"అంటే వెన్నెల రాత్రిళ్ళలో గాలి తిరుగుడు తిరిగేవాడు అన్నల సంపాదన తింటూ సోమరి అయ్యేవాడు, లోకంలోని దౌర్భాగ్యాలన్నీ ఏక త్రితం అయినవాడూ మనవుడని మీ అర్ధం" అతను వెకిలిగా నవ్వుతుంటే ఇమ్తియాజ్ అన్నకూడా నవ్వుతాడు. ఇద్దరూ కలిసి లాలాను ఉడికించే నెపంతో బాగా ఉడికేవారు.
ఇమ్తియాజ్ అన్న అయిదేళ్ళ నుంచి బి.ఏ. చేస్తున్నాడు. అందుకే చెల్లెళ్ళ తెలివితేటలంటే అతనికి మంట.
"చూడూ బాబూ! ఇవన్నీ నవలల పాత పాట్లు సినిమా కధలు. నాకు తెలియక అడుగుతాను. మజ్నూ దారిలో నడిచేవాళ్ళు వాయుదాల్లో చస్తే ఏం లాభం? ఆత్మహత్య చేసుకుంటే ఎవడు ఆపాడు? ఏమంటావ్?" అతడు ఇమ్తియాజ్ ను అడిగేవాడు.
లాలా అసహ్యించుకునేది. కాని ఆ అసహ్యాన్ని ఎలా వ్యక్త పరచాలో అర్ధం అయ్యేది కాదు. 'మాకు మామ అవుతే మీకు బాబాయి అవుతాడు' ఎటూ పాలుపోక ఏదో అనేది.
"అంటే వారి తెలివితెక్కువను గుర్తించి మాట్లాడోద్దనా?"
"అది మీకేం తెలుస్తుందిలే ఆర్టిస్టులే దాన్ని గ్రహించగలరు."
ఇమ్తియాజ్ అందుకుంటాడు.
'అవును ఎలాంటి ఆర్టిస్టులయా అంటే మాలీతో గోతి తవ్వించి తాము ఒక మొక్క నాటేవారు , కేదార రాగం అభ్యసించేవారు.'
'ఇంకా ఎలాంటి వారయా అంటే పేమోపహతులకు దొంగిలించిన డబ్బుతో కేప్ స్టన్ సిగరెట్లు అందించేవారు ' అని ఇమ్తియాజ్ అంటే చిన్న పిల్లలా నాలుకతో పెదవి తడిపి అతడు ' యార్ కేప్ స్టన్ సిగరెట్టు కాల్చాలని పిస్తుంది.' అంటాడు.
'అయితే లే' ఇమ్తియాజ్ లేచి నుంచొని 'నడువ్ రోడ్ ఇన్స్ పెక్షన్ చేతాం' అంటాడు.
ఒకనాడు అక్తర్ మామ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. వారిని చూడ్డానికి వచ్చినవాళ్ళలో అతనూ ఉన్నాడు.
'అక్తర్ చాచా! ఫలక్ నామా నుంచి స్టేషను రోడ్డు ఎంత దూరం ఉండొచ్చు' అడిగాడు.
'ఎలా తెలుస్తుంది?' మామ నిర్లక్ష్యంగా అన్నాడు.
'ఓహో! అయితే మీరింకా ఆ రోడ్డు కొలవలేదన్నమాట! అని లాలాను చూచి చిరు నవ్వునవ్వాడు. "ఇమ్తియాజ్ ! నాకూ ఆడదాన్ని కావాలని ఉంది. గజాలా అక్కను అవుతే ఎంత బావుండేది! మొగునిచేతిలో చేయి వేసుకొని తిరిగేవాణ్ణి అప్పుడు మొగుడు మొనగాడికి పుట్టిన ముద్దు బిడ్డల్ను మరొకరి వళ్ళో పారేసి తిరిగేవాణ్ణి " అంటాడు.
"పాపం ఆడవాళ్ళు ఎంత అమాయకులు!" ఇమ్తియాజ్ బుర్ర ఊపి అదో రకంగా అనేవాడు.
"అవును పాపం మరో ఆడదాని గాయం మాన్పడానికి డబ్బు దొంగిలించాల్సి వస్తుంది."
"ప్రేమాభిమానాలు ప్రతిమలు" ఇమ్తియాజ్ నిట్టుర్చేవాడు.
"నిజమే గాని కట్టే బొమ్మలు ....." వెక్కిరించేవాడు.
అతనికి కళలంటే అసహ్యం. మహామహా చిత్రకారులను కూడా రంగు ముద్దల కింద జమ కడ్తాడు. కవులంటే అతనికి లెక్కలేదు. రచయితలు అబద్దాల కారులు - ప్రేమికులు పిచ్చివాళ్ళు - ఇవీ అతని అభిప్రాయాలు.
లాలా తన అదృష్టం ఆ అబ్బాయితో ముడి పెట్టుకుంది.
ఒకనాడు అతని మీద ఒక ఆపద విరుచుకు పడింది. అతనికి ఒక పెన్సిల్ స్కెచ్ కావలసివచ్చింది. అతడు ఇమ్తియాజ్ పేర ఒక చిట్టీ రాసి లాలా బల్లమీద ఉంచిపోయాడు. ఉత్తరం ఎంత రొమాంటిక్ గా రాశాడంటే అది ఇమ్తియాజ్ ను ఉద్దేశించింది కానే కాదు . అతనికి కావలసిన స్కెచ్ ఏమంటే ఒక వంటరివాడు సముద్రపు ఒడ్డున ఉదాసీనంగా నుంచొని ఉండాలి. ఆ బొమ్మ అతనికి సాయంకాలం వరకు కావాలి. అతనికి ఆ బొమ్మ ఎందుకు అవసరం పడిందో తెలియదు. కాని ఊళ్ళో ఎవరూ అంత తొందరగా వేసి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు కనిపించదు. ఇమ్తియాజ్ ఊర్లో లేడు. పిక్నిక్ కు వెళ్ళాడు. రెండు మూడు రోజుల దాకా రాడు. అది అతనికి తెలిసిందే. కాగా ఇమ్తియాజ్ కు బొమ్మ దించడం అలా ఉంచి గీత సైతం చక్కగా గీయరాదు.
మరి ఉత్తరం ఎవరికి రాసినట్లు?
లాలాకు పెద్దగా నవ్వువచ్చింది. తనను ఆర్టిస్టుగానే వప్పుకోడే - అలాంటివాడికి అడక్కుండా బొమ్మ గీసి పెట్టడం ఎందుకు? అనుకుంది. తనను నెలల కొద్ది ఏ పనీ చేయడానికి 'మూడ్ రాదు. ఇప్పుడేమో తానూ సంగీతం నేర్చుకోవడానికి కళ దగ్గరికి వెళ్ళాలి.
నాలుగయింది. అయిదు కావాలని నిరీక్షించసాగింది. అయిదింటికి ఆతడు ఎలా వస్తాడో చూడాలనుకుంది. ఎంత గీమాల్తాడో ననుకుంది. కాని అయిదు కాకముందే బొమ్మ గీసి హమీదా అక్కకు అప్పగించింది.
'ఇది ఎప్పుడో వేసిన బొమ్మ . బొమ్మలు వెదుకుతుంటే దొరికింది. కాకుంటే ఇప్పుడు టైమేది వేయడానికి? అని చెప్పి బొమ్మ అందించమని చెప్పింది. గబగబా తయారయి కళ దగ్గరికి పరిగెత్తింది. ఇహ అతనికి బుద్ది వస్తుందనుకుంది. చేసిన తప్పులన్నీ వప్పు కుంటాడనుకుంది. అతి వినయంగా కృతజ్ఞతలు తెలియపరుస్తాడనుకుంది.
కాని ఆమె అంచనాలు తలక్రిందులైనాయి. తెల్లవారి అతను వచ్చాడు. సిగ్గు లేనివాడిలా కుర్చీలో కూలపడ్డాడు. ఆమె వేసిచ్చిన బొమ్మకు ఎగ్గులు పెడుతున్నాడు.