"చూడరా ఎంత ఘోరం జరిగిందో ...రేఖ ...రేఖని ఏం చేశారో చూడరా....." మంచం మీద కూలబడింది రాధాదేవి. శ్యామ్ ఒక్క ఉదుటున తల్లి చేతిలో పేపరు లాగి చదువుతూ "మైగాడ్...." అని అరిచాడు. వార్తా పూర్తిగా చదువుతుంటే అతని శరీరం భయంతో కంపించింది. చదివే పేపరు జారవిడిచాడు. "ఎంత ఘోరం....మైగాడ్" తల పట్టుకున్నాడు. రాధాదేవి కంపిస్తున్నా గొంతుతో 'శ్యామ్ ....నేను భయపడినంత జరిగింది . రేఖ.....పాపం, యింకేలా బతుకుతుంది ఈ లోకంలో? రామ, రామ. ఎంతకీ తెగించారు ఆ వెధవలు.....ఆమె బతుకు బండలు చేశారు. యెంత ఘతకం జరిగింది. ఎంత దారుణం...." ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. శ్యాం బాహ్యస్మ్ర్తుతి కోల్పోయిన వాడిలా మాటా పలుకు లేకుండా కూర్చుండి పోయాడు.
"ఈ పత్రికల వాళ్ళోకరు ఓ ఆడపిల్ల జీవితం నాశనం అయితే అదింత పెద్ద అక్షరాలతో ఫోటోతో సహా ప్రచురిస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందన్న సనుభూతన్నా లేకుండా యిలా ప్రచురిస్తారు. అంతే.....ఎవరి ఆదుర్దా వారిది..... శ్యామ్ ...ఏమిటి అలా వుండిపోయావు?"
"ఏమిటోనమ్మా. పెద్ద షాక్ తగిలినట్లయింది. ....మనకే యిలా వుంది. రేఖ ఎలా తట్టుకుందో ఈ ఘతకం. ఇంక ఆమె గతి ఏమిటమ్మా. ఈ పాటికి ఆమె తల్లిదండ్రులు వచ్చి యింటికి తీసికెళ్ళారేమో.....ఆమె ప్రాణాలతో బయట పడినందుకు సంతోషించాలి యింక...."
"హు....ఈ దేశంలో మానం పోయిన ఆడదాని ప్రాణానికి ఎవరూ విలువ ఇవ్వరు శ్యామ్.....ఆమె ఏ బాధ తెలియకుండా చచ్చిపోతేనే బాగుండేది. లోకం అంతా ఆమెను దోషిలా చూస్తుంటే తప్పు లేకపోయినా తలెత్తుకోలేని బతుకు బతికేకంటే చావు మేలు.....అడ బతుకింతే నాయనా...."
'అమ్మా!....' ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్. తన తల్లి.....చదువుకుని స్వతంత్యంగా బతుకుతున్న ఆమె కూడా అడ బతుకింతేనని నిరశాపడటం.....ఓ వ్యక్తిత్వం వున్న తల్లి కూడా లోకాని కింత భయపడడం! వింతగా అన్పించింది. "అమ్మా! నీవూ అలా మాట్లాడుతున్నావా.....ఇందులో రేఖ తప్పు ఏముందమ్మా.....ఆమె కావాలని చేస్తే అది తప్పు కాని ఎవరో అత్యాచారం చేస్తే రేఖ దోషం ఏముంది?"
"శ్యామ్ .....ఆడదాని మానానికి మన వాళ్ళిచ్చిన విలువ యింకే దేశంలోనూ లేదేమో. కావాలని చేసినా, ఎవరో చేసినా శిక్ష అనుభవించేది ఆ స్త్రేయే. మానం పోగొట్టుకున్న స్త్రీని ఈ సంఘం వెలేస్తుంది. ఆమె పట్ల సానుభూతి చూపి చెయ్యదించే వారుండరు. యింక రేఖని పెళ్లాడెందుకు ఎవరన్నా ముందుకు వస్తారా? ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అయింది శ్యామ్" ఆవేదనగా అంది రాధాదేవి.
'అమ్మా...." మంచం మీదనించి లేస్తూ 'అమ్మా! రేఖని ఒకసారి చూసి వస్తానమ్మా.....' ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా అన్నాడు శ్యామ్.
వెడతావా.....వద్దు శ్యామ్ ....ఇలాంటి సమయంలో యింకోరు చూపే సానుభూతి కూడా భరించలేరు. సానుభూతి చూపినా అవహేళన చేసినట్లే అన్పిస్తుంది వాళ్ళున్న పరిస్థితిలో. ఆమెని కొంచెం కుదుటపడనీ...."
"లేదమ్మా..... స్నేహితులమానుకునేవాళ్ళు ఈ స్థితిలో వెళ్ళకపోతే కూడా బాధపడ్తారు. ఒక్కసారి రేఖని చూసి రావాలి...." అన్నాడు గంభీరంగా.
"సరే పద. నేనూ వస్తాను. చూసిన మొదటి క్షణంలోనే రేఖ అంటే నా కెందుకో యిష్టం కల్గింది. అందులో ఈ పరిస్థితిలో వున్న రేఖని చూడకుండా వుండలేను. మనం అప్సత్రికే వెళ్దాం. ఇంటికి తీసికెళ్ళాక వాళ్ళింటికీ వెళ్ళాలంటే వాళ్ళెవరో మనకి తెలియదు , బావుండదు వెళ్ళడం . నీవు స్నానం అదీ కాని వేడ్దాం....." అంది రాధాదేవి. పేపరు చేతిలోకి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆ వార్త చదవసాగింది. "నగరంలో కాలేజీ విద్యార్ధినికి జరిగిన ఘోరమైన మానభంగం" అంటూ రేఖ ఫోటోతో సహా పెద్ద అక్షరాలతో ఆ వార్త ప్రచురించారు.
"నిన్న తెల్లవారుజామున నాల్గుగంటలకి యునీవర్సిటీ రోడ్డువైపు పాలవ్యాను వేడ్తుంటే రోడ్డుకి అడ్డంగా పడివున్న ఒక స్త్రీని చూసి వ్యాను ఆపి దిగారు. ఆ యువతి తెలివి తప్పి వుంది. చిరిగిన జాకేట్టుతో, వంటిని లంగా మాత్రం వున్న ఆ యువతి వంటినిండా రక్కులు, బుగ్గలపై గాట్లు పెదాలు చిట్లి రక్తం గడ్డకట్టి వుండడం చూసిన ఆ పాల వ్యాన్ వాళ్ళకి సంగతి అర్ధం అయింది. వెంటనే ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తీసికెళ్ళారు. ఆమెని రక్తసిక్తమైన ఆమె దుస్తుల్ని చూడగానే డాక్టర్లకి రేప్ కేసు అని అర్ధం అయింది. వెంటనే పోలీసు కంప్లయింట్ యిచ్చారు. ఉదయం ఏడు గంటలకి ఆమెకి తెలివి వచ్చింది. తెలివి వచ్చాక తన దుస్థితికి కన్నీరు మున్నీరుగా విలపించిన ఆమె దయనీయమైన పరిస్థితి చూసిన అందరికీ కళ్ళు చమర్చాయి. ఎంత అడిగినా ఆమె తన వివరాలు తెలవకుండా , తనని చంపేయమని ఒకటే ఏడ్పు. చచ్చిపోతానని హిస్టీరియా వచ్చిన దానిలా విలపించింది. అంతలో అదృష్టవశాత్తు ఆ వీధిలో వుండే రామారావు గారి భార్య ఆపరేషను అయి ఆస్పత్రిలో ఉందని ఉదయం కాఫీ పట్టుకు వచ్చిన అతను ఆ వర్డు వేపు వెడుతూ కిటికీ లోంచి ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టి ఆస్పత్రికి ఎందుకొచ్చిందా అని అరా తీయడానికి అడిగేసరికి అప్పుడు డాక్టర్లు ఆమె తండ్రి పేరు వగైరాలు తెల్సుకుని వెంటనే ఫోన్ చేశారు. అంతకుముందే సాయంత్రం కాలేజీ నుంచి కుమార్తె యిల్లు చేరలేదని రాత్రి పదిగంటలవరకు ఆరాటంగా ఎదురు చూసి, అందరి స్నేహితురాళ్ళ యిళ్ళకి వెళ్ళి కుమార్తె కనపడక బెంబేలు పడి అయన పోలీసు కంప్లయింట్ యిచ్చాడు. అసలు జరిగిన సంగతి ఏమనగా రేఖ అనే బి,ఏ. ఫస్టు యియర్ విద్యార్ధిని కాలేజిలో ఉండగా నాలుగిళ్ళ అవతల వుండే ఇంటర్ చదివే సుశీల అనే అమ్మాయి గాభరాగా క్లాసుకి వచ్చి రేఖ తండ్రికి యాక్సిడెంట్ అయి చావుబతుకుల్లో ఉన్నట్టుగా పక్కింటి అయిన చీటీ రాసి యిచ్చి రేఖ వుండే క్లాసు చూపి చీటీ యిచ్చి పిలుచుకు రమ్మని చెప్పాడట. సుశీల తెచ్చిన చీటీ చూసి గాభరాపడి మరేమీ ఆలోచించక అతని వెంట బయలుదేరినట్టు సుశీల రేఖ తండ్రితో చెప్పగానే అయన ఆందోళనతో పోలీసు కంప్లయింట్ యిచ్చాడు. ఎవరో కావాలని కధ అల్లి ఆమెని బలాత్కారంగా చెరిచారని అందుకు కారణం ఏమిటో తెలియదని పోలీసులు అన్నారు. రేఖ తల్లిదండ్రులు దుఃఖం వర్ణనాతీతం. ఎంతో సేపటికి గాని రేఖ నించి ఎవరూ అసలు విషయం రాబట్టలేకపోయారు. ఒక విధమైన షాక్ లో వున్న ఆమె మానసికంగా, శారీరకంగా గుర్తు పట్టలేనంత నీరసించిన ఆమె స్థితి డాక్టర్లకే గాభరా కల్గించింది. నిన్న సాయంత్రానికి కొద్దిగా మందుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు అనునయించి బుజ్జగించినందువల్ల ఆ షాక్ నుంచి కాస్త తేరుకుని కుమారి రేఖ అసలు విషయం చెప్పింది. ఆ చీటీ తీసుకొచ్చిన అతను ఓ అటో ఎక్కించి తీసుకేళ్ళాడట. ఆమె గాభారాలో ఎటు వేడ్తున్నది గమనించలేదట. చాలాసేపు వెళ్ళాక ఓ యింటి ముందు ఆగిందట అటో. 'యిదేమిటి ఆస్పత్రికి వేడ్తున్నాం అన్నారు ' అందిట ఆశ్చర్యంగా. 'ప్రయివేటు నర్శింగ్ హోంలో చేర్చారు లోపలికి వెళ్ళి చూడండి" అన్నాడుట. రేఖ తలుపులోంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో బలమైన హస్తం ఆమెని గట్టిగా బందించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టారట. నోట్లో గుడ్డలు కుక్కరట. ఆ మాటలని, గొంతుల్ని బట్టి కనీసం ముగ్గురు మనుష్యులుంటారని ఆమె గుర్తు పడుతుంది. చాలాసేపు తరువాత ముగ్గురో నల్గురో ఒకరి తర్వాత ఒకరు ఎంత ఘోరంగా , ఎంత భీబత్సంగా గింజుకుంటున్న ఆమెని మానభంగం చేశారో చెప్తూ అది గుర్తు తెచ్చుకున్న ఆమె మళ్ళీ స్పృహ తప్పింది. ఆమె మానసికంగా చాలా నీరసించినందున డాక్టర్లు యింకా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె వారి ఘాతకచర్య చెప్తుంటే వినిన అందరూ చలించిపోయారు. ఆఖరికి పోలీసు ఇన్ స్పెక్టర్ కూడా విపరీతంగా చలించి ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా రాక్షసప్రవృత్తిలో చెరచిన ఆ దుర్మార్గులని ఏనాటి కన్నా పట్టుకు తీరుతానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ ముగ్గురూ ఎవరై వుంటారు? ఆ యువతిపై వారికింత పగ , కక్ష ఎందుకా అని పోలీసులు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ గాభరాలో ఆ అటో నెంబరు కూడా చూడలేదు ఆమె. చీటీ తెచ్చి యిచ్చిన అతను మారువేషం వేసుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడ్తున్నారు పోలీసులు. ఈ ఘాతుక చర్య చేసిన వారి గురించి గాని, దీని వెనుక వున్న కారణం గురించి గాని తెలిసిన ఎవరన్నా ఏ చిన్న విషయం అయినా సరే పోలీసులకి చెప్పి సహాయపడవలెను. ఆ అటో డ్రైవర్ సహృదయంతో ముందుకు వచ్చి ఆ యిల్లు వగైరా ఆచూకీ యిచ్చిన మంచి బహుమతి ఇవ్వబడును. కుమారి రేఖపై జరిగిన ఈ అత్యాచారం మొత్తం స్త్రీ జాతిపైన జరపబడిన అత్యాచారంగా గుర్తించి నేరస్తులని శిక్షించడానికి పోలీసులకి సహాయపడవలనేని ఇన్ పెక్టర్ విజ్ఞప్తి చేశాడు -" పేపరు మడిచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధాదేవి.