Previous Page Next Page 
జనపదం పేజి 5

 

    "వద్దు పండుకో , ఎందుకు లేస్తవు?"
    "దొర నిలబడ్తే నేను పండ్తానా?" అని మంచం మీది నుంచి జారి నేల మీద కూలబడ్డది. తల వంచుకుని కూర్చున్నది. "కూకుండు దోరా మంచం మీద" అన్నది నీరసంగా.
    బలరామయ్య కూర్చోలేదు. నంచునే చూస్తున్నాడు.
    "దొరా! అన్నం తిన్నావా'?" అనే ఆవేదన నిండిన పదాలు.
    బలరామయ్య ఉక్కిరిబిక్కిరి అయినాడు. గుండె కరిగి నీరై కళ్ళలోంచి రాలింది.  తాను వాణిని గురించి పట్టించుకోలేదు. కనీసం ఆ మాట తాను అడగలేదు.
    "దేవుడిట్ట చేసె. దొరకింత వండి పెట్ట లేకపోతి" నిరాశతో అన్నది ఎక్కడో లోతుగా ఉన్న కళ్ళల్లో కూడా నీరు నిండింది.
    "వాణీ! ఎంత మంచిదానివి! రోగం ముదిరింది . పట్నం తీస్కుపోత వస్తావా?" బలరామయ్య నంచునే అడిగాడు.
    "ఎందుకుండి ఇంక? రాముణ్ణి చూసి చస్త దొరా! బతకాల్నని లేదు" బలరామయ్యను చూస్తూ అన్నది. ఇంతలో దగ్గుతెర వచ్చింది. సతమతం అయింది. సుళ్ళు తిరిగింది. తెములుకుంది. తనస్తూ పడిపోయింది నేలమీద.
    "లే, మంచం మీద పండు" బలరామయ్య అన్నాడు.
    దొర అజ్ఞ పాలించింది అమృతవాణి.
    లాంతరు గుడిసెలో వదిలి సాగిపోయాడు బలరామయ్య. పందిరి మంచంలో మేను వాల్చాడు దొర. కాస్సేపు పడుకొని లేచి దిండ్ల కానుకుని కూర్చున్నాడు. సిగరెట్లు కాల్చాడు. అమృతవాణి ఎందుకో అతణ్ణి బాధ పెడ్తుంది. మనసు మనసులో ఉండటం లేదు. "దొరా! బతకాలని లేదు, రాముణ్ణి చూసి చస్త" ఈ మాటలే చెవుల్లో గింగురు మంటున్నాయి. తన కొడుకు శ్రీనివాసులు . ఆడూ తుపాకీ పట్టాడు. తానూ చందా ఇచ్చాడు. కాని భూములూ పంచేందుకు కాదు - ఆస్తి సంరక్షించేందుకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోట్లాడేందుకు. భూములు పంచేవాళ్ళను ఏరి పారేసేందుకు. వారిని  కాల్చి పారేసేందుకు. అతడు కాల్పుల్లో కూలాడు. కనీసం శవం కనిపించలేదు. ఇప్పుడు తనకు మిగిలింది అమృతవాణి ఒక్కతే. దానికి కూడా చావు వాకిటికి వచ్చేసింది. రాముణ్ణి చూడాలానుకుంటుంది! రాముడు రాముడు కూడా తన రక్తమే కదా! అయినా తనకే ఎదురు తిరిగాడు. తనను కాల్చడానికి తుపాకి పట్టాడు! అయినా వాణ్ని తెచ్చి వాణికి చూపించాలి - ఎలా? తానూ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దొరుకుతాడు వాడు? దొరికితే వాణ్ణి క్షమించాలి. నచ్చజేప్పాలి. వాణికి చూపించాలి. అప్పటికైనా వాణి పట్నం వస్తుందేమో! బ్రతుకుతుందేమో ! ఏమో ఏమో! ఏదో ఆశ.
    క్రమక్రమంగా ఊరికి జనం చేరుకోసాగారు. అలా చేరుకుంటున్న వాళ్ళందర్నీ రాముణ్ణి గురించి అడిగాడు దొర. ఎవరూ తమకు తెలియదనే జవాబు చెప్పారు. పని పాటల వాళ్ళు గడీకి వస్తున్నారు. పట్నం నుంచి వంట మనుష్యుల్ని పిలిపించాడు. అమృతవాణి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు దొర. ఆమె నోట 'రాముడా' అనే మాట తప్ప వేరే రావడం లేదు. తను అరా తీసున్నాననీ రావల్సిందే అనేకమందితో చెప్పి పంపుతున్నాననీ అంటున్నాడు బలరామయ్య. ఏదో ఆశ అమృతవాణి కళ్ళల్లో కనిపిస్తుంది. రాముడు వస్తాడు. అదే ఆశతో జీవిస్తుందమె. బలరామయ్య తన పొలాలు చూసుకోడానికి వెళ్ళి వస్తున్నాడు. జీతగాండ్లను కుదిరించు'కుంటున్నాడు. వాళ్ళకు డబ్బిస్తున్నాడు. అప్పులు పెడుతున్నాడు. అయినా అతనిలో ఏదో వెలితి కనిపిస్తుంది. పూర్వపు వైభవం లేదు. జనం తాను చెప్పిన పని చేస్తున్నారు కాని తన అధికారానికి భయపడి కాదు, వారి అవసరలాకు లొంగి . ఇప్పుడు తన అధికారం కాదు, డబ్బు పెత్తనం చేస్తుంది !
    అర్ధరాత్రి దాటింది. చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశంలో మబ్బులున్నాయి. కనీసం నక్షత్ర కాంతిలేదు. గడీ డాబా మీద పోలీసులు కాపలా కాస్తున్నారు. పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి. సెంట్రీలు మెలుకువతోనే ఉన్నారు. కింద ఎక్కడో అలికిడి అయింది. నాలుగు వైపులా నుండీ టార్చీలు పడ్డాయి. ఏదో మానవాకారం చెట్టు చాటున దాగింది. డాబా మీద కేకలు అరుపులు. అంతా తుపాకులు పట్టుకుని సిద్దంగా నుంచున్నారు. టార్చిలైట్ల వెలుగు ప్రవాహం తిరుగుతుంది. వెలుగు దాటగానే మానవాకారం ముందుకు నడిచింది. బూట్లు టకటకమన్నాయి. మెడ మెట్లు ముట్టడించాయి. ఆ ఆకారం అమృతవాణి గుడిసెలో దూరింది. పోలీసులు అటు ఉరికారు. తుపాకులు పేలాయి. బలరామయ్య లేచి పరిగెత్తాడు. అమృతవాణి గుండెలోంచి దూసుకుపోయిన బుల్లెట్ రాముడి ఎడం భుజంలో ఇరుక్కుంది. "ఆగండి" అని కేకపెట్టి అమృతవాణి మీద పడిపోయాడు దొర.
    "దొరా! రామిడోచ్చాగద ఏడీ? పట్కపోయిన్రా?" రక్తం ధారగా ప్రవహిస్తున్నా అడిగింది వాణి. రొమ్ము నిండా రక్తం అయినా విన్నాడు బలరామయ్య.
    చిత్రపటంలా నుంచొని చూస్తున్నారు పోలీసులు.
    "వాణీ! ఒక్కసారి చూడు. ఇడ్గో రాముడిక్కడే ఉన్నాడు."
    టార్చిలైట్ల వెలుగులో వాణి కన్నీటి ధార కనిపిస్తుంది. రాముడు ఏడుస్తున్నాడు. రాముని తలను తన నోటి దగ్గరకు తీసుకుంది. ముద్దు పెట్టుకుంది. "దొర మీద పగబడ్తావు! అయన ఉప్పు తిని మనం పెరిగినం , తప్పు ఇగ చేయకు" అని రాముణ్ణి దొరకు అప్పగించి "దొరా! వీడు బాంచోడు నీ చేతుల పెట్టి......" పెద్ద దగ్గుతెర వచ్చింది. రక్తం ధారగా ప్రవహిస్తోంది. తెములుకోలేకపోయింది. వాణి. ప్రాణాలు ఎగిరిపోయాయి. పీనుగు మిగిలిపోయింది. రాముడు తల్లి మీద పడి బోరుమన్నాడు. బలరామయ్య మౌనంగా కన్నీరు కార్చాడు. పోలీసుల కళ్ళు చెమర్చాయి.!
    దుఖం ఎవరి గుండెల్లో కలకాలం కాపురం ఉండదు. మాన్చే శక్తి ప్రకృతిలో ఉంది. తెల్లవారడంతో తెములుకున్నాడు రాముడు. బలరామయ్య ఆలోచనలో పడ్డాడు. గడీలో ఏదో వైభవం వెలిగించాలని ఊరికి వచ్చాడు. అంతా తలక్రిందులైంది. అనుకోనిది జరిగిపోయింది. రాగానే ఒక హత్య, ఒక చావు, ఒక పీనుగు. అది అతని మనసుకు కలచి వేయసాగింది. రాముడు వచ్చి ముందు నుంచున్నాడు. దొర ఆలోచనలో ఉన్నాడని గ్రహించాడు. కొంతసేపు మౌనంగా నుంచున్నాడు.
    "దొరా " ఆ మాట గొంతులోంచి వచ్చింది. మనసులోంచి వచ్చింది కాదు. గ్రహించాడు బలరామయ్య. విధిలేక అంటున్నాడనుకున్నాడు. అయినా "ఏందిరా రాముడూ?" అని ప్రశ్నించాడు.
    "అమ్మను దహనం చేయాలె"

 Previous Page Next Page