నమ్మకమైన నౌకర్లు, తీరని సంపద ఐతేనేం మనసిప్పి మాట్లాడుకోటానికి మనుషులు కరువే.
అన్నపూర్ణమ్మ బహుదొడ్డ మనిషి. ముంచేతికి ఎముకలేదు. ఊరివారికి తెలుసు.
ఇంట్లో పాదం బైట మోపకపోయినా ఊరు ఊరు ఆ ఊరిలో ఇంటింటి కథ తెలుసు అన్నపూర్ణమ్మకి.
అన్నపూర్ణమ్మ వద్ద చనువు దీపకి.
దీప వస్తే కావలసినంత కాలక్షేపం అన్నపూర్ణమ్మకి.
"రా... రా... నీకోసమే ఎదురు చూస్తున్నా!" అంది అన్నపూర్ణమ్మ గీతా మకరందం పక్కనపెట్టి.
దీప వచ్చి అన్నపూర్ణమ్మ పక్కనే కూర్చుంది.
"ఈ నిమిషానా లేక రోజూనా, నాకోసం ఎదురుచూడటం అత్తయ్యా?"
"నీ వెలా అనుకుంటే అలానే అమ్మాయీ!"
అన్నపూర్ణమ్మ దీపని ఓసారి పేరుపెట్టి పిలుస్తుంది. మరోసారి అమ్మాయీ! అంటుంది.
"నాకోసం ఎదురుచూడటం ఎప్పుటినుండో కరెక్ట్ గా చెప్పనా?"
అన్నపూర్ణమ్మ కుతూహలంగా ముందుకి జరిగింది.
"ఊ...చెప్పు...చెప్పు...నీ తెలివేపాటిదో చూస్తాను?"
"ఊ..హ్హూ" కంఠం సవరించుకుంది దీప. గాంభీర్యంగా ముఖం పెట్టింది. ఒకటి...రెండు...మూడు...అన్నట్లు వేళ్ళు లెక్కపెట్టింది.
"అత్తయ్యా! ఈరోజుకీ సరీగా అయిదు రోజుల క్రితం అంటే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలవేళ ఏమీ లేదు. ఆ తర్వాత గంటకి అంటే మూడు అయి వుండవచ్చు. అప్పుడు మీ కుమార రత్నం గుంటూరునుంచి వచ్చాడు. ఆ రాత్రినుంచి నాకోసం ఎదురుచూస్తున్నావు. అంతేనా అత్తయ్యా?"
"ఆశి నీ ఇల్లు బంగారంగాను" అన్నపూర్ణమ్మ విస్తుబోతూ అంది.
"అమ్మ బాబోయ్! బంగారమే! అందుట్లో ఇల్లంతానా? ఖర్మ...ఖర్మ..."
"అదేమిటే దీపా?"
"అవును ఇల్లంతా బంగారం అయితే నాన్నని చూడటం తీరని కోర్కె అవుతుంది. ఇంట్లో రోజుకో బంగారపు పెళ్ళ ఎత్తుకెళ్ళి రాత్రింబవళ్ళు ఆడినవాడు ఆడినట్లే వుండడూ ఆ చీట్లాట?"
"ఛా...ఏం మాటలివి?"
"ఉన్నమాటే అత్తయ్యా! దురలవాట్లలో చీట్లాటంత పాడాట మరొకటి లేదనుకో. రూపాయి వుంటే రూపాయి పోయిందాకా ఆడతారు. పదుంటే పది పోయిందాకా ఆడతారు. ఓ వందే వుందనుకో ఓ రాత్రి. ఇహ బంగారపు పెళ్ళలుంటే జీవితాంతం ఆడుతూనే వుంటారు. మృత్యుదేవత కూడా ఆటమధ్యలో లాక్కెళుతుంది. మరి విడి టైమ్ లో చిక్కరుకదా? అదే మరో అలవాటు అయితే ఓసారి కాకపోతే ఓసారయినా మారతారు. తాగుబోతు కడుపులో రణం పుట్టగానే తాగుడాపేస్తాడు. విటుడికి డబ్బై పోయింతర్వాత వేశ్య తన్ని తరిమితే నెత్తిన గుడ్డేసుకుని ఇంట్లో ఇల్లాలి కాళ్ళవద్ద పడుంటాడు. తాగుబోతు, విటుడు, సమయం మించిపోతే మారతారు. కాని పేకాట రాయుళ్ళు అలాకాదే, వారికి సమయం మించిపోటం మించిపోవక పోవటం వుండదు. ధనలక్ష్మి దూరం అవుతుంటే యింకా ఆడాలి యింకా ఆడాలి ఈ తఫా వస్తుంది. అనుకుంటు వంటినున్న గుడ్డలుకూడా వలిచి అలా ఆడుతూనే వుంటారు. చివరికి ఏమవుతుందో తెలుసా అత్తయ్యా?!"
"అదీ నువ్వే చెప్పు" అంది అన్నపూర్ణమ్మ నవ్వుని దాచుకుంటూ.
దీప మెడరిక్కించి నిటారుగా కూర్చుని "ఊ...హ్హూ..." అంటూ కంఠం సవరించుకుంది.
"అత్తయ్యా! యిప్పుడు నేను చెప్పబోవునది మామూలు కథకాదు. మరి హరికథా? అని అడుగుతావేమో, హరికథా కాదు. మరి ఈ కథ ఎట్టిదనిన హరిగారి గిరికథ... ఊ...హ్హూ..."
"ఎవరా హరి? ఎవరా గిరి? ఏమా కథ?"
"అలా అడిగావు బాగుందత్తయ్యా! నీకు శ్రవణానందంగా వుంటుంది. విను. అనగనగా..."
"ఏడుచేపల కథ వేటకెళ్ళి తెచ్చిన రాజకుమారులు, ఆ కథేనా దీపా?"
"కథ మధ్యలో యిలాంటి ప్రశ్నలేస్తే కథ చెడుతుంది. అంటే చెప్పేవారికి తిక్కొచ్చి వినసొంపుగా చెప్పగల కథి వికారంగా చెప్పగల ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ప్రశ్నలెయ్య రాదు. యిహ వినుము, ఆ...ఎక్కడి కొచ్చాను? అనగనగా దగ్గరనే ఆగా కదూ? అనగనగా ఓ ఊరు. అంటే అది పల్లెకాదు. పట్నం కాదు. కాస్త అటు కాస్త ఇటు సంబంధం కలది. ఆ వూళ్ళో హరినారాయణ అని ఒకాయన మంచీచెడ్డా తెలిసిన పెద్దమనిషి ఉన్నాడు. ఈ హరినారాయణ గారికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాంటి భార్య వుంది పిల్లలు వున్నారు."
అన్నపూర్ణమ్మ అడ్డం తగిలింది.
"నువ్వు చెప్పే కథ ఎవరిదో తెలిసిందిగాని, ఇహ ఆపు."
"చెప్పమన్నప్పుడు చెప్పటం, ఆగమన్నప్పుడు ఆగటం నా తత్వానికి విరుద్ధం. వద్దంటే ఆగను. చేయమంటే చేయను.కాబట్టి సాంతం వినవలసిందే. ఊ...హ్హు... ఎందాక వచ్చాను?"
"పిల్లలదాకా"
దానిమ్మ గింజల్లాంటి పలువరుస కనబడేటట్లు ఫక్కున నవ్వింది దీప.
"తప్పు... తప్పు... అత్తయ్యా! పెళ్ళి కావలసిన దాన్ని, దీవిస్తున్నట్లు అవేం మాటలు? మాటలతో కాలయాపన అవుతున్నది కథలోకి పోదాము. హరినారాయణ గారికి ఎవరి పోలిక వచ్చిందంటే వాళ్ళ అమ్మా నాన్నది కాదు. ధర్మరాజుది, సత్యహరిశ్చంద్రుడిదీ వచ్చింది. ధర్మరాజు ఒకేసారి జూదం ఆడి సర్వం కోల్పోయాడు. సత్యహరిశ్చంద్రుడు ఆడినమాట తప్పనివాడు అయి పెళ్ళాం బిడ్డల గోడు వినిపించుకోలేదు. తను గొప్పవాడి ననిపించుకోవాలనే స్వార్ధంతో ఆలిని, బిడ్డని కష్టపెట్టాడు. ఈ కథలో హరినారాయణ గారు పేకాట ఆడటంలో ప్రసిద్ధి గాంచినారు. ధర్మరాజులా సర్వం ఆటలో ఒకేసారి కోల్పోలేదు. రోజుకి కాస్త కాస్త చొప్పున భార్య శ్రీమహాలక్ష్మి ఆస్తిని హరీ అనిపించాడు."
అన్నపూర్ణమ్మ దీప మాటలకు అడ్డు రాబోతే "అడ్డురావద్దు అన్నట్లు చేతిని ఆడిస్తూ వారించింది"
"ఆస్తిని హరీ అనిపించిన హరినారాయణ, సత్యహరిశ్చంద్రుడిలా భార్యా బిడ్డను విడనాడలేదు. ఇంటికి వస్తూ పోతూనే వున్నాడు. వాళ్ళకి అక్కడమాట ఇచ్చి వుంటాడు. కాబట్టి ఆడిన మాట తప్పనివాడయి రాత్రి కాగానే హరిశ్చం... తప్పు...తప్పు హరినారాయణ తృణమో ఫణమో చేత బుచ్చుకుని వెళుతుంటాడు.
శ్రీమహాలక్ష్మి వద్ద సిరి పూర్తిగా తరిగిపోయింది. ఏం చేస్తుంది? తన బిడ్డని, ఓ యాభయి రూపాయలు అప్పు తెమ్మని ఇంట్లోంచి బైటకు తరిమింది.
"ఛట్ అప్పుకి నే పోను" అని గిరి అంటే కొండ అదెక్కి కూర్చుంది ఆ బిడ్డ.
"నా తల్లివి కదూ? నా అమ్మకదూ?" అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తల్లి కన్నీరుకి కరిగి గిరి దిగిన తనయ అప్పుకి బైలుదేరే వచ్చింది. ఇదీ హరిగాధ కథ ననననానా...
"నీ హరికథ అర్ధమయింది కాని సంగీతం ఆపవే దీపా" అంది అన్నపూర్ణమ్మ నవ్వుతూ.