చేత్తో కళ్ళు తుడుచుకుని అన్నం కలుపుకోసాగాడు సత్తిపండు.
శ్రీచంద్ర, సత్తిపండు కామత్ హోటల్ లో ఉన్నారు.
అన్నం వేడివేడిగా పొగలు కక్కుతోంది. అన్నం వైపు చూస్తుంటే ఎన్నో భావాలు, బాధలు.
తండ్రితో గొడవపడ్డ కొత్తలో ఓ రోజు మధ్యాహ్నం ఆకలేసి స్పృహ తప్పే పరిస్థితిలో అనుకోకుండా రోడ్డు మీద దొరికిన అయిదు రూపాయలతో రోడ్డు పక్కన బండిమీద అన్నం కొనుక్కుని......
నిన్నటి అన్నం వేడిచేసి, నిన్నటి కూరలు వేడిచేసి అయిదు రూపాయలకు ప్లేటు అన్నం. వణికే చేతులతో రోడ్డు పక్కన నిలబడి సత్తు పళ్ళెంలో ఆబగా, ఆత్రంగా ఆకలి బాధ తీర్చుకునే ప్రయత్నంలో అన్నం తినడం గుర్తొచ్చింది.
ఆకలి....ఆకలి.,.....ఆకలి......
అత్మబిమానాన్ని , అంతరాత్మని నొక్కెసే ఆకలి.
నువ్వెప్పుడూ క్యాన్సర్ కన్నా భయంకరమైనదానివి. మృత్యువు కన్నా జాతి లేని దానివి అనుకున్నాడు బాధగా శ్రీచంద్ర.
అప్రయత్నంగా అతని కళ్ళల్లో కన్నీటి తడి.
ఈ ప్రపంచంలో తనని భయపెట్టే శక్తి ఆకలికి వుందని తెలిసినందువల్ల కలిగిన భాదేమో అది.
* * *
సరిగ్గా అప్పుడే బ్రహ్మదేవుడు తను చూస్తున్న సృష్టిని ఆపి ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు.
స్వామి ఏమిటా ఉలికిపాటు ఆ లిప్త మాత్రపు కలవరపాటు ఏమి?" వీణ వాయిస్తున్న సరస్వతి దేవి తన స్వామిని అడిగింది.
"చిన్న కలవరం దేవీ. జననాలు పెరుగుతున్నాయి. రానురాను సృష్టి భారమైపోతోంది వారి తల రాతలు రాసిరాసి కరములు నొప్పి పుట్టుచున్నవి. ఎవరి తలరాతను రాసి కరములు నొప్పి పుట్టుచున్నవి. ఎవరి తలరాతను ఎలా రాయాలో కూడా బోధపడని స్థితి. అలుపు వచ్చుచున్నది. ఈ సృష్టికి అంతం లేకున్నది" బ్రహ్మదేవుడు తన బాధని దేవితో విన్నవించుకున్"నాడు.
"అవును స్వామీ! మీరు వట్టి అమాయకులు. ఆ శివుడు మీలా నిరంతరం సృష్టిని నిర్విగ్నంగా కొనసాగించుచున్నాడా....ఎప్పుడూ కన్నులు మూసుకుని ధ్యానంలో వుంటాడు. ఆ మహావిష్ణువు మాత్రం ఎప్పుడూ పాల సముద్రంలో శేషపాన్పుపై విశ్రాంతి తీసుకోవడమే పని. ఆ లక్ష్మి దేవి అదృష్టవంతురాలు, నిత్యం తన కనుల ముందే వున్న స్వామి పాదాలు పడుతూ హాయిగా వుంటుంది. ఏ దేవుడు చూసినా మిక్కిలి సంతోషముతో ఉన్నారు. నాకేది ఆ భాగ్యం. మీరెప్పుడు సృష్టిని కొనసాగించడంలో నిమగ్నమై ఉంటారు. నాకో అచ్చటా ముచ్చటా.....ముద్దులా మురిపములా, నా కన్నా తోటి దేవతలు మిన్న. సరస్వతి దేవి కాసింత బాధతో తన అక్కసును వెళ్ళగక్కింది.
"నిజమే, దేవి అలసిపోయి ఉన్నాను, అలా విహారం చేసి రావాలన్న కోరిక ఉదృతమగుచున్నది. అందరి తలరాతలను రాయు నేను నా తల రాతను ఈ విధంగా రాసుకుని యున్నానేమో....." దీర్ఘంగా నిట్టూర్చాడు బ్రహ్మదేవుడు.
"కాదు....కాదు.....ఇదంతా ఆ త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ మూర్తులు పన్నాగమే. వారే పనియు లేక హాయిగా ఉన్నారు. దశావతార సమాప్తి కాగానే యోగ నిద్రలోకి జారుకున్నారు మహావిష్ణువు -ఎప్పుడో భక్తుడు తపస్సు చేసినప్పుడు తప్ప కన్నులు తెరవడు ఆ కైలాస నాధుడు హూ.... నా నాధుడే.....ఘంటం పుచ్చుకుని తలరాతలను లిఖిస్తూ.....నా రాతను ఇలా....." మరోసారి వీణాదేవి తన అక్కసును వెళ్ళగాక్కేసింది.
బ్రహ్మదేవుడు తన తలలను పట్టుకున్నాడు అనవసరంగా వీణాదేవిని కదిల్చానని మింగలేక, కక్కలేక మిన్నకుండిపోయాడు.
"దేవీ.....అన్నీ మరచిపొమ్ము. మనకును మంచి ఘడియలు రాగలవు. నేను అలా విహరమునకేగి వచ్చెదను" అంటూ లేచాడు.
తధాస్తు దేవతలు మొహమొహాలు చూసుకున్నారు.
* * *
"ఒరే పండు....." ప్లయ్ ఓవర్ మీద నడుస్తూ పిలిచాడు శ్రీచంద్ర.
"ఏంటి గురూ?"
"ఇలా సాయంత్రం పూట మబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి....."
"ఏంటి .....ఆకాశానికి జబ్బు చేస్తుందా? ఎందుకంటావ్ గురూ?" మధ్యలో కట్ చేసి అడిగాడు సత్తిపండు.
"ఒరే పండు.....జబ్బు కాదురా.....మ...మబ్బు.... మబ్బు పట్టిన ఆకాశం అంటూ సత్తిపండు తలని పైకెత్తి "చూడు దాన్ని అంటారు మబ్బు చేసిన ఆకాశం అని" కోపంగా అన్నాడు.
"ఓహొ....మరి రెండు 'మ' లుంటాయా గురూ మబ్బుకు ఎందుకట......?"
శ్రీచంద్ర కోపంగా చూసి సత్తిపండును అమాంతం ప్లయ్ ఓవర్ నుంచి కిందకి తోసేయలన్నంత కోపం వచ్చింది.
"సారీ గురూ.....నువ్వలా చూస్తే నాకు మీ ఇంట్లో మీ నాన్న తిడుతున్నప్పుడు అయన మోహంలో కనబడే ఎక్స్ ప్రేషన్స్ గుర్తొస్తాయి" అన్నాడు సత్తిపండు భయంగా.
శ్రీచంద్ర తలమీద కొట్టుకుని "ఏంటోరా....నిన్ను కొట్టాలంటే పొట్టి లాగుతో, భూతద్దాల కళ్ళజోడుతో వున్న నీ అవతారం గుర్తొచ్చి బాధనిపిస్తుంది. జాలేనిపిస్తుంది" అన్నాడు.
"ఎందుకంటావ్ గురూ?" అని అడిగి వెంటనే నాలిక్కర్చుకుని "చెప్పు గురూ.....ఈ జబ్బు.....ఛ.....ఈ మబ్బు పట్టిన ఆకాశాన్ని చూస్తోంటే నికేమనిపిపిస్తోంది?" ఉత్సాహంగా అడిగిన ఏక్స్ ప్రేషనిచ్చాడు సత్తిపండు.
వెంటనే తన మాములు ధోరణిలోకి వచ్చి.....
"హాయిగా కబుర్లు చెబుతూ భుజం చుట్టూ చేయెసి నడవాలనిపిస్తోంది" అన్నాడు.
వాతావరణం ప్లజంట్ గా వుంది.
వర్షం రావడం లేదు గానీ చల్లని గాలి వీస్తోంది. ఎక్కడో మట్టి వాసన ముక్కుపుటాలను అందంగా అలరిస్తూ......
"నా భుజం చెట్టు చెయ్యేసి నడవాలనిపిస్తోందా గురూ.....అలాగే కానీ" అన్నాడు శ్రీచంద్ర చేతిని తన భుజం చుట్టూ వేసుకోబోతూ......
శ్రీచంద్ర ఏడుపోక్కటే తక్కువైంది.
"నన్నెందుకురా ఇలా చంపుతావు? నీకు కనీసం మోకాల్లో ఉందేమో మెదడు అనుకునేవాడ్ని ఇన్నాళ్ళూ? ఇప్పుడు తెలిసింది నీకసలు మెదడే లేదని. నీతో హాయిగా, నీ భుజం చుట్టూ చేయెసి నేను నడవడమేమిట్రా......అలా అయితే నన్ను పాయింట్ ఫైవ్ గాడంటారు" అని వెంటనే తన వీపు చరుచుకుని "చీ....చీ.....ఈ శుక్రవారం పూట నాతొ ఇలాంటి మాటలనిపిస్తావేంట్రా.....పైన తధాస్తు దేవతలుంటారేమో" అన్నాడు శ్రీచంద్ర.
"నువ్వు అరవ డబ్బింగ్ సినిమా డైలాగులు చెబితే నాకెలా అర్ధమవుతుంది గురూ......"