Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 5

 

    "బ్రహ్మరహస్యాలు పగటిపూట మాట్లాదకయ్యా బాబూ!"


    "సరే! రాత్రికి షాంపేను రెడి చెయ్!"


    "విందు, మందు, పొందు అన్ని ఒక్కటి బీరుపోకుండా అరేంజ్ చేశాగా!"


    "బీరు కూడా తెప్పించు! ఇంతకీ ఇంక ఈ ఆస్తి అంతా మనదే నంటావా?


    "విక్రమదేవరావు కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది! అయన ఆస్తులన్నీ ట్రస్టుకి చెందుతాయి. ఆ ట్రస్టులో ట్రస్టీలం మనమే! ఇంక మనం ఆడింది ఆటా? పాడింది పాటానూ?" అన్నాడు సుందరం.


    "విడింకా మిగిలాడుగా?" అన్నాడు సద్గుణరావు.


    "ఎవడూ?" అన్నాడు సుందరం.


    "వీడే ....ఈ జస్వంతరావు ........జిగటగాడు! ఆఖరి క్షణంలో అరేంజ్మెంట్లోవో ఉన్నాయని చెప్పి విమానంలో నుంచి దేగేశాడు, బతికి బట్ట కట్టేశాడు. మనం ఇంత మాస్టర్ ప్లాన్ వేసి విక్రమదేవరావు వంశాన్ని సర్వనాశనం చేసినా, ఆ ఫలితం మనం అనుభవించకుండా ఈ జస్వంతరావు అడ్డం పడతాడేమో అని కూడా డౌటు!"


    "వాడి మొహ్హం! వ్వాడెం చేస్తాడు?" అన్నాడు సుందరం నిరసనగా.


    అతను అట్లా అంటున్న టైంలోనే-

    
    అప్పటికే తన ఇల్లు చేరుకున్న జస్వంతరావు హడావుడిగా ఒక పనిలో జోరబడిపోయి ఉన్నాడు.


    అతని ముందు-


    కట్టలుకట్టలుగా పురాతనమైన తాళపత్ర గ్రంధాలున్నాయి.


    గుట్టలు గుట్టలుగా జీర్ణగ్రందాల ప్రతులు ఉన్నాయ్.


    అనేకమైన పాటాలు, మ్యాపులు ఉన్నాయి.


    జస్వంతరావు చేతిలో ఒక భూతద్దం ఉంది.


    ఆ భూతద్దం సాయంతో తన ముందు వున్న గ్రంధాలని కూలంకుషంగా పరిశీలిస్తున్నాడు జస్వంతరావు.


    హటాతుగా అతని గొంతులో నుంచి ఒక కేక వెలువడింది.


    "యురీకా!" అన్నాడు జస్వంతరావు ఉత్సాహంగా?


            
                                             * * *

 


    ఆ రోజున పారడైజ్ హోటల్లో డైమండ్ రాజా చేసిన హెచ్చరిక వినగానే, ప్రాణాలు అరచేతులబట్టుకుని పరుగెత్తి బయటికి వచ్చేసిన వాళ్ళలో "ఆఠీన్ రాణీ" మీనాక్షి కూడా ఉంది.


    ప్రమాదాన్ని గురించి పెద్ద గొంతుతో హెచ్చరిస్తున్న డైమండ్ రాజాని చూసింది మీనాక్షి. కానీ ఇతనెవరో అ అమ్మాయికి తెలియదు. ముంచుకురాబోతున్న ఆ ప్రమాదం కూడా తెలియదు.


    ఆమెకి తెలిసినదల్లా-


    ముంచుకు రాబోతున్న ఆ ప్రమాదం వల్ల, ప్రస్తుతం తన ముందు ఉన్న మరో ప్రమాదం మాత్రం తొలిగిపోయిందని! అంతే!


    హోటల్ మేనేజర్ మల్ హోత్రా బారినుంచి తను బయటపడగలిగింది! అది చాలు!


    ఆమె అలా అనుకుంటూ ఉండగానే -


    ఎదురుగానే కనబడ్డాడు మేనేజర్ మల్ హోత్రా.


    "ఎక్కడికెళ్తున్నావ్? అగు!" అని గర్జించబోయాడు అతను.


    సరిగ్గా అదే సమయంలో -

    
    మల్ హోత్రా భుజం మీదా సర్కిల్ ఇన్ స్పెక్టర్ చెయ్యి బలంగా పడింది.


    "మా మాములు పంపనన్నావంట ఏంది?" అన్నాడు ఇన్స్పెక్టర్ మెరటుగా.


    పొలిసు గొంతు వినబడగానే గిరుక్కున వెనక్కి తిరిగాడు మల్ హోత్రా.


    అదే ఆదననుకుని నాలుగంగల్లో అక్కడ్నుంచి బయటపడింది మీనాక్షి.


    మేనేజర్ మల్ హోత్రా తో ఇన్స్ పెక్టర్ మళ్ళీ ఏదో అనబోతూ ఉండగానే -


    బ్రహ్మాండమైన సోరచేపలా ఉన్న విమానం అతి వేగంగా భూమిని సమీపించి, హోటల్ బిల్డింగు మీదుగా మైదానంలోకి దిగబోతూ , చివరి క్షణంలో గాల్లోనే ఎక్స్ ఫ్లోడ్ అయిపొయింది!


    అ దృశ్యం చూస్తున్న ఇన్స్ పెక్టర్ అట్లాగే నిలుక్కుపోయాడు! కొద్దిక్షణాల తర్వాత స్పృహ లోకి రాగానే తన "మాములు" సంగతి మర్చిపోయి , "విమానం కూలిపోయింది పారడైజ్ హోటల్ పక్క మైదానంలో! పారడైజ్ హోటలైతే మా జూరిస్ డిక్షన్ కిందికి వచ్చి వుండేది! ఆ మైదానం మా పోలిస్ స్టేషన్ పరిధిలోకి రాదు - నాకెందుకి పితలాటకం!" అని గొణుక్కుని, అర్జెంటుగా అక్కన్నుంచి అదృశ్యమైపోయాడు.


    పరుగులాంటి నడకతో వస్తున్నా మీనాక్షికి అదృష్టవశాత్తు అక్కడే ఆగివున్న ఒక అటో కనబడింది.


    "తార్నాకా వెళ్ళాలి!" అంది మీనాక్షి కంగారుగా.


    ఆటోవాలా అలవాటు కొద్ది "అబిడ్స్ కైతేనే వస్తా!" అనబోయి, ఆమె వేషాన్ని చూస్తున్న ఆశ్చర్యంతో డైలాగు మర్చిపోయి "సరే! వస్తా!" అనేశాడు.


    అటో కదిలింది.


    షాక్ లో ఉంది మీనాక్షి. స్తబ్దంగా వుంది ఆమె మనసు.


    అటో ఎంతసేపు ప్రయాణించిందో , ఎప్పుడూ ఇల్లు సమిపించిందో కూడా గమనించలేదు తను!


    మీనాక్షి తల ఎత్తేసరికి కొద్ది దూరంలోనే కనబడింది వాళ్ళ ఇల్లు.


    ఇంటిముందు ఇరుగు పొరుగూ నిలబడి ఏదో మాట్టాడుకుంటున్నారు.


    అది చూడగానే - ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది మీనాక్షికి!


    ఏమయింది?


    అమ్మకేలా ఉంది?


    అప్పుడు కనబడింది మీనాక్షికి-


    డాక్టర్ లత!


    తమ ఇరుగు పొరుగూ వాళ్ళ ఆకారాలు మాత్రం అస్పష్టంగా కనబడుతున్నాయి గానీ-


    వాళ్ళ పక్కనే ఉన్న డాక్టర్ లత మాత్రం చాలా పొడుగ్గా, గంభీరంగా కనబడుతోంది.


    వస్తున్న ఆటోని, అందులో ఉన్న మీనాక్షిని అంత దూరంలో నుంచే చూసేసింది డాక్టర్ లత. తక్షణం తన ఎడం చెయ్యి ఎత్తి, "మీ అమ్మకేం భయం లేదు!" అన్నట్లు సైగ చేసింది.


    ఎవరో దేవత , తన వామహస్తంతో అభయ ప్రదానం చేస్తున్నట్లు అనిపించింది మీనాక్షికి. మనసుకొద్దిగా కుదుటపడింది.


    అటో దిగిదిగగానే , ఒక్క అంగలో ఇంట్లోకెళ్ళిపోయింది మీనాక్షి.


    ఇల్లని పెరేగాని, అందులో ఉన్నవి రెండే గదులు . ఒక గదేమో మల్టిపర్పస్! అదే వరండా! అదే డ్రాయింగ్ రూము! అదే బెడ్ రూమూ కూడా ! రెండోదేమో చిన్న కిచెన్. అంతే!


    ముందు గదిలోకి మీనాక్షి తల్లి వసుధ మగతగా పడుకుని వుంది. ఆమెకి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు డాక్టర్ లత గారి భర్త అలోక్.


    వస్తూనే ఒక్కసారిగా తల్లి మంచం మీద కులబడిపోయింది మీనాక్షి.


    "ఏమయిందంమ్మా" అంది ఆరాటంగా.


    "మీ అమ్మకి ఏం కాలేదులే! నీరసం వల్ల కళ్ళు తిరిగినట్లున్నాయ్! ఇప్పుడే నిద్ర పట్టింది! నువ్వేం వర్రీకాకు" అంది డాక్టర్ లత.


    "వర్రినా! అబ్బే! నాకెందుకు వర్రీ......నేను......" అని, మాట సగంలో ఆపేసి చటుక్కున కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని, తల వంచేసుకుంది మీనాక్షి.


    మీనాక్షి కొద్దిక్షణాల పాటు కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని అలానే కూర్చుండిపోయేసరికి, ఆ అమ్మాయి ఏడుస్తోందని అర్ధం అయింది డాక్టరు లతకి. ఓదార్పుగా తన చేతిని మీనాక్షి భుజం మీద వేసింది.


    వెంటనే, మీనాక్షి భుజాలు వెక్కిళ్ళతో ఎగిరెగిరి పడటం మొదలెట్టాయి. తర్వాత కళ్ళు తుడుచుకుని, ఏదో చెప్పబోయి, అంతలోనే తల్లివైపు చూసి ఆగిపోయింది మీనాక్షి.


    "మీ ఇంటికెళ్దాం!" అంది డాక్టర్ లతతో. ఒక్కక్షణం పాటు మీనాక్షి వైపు పరిశీలనగా చూసింది డాక్టర్ లత.


    "పద!" అంది.


    మగత నిద్రలో ఉన్న మీనాక్షి తల్లికి తోడుగా డాక్టర్ లత భర్త అలోక్ అక్కడే వుండిపోయాడు.


    తార్నాకాలో డాక్టర్ లత వాళ్ళ ప్లాట్ మీనాక్షి వాళ్ళింటి పక్కనే ఉంది. లతతో బాటు వాళ్ళింటికి నడిచింది మీనాక్షి. ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా మీనాక్షికి మంచినీళ్ళు ఇచ్చింది లత.


    "కాఫీ కలపనా?" అంది. వాళ్ళిల్లు నిజంగానే ఒక సత్రంలాగా ఉంటుంది. అతిధుల రాకపోకలు మరి ఎక్కువ! నిరంతరం కాఫీలు, ఫలహారాలు తయారవుతూనే ఉంటాయి అక్కడ.


    "కాఫీ వద్దు! మీరు కూర్చోండి! మీతో మాట్లాడాలి!" అంది మీనాక్షి.


    డాక్టర్ లత కుర్చీలో కూర్చుంది మీనాక్షి ఆమె కళ్ళ దగ్గర కూర్చుంది.


    "అయ్యో! అదేమిటి? కుర్చీలో కూర్చో!" అంది లత.

    
     "ఫర్వాలేదు" అంది మీనాక్షి. అంటుండగానే ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించడం మొదలుపెట్టాయి.


    అభిమానంగా మీనాక్షి తలని నిమిరింది డాక్టర్ లత. "పిచ్చిపిల్లా! ఊరుకో!" అంది.


    "నాకంతా అయోమయంగా ఉంది డాక్టర్!" అంది మీనాక్షి దుఃఖంగా.


    "ఎందుకు?"

 Previous Page Next Page