"ఎక్కడ పతివ్రతలు వుండునో అక్కడ నారదమునీంద్రుల వారు వుందురు" మహారచయిత్రి మహాదేవి కొటేషన్ చెప్పింది. ఆ మాత్రం ఏదో ఒక కొత్త మాట చెప్పకపోతే ఆమెగారు రచయిత్రి ఎలా అవుతుంది?
"నారీ నారీ నడుమ నారద.
ఆరి తేరి పోరి ఆడది"
కవయిత్రి కాంచనమాల అప్పటికప్పుడే ఓ కవిత్వం అల్లబోయింది.
అది చూసి__
పిల్లకవయిత్రి ప్రీతిగంగులీకి ఒళ్ళు మండింది. ఇంతోటి కవిత నేనూ కట్టగలను అనుకుని అప్పటికప్పుడే కట్టి అక్కడికక్కడే కక్కేసింది.
ప్రేమ ఎంత మధురం-
మగవాడు అంత కఠినం-
చేసినావు చివరికి కడుపు-
యుగయుగాలుగా స్త్రీలకిది పరగడుపు.
"ఆపండి దిక్కుమాలిన గోల. ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరటం కధలు కవిత్వాలు కాకరకాయలు ...." అంటూ లీడర్ లీలారాణి కోప్పడటంతొ అందరూ నోరుమూసుకున్నారు.
"నారదమహర్షీ! ఆడదాన్ని పెళ్ళాడనివారు-పరస్తీని కన్నెత్తి చూడనివారు, పతివ్రతలను ఆదుకున్నవారు అయిన మిమ్మల్ని మేము కొద్దిగానో-గొప్పగానో నమ్ముతున్నాం కాబట్టి మా సమస్య మాకొచ్చిన కష్టం మీతో చెప్పదలచుకున్నాము. మేము చెపితే తప్ప మాకొచ్చిన కష్టం మీకర్ధమయ్యేటట్లు లేదు. అవునా...?" లీడర్ లీలారాణి అడిగింది.
"అవును తల్లీ! మీకొచ్చిన కష్టమేదో మీరు చెపితే తప్ప నా ఊహకి అందటంలేదు. విషయం వివరంగా చెపితే నావంతు సహాయం అనగా సలహా చెప్పి చేస్తాను" నారద మునీంద్రులవారు సానునయంగా అభినయిస్తూ అన్నారు.
"నేను చెపుతుంటే మధ్యలో అడ్డుతగిలి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయకూడదు" లీడర్ లీలారాణి ముందుగా మాట తీసుకుంటూ అంది.
"మాటమధ్యలో అనుమానం వస్తే?" అంతకన్నా ముందు జాగ్రత్తతొ తన అనుమానం వెళ్ళడించాడు నారదుడు.
"మీకు అనుమానం రావచ్చు. ఏదయినా సలహా ఇవ్వాలని అనిపించవచ్చు. ఏదయినా అడగాలని వుండచ్చు. అవన్నీ మీ మనస్సులోనే వుంచుకొని చివరికి అడగండి. సరేనా?" అంది లీడర లీలారాణి.
"సరేనమ్మా" అంటూ తల తాటిస్తూ నోటితో చెప్పి చేతులు వూరుకోక తుంబురని టింగ్ టింగ్ మనిపించాడు నారదమహర్షి.
"ఇప్పుడు మేము వెళ్ళేది దేవతల దగ్గరికి ఆడదేముళ్ళ దగ్గరికి" లీడర్ లీలారాణి చెప్పంగానే "ఏ దేవతలు ఏ ఆడదేముళ్ళు" అని నారదులవారు అడగబోయి "మధ్యలో అడగరాదు మాట్లాడరాదు" అన్న కండిషన్ గుర్తుకు వచ్చి పెదవులు కుట్టేసినట్లు వుండిపోయాడు. "ఊ" కొట్టవచ్చో లేదోనన్న విషయం ముందే మాటాడుకోలేదు కాబట్టి "ఊ" కూడా కొట్టకుండా వినసాగాడు.
"....ఆడపిల్ల పుట్టంగానే "అయ్యో పుట్టింది ఆడపిల్లా" అని ఈ లోకం మా మీద జాలి, సానుభూతి, యీసడింపు. ఇలా ఎన్నో రకాలు చూపిస్తున్నది. పెద్దమనిషి కాంగానే పెళ్ళి చేయాలన్న భయంతో "అమ్మాయి యీడేరింది! ఇంకేముంది ఆ తండ్రిగారి గుండెలమీద కుంపటే చెప్పులతోపాటు కాళ్ళు కూడా అరిగేలా పెళ్ళికొడుకుల వేటకి బయలుదేరాలి....చదవుకుంటే అంతకన్నా పై చదువుకున్న వాడిని వెతకాలి....అమమయికి చదువు చెప్పించకపోతే చదువురాని అమ్మాయి మాకు అక్కరలేదంటున్నారు."
డిగ్రీదాకా చదివిస్తే "బోడి డిగ్రీ యీ కాలంలో అంతా ప్యాసై అఘోరిస్తున్నవాళ్ళే అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తున్నదా! అలా అయితే పెళ్ళిచూపులు చూడటానికి వస్తాం. అమ్మాయి నచ్చితే కాస్త కట్నం తగ్గించుకుంటాం. ఇలా ఆడపిల్ల పెళ్ళివిషయాలలో బోలెడు సమస్యలు ఇవి చాలక కార్టూన్స్ మా ఆడవాళ్ళమీద బోలెడు. సిగ్గులేకపోతే సరి..."
"ఎవరికి?"
"అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు చీరసారెతోపాటు అయిదు లీటర్ ల కిరసనాయిలు డబ్బా కూడా పంపాలి. మర్చిపోయేరు?"
"బ్లాకులో కొందామన్నా చుక్క కిరసనాయిల్ దొరకటంలేదు. మరో నాలుగువేళ కట్నం అదనంగా యిస్తాం. కిరసనాయిలు మీరే సంపాదించుకోండి"
లాంటి...జోకులు కార్టూన్స్ చదివి చదివి చూసిచూసి ఇవి చాలక దిన పత్రికలలో రోజురోజుకి ప్రచురింపబడుతున్న ఆడపిల్లలు అత్తవారిళ్ళలోని దారుణ మరణాల సంఖ్యలు చదివి మా హృదయాలు దహించిపోగా ఎమీచేయలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మాలో మేము కుమిలి కుమిలి చస్తూ..."
లీడర్ లీలారాణి చెప్పటం లేపి పైటకొంగుతో కళ్ళు ఒత్తుకుంది. మిగతా ఆడవాళ్ళంతా కూడా లీడర్ ని అనుకరిస్తూ పైట కొంగులతోను అందమైన హేండ్ కర్చీఫ్ లతోను కళ్ళు వత్తుకున్నారు.
"ఊరికే కన్నీరు నింప కారణమేమమ్మా!" అని సినిమా పాట పాడబోయి అయ్యో ఇప్పుడు నేను నోరు తెరవకూడదు కదూ. అన్న విషయం గుర్తుకురాగా పెదవి కదప సాహసింపలేదు నారదమునీంద్రులవారు.
కళ్ళల్లో నీరు వూరినా కంఠం మూగపోలేదు కాబట్టి మళ్ళీ చెప్పసాగింది లీడర్ లీలారాణి.
"మా ఆడవాళ్ళ కష్టాలు అన్నీ యిన్నీకావు స్వామీ! సమస్యల విషయానికి వస్తే ప్రతీదీ ఓ విషమ సమస్యే. ఒక స్త్రీ భర్తని కట్నం డబ్బుతో కొనుక్కుని కూడా అతగాడికి ఊడిగం చేస్తూ ఇష్టమున్నా లేకపోయినా తల తాటిస్తూ అతగాడు ఏడిస్తే తానూ ఏడుస్తూ అతగాడు నవ్వితే ఓపిక వున్నా లేకపోయినా తనూ నవ్వుతూ గతిలేక గత్యంతరం లేక వాళ్ళగోడు వినేవారు ఎవరూలేక గోడుగోడున విలపిస్తూ కాపురాలు చేస్తున్నారు.
ఈ సమస్యలకి అంతూపొంతూ లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాచాలా వున్నాయి. మా యీ సమస్యలు పరిష్కరించటానికి మహిళా సంఘాలున్నాయి. కట్నం తీసుకుంటే శిక్ష విధిస్తామని ప్రభుత్వము కొన్నిరకాల బిల్లులు ప్రవేశపెట్టింది.
ఇవి ఎప్పుడూ వుండే సమస్యలు. అసలయిన పెద్ద సమస్య. అసలయిన కష్టం మరొకటుంది అదేమిటంటే మాతృత్వం...మాతృత్వము స్త్రీకి వరం అన్నారు ఆ వరంవల్ల మాకు వచ్చింది ఏమిటి? ఖర్మచాలక మగవాడి లోపంవల్ల భార్యకి పిల్లలు పుట్టకపోతే "ఆమె గొడ్రాలు" అంటూ లోకం దుమ్మెత్తి పోయటం వేలెత్తి చూపటం చేస్తున్నారు.