Previous Page Next Page 
విరిజల్లు పేజి 5


    "విరజా....ఆగు....ఆగు....ఆగు__విరజా"
    అతని కంఠం ఆ సాయంత్రపు నిశ్శబ్ధతలో మార్మోగుతోంది.
    అస్తమించబోతున్న సూర్యుడు గూడా అతని ముఖాన్ని చూసి వ్యధ చెందాడా అన్నట్లు ఆయన హృదయమూ ఎర్రగా అయింది. ఆమె ఏడ్పుని విని తమలాగే కన్నీటిని విడుస్తున్న ఆమెను చూసి జలదాలు ఎర్రగా ఆమె కంటి చివరలోని ఎర్రదనంలా అయ్యాయి.
    "విరజా ఆగు!"
    ఆపుకోలేని కోపంతో అరిచాడు.
    వెను దిరిగి చూసింది దగ్గరగా వస్తున్నాడు. చాలా దగ్గరగావచ్చాడు. ఇక కొద్ది క్షణాల్లో తనని అందుకుంటాడు. ఎలా....ఎలా?
    అపజయాన్ని అంగీకరించలేక బిగ్గరగా యేడుస్తూ అలా దారిలో కూలబడిపోయింది.
    దగ్గరగా వచ్చి ఆమె ప్రక్కనే కూర్చుని ఒక చేత్తో ఆమెను పట్టుకుని ఆయాసంతో రొప్పసాగాడు.
    ఊపిరి బలంగా విడుస్తూ ఒక చేత్తో ఆమె చేయి పట్టుకుని మరో చేత్తో ముఖంమీద నిండిన స్వేద బిందువుల్ని తుడుచుకోసాగాడు.
    అయిదారు నిముషాలు బాగా విశ్రాంతి తీసుకుని బలంగా తనవైపు తిప్పుకుంటూ అన్నాడు.
    "నీవు ఒట్టి మొండివి విరజా"
    ఏమీ జవాబు చెప్పకుండా మౌనం వహించింది. ఆమె అలా పారిపోయి రావటం, అప్పటినుంచి సరిగా పలకకుండా వుండటం అతన్లో ఓ విధమైన చిరాకును రేకెత్తించింది, విసుగ్గా అన్నాడు.
    "అబ్బబ్బ! నీ మౌనంతో నన్ను చంపుతున్నావ్ విరజా! ఇలా అయితే నేను చచ్చిపోతాను చూడు"
    మెల్లిగా మృదువైన తన అరచేతితో అతని నోరు మూసింది. ఆ క్షణాన ఆ అమ్మాయి ముఖంలో దోబూచులాడిన వేదన అనండి, అనురాగం అనండి, ఆత్మీయత అనండి, అనుబంధం అనండి. అదేదైనాకానీ ఎలాంటి వారినైనా యిట్టే కదిల్చివేస్తుంది. హృదయానికి హృదయానికీ మధ్యనున్న సంబంధం నిర్వచించటం కష్టం.
    ఆత్మీయులైనా ఇద్దరి మధ్య ఎందుకైనా చిలిపి తలపువల్ల చిన్ని చిన్ని కలహాలు బయలుదేరితే వానివల్ల ఆ క్షణంలో వాళ్ళిద్దర్లో ఎవరైనా సరే, అనువల్లరి వలన బాధపడుతూ ఆత్మనిందని చేసుకుంటే ఎదుటివాళ్ళు ఏమీ అనలేనిస్థితిలో చిక్కుకుని అవతలివాళ్ళని మౌనం వహించమని కోరటంకంటే మరేమీ చేయలేరు.
    "నీ ధ్యానముద్ర వదలు విరజా"
    మెల్లిగా తన చిన్నారి లేతపెదాలు విడివడకుండా వసంతఋతువు ప్రవేశించేవేళ చిన్నారి కోయిల కుహూఁ కుహూఁ నినాదం చేసినట్టుగా అంది.
    "అంత గట్టిగా అరవాలా వేణూ? నేనెక్కడికి పోతాను? ఎలా పోయినా, ఎక్కడికి పోయినా వెన్నంటి తరిమితెచ్చేవాడివి నీవుంటివాయె! పోవాలన్నా పోనీవు-"
    మనసు నిండుగా ప్రవహించే స్నేహవాహినీ పూరితమైన మధుర వాక్కుతో అంది.
    ఆమె చెప్పే మాటలు పూర్తికాకుండానే అన్నాడు ఉక్రోషంగా. "అందుకే కాబోలు బహుశా నన్నీ దారివెంట అంతా పరుగెత్తించింది. ఏమైనా మళ్ళీ యిలా చేస్తే నీతో కచ్చే..." తర్జనతో బెదిరిస్తూ అన్నాడు.
    తనెంతో ప్రేమపూరితంగా మృదువుగా హాస్యాన్ని జోడించి అన్న మాటలకు అతనలా కోపం తెచ్చుకుని అనటంతో ఆమె మనస్సు కొద్దిగా బాధ పడింది.
    దీనంగా చూస్తూ అంది. "అలా అయితే మంచిదే వేణూ! నన్ను ఆట పట్టించటమే నీకు సరదా కాబోలు! అలా అయితే అంతకన్నా నాకు కావలసింది ఏముంది? ఎప్పుడూ నాకు కావలసింది నీ సరదా సంతోషాలే. అవి ఎలాగైనా లభ్యమైతే చాలు. వాటికోసం నేనెంత బాధపడినా లెక్కజేయను. అయినా నన్ను నొప్పించటం తర్వాత సేద తీర్చటం అదేకదా నీ హాబీ."
    తేలిగ్గా నవ్వాడు ఆ అబ్బాయి. ఆమె తన పెదాలను దగ్గరగా తీసుకుని మూతి సున్నాలా చుట్టి కళ్ళల్లోకి కోపంగా కూడుకున్న ఎత్తిపొడుపు లాంటి భావాన్ని అనురాగంతో కలిపి వ్యక్తీకరిస్తూ అంటుంటే, అతనికే కాదు ఎవరికైనా నవ్వొస్తుంది.
    అతను తేలిగ్గా నవ్వేసరికి వాతావరణాన్ని తేలిగ్గా మార్చాలని తనూ నవ్వుతూ అంది.
    "ఇంత లేతవయస్సులోనే అమ్మాయిల్ని ఇంతగా ఏడ్పిస్తున్నారే.... రేపు పెళ్ళయ్యాక మీ ఆవిడని మరీ ఏడ్పిస్తావేమోకదూ?"
    ఆ మాటల్ని హాస్యానికైనా సరే అనేప్పుడు ఆమె ముఖంలో ద్యోతకమైన భావాల్ని వ్రాయటానికి నాకు చేతగావటంలేదు.
    "ఉహు....ఏడ్పించను. ఎందుకేడిపిస్తానేమిటి? ఆవిడ మా ఆవిడాయె. ఎవరైనా తనవారిని ఏడిపిస్తారేమిటి?"
    కొన్ని కొన్ని పదాల్ని వత్తిపలుకుతూ ఆమెను సరిగ్గా ఆమెలాగే అనుసరిస్తూ పెద్ద హీరోలా అభినయించాడు.
    ఉక్రోషంతో అడిగింది. "మరయితే నేనెవర్ని? ఎవర్నీ కానప్పుడు నన్నెందుకేడ్పించావేం? నేనేడిస్తే నీకు సంతోషమా?"
    గట్టిగా గలగలా నవ్వుతూ అన్నాడు. "నీవా? నీవా? ఇప్పుడెవరో తమరికీ తెలుసు. ఇకముందు యేమౌతావో ఎవరికేం తెలుసు? కానీ పూర్వజన్మలో మాత్రం నీవెవరివో తెలుసు. ఎవరో చెప్పనా? బహుశా మా మేనమామ కూతురివై వుంటావు. అవునా? మరదల్ని సరదాకైనా యేడ్పించని బావ యేం బావ? అందుకే అప్పుడు సరిగా యేడ్పించానో లేదో గుర్తులేక ఇప్పుడు అప్పుడప్పుడూ ఆ కొరత తీరుద్దామని సరదాకి...."
    "ఛీ-ఛీ-ఎప్పుడూ మరదలూ....బావా....పో....పో.... ఇలా అయితే నీవెంట రానేరాను-"
    ఆమె మాటను పూర్తికానివ్వకుండానే ఆమె చేయి పట్టుకుని లేవదీస్తూ "ఇక పద పొద్దు పోవస్తూంది.... వద్దులే ఇక రేపటినుంచి నీవు నాతో రానేరావద్దు....మంచిది-కానీ నేనుమాత్రం మా విరజవెంట వస్తూనేవుంటా"
    గట్టిగా సంతోషాన్ని దాచుకోలేక కిలకిలా నవ్వింది విరజ.
    ఈ ప్రపంచంలో జరిగే చిత్రాల్లో కొన్ని అతివిచిత్రంగా వుంటాయ్. వయసు వికసించకున్నా మనసు వికసించి పెద్ద ఆరిందల్లా మాట్లాడేవాళ్ళుంటారు__విరజ లాంటి అమ్మాయిలూ, వేణులాంటి అబ్బాయిలూ యెప్పుడూ కాలానికీ వయసుకీ అతీతులు__


                                                          3


    దాదాపు తొమ్మిది గంటలవుతోంది. శ్రావణమాసం వెళ్ళబోతోంది. భాద్రపద మాసానికి స్వాగతం పలకబోతూ సూర్యుడు కొంచెం తీక్షణతని పెంచుకుంటున్నాడు. అక్కడక్కడా చెదురు చెదురుగా మేఘాలున్నా, అవి వర్షానిచ్చేట్టు లేవు.
    త్వర త్వరగా బడికి చేరుకోవాలనే తొందరలో అన్నాడు వేణు.
    "త్వరగా నడు విరజా!"
    జవాబు రాకపోవటంతో మళ్ళీ అన్నాడు విసుగ్గా. "నడు విరజా.... ఆలస్యం అవుతుంది. అసెంబ్లీ హాల్లో మనం కనిపించకపోతే హెడ్మాష్టరుగారు వూరుకోరు. నీ ప్రార్ధనగీతం లేందే పాఠశాల మొదలవదు__"
    హెడ్మాష్టరుగారి పేరు మెదలటంతో ఆమె మనసులో ఆయన ఒక్కసారి కదిలారు. గంభీరంగా, చమత్కారంగా విద్యార్ధులతో, తోటి ఉపాధ్యాయులతో కలిసిపోతూ ఎలామతి విద్యార్ధినైనా సామదాన భేదోపాయాలతో లొంగదీసుకుంటూ ఎటువంటి మాష్టారయినా చక్కగా పనిచేసేట్టు పాఠశాలను శాంతంగా నడుపుకుంటూ, ప్రతిరోజూ అసెంబ్లీలో విద్యార్థినీ విద్యార్థులకు మంచి మంచి మాటలు బోధిస్తూ వాటిని అప్పుడప్పుడూ ఆచరణలో పెట్టి చూపెడుతూ, తండ్రిగా, సోదరుడిగా, ఆత్మీయుడిగా మెదలుతూ బళ్ళో ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్న విద్యావినయ సంపన్నమూర్తి!
    ఆలోచనలని పారద్రోలి అంది."చేతకావటంలేదు వేణూ!" బాధతో మూల్గింది.
    "ఎందు కేమిటి? పరుగెడుతూ వెడతావే? వేగంగా నడవమంటే చేతకాదా?"
    ఒక్క క్షణం ఆగి అతని ముఖంలోకి చూస్తూ అంది. "నిజం వేణూ! పరిగెడతాను. పరిగెత్తిస్తాను. కానీ ఈరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు కెయ్యటానికి చేతకావటంలేదంటే నమ్ము."
    ముఖంమీద గాలి విసురికి పడుతున్న ముంగుర్లని పక్కకి నెట్టుకుంటూ అడిగాడు.
    "ఎందుకని? అయినా చెబితేకదా ఎవరికైనా తెలిసేది?"
    "ఇటు చూడు."
    పరికిణీ మోకాలు వరకు లాగి తలమరోవేపు తిప్పుకుని చూసింది. ఒక్కక్షణం తర్వాత ఇక నిలబడలేక కూర్చుంది.
    పచ్చగా మెరుస్తున్న కాలిమీద మోకాలికి బెత్తెడు క్రిందుగా గీరుకునిపోయి రక్తం గడ్డకట్టి యెర్రగా చారలా కనిపిస్తోంది.
    ఎక్కడో తొందరపాటుచేసిన పనికి శృంగభగం అయినట్టుంది. తనూ కూర్చుని కాలిని దగ్గరగా లాక్కొని సుతారంగా వత్తుతూ అన్నాడు ఆర్ద్రంగా.

 Previous Page Next Page