Previous Page Next Page 
మనసున మనసై పేజి 5


    ఆ బ్రాంచిలొ ఆమెకున్న స్నేహితురాలు ఉషారాణి ఒక్కర్తే. యిద్దరూ వెళ్ళేటపుడు బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళడం, ఏ శనివారం ఆఫ్ డే నాడో ఇద్దరు కలిసి షాపింగుకో, సినిమాకో వెళ్ళడం, పుస్తకాల గురించి, సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం, పెళ్ళిగురించి, అబ్బాయిల గురించి మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారిస్నేహం, "ఏమిటి యిదంతా, అతనెవరు, యిలా ఆఫీసుకొచ్చి యిలా సీన్ క్రియేట్ చేశాడెందుకు?" నడుస్తూ ఆరాటంగా అడిగింది. జయంతి ఆ అవమానం నించి యింకా తేరుకోలేదు. జవాబివ్వలేకపోయింది. వెంటనే.' ఏమయింది జయంతీ అతనెవరసలు నీకెలా తెలుసు?" యింకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది. జయంతి కష్టంమీద మాటలు కూడదీసుకుని.... 'ఈ రాస్కెల్ నిన్న మాయింటికి పెళ్ళిచూపులకొచ్చాడు.....'
    'వస్తే.....' ఉషారాణికి అర్ధంకాలేదు.
    "నేను వాడి మొహం చూసి నచ్చలేదన్నా నని ఉడుక్కుని.....' మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి.
    'అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా నచ్చలేదంటే యింత ఓవర్ రియాక్ట్ ఎందుకవడం, అందరూ అందరికీ నచ్చరుగా, దానికోసం పనిగట్టుకుని ఆఫీసుకొచ్చి యిన్సల్ట్ చేయడం ఏమిటి...' ఆశ్చర్యంగా అంది ఉషారాణి.
    "అంటే.....అంటే నేను అతను నల్లగా వికారంగా వున్నాడన్న మాటలు అతను విన్నాడు.....' అంటూ జరిగింది చెప్పుకొచ్చింది.
    'అదా సంగతి, నీవన్న మాటలన్నీ విని ఇన్సల్ట్ ఫీలయినట్టున్నాడు.' అర్దమైనట్టు తల పంకించింది.
    'నీవేం నీవనుకున్నట్టు అందగత్తెవి కావు అని నీ మొహం మీదే చెప్పి దెప్పి పొడవాలని వచ్చాడన్న మాట. గట్టివాడే, బాగానే బదులు తీర్చుకున్నాడు'
    జయంతి తీక్షణంగా చూసింది, "ఏమిటి నీకూ సంతోషంగా వుందా నన్నవమానపర్చడం...'
    'ఛా... ఛా... అది కాదోయ్ .... తెలివిగా రిటైర్డ్ ఇచ్చాడంటున్నాను. అందరికి తట్టవుగదా ఇలాంటిది. అయినా జయంతీ ఒక్కమాట అంటే ఏమనుకోకు నీవు లుక్స్ కి మరీ యింపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే ఏదీ బాగులేదని తిరగ్గొట్టేస్తున్నావు."
    'అంటే, ఇలాంటి వాడిని నీవు అయితే చేసుకుంటావా' పరుషంగా అంది.
    'నేననేది, మనిషి ఎపియరెన్స్ కంటే, ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయనుకుంటాను. అంటే కేరక్టర్, తెలివితేటలు, సంస్కారం, సున్నితత్వం, స్పోర్టివ్ నెస్ వగైరా.... వగైరా....అఫ్ కోర్స్ చదువు, ఉద్యోగం ముందు చూడాలి.
    
                                9
    
    "అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పరవాలేదా? తెల్లారి లేస్తే చూడాల్సింది ముందు మొహమేగదా, ఈ గుణాలన్నీ తరువాత లెక్కల్లోకి వస్తాయి' "అసలు ఇన్ని ప్లస్ పాయింట్లున్న సంస్కారి ఎవడన్నా వుంటాడా, కాస్తో కూస్తో ఉన్నా పెళ్ళి కాగానే పెళ్ళాం దగ్గిరకొచ్చేసరికి అన్ని మాయం అయిపోతాయి గుణాలెలాగో తెలియఉ. కాస్త స్మార్ట్ గా వుండేవాడు కావాలనుకోవడం తప్పా-"
    'స్మార్ట్ నెస్ అన్నదానికీ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో, కొందరు ఉద్యోగంలో, కొందరు చదువులో. ఒక్కొక్క ఫీల్డులో ఒక్కొక్కరు తెలివిగా....స్మార్ట్ గా రాణిస్తారు. అంచేత జయంతీ, నీవు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు.... అసలు మన తెలుగు వాళ్ళల్లో నూటికి ఒకరన్నరంగున్న వాళ్ళు ఆడవాళ్లలోనే కనపడరు. ఇంకా మగాళ్ళల్లో అందగాళ్ళు మరీ తక్కువ....' నచ్చ చెప్తున్నట్లు అంది. జయంతి మొహం ముడుచుకుంది.
    'ఫర్ గెట్ యిట్..... ఏదో అయింది. వూరికే బాధపడకు" ఓదార్పుగా అంది.
    అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు.
    ఇంటికొస్తూనే సావిట్లో కూర్చున్న వాసంతిని, దమయంతిని చూసి ఆవేశంగా 'ఆ రాస్కెల్ ఏం చేశాడో చూశారా....అలాంటి వెధవని కాదన్నానని నా మీద అంతా ఎగిరారు... వాడెలాంటి వాడో...' ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా ఎవరి గురించి ఆ గోపాలకృష్ణా....' అంటూ అదోలా నవ్వింది.
    'ఆఫీసుకొచ్చాడా...' దమయంతి నవ్వుతూ అంది. జయంతి కాస్త ఆశ్చర్యంగా 'నీకెలా తెలుసు అంది.
    "ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడే వెళ్ళాడు" వసంతా తాపీగా అంది.
    ఈసారి మరింత తెల్లపోతూ 'అంటే, మీకు చెప్పే అలా చేశాడా. మీ అందరికీ తెలిసీ అడ్డుచెప్పలేదా..' ఉక్రోషంగా అంది. పద్మావతి లోపల్నించి వచ్చి "అడ్డు చెప్పడానికి ఏముంది నీకు కాస్త ఇలాగన్నా బుద్ది వస్తుందేమోనని ఆశ! నీవేమిటో, నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్ధం చేసుకుంటావని ఆశ! పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో, ఇంటికొచ్చి నీ గురించి ఎంతో అడిగాడు నీవెందుకిల్లా చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. మేం చెప్పింది విని ఫీలయ్యాడు పాపం. మేమంతా ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా నీవు వినడం లేదని విని బాధపడ్డాడు. నీవు అతనికి నచ్చావని, కాని నీవలా అనగానే చాలా బాధపడ్డానని, ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి. ఆవిడ ఏ మాత్రం అందగత్తెనని ఇలా ఏరిపారేస్తుంది అంటూ ఎంతో పరిచయం వున్న వాడిలా మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడోననిపించింది మా అందరికి. నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాను మీరేం అనుకోవద్దు అంటూ అడిగాడు. పద్మావతి చెప్పుకుపోతుంది.

 Previous Page Next Page