Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 5

    అతని భీకర వాగ్ధాటి విని తల్లి మనసు అతలాకుతలమయింది. అతని ముందు సాగిలిపడింది. మ్రొక్కటం ప్రారంభించింది.

    "దేవరా! నువ్వు జంగమయ్యలా ఉన్నావు. చిన్నవాళ్ళని శపించకు.నీకు కావలసిందేమిటో నేను యిస్తాను" అని బ్రతిమాలుకుంది.

    "అత్తగారూ! ఇలాంటి పగటి వేషగాళ్ళని చూచి మీరు భయపడకూడదు. వాళ్ళకిది మరీ అలుసు సుమండి! మీరు వెనక్కు రండి. వీడి తంతు ఏమిటో నేను తెలుసుకుంటాను.

    "ఏరా! ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఇళ్ళ ముందుకు వచ్చి వెధవ వేషాలేసి ఆడవాళ్ళని బెదిరిస్తావా? రాస్కెల్! అడ్డులే" అంటూ అతన్ని మెడపట్టి త్రోశాడు శివరాజ్.

    అతని శక్తినంతా సమీకరించి వెనక్కు నెడితే ఎత్తుగా అతి బక్కపలుచగా ఉన్న ద్రవిడమహేశ్వరుడు సెంటిమీటరు అయిన కదలలేదు. కాని కృద్దుడు అయిపోయినాడు. ఢమరుకం తీవ్రంగా మ్రోగించాడు.

    నేత్రగోళాలు చిదిమిన తంగేడుపూవుల్లా అయినాయి. శ్వేత వర్ణాంచితంగా ఉన్న ముఖం కోపాగ్నితప్తమై పద్మరాగ వర్ణాలను శ్రేతస్సుకు స్రవించింది. కనురెప్పలు విశాలంగా లేచినాయి.

    దట్టమయిన కనుబొమలు తెల్లగా శ్వేతఫణిఫణాగ్రాల్లా పూత్కరించినట్టు లేచినాయి. అతడు దెబ్బతిన్న రాజసర్పంలా బుసలు కొట్టడం ప్రారంభించాడు.

    ద్రవిడ మహేశ్వరుని తాకి అవమానిస్తావురా! ఓం నమో నాగ రాజాయ! ఓం హర హర హర! ఫణిఫణాగ్రా! పూత్కరించి లేచి రారా! మహేశ్వరుని మలినపరిచాడీ నరుడు!

    "కీలా లోలిత జ్వాలా జిహ్వాగ్రా! ఉత్తిష్ఠ! ఉత్ఫుల్ల రాజీవపత్ర ఫణీ! లే! లేచి రారా!!" అని గోడలు చిల్లులుపడేలా కర్కశస్వరంతో అరిచాడు.

    "కిలాలోలిత జ్వాలా జిహ్విగ్రా! ఉత్తిష్ఠ!!" అన్నప్పుడే ఉన్నతంగా మలిచిన అతని జటాజూటంలో కదలికలు ప్రారంభమయినాయి! ఆ తరువాతి ఆ మాటకి సమాధానంగా భయంకరమయిన ఫూత్కారం వినిపించింది.

    అతని జటాజూటంలోంచి భయంకరమయిన నాగరాజులేచి పడగవిప్పి ఆడటం ప్రారంభించింది. అతని ముఖం ఎంతగా కోపవివశమయి ఉందో నాగరాజుకూడ అంతకోప వివశంగా పడగ ఊపుతూ వెర్రెత్తిన దానిలా భయంకరంగా ఆడుతోంది.

    ఆ దృశ్యాన్ని చూచి తల్లి వెర్రి కేకపెట్టి విరుచుకుపడిపోయింది   

    ప్రొఫెసర్ సమతా బెనర్జీ అవాక్కుపడి నిలిచిపోయింది.

    తులసికి వొళ్ళంతా చెమటలు పట్టేశాయి.

    శివరాజ్ క్షణంసేపు షాక్ అయి అలా నిలిచిపోయాడు.

    "నాగరాజా! ఈ ద్రవిడ మహేశ్వరుని దిక్కరించాడీ నరుడు! నర్తించరా నాగా! రుద్రతాండవం చెయ్యి!" అంటూ భీకరమయిన శబ్దాలు వచ్చేలా ఢమరుకాన్ని మ్రోగించడం ప్రారంభించాడు.

    నాగు ఊగిపోతూ తన పొడవయిన అమృతకాయాన్ని మాహేశ్వరుని జటాజూటంలోంచి వెలికితీయటం ప్రారంభించింది. అది అతని మెడని కావలించుకుని ఆడింది రవంతసేపు.

    ఆ తరువాత గుండెలమీదుగా కౌపీనందాటి కాళ్ళమీదుగా నేలమీదికి వచ్చింది. అతని కాళ్ళముందు నిలబడిన డేగఎత్తితే దానిపడగ అతని గుండెల ఎత్తున లేచింది.

    క్షణంలో సగం ఆలోచించి పోలీసు అధికారి వేగంతో తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు! కాల్చి వేసేందుకయితే రివాల్వర్ సూట్ కేసులో ఉండిపోయింది. మరొకదారి అన్వేషించాలి.

    ముందు సీటువైపు చూచాడు. తులసి విపరీతంగా విచ్చుకున్న కళ్ళతో బిగుసుకుపోయి కన్పించింది. ఆమెకు శరీరంమీద తెలివి ఉన్నదో లేదో తెలియటల్లేదు. తనకు సాయం అందించగలిగిన స్థితిలో లేదామె. వెంటనే శరీరంమీది షర్ట్ లాగి దానిమీద వేశాడు.

    దాని లోలోపల మెలికలు తిరుగుతూ దారి అన్వేషించుకుని బయటకు రావటానికి దానికి కొంత సమయం పట్టవచ్చు.

    బహుశా నిముషంకాని అంతకుపైనగాని సమయంఉంది. ఈలోగా ఈ ద్రవిడ మహేశ్వరుని పనిపట్టాలి.

    నాలుగురోజులు కటకటాల వెనుక తోయిస్తే గాండ్రింపులు తగ్గుతాయి. విషజంతువుల్ని జనంమీదికి విడిచిపెట్టి భయపెట్టాలని ప్రయత్నించటం క్షమించరాని క్రైం.

    అతడు ఒక్క దుముకులో వెళ్ళి మెడపట్టుకున్నాడు. ద్రవిడ మహేశ్వరుడు త్రిశూలంతో తిరగబడ్డాడు.

    కాని పోలీసు దాటి క్షణక్షణానికి విజ్రుంభించింది. షర్ట్ లో పెనుగులాడుతున్న నాగరాజు మీదికి ఓ రాయి దొర్లించాడు శివ!

    గాయపడిన ఆ రెండు ప్రాణుల్నీ కంట్రోల్ రూం చేర్పించాడు!!
   
                                        2

    పోలీసు కంట్రోల్ రూం అంత హడావుడిగా ఉంది!

    ఎన్నడూరాని ఇంతకు మునుపు ఎవ్వరూ వినని విచిత్ర మయిన కేసు ఇది! ద్రవిడ మహేశ్వరుడు కటకటాల వెనుక కూర్చున్నాడు.

    రెప్పలు సగం వాల్చి ఏవో మంత్రాలు వల్లించుకుంటున్నాడు ఏ మహారాజుకో, చక్రవర్తికో జరగకూడని అమానం జరిగినట్లు, ప్రపంచమంతా మునిగిపోయినట్లు ముఖం పెట్టాడు.

    ముఖం మీద వికృతంగా పెరిగిపోయి ఉండడం నించి జూలు విదిల్చి గాండ్రించుతున్న సింహంలా కన్పించుతున్నాడు. ఏనాడూ పాదరక్షలు ధరించని కాళ్ళు మొరటుగా మట్టికొట్టుకుపోయి జంతువుల కాళ్ళలా గోళ్ళు పెరిగిపోయి వున్నాయి. శరీరం మీద పుట్టిన వెంట్రుకల్ని ఏనాడు కత్తిరించని విచిత్ర ప్రాణి అతడు!

    గదిలో కూర్చున్నా వెలుపలకు వంగి మసలుతున్న మదపువాసన ఘాటుగా వస్తోంది. కంటి చూపులు సూది మొనల్లా గ్రుచ్చుకుంటున్నాయి. దయగలిగిన ఓ పోలీసు తండ్రి యిచ్చిన బ్రెడ్ కాని పాలుకాని అతడు ముట్టుకోలేదు. బుట్టలో పెట్టిన నాగులా బుసలు కొడుతున్నాదు.
   

 Previous Page Next Page