కార్తిక్ వైపు తిరిగింది ఉజ్వల. "కార్తిక్!" నువ్వు ఫ్రీగానే ఉన్నావా! వై డోంట్ యూ డ్రాప్ మీ ఎట్ మై ప్లేన్ ఐ సే?"
"విత్ ప్లెజర్!" అన్నాడు కార్తిక్ కారు కీస్ జేబులోంచి బయటకు తీస్తూ.
తన నాజుకైనా చేతిని కొద్దిగా పైకెత్తి , సుతారంగా వేళ్ళని అల్లల్లాడించి 'బై' చెప్పి బయటకు నడిచింది ఉజ్వల. ఆమెతో బాటే వెళ్ళిపోయాడు కార్తిక్.
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉజ్వలా తనవైపు చూసిన వాలుచూపు ఎందుకో తెలియని కలవరాన్ని కలిగించింది శశికాంత్ పక్కనే నిలబడి ఉన్న సౌమ్యకి.
"అందరూ వెళ్ళిపోయారు. నువ్వు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు వాళ్ళందరితో బాటు వెళ్ళిపోలేదేం?" అన్నాడు శశికాంత్ సౌమ్యతో. అతనికి తెలియకుండా అతని గొంతులో కఠిన్యం చోటు చేసుకుంది.
మొహమాటంతో మాట రాక మౌనంగా నిలబడిపోయింది సౌమ్య.
తన కోపాన్ని కంట్రోలు చేసుకొని కొంచెం శాంతంగా అన్నాడు శశికాంత్. "చుస్తున్నవుగా సౌమ్యా? బెల్లం ముక్క తరిగిపోయిందని తెలిశాక చీమలు ఎంత వేగంగా , ఎంత దూరంగా వెళ్లిపోయాయో? వెళ్ళిపొదలుచుకుంటే నువ్వూ వెళ్ళిపోవచ్చు సౌమ్యా! నేనేం అనుకోను! ఇది నీకు చివరి అవకాశం కూడా! నిజం చెప్పాలంటే , వెళ్ళిపోవడం తెలివైన పని అని నేను రికమండ్ చేస్తాను!"
అతను అలా అనగానే నెమ్మదిగా తల ఎత్తి తన విశాల నయనాలతో అతని కళ్ళలోకి చూసింది సౌమ్య.
తరువాత నెమ్మదిగా, కానీ చాలా స్థిరంగా చెప్పింది.
"నేను వేళ్ళను."
"ఏం! ఎందుకని, " అన్నాడు శశికాంత్ అసహనంగా.
మృదువుగా చెప్పింది సౌమ్య. "ఒక గంట క్రితమే మన ఎంగేజ్ మెంట్ జరిగింది. మంచికో, చెడుకో గానీ మనిద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చాం.
"మీకు సకల సంపదలు ఉన్నప్పుడు వచ్చి అర్ధాంగిగా ఉంటానని మాట ఇచ్చాను మీకు!
"ఇప్పుడు మీరు కష్టాలలో ఉన్నారని తెలియగానే అర్దాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఇంక ఆ మాటకి అర్ధమేముంది?"
చాలాసేపు వెదుకుతున్నట్లు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు శశికాంత్.
తరువాత హఠాత్తుగా చెయ్యి జాచి ఆమె కుడిచేతిని బలంగా పట్టుకున్నాడు.
"సౌమ్య ఇటురా."
"ఎక్కడికి?" అని అడగలేదు సౌమ్య. అతని వెంట నడిచింది.
ఆ హల్లో విదేశీ బంగళాలో ఉన్నట్లు ఒక వైపున ఫైర్ ప్లేస్ ఉంది. శశికాంత్ ముచ్చట పడి దాన్ని అలా కట్టించుకున్నాడు.
ఆ ఫైర్ ప్లేస్ లో కట్టెలు సన్నగా మండుతున్నాయి. ఆ వేడిమి గదిలోని చలిని తరిమి కొడుతుంది.
ఆ మంట ముందు ఆగాడు శశికాంత్. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమెని తన వైపుకి తిప్పుకున్నాడు.
"సౌమ్యా!" అన్నాడు. భావోద్రేకంతో చ;చలించిపోతున్న కంఠస్వరంతో. "ఇక నువ్వు నా అర్ధంగివి సౌమ్యా! నా జీవితంలో నువ్వు సగానివి. నా ప్రాణానికి ప్రాణానివి.!
"సౌమ్యా! నా జీవితంలో ఏది పోయినా బాధపడను. బాధ పడే తత్వం కాదు. కానీ నిన్ను కూడా పోగొట్టుకుంటానెమో, నువ్వు కూడా అందరిలా ప్రవర్తించి వెళ్ళిపోతవేమోనని పసివాడిలా కాసేపు బెదిరిపోయాను సౌమ్యా! అందరిలాగా నువ్వూ వెళ్లిపోలేదని , వెళ్ళిపోవని తెలిశాక ఇప్పుడేంత సంతోషంగా వుందో తెలుసా?"
ఐ యామ్ హాపీ సౌమ్యా! డెలిరియాస్ లీ హ్యాపి! ఇకనుంచి కష్టమోచ్చినా సుఖమొచ్చినా ఇద్దరం పంచుకుంటాం! ఇది నిజం సౌమ్యా!" అంటూ అప్పటికే తన కోటు జేబులో రెడీగా ఉంచుకున్న తాళి తీసి త్వరత్వరగా ఆమె మెళ్ళో మూడు ముడులు వేసేశాడు శశికాంత్.
"సౌమ్యా! ఈ అగ్ని సాక్షిగా ఇకనుండి నువ్వు నా భార్యవి!"
తన కళ్ళ ముందు జరిగిపోతున్నందంతా కలలాగా అనిపిస్తోంది సౌమ్యకి.
అతను తాళి కట్టేశాడా తన మెడలో?
ఇప్పుడే, ఇక్కడేనా?
నోటమాట రాక నిశ్చేష్టురాలై చూస్తోంది సౌమ్య.
ఆమె ఆశ్చర్యంలో నుంచి కోలుకోక ముందే తగ్గు స్వరంతో మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు శశికాంత్-
"సౌమ్యా! నువ్వు నా భార్యవి అయిపోయావు కనుక, మూడో కంటికి తెలియని రహస్యం ఒకటి నీతో చెబుతాను."
అతను చెబుతున్న అరహస్యం వింటుంటే రక్తాన్నంతా బ్లాటింగ్ పేపరుతో అద్దేసినట్లు తెల్లగా పాలిపోయింది సౌమ్య మొహం.
"అవును సౌమ్యా. ఇది అక్షరాల నిజం! నేను దివాలా తీయలేదు. " మళ్ళీ చెప్పాడు శశికాంత్.
"మరి -మరి .....ఇందాక వాళ్ళతో అలా- " అంది సౌమ్య మాటలకోసం తడుముకుంటూ.
"అదంతా అబద్దం!"
"అబద్దమా? అంత సునాయాసంగా అంత పెద్ద అబద్దం ఎలా చెప్పగలిగారు? అందులోనూ అంతమంది పెద్ద మనుషుల ముందు."