పెద్ద పండుగ
పెద్దపండుగ1, పెద్ద పండుగ; పెద్ద పండుగ, పేరు దండుగ!
పండుగెవరికి? పండుగెవరికి?
పండుగెవరికి? పబ్బ మెవరికి?
తిండి లేకా దిక్కు లేకా
దేవులాడే దీన జనులకు
పండుగెక్కడ! పబ్బ మెక్కడ?
ఎండు డొక్కల పుండు రెక్కల
బండ బతుకుల బానిసీండ్రకు
పండుగేమిటి? పబ్బమేమిటి?
ఉండడానికి గూడులేకా
పండడానికి నీడలేకా
ఎండ వానల దేబిరించే
హీనజనులకు పేదనరులకు
పండుగొకటా? పబ్బ మొకటా?
పెద్ద పండుగ, పెద్ద పండుగ;
పెద్ద పండుగ, శుద్ధ దండుగ!
రచన : 23 - 9 - 1970
ముద్రణ: మరోప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980
1. పెద్ద పండుగ :వానాకాలం వెళ్లాక పంట ఇంకా పంపకముందే వచ్చే పండగ దసరా. ఈ పండక్కి రేడియోలో కవి సమ్మేళనాలు నిర్వహించడం పరిపాటి.
ఎవరిది అహింస?
తలకాయలు దొర్లా
లన్నాడు బిర్లా
ఔను సత్యం1 తలకాయ దొర్లింది
భాస్కరుడి2 తలకాయ దొర్లింది - ఇదే హింస
బోర్లా
పడుకున్న సంపాదకా విను
నక్సలైట్లు ఛేదిస్తున్నారు గాంధీ
విగ్రహాల శిరస్సులను - అదే అహింస
సత్యానికి3 చావులేదు
భాస్కరుడు4 బతికే వుంటాడు
ఈ లోగా
పురాణాలు పుక్కిలించిన
కిరాణా కవులంతా
నక్సలైట్ నరకాసురుణ్ణెదిరించి
సినీమాతార సత్యభామ
ధనస్వామ్య దామోదారుణ్ణి రక్షిస్తుందని
అమాయకంగా నమ్ముతారు
రచన: ఫిభ్రవరి, 1971
ముద్రణ : జయశ్రీ, మాస పత్రిక - ఫిబ్రవరి, 1971
పునర్ముద్రణ : మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980
1,3 - వెంపటావు సత్యనారాయణ
2,4 - చాగంటి భాస్కరావు