Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 5

    భోజనాలకు ఏర్పాట్లు జరిగాయి. అధికారుల పంక్తిలోనే కొత్త తురకలూ కూర్చున్నారు. అందరికీ గోమాంసపు బిర్యానీ వడ్డించారు.
    "మేం మాదిగోండ్లతో తినముండి. తురుకోండ్లమైతే మాత్రం కులం తగ్గుతదా? మాదిగోండ్లు మాదిగోండ్లే, మాలోండ్లు మాలోండ్లే" అన్నాడు ఒకడు. మాలలంతా మేం తినమంటే మేం తినమని లేచారు.
    "మేం డొక్కలోండ్లతో తినముండి" అని మాదిగలు లేచారు.
    అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. బహద్దూర్ యార్ జంగ్ ఉపన్యాసం బూడిదలో పోసిన పన్నీరైంది.
    "మేం మాల తురుకోండ్లమే., వాల్లు మాదిగతురుకోల్లే. తాతల్నాటినుంచి లేంది ఇప్పుడు తినమంటే తింటాముండి?" అన్నాడు మరొకడు.
    విధిలేక వేరే పంక్తులు తీర్చి వడ్డించారు వీర ముసల్మానులు.
    భోజనాలయింతరువాత కొత్త తురకలందరికీ గింజలు కొలిపించాడు తాసిల్దారు. బండ్లు సిద్దమైనాయి. రెడ్డిగారి చేతుల్తో చేతులు కలిపి "షుక్రియా(కృతజ్ఞత)" చెప్పి బండ్లెక్కారంతా.
    బండ్లు సాగిపోయాయి.
    కొత్త తురకలు గింజల మూటల్తో ఇండ్లకు చేరారు.
    రెడ్డిగారు గడీకి తిరిగి వచ్చారు, గరం గరంగా.
                                                 3
    మంచం మీద పడుకొని కూనిరాగం తీస్తున్న పాణి గాజుల చప్పుడు వినిపిస్తే తల త్రిప్పి చూచాడు. కావిడి పెట్టెమీద భోజనపు పళ్ళెం పెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూంది వనజ. లేచి కూర్చుని పిలిచాడు.
    కళ్ళెం పట్టుకొని లాగినట్లు నుంచుండి పోయింది.
    "నుంచోరాదూ?"
    తలవంచుకొని నుంచుంది.
    "వనజా! నీ పేరుకు అర్ధం తెలుసా?"
    తల అడ్డంగా ఊపింది తెలీదన్నట్లు.
    "వనజము అంటే తామరపూవు."
    తలెత్తి కళ్ళు పెద్దవిచేసి చూసింది. తన పేరు అంత అందమైందా అనుకుంది.
    "నీ కళ్ళిప్పుడు నిజంగా తామరల్లాగే వున్నాయి వనజా!"
    తల వంచుకుంది.
    "దొరసాని తిడ్తది" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. పాణి ఎంత మంచివాడు, తన పేరు చక్కనిదని చెప్పాడానాడు. ఇప్పుడు దానికి అర్ధం చెప్పాడు. తామరపూవు! తాను అందగత్తెనని మొదటి తడవగా చెప్పిన వాడతడే. నిజంగా తాను అందకత్తెయేనా? ఎంతమంది వాడుకున్నారు తనను! తన అందాన్ని గురించి ఒక్కమాట కూడా అనలేదెవడూ ఈనాటికి. యంత్రంలా, ఆటబొమ్మలా అందరికీ లొంగింది తాను. తనకు సిగ్గన్నది ఎన్నడో పోయింది - మొదటి రాత్రితో. మామిడిపండ్లు పళ్ళెంలో పెట్టి అందించినట్లు అందించింది తనను అందరికీ. రసం త్రాగి తొక్క పారేసినట్లు పారేశారెందరో. మగవారంటే ఆడదాన్ని పళ్ళరసంలానూ, పాయసంలానూ, సారాయిలానూ తాగేవారనుకున్నది తానిన్నాళ్ళనుంచి. అల్లాంటి తనకు కొత్త అనుభూతి కలిగించాడు పాణి.  అతని ముందుకు వెళ్ళగానే ఎందుకు తన తల అలా సిగ్గుతో వంగిపోతుంది? ఎందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది? అతను తనను కోరాడా? కోరితే అడ్డు చెప్పగలదా తాను? తనను అనుభవించినవారెవరో, ఎంతమందో కూడా తనకు గుర్తులేదు. కాని, ఈ పాణి! ఇతను విచిత్రంగా ఉన్నాడు. ఇతను శరీరానికి కాక, గుండెకు గిలిగింత పెట్టుతున్నాడు. శారీరకం అయినా తృష్ణ తనకు లేదు. కాని, ఏదో మానసిక తృష్ణ కలిగిస్తున్నాడితను.
    ఆమెకు గడీ పక్కనున్న దంపతులు గుర్తుకువచ్చారు. కిష్ణయ్యకు జబ్బుచేస్తే రాములమ్మ ఎంత తహతహలాడిపోతుంది? రాములమ్మ కాలికి ముల్లు గుచ్చుకున్నా గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్లు బాధపడ్తాడు కిష్ణయ్య. వారిద్దరి బాంధవ్యం ఏమిటి? అది శారీరకం అయిందా? కాదు. తనకూ ఇంద్రారెడ్డికీ శారీరకమైన సంబంధం. ఇంద్రారెడ్డి చనిపోయినా తాను ఏడవలేదు. తాను చనిపోతే, తనకు బాధ అవుతే ఇంద్రారెడ్డి బాధపడ్తాడా? పడడు. ఎందుకు? అది క్షణికమైన సంబంధం. శారీరకమైన సంబంధం. రాములమ్మదీ, కిష్ణయ్యదీ అలా కాదా? వారిది పవిత్రమైన బంధం! జీవితాంతం ఒకరి దుఃఖాన్ని ఒకరు పంచుకుంటారు. ఒకరి దుఃఖం పంచుకొని జీవితం ఏం జీవితం? తానెవరికోసమన్నా దుఃఖపడగలదా? ఎవరున్నారు తనకు? దొర. తనకు తిండి పెడ్తాడు. జబ్బుచేస్తే మందిస్తాడు. అది అతని దొడ్లో ఉన్న పశువులకూ చేస్తాడు. దొర దుఃఖాన్ని తాను పంచుకోగలదా? లేదు. పంచుకోలేదు. తల్లి చనిపోయినప్పుడు తానెంత ఏడ్చింది? మళ్ళీ అలా ఏడవగలదా తాను? లేదు. పోనీ, తన దుఃఖాన్ని పంచుకొనేవారున్నారా? లేరు. తానొకరి సుఖదుఃఖాల్ను పంచుకోవాలి? తన సుఖదుఃఖాల్ను పంచుకోవడానికి తన కొకరు కావాలి. నిజమే కాని, ఎలా?
    రెడ్డిగారు పొలాలవైపు వెళ్తున్నారు చింతల తోపులోంచి. చింతచెట్టు మీద ఏదో అలికిడి వినవచ్చింది. తరువాత ఆదుర్దాగా దూకిన చప్పుడైంది. చకచకా నడిచి చూస్తే చెట్టుమీద నుంచీ దూకి పరిగెత్తుతున్నాడొకడు. అది చూచి "ఎవడ్రా! ఆగు" అని కేకవేశారు రెడ్డిగారు. పరుగెత్తుతున్న మనిషి ఆ మాటే వినిపించుకోనట్లు పరుగెత్తాడు.
    దొరగారి ఆజ్ఞకు అంతగా ధిక్కారం ఎప్పుడూ జరుగలేదు. లోకమంతా తలక్రిందులౌతున్నట్లనిపించిందాయనకి. అలికీ మనిషి తాను నిలవమంటే నిలవడూ? కోపం పొంగింది. నరాల్లో రక్తం మహావేగంగా పొర్లింది. ఆవిర్లొచ్చాయి. మళ్ళీ కేకవేశాడు "ఒరే, నిలబడు. లేకుంటే తోళ్ళొలుస్త!" అని. పరిగెత్తే మనిషి మరికొంత వేగంగా పరిగెత్తాడు. కాని నిలవలేదు. రెడ్డిగారి ఉద్రేకం పొర్లింది. నరాలు చిట్లి రక్తం బైట పడేంత పనయింది.
    "ఎవడ్రా అక్కడ?"
    "బాంచను. పెంటిగాన్ని" అని బాణంలా పరిగెత్తుకొని వచ్చి చేతులు కట్టుకొని నుంచున్నాడు.
    "లంజకొడుక, ఏం చేస్తున్నావుర ఈడ! చింతల్ల దొంగలు పడ్తే చూడొద్దు?"
    "నీ కాల్మొక్త, నేను జొన్న చేనుమీదున్ననుండి."
    "జవాబు సుత చెప్పుతౌలే గాడ్దికొడకా" అని వంకర కర్రతో వానిమీదపడి బాదాడు.  దెబ్బతగిలినచోట చేత్తో రాసుకుంటూ బెత్తానికి చేయి అడ్డంపెట్టి దెబ్బలు తప్పుకుంటున్నాడు పెంటిగాడు. ఈలోగా బాటన వెళ్తున్న బ్రహ్మయ్య కనిపిస్తే "ఎవరయ్యా పారిపోతున్నదీ?" అనడిగారు. బ్రహ్మయ్య నుంచొని దండం పెట్టి జవాబు చెప్పాడు: "మల్లిగాని కొడుకు పీరిగాడు."
    "ఏ మల్లిగాడు?"
    "చాకలి మల్లిగాడు. గత్తరొచ్చి చచ్చిండు కాదుండి, అని కొడుకు."
    "చాకలి మల్లిగాడు కొడుక్కు ఇంత మస్తేక్కింది "లే!"
    "ఏం చేసిండుండీ?" అడిగాడు బ్రహ్మయ్య.
    "చింతచెట్టెక్కి కాయలు కోస్తాండు. నే నొచ్చేటారల్కల, నన్ను చూసిండు. దునికిండు, ఉరికిండు. అరిచినా పలక్కుండ, ఉరికిండు. కాయకోసుకున్నోడు 'దొరా! గీకాయ కోసుకున్న నీ బాంచను' అంటే పోక పోయినది. ఏమంటవు చెప్పు?"
    దొర వ్యవహారం వింతగా తోచింది బ్రహ్మయ్యకు. చింతలు ఎవరివి? దొర తండ్రివా, తాతవా! సర్కారువి. ప్రతి ఏడాది సర్కారు చింతల్ను వేలం వెయ్యాలి. ఎవడు ఎక్కువ పాడితే వాడికి సంక్రమించాలి న్యాయంగా చింతలు. కాని, దొర వేలం వెయ్యనివ్వడు. తాసీల్దారువాళ్ళకేదో చెప్పి వేలంలో ఎవరూ పాల్గొనలేదని వ్రాయిస్తాడు. చింతకాయంతా కొట్టించి ఊళ్ళో కారణానికంత, పటేలుకింత ఇచ్చి, మిగిలింది బస్తీకి పంపి అమ్మిస్తాడు. పైగా, ఈ చింతలు తన జాగీరైనట్లు అందర్నీ బెదిరిస్తాడని మనసులో అనుకొని పైకి "దొరోరు నిలవడమంటే నిలవకుండ పోయిండులే! అబ్బ, ఎంత ధైర్యముంది!! చాకలోడే అట్లయితే ఇగ దొరోరి మాట సాగినట్టే" అని దండంపెట్టి వెళ్ళిపోయాడు బ్రహ్మయ్య.
    'చాకలోడే అట్లయితె ఇగ దొరోరి మాట సాగినట్లే' అనే మాటలు రెడ్డిగారి మెదడును చీల్చి వేయసాగాయి. తరతరాలుగా వస్తున్న ప్రభుత్వం ఊడిపోతున్నట్లనిపించింది. పీరిగానికి తగిన శాస్తి చేయాలి. ఈ దెబ్బతో ఊరికి ఊరే అదిరిపోవాలి. మళ్ళీ చింతలవైపు వెళ్ళే ధైర్యం ఎవడూ చేయగూడదు అనుకుంటూ జొన్న చేనువైపు నడిచారు. గొడ్డు దూరి కరకరా మేస్తున్నది జొన్నంతా. మెదడు కరకరా కొరికినట్టనిపించింది.
    "ఎవడ్రా అక్కడా?" గర్జించారు. అదే ధ్వని తిరిగి వచ్చింది. 'గాడిద కొడుకులు, సొమ్ముతిని ఇండ్లంల్ల పంటరు' అనుకుంటూ జొన్నచేలో దూరి పశువును బాదారు రెడ్డిగారు. పశువు పరిగెత్తింది. దానివెంట పరుగెత్తి బాదారు. పశువు అమాంతంగా వెనక్కు తిరిగింది. దొరవారూ తిరగబోయి, ధోవతి కాలికి తట్టుకొని పడిపోయారు. ఎవరైనా చూసారేమోనని అటూ ఇటూ కలియజూచారు. ఎవరూ చూళ్ళేదని ధ్రువపరుచుకొని పంచ దులుపుకొని కర్ర అందుకొని బుసలుకొట్తూ ఊళ్ళో ప్రవేశించారు.
    తలమీది బిందెల్లో మంచినీళ్ళ బావినుంచి వస్తున్న ముగుదలు 'దొరోరు దొరోరు' అని పక్కకు ఒదిగి నుంచున్నారు. అరుగులమీద కూర్చొని ముచ్చట్లాడుకుంటున్న మగువలు అమాంతంగా లేచి లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. బాట వెంట నడిచేవారు పక్కకు ఒదిగి దొరవారికి మార్గం చేశారు.
    కరణం ఇంటి ముందరి అరుగుల మీద కరణం, పటేలూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు రెడ్డిగార్ని చూచి లేచి నమస్కరించారు.
    "చాకలి పీరిగాడు చింతకాయలు కోస్కపోయిండట కాదుండి?" కరణం వెటకారంగా అడిగాడు.
    "యాడికి పోతడులే దొరను తప్పించుకొని?" పటేల్ నిజామొద్దీన్ అన్నాడు.
    "కలికాలం కాదు దొర. దాతలెక్కున్నాది?" అన్నాడు కరణం చివరి పదం కావాలనే నొక్కి  పలుకుతూ.

 Previous Page Next Page