"అతనితోనే నా కొడుకు ఛాలెంజ్ చేశాడని తెలుసుకున్న ఈ రోజును నేనెన్నటికీ మరువలేను. అయితే, తను అవమానింపబడిందీ... నేను పగబట్టిందీ ఒకరే అయినా నా నోటితోనే అతని పేరును చెప్పించాలని నా కొడుకు ఇంతకాలం ఆగాడు. ఇప్పుడు మీ సందేహం తీరుస్తాను. అతను నా తోడబుట్టిన వాడు. అంటే నా అన్న.
అందరూ చేష్టలు దక్కి చూస్తుండిపోయారు. అయితే ఆ సమయానికే మాలిని ఉలిక్కిపడటాన్ని ఒక్క గుప్తా మాత్రమే గ్రహించగలిగాడు.
కొద్ది క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు.
అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోన్ మ్రోగింది.
త్రినాధ్ చటుక్కున ఫోన్ ఎత్తాడు.
"వసుంధర ఇండస్ట్రీస్ కంపెనీ చైర్ మన్ అయిన సందర్భాన నీకు నా శుభాకాంక్షలు..." ఆవేపు నుంచి ప్రియాంక అంది.
ఫోన్ ఎక్కడినుంచన్న ఆలోచన అక్కడున్న ఎవరికీ లేదు... వారింకా అంతకుముందు తిన్న షాక్ నుంచే తేరుకోలేదు.
"ఏం మామ కూతురా... బాగున్నావా? నువ్వు చైర్ పర్సన్ పదవిలోకి వచ్చావుగా. నా వంతు అభినందనలు నువ్వూ అందుకో."
ఆశ్చర్యంగా చూస్తున్న తల్లివేపు చూసి నవ్వాడు-
"నీ మేనకోడలు... ప్రచ్చన్న యుద్ధానికి కాలుదువ్వుతోంది..." అన్నాడు మౌత్ పీస్ మీద చేయి అడ్డం పెట్టి.
"పిచ్చి వరసలు కలపొద్దని ఎన్నోసార్లు చెప్పాను..." ఆవేపు ప్రియాంక విసురుగా అంది.
"కోపంలో తప్పటడుగులు వేసే ప్రమాదం వుంది... జాగ్రత్త..."
"నాకొచ్చే ప్రమాదం ఏమీలేదు. నీకే మరికొద్ది నిమిషాల్లో ఓ ప్రమాదకరమైన వార్త అందుతుంది. ఉంటే... గింటే... దాన్ని అదిగమించటానికి నీ తెలివితేటలు ఉపయోగించు..." ఆవేపున ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది.
"ఇక కంపెనీ విషయాల్లోకి వద్దాం..." అన్నాడు త్రినాధ్ ఒకింత గంభీరంగా.
"కొన్నిటిని మనం కనిపెట్టాలి. మరికొన్నింటిని దిగుమతి చేసుకోవాలి. అవి వస్తువులే కావచ్చు, సలహాలే కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానమే కావచ్చు. వెంటనే నాకో వ్యాపారం చేపట్టాలని వుంది.
ప్రపంచవ్యాప్తంగా కేవలం వార్తలు, పరామర్శలు ఎక్సేంజ్ చేసుకునేందుకు టెలిఫోన్స్, టెలిగ్రాఫ్, పోస్టల్ సర్వీసెస్ వున్నాయి. మనుషుల ప్రయాణానికి బస్సులు, ట్రైన్స్, ఫ్లైట్స్ వున్నాయి. అదే వస్తువులను త్వరగా కావల్సిన చోటికి చేరవేసే ప్రత్యేక తరహా వ్యాపారంగానీ, ప్రణాళికగానీ లేదు.
ఒక వస్తువును కొనగల శక్తి వున్నా, వాటిని అతి తక్కువ కాలములో సొంతం చేసుకొనే అవకాశం మనదేశ వినియోగదారులకు లేదు. ఒకవేళ కొందరికా అవకాశం వునా, టైమ్ లేకపోవచ్చు. సో... వారి కాలానికి మనం మన సర్వీస్ ద్వారా విలువకడతాం.
ఉదాహరణకి- "స్పీడ్ పోస్ట్' ని ప్రవేశపెడతాం. అంటే రాష్ట్రంలో విమాన సర్వీసుగల హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలకు చెందిన జనరల్ పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్ట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం. అత్యవసరంగా డాక్యుమెంట్స్, ఫోన్ లో చెప్పటానికి వీలులేని వివరాల్ని పొందుపర్చిన పేపర్స్ ని అవతల పార్టీకి అందించాల్సి వచ్చిన కస్టమర్స్ అవసరాన్ని మన వ్యాపారంగా మార్చుకొని, ఎక్కువ ఛార్జ్ చేసి కొంత పోస్టల్ డిపార్ట్ మెంట్ కి, మరికొంత ఇండియన్ ఎయిర్ లైన్స్ కి రాయల్టీ ఇచ్చి, మన కంపెనీ వాహనాల్లో వారందించే కవర్స్ ని సరీగ్గా విమానం బయలుదేరే టైమ్ కి ఎయిర్ పోర్ట్ లో బ్యాగేజ్ స్టాఫ్ కి అందిస్తాం. ఆ విమానం వేరే నగరంలో లేండ్ అయ్యే సమయానికి ఆ ఊరిలో మనం అరేంజ్ చేసే మన వెహికల్ అక్కడకు వచ్చి వాటిని రిసీవ్ చేసుకుంటుంది. ఆ తరువాత ఆయా అడ్రసుల్ని బట్టి ఆ సిటీలో మనం నియమించే బాయ్స్ ఎమర్జన్సీ బేస్ మీద వారికందిస్తారు."
త్రినాధ్ చెప్పే వివరాల్ని కళ్ళప్పగించి చూస్తున్నారు అక్కడున్న వాళ్ళంతా.
"ఇది పోస్టల్ కి సంబంధించిన విషయం. అలాగే వస్తువుల్ని, విలువైన సరుకుల్ని అందించేందుకు కొరియర్ సర్వీస్ ను ఏర్పాటు చేద్దాం. ఇదీ లాభసాటి వ్యాపారం. సింగపూర్ లో 'స్కైప్యాక్' అనే ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒకటుంది. నేను అతి త్వరలోనే సింగపూర్ వెళ్ళి ఆ కంపెనీకి ఇండియాలో ఏజంట్ గా మన కంపెనీ వుండేలా ఏర్పాట్లు చేసుకు వస్తాను. ఈ మధ్యనే డి.హెచ్.ఎల్. అనే అంతర్జాతీయ కొరియర్ సర్వీస్ ఇండియాలో కాలుబెట్టింది. దానికి పోటీ సంస్థ స్కైప్యాక్..." నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో త్రినాధ్ కంఠం ప్రవాహంలా సాగిపోతోంది.
"కనుక గుప్తాగారు... ఇమీడియెట్ గా మనిద్దరికి పాప్ పోర్ట్స్, వీసాస్ అరేంజ్ చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మం సింగపూర్ వెళ్ళాలి. ప్రజలకు అవసరమైన స్పీడ్ కమ్యూనికేషన్స్ మీదే మన సరికొత్త వ్యాపారం ఆరంభం. ఇక్కడున్న అందరికీ ఓ విన్నపం- దయచేసి వ్యాపార రహస్యాల్ని రహస్యాలుగానే వుంచాలని..." అని గుప్తావేపు తిరిగి, "చైర్ మెన్ గా ఒక హెచ్చరిక- నేనేదయితే రహస్యంగా వుంచాలని శాసిస్తానో, దాన్ని తప్పక ఆచరించి తీరాలి- పొరపాటునో, మరేవిధంగానో... ఎలా అయినా సరే... అది బయటకు వస్తే, వాళ్ళను నేను క్షమించను..." చివరి మాటలు కావాలనే బెదిరిస్తున్నట్లుగా అన్నాడు.
(దిలీప్ కులకర్ణి అనే వార్తిండియన్ స్కైప్యాక్ కంపెనీకి ఇండియా ఏజెంట్ గా అపాయింట్ అయ్యాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నగరాలకు తన వ్యాపార కార్యకలాపాల్ని విస్తరింపజేశాడాయన. తొలి సంవత్సరంలో (1982-83) కేవలం ఐదులక్షల వ్యాపారమే చేసినా, రెండవ సంవత్సరంలో (1983-84) దానిని 45 లక్షలకు అభివృద్ధి చేశాడు. సరీగ్గా ఐదు సంవత్సరాలకి (1986-87) అతని వ్యాపారం 15 కోట్లకు పెరిగింది. ఒకప్పటి నిరుద్యోగి (ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్) మనం చూస్తుండగానే మన కళ్ళముందే సాధించిన అద్భుత వ్యాపార విజయం ఇది)
* * * *
సరీగ్గా బోస్ అక్కడ బోర్డ్ మీటింగ్ లో వుండగా, ఇక్కడ సైంటిస్ట్ హెచ్.బి.ల్యూబ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు- ప్రియాంక అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు.
సైంటిస్ట్ అంతకుముందు నాలుగైదుసార్లు హిందూతో, ఇంజనీర్ తో కలిసి ఫ్యాక్టరీ గేటువరకు వచ్చి వెళ్ళిపోవడాన్ని గమనించి వున్న ఫ్యాక్టరీ వర్కర్స్ కి అతని రాకలో వింతకాని, ప్రమాదం కాని కనిపించలేదు.
"హిందూ లేదా" అనంటూనే చొరవగా ఫ్యాక్టరీ షెడ్ లోకి వచ్చేశాడు సైంటిస్ట్.
అప్పుడు సరీగ్గా 1-30 అవుతోంది. కావాలనే ఆ టైమ్ ని ఎన్నుకున్నాడు సైంటిస్ట్.
అప్పటికే వర్కర్స్ మధ్యాహ్న భోజనం చేసేందుకు షెడ్ లోంచి బయటకొచ్చేస్తున్నారు.
కేజువల్ గా షెడ్ ని, అందులోని మెషినరీని చూస్తున్నట్లుగా నటిస్తూ మెషినరీకి దగ్గరగా వెళ్ళాడు.
ఎవరూ అతన్నంత శ్రద్ధగా గమనించడం లేదు.
సైంటిస్ట్ చటుక్కున వంగి ఒక ఇనుపకడ్డీని చేతిలోనికి తీసుకుని, తన నెవరన్నా గమనిస్తున్నారేమోనని ఓసారి తలుపువేపు చూసి, మెరుపు వేగంతో దాన్ని మెషిన్ మీదకు విసిరాడు.
ఆ తరువాత అక్కడ మరోక్షణం వుండలేదు.
* * * *
"ఏమైంది...?" ప్రియాంక సైంటిస్ట్ మీద అభిమానం నటిస్తూ అడిగింది.
"చాలా ప్రమాదకరమైన పనిని పూర్తిచేశాను. అది నేనే చేశానని త్రినాధ్ దాకా అక్కర్లేదు- బోస్ కి తెలిస్తే చాలు. నన్ను నమిలి మ్రింగేస్తాడు... ఇక త్రినాధ్ కే తెలిస్తే నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు."
ప్రియాంక ఆకర్షణలోపడి పనయితే తెగించి చేశాడు కాని- తీరా చేశాక ఇప్పుడతనికి ప్రాణభీతి పట్టుకుంది.
"నీ ప్రాణానికేం భయంలేదు- ఆ మొరటువాళ్ళేం చేస్తారు...?" నిర్లక్ష్యంగా అంది ప్రియాంక తన సీట్ లో యువరాణిలా కదులుతూ.
"కేవలం మొరటువాళ్ళేకాదు- త్రినాధ్ కి అద్భుతమైన తెలివితేటలున్నాయ్..." సైంటిస్ట్ మాటలు పూర్తవుతుండగానే ప్రియాంక పెద్దగా నవ్వింది.
సైంటిస్ట్ ఆమె నవ్వుకు నివ్వెరపోయాడు.
"ఒకప్పుడేమన్నావ్...? ఆ... వాడు పిచ్చి వెధవ... వాడేం చేయగలడన్నావ్- కేవలం ఏడెనిమిది నెలలకే అతనికి అద్భుతమైన తెలివితేటలున్నాయంటున్నావ్-?"
సైంటిస్ట్ అవమానంతో తలవంచుకున్నాడు.
"ఓ.కే. - ఓ.కే- నీ ప్రాణానికి నేను అడ్డు వేస్తాను- ఈరోజు నుంచే నిన్ను మా రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ లో కెమిస్ట్ గా అపాయింట్ చేస్తున్నాను. బుద్ధిగా ఉద్యోగం చేసుకో-" అంది ఇక వెళ్ళవచ్చన్న భావాన్ని వ్యక్తం చేస్తూ.
సరీగ్గా అదే టైమ్ కి హెచ్.బి.ల్యూబ్ ఫ్యాక్టరీలో వర్కర్స్ అంతా ఆందోళనగా మెషిన్ చుట్టూ పిచ్చెక్కినట్లుగా తిరుగాడుతున్నారు.
మెషిన్ చెయిన్ తెగిపోయింది.
అప్పటికే ఆ మెషిన్ ఆపరేటర్- మెషిన్ కొన్నాళ్ళు మూతపడక తప్పదు. ఇండియన్ మేడ్ చెయిన్స్ దానికి సరిపడవు- చచ్చినట్లు జెకోస్లవేకియా నుంచి తెప్పించాల్సిందే. ఎంత లేదన్నా అందుకు ఆర్నెల్లు పడుతుంది... అని బాంబు పేల్చాడు.
వర్కర్స్ గుండెల్లో రాయిపడింది.
ఓప్రక్క బోస్ ప్రళయ రూపం- మరోప్రక్క తమకి భృతి చూపించి బ్రతికిస్తున్న తమ బాస్ త్రినాధ్ కి సంభవింపనున్న ఆర్ధిక నష్టం... ఇంకోప్రక్క మెషిన్ ఆర్నెల్లు ఆడకపోతే తమ జరుగుత్బాటు- వర్కర్స్ మొఖాల్లో నెత్తురుచుక్క లేదు. కొందరయితే కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు.
సరీగ్గా అరగంట క్రితం అక్కడున్న సందడి, కోలాహలం ఇప్పుడు లేవు. మెషిన్ కన్నా వేగంగా పనిచేసుకుపోయే కొన్ని జతల చేతులిప్పుడు నిర్వీర్యమయి పోయాయి... త్వరలోనే కంపెనీ తమకు బోనస్ ఇవ్వబోతోందని హిందూ ద్వారా సూచాయగా తెల్సుకొని- ఆ డబ్బుతో కట్టుకుంటున్న వారి కలలు కుప్పలా కూలిపోయాయి.
విశాలమైన ఆ షెడ్ లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది.
* * * *
బోర్డు మీటింగ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండున్నర గంటలయింది... అందరూ వెళ్ళిపోయారు.
ఇప్పుడు త్రినాధ్ గదిలో గుప్తా, బోస్, ఇంజనీర్, హిందూ మాత్రమే వున్నారు.
హెచ్.బి.ల్యూబ్ ఆయిల్ కి పబ్లిసిటీ డిజైన్స్ తయారుచేసి ప్రముఖ దినపత్రికలో వచ్చేలా చూసే బాధ్యతను ఒక సంవత్సరంపాటు ఒక యాడ్ ఏజెన్సీకి ఇచ్చేట్లు ఆ తర్వాత సొంత యాడ్ యూనిట్ నెలకొల్పేట్లు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు.
ఆ రోజు నుంచే ల్యూబ్ ప్రొడక్షన్ ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
* * * *
"మీకు సహాయం చేయాలని ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు సార్! నన్ను క్షమించాలి...." ఆర్.టి.సి. పర్చేజ్ మేనేజర్ నెమ్మదిగా అన్నాడు.
అది ప్రియాంక గది....
ఆ గదిలో ఇప్పుడు ప్రియాంక, సుదర్శనరావు, యోగేష్ లు వున్నారు.
"పోనీ- మీకు చేతనయ్యే పనే చెబుతాం. చేస్తారా?" ప్రియాంక ఒకింత సీరియస్ గా అడిగింది.
"చెప్పండి మేడమ్- తప్పక చేస్తాను- కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. త్రినాధ్ కంపెనీ ప్రోడక్ట్ నే తప్పక కొనాలని మా డిపార్ట్ మెంట్ కి ఎం.డి. నుంచి చైర్ మన్, మినిష్టరీ నుంచి అధికార ఉత్తర్వులున్నాయి. వీటికి తోడు సి.ఎం. అనధికార సూచన కూడా వుంది. కనుక మార్కెటింగ్ విషయంలో అతన్ని దెబ్బతీయలేం. ఇకపోతే క్వాలిటీ విషయానికొస్తే- త్రినాధ్ ప్రోడక్ట్ నిజంగానే అత్యున్నత ప్రమాణంలో వుంది. మరింకెలా నేను మీకు సహాయం చేయగలను...?" తనకు చేతనయ్యే పనేమిటో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడతను.