుదురు గాక. మేము చిరకాలము సూర్యుని దర్శింతుము గాక.
   
                                       నాలుగవ సూక్తము - 32
   
వినియోగము:-

   
       1. వంధ్యకు సంతానము కలుగుటకు శమీ స్నానము చేయించవలెను. ఈ సూక్తముతో ఆమెకు పురోడాశపు     ముద్ద ఇచ్చి అలంకారము చేయవలెను.
   
       2. ధనము, బలము అర్ధించువాడు ఈ సూక్తముచే ద్యావాపృథ్వి యాగము చేయవలెను.
   
       3. దర్శపూర్ణమాస యాగమున మొదటి మంత్రముచే భార్య దోసిలిలో ఉదక పాత్ర ఉంచబడును.
   
1.    జనులారా! వినండి. తెలిసికొనండి. మహాబ్రహ్మ చెప్పుచున్నాడు:-
    అది ఈ లోకమున లేదు. ఆ లోకమున లేదు. ప్రనులందు నిలిచి ఉన్నది.
   
వ్యాఖ్య -    సాయణాచార్యులు "తత్" అనగా "ఉదకాత్మకం బ్రహ్మ" అన్నారు. అట్లయిన జలము ఉభయ లోకములందు లేదు. ప్రాణులందు ఉన్నది అని అర్ధము.
       
    నీరు ఉన్నచోటనే ప్రాణులుండును. అన్యగ్రహములందు ప్రాణులు లేక పోవుట నీరు లేకపోవుట వలననే అని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు.
   
2.    (జలము ప్రాణులందు ఉన్నదని చెప్పి స్థానమును నిరూపించుచున్నారు.)
   
    ఇది అంతరిక్షమున - యక్షగంధర్వుల వలె - నిలిచిఉన్నది. ఈ లోకమున జలము స్థావర జంగమాత్మకమై ఉన్నది. జలము యొక్క మూల స్థానమును ఎరింగిన వారు ఉన్నారో? లేరో?
   
వ్యాఖ్య:-    "అంతరిక్షే మహత్ సముద్రం వితతం అస్తి" అన్నాడు పతంజలి. యాస్కుడు కూడ అదేమాట అన్నాడు. "అస్మిన్ మహత్యర్ణవే అన్తరిక్షే" అని శ్రుతి.

 Previous Page Next Page