Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 5


                                                        నిన్నటి జట్కావాలా

తాను సాలీసాలని గడ్డితిని
నాకు రోజూ వణ్ణం యెట్టేదండి నా గుర్రం
రెండ్రోజుల్నించి ఆ గడ్డికూడా తిన్నేదు
నిన్న సచ్చిపోనాది
కవిగోరూ
యినండి నాగోడు
యేటలా రాసుకుపోతున్నావు
ఆగవయ్యా యెర్రి బ్యామ్మడా
అన్నట్లు నువ్వు బ్యామ్మణ్నానుకోవడం
మానీశావటగా
పోనీ యినవయ్యా మనిసీ
నే సెప్పిందంతా యిశదంగా యిని
లచ్చనంగా గయోపాక్యానంలో పజ్యాల్లాగ
జామయించిరాసీ
అలాంటియి నువ్వు ఎడంసేతి
సిటికెనేలు గోటితో గీకేస్తావటగా
అదంతా యిప్పుడొగ్గీనావా
అయితే సూడు ఆ మద్దిన మనూరొచ్చాడే
జరీకండవా యేసుకుని
అబ్బెదవ కవి
ఆడినాగ జణకజణా జణకజణా
కాయితాలమీద అచ్చరాల్ని లగెత్తించు
కాదు  నాయేడుపే కావాలంటావా
అయితే యేడు
కాదు యిను
నిన్న సింగపూరునించి స్టీమరొచ్చింది సూడూ
అందులోంచి దిగాడో నల్లదొర
ముండల కంపెనీకి తీసుకెళ్లమంటే
మూడ్రూపాయలకి బేరం కుదుర్సుకున్నాను
గుర్రం కదిల్తేగా
కొట్టేను తిట్టేను
ఒట్టుకూడా యేసేను
ఛలోచల్ చల్ రే బేటా అన్నాను
(ఇందీలో సెబితే యినుకుంటాదేమోనని)
ఒంట్లో ఓపికుంటేగా
ఒక్కడుగేనా ముందు కెయ్యడానికి
ముడ్డంటా నోటంటా నెత్తురోడ్చుకుంటూ
ముక్కుతోంది
సింగపూరుబాబు గైరుహాజరైపోనాడు
యిలాంటోళ్లేయేయేవో జబ్బులొట్టుకొస్తారట
మనుసులికే కాక
పసువులికి కూడా
తగిలించేస్తారు కామాల
పసువుల డాక్టేరు దగ్గిరికి పరుగెత్తుకెళ్లేను
ఒక్క పాలొచ్చి సూడండన్నాను
పది రూపాయలు పట్రమ్మన్నాడు
ఎలా సవ్వను
సరే అది బతికితేసాలు ఆ తర్వాత సూసుకుందామని
పటకా గిటకా అదీ యిదీ అమ్మేసి
అర్జెంటుగా అయిదూ పదీ పోగుచేసి
జారూరుగా సదివించుకున్నాను
దారిలో నాసేతొక సూదిమందుసీసాకొనిపించాడు
గుర్రానికి రెండేపులా రగతం
నా రెండు కళ్లల్లో కన్నీళ్ల నాగ
నాబంనేదు బతకదన్నాడు
అన్న పెకారం అది బతకనేదు
మా సత్తెమైన మనిసి
(యేటాగి పోనావు
కలంలో సిరా నిండుకుందా
యెందుకలా దులపతావు
అందులోంచి యేటీరాలదు
యింద పెనసలు ముక్క
యీదిలో దొరికింది
యెవడిదో యిస్కూలు కుర్రోడిది
నూర్రూపాయల కలంతోనైనా
నువ్వింతకన్నా యేం రాస్తావులే రాసుకో)
నిక్కచ్చిగా నిజం సెబుతున్నాను గురూ
నిన్నటేల్నించీ నాకు తిండే సయించనేదు
ఏడ్చాను ఏడ్చాను
ఏడిస్తే నాబంనేదని యిరమించీసుకున్నాను
ఎద్దునాగ యెక్కడెక్కడో తిరిగాను
ఏదిరా దారి బగమంతుడా అనుకుంటానే
ఎక్కడున్నాడాడు
సిమ్మాచెలం1 కోవిల్లోనా
సింతచెట్టు సివర్లోనా
దరగా కొండమీదనా2
గ్యానాపురంలోనా3
ఎక్కడున్నాడు
ఉంటే యేటిసేస్తున్నాడు
అబ్బోరబ్బ నాలోటోళ్లని రచ్చించడమే ఆడిపనా
అసలాడంటూ ఉన్నాడా
ఉంటే మాత్రం ఆడెవడు నన్ను రచ్చించడానికి
అప్పుడప్పుడాన్ని తలుసుకుంటానుగాని
అదోపిరికితనం
కయీస్సెరుడుని నీదగ్గిర దాసడమెందుకు
యేడాది కిందటేటయిందో తెలుసా
యెలంపేటలో4 అందిరికీ యెరిక
నా మూడేళ్ల కొడుకు సచ్చిపొతే
యిశారం సేత
గూనపాకలోడి5తో నెగిసిపోయింది నా పెల్లాంనంజ
అప్పుడుకూడా యింత
బాదపడనేదంటే నమ్మండి కవిగోరూ
నిన్న రాత్రంతా సముద్రపొడ్డునే కూకున్నాను
సెప్పకేం సచ్చిపోదామనే అనుకున్నాను
ఏం చెయ్యాల నేను
ఏం కావాల నా బదుకు
రేత్తిరంతా యిదే ఆలోశన
సీ సవ్వకూడదు
సచ్చిసాదించేదేటి
ఏది సేసినా బతికున్నప్పుడే సెయ్యాల
బతికున్నోడే సెయ్యాల
మనిసంత మనిసిని
గుర్రం సచ్చిందని నేనూ సవ్వడమేనా
కుక్కలు సవ్వనేదూ
నక్కలు సవ్వనేదూ
సినీమా యిస్టారులు సవ్వనేదూ
సీకటి బజారాళ్లు సవ్వనేదూ
నేనుమాత్రం సావను
సచ్చేదాకా బతికే తీరతాను
పర్వాలేదురా బేటా అని
నాకు నేనే  బరవసా సెప్పుకున్నను
నా గుర్రమే నా కళ్ళముందాడుతోంది
నా మూడేళ్ల కొడుకులాగ
అప్పుడనింపించింది నాకు
సికాకులం6 యెల్లిపోవాలని
సెప్పవయ్యా సిరిసిరిమువ్వా7
(సరుపుకి తొడ నొచ్చిందా)
యిప్పుడు సెప్పుమరి
యెల్లమంటావా వొద్దంటావా
నువ్వెల్లమన్నా వొద్దన్నా
నేనెల్లక మాననులే


                                                                            రచన: 12-9-1970
                                             ముద్రణ : సృజన మాసపత్రిక - అక్టోబరు, 1970
                  పునర్ముద్రణ : (1) ఝంఝ విరసం కవితా సంకలనం - అక్టోబరు, 1970
                                              (2)మరోప్రస్థానం విరసం ప్రచురణ - మే, 1980.
1. సిమ్మాచెలం : విశాఖపట్టణానికి 20 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన దేవాలయం.
2. విశాపట్నం ఓడరేవు చేరువలో, యారాడకొండ కెదురుగా వున్న కొండమీద ఒక మసీదుంది.దాన్ని దర్గాకొండ అంటారు.
 3. జ్ఞానాపురం - విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరువలో వున్న ఒక పేట. అక్కడ క్రైస్తవులెక్కువ వుంటారు. పెద్ద చర్చికూడా వుంది.
4. యెలం పేట : వేలంపేట - విశాఖపట్నంలో ఒక పేరు. వాడుకలో యెలంపేట అంటారు. ఇప్పుడక్కడ హెడ్ పోస్టాఫీసుంది.
5. గూన అంటే పెద్దకుండ. దానిలో బట్టలు నానబెట్టి రంగులు వేసే వారిని గూనచాకలోళ్లంటారు.
6.సికాకులం :శ్రీకాకుళం
7. సిరిసిరిమువ్వ: ఈ మకుటంతో శ్రీశ్రీ వందపద్యాలు రాశాడు. సిరిసిరి. శ్రీశ్రీ.
  

 Previous Page Next Page