Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 5


    
    అతను అనర్గళంగా, ఉపన్యాసంలా చెప్పేస్తుంటే చిరునవ్వు పెదిమలకింద తొక్కిపట్టి వింటోంది లత. అతను చెబుతున్నవి నిజంగానే లతకు తెలియవు.
"ఇవన్నీ ఎలా తెలుసు మీకు? మీరు వాకింగ్ ఎన్ సైక్లోపీడియానా?"
"నిజం చెప్పనా? జూలై ఇరవై ఆరో తారీఖు హిందూ సండే మేగజైన్ సెక్షన్ లో చదివాను. ఒకసారి కళ్ళతో చూసిందీ చెవులతో విన్నదీ మర్చిపోను. అంతే!" చెప్పాడు తెచ్చిపెట్టుకున్న నమ్రతతో.
తర్వాత మెల్లిగా అన్నాడు - "ఇదివరకు ఎడంచేతివాటంవాళ్ళని చూస్తే చిత్రంగా అనిపించేది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక, అసలు లెఫ్ట్ హాండర్ గా వుండడమే రైటనీ, రైట్ హాండర్స్ అంతా రాంగనీ అనిపిస్తోంది."
"నేను అన్ని విషయాల్లోనూ అంతే! డిఫరెంట్ గా ఉంటాను. లోకంతోబాటు నడవను."
"నేను మాత్రం మీతోబాటు నడుస్తూ మీయింటివరకూ వస్తాను ఇవాళ! ఇంతకీ మీ ఇల్లెక్కడా?"
చెప్పాలా వద్దా అని అనుమానిస్తూ అతని వైపు చూసి "చిక్కడపల్లిలో" అంది లత.
"నా రాజ్యం హిమాయత్ నగర్!" అని "ఇంతకుముందు నాకు చిక్కడపల్లి అంటే చిరాగ్గా వుండేది. జనం మందలు మందలుగా ఉంటారని. ఇప్పుడు హఠాత్తుగా చిక్కడపల్లి అంటే గ్లామర్ పెరిగిపోయింది నాకు. ఎందుకో తెలుసా?" అన్నాడు భావగర్భితంగా లతవైపు చూస్తూ.
లత వినిపించుకోనట్లు "రెండు కాఫీ! అర్జెంటు!" అంది సర్వర్ తో, సర్వర్ కూడా తన ఆనవాయితీ కొద్దీ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.
"మీ నాన్నగారు...?" అని ఆగిపోయాడు శ్రీమంత్ ప్రశ్నార్ధకంగా.
"నాన్నగారు పోయారు" అంది లత. ఆమె గొంతులో దుఃఖం లేదు. మామూలుగా చెప్పింది.
"ఐయామ్ సో సారీ! ఇంట్లో మీరూ మీ అమ్మగారూ. మీ ఇద్దరే ఉంటారన్నమాట! మరి ఇన్నాళ్ళూ...?"
"ఎలా గడిచిందంటారు. అవునా? అమ్మకి పెన్షన్ వస్తుంది. వంద రూపాయలు. నాన్నగారు పోయినప్పుడు వచ్చిన గ్రాట్యుటీతో ఒక గ్రైండర్ కొన్నాం. చుట్టుపక్కలవాళ్ళందరికీ ఇడ్లీ పిండీ, దోసెల పిండీ పట్టిపెడుతుంటుంది అమ్మ. ఇల్లు గడిచిపోతుంది."
"వెరీగుడ్! అయితే మీరు ఉద్యోగం చేయకపోయినా ఫర్వాలేదన్నమాట!"
"ఫర్వా ఎందుకు లేదు?" అని నవ్వింది లత. "అతి కష్టం మీద ఇల్లు గడుస్తుంది. నాన్నగారి పెన్షన్ ఇంటి అద్దెకి సరిపోతుంది. గ్రైండర్ మీద వచ్చేది తినడానికి సరిపోతుంది. మేం కొత్త బట్టలు కొనం, సినిమాలు కనం, చెప్పుల సంగతి చెప్పక్కరలేదు. రెండేళ్ళకొకసారే కొంటాం. హోటళ్ళ కెళ్ళం. నిజం చెప్పాలంటే, పదవ తరగతి పాసయినప్పుడు నాన్నగారు హోటల్ కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం. అంతేగాక..." అని ఆగిపోయింది.
శ్రీమంత్ తలూపాడు. "అవును! అంతేగాక ఇంకా ముందు ముందు జరగాల్సినవి చాలా వున్నాయి. మీ పెళ్ళి...అందుకు డబ్బూ.... అందుకని ఉద్యోగం....కరక్టే!"
"భలే గ్రహించారే! వద్దు దోసె చెప్పకండి! టైంలేదు! నిజంగానే!"
శ్రీమంత్ వినిపించుకోలేదు.
"బావుందండీ! ఇప్పుడు నా జీవితచరిత్ర చెపుతాను. అది అంత రంజుగా వుండదు. అందుకని నంచుకోవడానికి దోసెలాంటిదేమయినా ఉండాలి. నాకు ఒక్క చెల్లెలుంది. నేను పుట్టినప్పుడు నా పేరుతో ఏదో లాటరీ టిక్కెట్టు కొంటే పాతికరూపాయలు ప్రైజ్ వచ్చిందట. అందుకని ఉప్పొంగిపోయి నా పేరు శ్రీమంత్ అని పెట్టేశారు."
చెయ్యి పెదిమలకి అడ్డం పెట్టుకుంది లత - నవ్వు కనబడకుండా.
"అది మొదలు! లాటరీల పిచ్చీ, రేసులపిచ్చీ పట్టింది మా నాన్నగారికి! వీటికి తోడు ఆయనకి జాతకాల పిచ్చి కూడా ఉండేది. ఆయన జాతకరీత్యా కొడుకు పుట్టాక దశ తిరగాలన్నమాట! నిజంగానే దశ తిరిగింది. అప్పటిదాకా ఉండిన ఆస్తి పోయింది. అప్పటిదాకా లేనివి - అప్పులు వచ్చాయ్. సంసారమనే నౌకకికంతపడిపోయినా, నాచదువాగిపోకుండా ఇంకో షిప్పు దొరికింది - మెరిట్ స్కాలర్ షిప్పు!" అంటూ మీదికి వంగిన సర్వర్ తో "రెండు కాఫీ" అన్నాడు శ్రీమంత్.
సర్వర్ బిల్లు పట్టుకురాకముందే పదిరూపాయలనోటు అతనికి అందించింది లత.
శ్రీమంత్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
'మీరే పేచెయ్యండి' అంది లత. ఆ నోటు జేబులో పెట్టుకుని సర్వర్ బిల్లు పట్టుకురాగానే నిర్లక్ష్యంగా రెండు వేళ్ళతో దానిని జేబులోంచి తీసి ప్లేట్ లో పడేసి, అతను వెనక్కి తిరగ్గానే లతవైపు సరదాగా కన్నుగీటి నవ్వాడు శ్రీమంత్.
"థాంక్స్ ఫర్ ది పార్టీ!"
"యు ఆర్ వెల్ కమ్!" అంది లత. బస్ స్టాప్ దాకా రాగానే, "బస్సులో వెళ్ళిపోతాను" అంది లత.
"మళ్ళీ ఎప్పుడు? ఎక్కడ?" అనడిగాడు శ్రీమంత్.
జవాబివ్వకుండా నవ్వి వెళ్ళిపోయింది.
    
                                                               * * *
    
ఆరోజు ఆఫీసులోనే ఆరయిపోయింది. పది లెటర్స్ అప్పటి కప్పుడు టైప్ చేసి డిస్పాచ్ చెయ్యాల్సివచ్చింది.
చివరి లెటరు టైపుచేసి సంతకం కోసం వెళితే, సతీష్ అడిగాడు.
"థాంక్యూ లతా! కొద్దిగా లేటయింది కదూ! త్వరగా ఇంటికెళ్ళిపోవాలా?"
"అవును!" అంది లత. గోడమీద వుండిన గడియారంలో టైం చూస్తూ. అతని పిలుపులో 'మిస్' అనే సంబోధన మిస్సవడం గమనించింది.
"అయ్ విల్ డ్రాప్ యు ఇన్ మై కార్."
"తొందర అంటే అంత తొందర కాదు. బస్సులో వెళ్ళిపోతాను."
"ఓకే అంత తొందర లేదన్నమాట. దెన్ వీ విల్ హావ్ ఎ హాట్ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో!"
మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకీ వేసేటట్లున్న అతని మాటలకి జవాబుగా "గుడ్ నైట్ సర్!" అంటూ బ్యాగు తగిలించుకుని బయలు దేరింది.
సతీష్ ఆమెని వెనకనుండి చూస్తూ అలాగే ఉండిపోయాడు.

 Previous Page Next Page