Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 5

    "ఎక్కడికి?"

    "షంషాబాద్..."

    "పక్కన వున్న షంషాబాద్ కి ఇంత హడావుడంటయ్యా?"

    "పోనీ, ఔరంగాబాద్ కివ్వు..."

    "ఔరంగా...బాద్...కా...?" గుడ్లు తేలవేస్తూ అన్నాడు స్టేషన్ మాస్టర్.

    సీట్లోంచి లేచి, కిటికీ పక్కనున్న టికెట్స్ సెల్ వేపు వెళ్ళి, మూడు టిక్కెట్లను తీసి వెనక్కొచ్చి__

    "డబ్బులివ్వండ"న్నాడు స్టేషన్ మాస్టర్ - సేతురాజు, వీర్రాజు ఇద్దరూ గుడ్లు తేలేసారు.

    కిచ కిచమని నవ్వుతూ అరచేయి గుప్పిట తెరిచాడు పోతురాజు.

    అయిదు వందల రూపాయల నోటు అందులో ప్రత్యక్షమైంది.

    ఫైవ్ హండ్రెడ్ రుపీస్...ఎక్కడిదని కప్పలా నోరు తెరిచి అడగబోతుండగా, ఒక చేత్తో వాడి నోరు మూసేసాడు పోతురాజు.

    స్టేషన్ మాస్టర్ ఆ నోటుని తీసుకొని, పరకాయించి చూసి "నో చేంజ్.." అన్నాడు.

    "ఏం ఫర్వాలేదు...బ్యాలెన్స్ నువ్వు తీసుకో...ఇలా బ్యాలెన్స్ దానాలు చేయడం మా హాబీ..." ఆ టిక్కెట్లను అందుకొని ముందుకు నడిచాడు పోతురాజు.

    సంభ్రమాశ్చర్య వదనులై మిగతా ముగ్గురూ పోతురాజుని పక్కకులాగి__

    "ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్స్ ఎక్కడివిరా...?" కంగారుగా అడిగారు.

    "ఒరే పిచ్చి నాన్నలూ...మనీ సంపాదించడం ఒక ఆర్ట్...ఒక ఫైవ్ హండ్రెడ్స్ ఏంటి....ఇప్పుడు మన దగ్గర చాలా ఫైవ్ హండ్రెడ్స్ వున్నాయి" అంటూ బ్యాక్ పాకెట్ లోంచి అయిదు వందల రూపాయలట్టను తీసి, వాళ్ళ కళ్ళముందు ఆడించాడు.

    సరిగ్గా అదే సమయంలో__

    "ముగ్గుర్లో ఆ టిక్కెట్లు తీసుకొన్నవారు మరీ పిచ్చివాడు...లేకపోతే బ్యాలెన్స్ ఎందుకు వదిలేస్తాడూ... ఒరే రామప్పా...నీకీ టైం లో ధనయోగాన్ని నుదుట మీద రాశాడు ఆ గాడ్!" అని స్వగతానంద లఃరిలో అనుకొంటూ డ్రాయర్ సొరుగు కొంచెం ముందుకు లాగి, తేలుకుట్టిన వాడిలా "అమ్మో!" అన్నాడు.

    ఆ అమ్మోకి కారణం- అంతకు పూర్వమే అతగాడు అక్కడ అయిదు వందల రూపాయల నోట్ల కట్టాను ఉంచడమే!

    కిందా మీదా పడుతూ వెతకడం ప్రారంభించాడు.

    అయిదు నిమిషాలసేపు వెతికేసరికి, వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలా అయిపోయాడు స్టేషన్ మాస్టర్.

    "చోర్...చోర్...పకడో...పకడో..." అంటూ బయటకు పరుగు దీయబోయి, ఎదురుగా యూనిఫారమ్ లో వున్న మనిషిని ఢీకొన్నాడు.

    "ఏమైంది రామప్పా?" అడిగాడు ఆ యూనిఫారమ్ లో ఉన్న రైల్వే పోలీస్ సబ్ ఇన్ స్పెక్టరు.

    "దొంగలబండీ బాబూ....అర్జంటుగా పట్టుకోండి! అదిగో....వాళ్ళే!" దూరంగా బెంచీ మీద తీరుబడిగా కూర్చుని, బీడీలు కాల్చుకుంటున్న ముగ్గుర్నీ చూపిస్తూ అన్నాడు రామప్ప.

    "ఆర్యూ షూర్...ఎంత ఎమౌంట్....ఎలా పోయింది?" ఆ ఇన్ స్పెక్టర్ చేతిని పట్టుకుని ముందుకు పరిగెడుతూ కధంతా చెప్పాడు స్టేషన్ మాస్టర్.

    మూడు నిమిషాల తర్వాత__

    తమ ఎదురుగా నిలబడిన ఆ ఇన్ స్పెక్టర్ వేపు చూస్తూ పోతురాజు

    "ఉయార్ అండర్ అరెస్ట్- అవునా?" అని అన్నాడు - ఆ ఇన్ స్పెక్టర్ కి మతిపోయినంత పనైంది ఆ డైలాగ్ కి.

    "అరెస్టా...తోలు వలిచేస్తాను. మర్యాదగా చెప్పండి- స్టేషన్ రూమ్ టేబుల్లోని యాభై వేల రూపాయల్ని తీసింది మీరేనా?"

    "చెప్పకపోతే ఏం చేస్తారో?" ఠీవీగా పొగ వదుల్తూ అన్నాడు వీర్రాజు.

    "స్టేషన్ లో పడేస్తా. లాఠీల్తో కుళ్ళబొడుస్తా. కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తా. ఆరు వారాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త!" అగ్గిరాముడి టైపులో అన్నాడు ఇన్ స్పెక్టర్.

    "ఇంతేనా__ఆరు వారాలేనా? అదికాదు ఇన్స్ ఫెట్రూ- ఇప్పుడు నిన్ను మేం కొట్టేసి పారిపోయామే అనుకో - శిక్ష ఎంత?"

    "అయిదు నెలలు!"

    "ఆరు వారాల కంటే, అయిదు నెలలు ఎక్కువే కదరా! ఒరేయ్, మరెందుకూ- లాగించెయ్!" కన్నుకొట్టి వీర్రాజు, సేతురాజుకు సలహా ఇవ్వడంతో - సేతురాజు రెప్పపాటు టైం లో ఫట్ మని ఇన్ స్పెక్టర్ చెంప మీద కొట్టి, ముందుకు పరుగెత్తాడు.

    ఇన్ స్పెక్టర్ టోపీ కింద పడిపోయింది. ఆతోపీని అందుకొని, ముందుకురికాదు.

    స్టేషన్ బయటికి పరుగెత్తి, అటూ ఇటూ చూసి, ముందుకు పరుగెత్తాడు.

    రైల్వే పోలీసుల విజిల్స్ కి, ఆ పక్కనే ఉన్న స్టేషన్ లోంచి కానిస్టేబుల్స్ బయటికొచ్చారు.

    తమకి దొరక్కుండా తప్పించుకొంటూ, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి పరిగెత్తుతున్న ఆ ముగ్గురి వేపూ వింతగా చూడసాగారు పోలీసులు.

    డైరెక్ట్ గా లోనికెళ్ళిపోయి, ఖాళీ సెల్ లోకి దూరిపోయి, ఇనప చువ్వల డోర్ ని గట్టిగా బిగించుకున్నారు ఆ ముగ్గురూ.
   
                                                                  ౦    ౦    ౦

 Previous Page Next Page