Previous Page Next Page 
మోహిత పేజి 6


 

        "మోహిత..... ఆ పేరుగల వాళ్లెవరూ ఇక్కడ లేరు బాబూ!" ఇప్పుడు ఆశ్చర్యపోవడం మైత్రేయ వంతైంది. అతనికి శరీరంలో నెత్తురు ఒక్కసారి ఇంకిపోయినట్టయింది.

 

    "మరి మీ అయ్యగారి భార్య, పిల్లలు....." తడారిపోయిన గొంతుతో అడిగాడు దాసప్ప.

 

    "మా అయ్యగారి భార్య చనిపోయి అయిదేళ్ళయింది. ఇద్దరు పిల్లలూ అమెరికాలో వున్నారు" చెప్పాడతను.

 

    "మీ అయ్యగారు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదా?"

 

    "లేదు."

 

    మరి మోహిత ఎవరు? అపార్ట్ మెంట్ లో దొరికిన విజిటింగ్ కార్డుకీ మోహితకు సంబంధం లేదా? ఏమిటీ మిస్టరీ? భారంగా నిట్టూర్చి నిరాశగా వెనక్కి తిరిగాడు మైత్రేయ.

 

    దాసప్పకి కూడా ఏం అర్థంకాలేదు.

 

    ఆ ట్రాప్ లో నుంచి తన ఫ్రెండ్ ఎలా బయటపడగలడని ఆలోచిస్తున్నడతను.

 

    మోహిత ఎవరోగానీ ఇంటెలిజెంట్ లేడీ. ప్లాన్డ్ గా తనని ట్రాప్ లోకి ఇరికించింది. మైత్రేయ నిరాశగా  దాసప్పవేపు చూశాడు. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్డుమీదకొచ్చి రిక్షా ఎక్కారు.

 

                                                                    *    *    *


`
    చాలాసేపు అచేతనంగా ఆలోచిస్తూ వుండిపోయాడు మైత్రేయ.

 

    రాజేంద్రకుమార్ పేరుమీద వుంది కాబట్టి, ఆ కారుని మోహిత వాడుతోంది కాబట్టి ఆమెకు,  రాజేంద్రకుమార్ కి ఏదో రిలేషన్ వుండి వుండాలి.

 

    రాజేంద్రకుమార్ గురించి ఎంక్వయిరీ చెయ్యాలి. అతను ఫారెస్ట్ కంట్రాక్టర్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కనుక్కుంటే అతని వివరాలు కరెక్టుగా తెలుస్తాయి.

 

    ఫారెస్ట్  డిపార్ట్ మెంట్ ఆఫీసుకెళ్లాడు మైత్రేయ.

 

    వెదురు కర్రలతో కట్టిన ఫెన్సింగ్ మధ్య చిన్న బిల్డింగ్ లోపల ఆఫీసు రూమ్ లో యాభైఏళ్ళ క్లర్కు కూర్చుని సీరియస్ గా రాసుకుంటున్నాడు.

 

    "చెప్పండి.... ఏం కావాలి?" అడిగాడతను.

 

    "కంట్రాక్టర్ రాజేంద్రకుమార్ గురించి కొన్ని వివరాలు కావాలి" చెప్పాడు మైత్రేయ.

 

    ఆ మాట వినగానే చటుక్కున తలెత్తి, సూటిగా మైత్రేయ ముఖంలోకి చూసి తల దించేసుకుని-

 

    "ఎందుకు..... ఇంతకీ మీరెవరు?" తిరిగి ప్రశ్నించాడు.

 

    "ట్రైబల్ ఏరియాలోని గిరిజనుల గురించి పరిశోధన చేస్తున్నాను. ఫారెస్ట్ కంట్రాక్టర్ కదా! ఆయన ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించాలని..... హైదరాబాద్  నుంచి వచ్చాను" అబద్ధం ఆడాడతను.

 

    "వాళ్ళింటికెళ్ళి, ఆయన్ని కలిస్తే తెలిస్తుంది కదా?" అన్నాడాయన.

 

    "ఆయన గెస్ట్ హౌస్ కెళ్ళాను. ఆయన లేరు" చెప్పాడు మైత్రేయ.

 

    "ఫారెస్ట్ లోని గెస్ట్ హౌస్ కి వెళ్ళారా? ఆయన వూళ్ళో వుంటే అక్కడే వుంటారు.

 

    "భార్యపోయాక ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా?" మైత్రేయ అడిగిన ప్రశ్నకు అతనివేపు ఎగాదిగా చూశాడు క్లర్కు.


    
    "ఆయన వ్యక్తిగత వివరాలు నీకెందుకు?"

 

    వెంటనే జేబులోంచి వంద రూపాయలు తీసి, టేబుల్ మీద పెట్టాడు మైత్రేయ.

 

    "దయచేసి మీకు తెల్సిన వివరాలు చెప్పండి."

 

    ఆ వందరూపాయల నోటుని తీసుకుని, ఆ క్లర్కు జేబులో పెట్టుకుని చెప్పడం ప్రారంభించాడతను.

 

    "అతని మొదటిభార్య చనిపోయాక ఒక అమ్మాయిని వుంచుకున్నాడు. ఆ అమ్మాయిని ముదుమలై ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రహస్యంగా కొన్నాళ్ళుంచాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు."

 

    "ఏం....?"

 

    "ఇద్దరి మధ్యా కొన్నాళ్ళక్రితం ఏవో గొడవలు జరిగాయని విన్నాను."

 

    "ఆవిడ పేరు మీకు తెలుసా....?" చాలా ఆత్రుతగా అడిగాడు మైత్రేయ.

 

    "తెలీదు...."

 

    "మీరావీడ్ని ఎప్పుడైనా చూశారా?"

 

    "అసలు ఆవిడ్ని వుంచుకున్న విషయం అతి తక్కువమందికి మాత్రమే తెల్సు."

 

    భార్యపోయిన మనిషి... అంత సీక్రెట్ గా ఆమెనుమెయిన్ టైన్ చేయడానికి గల కారణం ఏమిటి? ఎవరికీ తెలీకుండా మెయిన్ టైన్ చేయడం వెనక సీక్రెట్ ఏమిటి? ఆ ఫారిస్ట్ గెస్ట్ హౌస్ కి ఎందుకుంచాడు?

 

    ఆ  వ్యక్తి మోహితేనా? ఏం అర్థంకాలేదు మైత్రేయకి.

 

    "ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏ ఏరియాలో ఉందో చెప్పగలరా?" అడిగాడు మైత్రేయ.

 

    "అడవిమధ్యలో ఒక జలపాతం దగ్గరని విన్నాను....." చెప్పాడు అతను.

 

    "బహుశా ఎంత దూరం వుండొచ్చు.... ఆ జలపాతం పేరేమిటి?"

 

    "వందమైళ్ళు వుండొచ్చేమో! ఆ ప్రాంతంలో చిన్న చిన్న జలపాతాలు చాలా వున్నాయని తెలుసుగానీ పేర్లు నాకూ తెలీదు...... నాది ఫీల్డ్ వర్క్ కాదు.ఆఫీస్ వర్క్..... కానీ ఎందుకిలా అడుగుతున్నావ్? అక్కడకు వెళతావా ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడతను.

 

    మోహిత ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో  వుంటుందని మైత్రేయ నమ్మకం.

 

    ఒకవేళ లేకపోతే....? ఉన్నా లేకపోయినా వెళ్ళక తప్పదు. మోహితకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అతని విశ్వాసం.


    
    "వెళతాను" దృఢనిశ్చయంతో అన్నాడు మైత్రేయ.

 

    "కొండలు, గుట్టలు, భయంకరమయిన విషసర్పాలు..... తోడేళ్ళు, ఒక పెద్దపులి కూడా అక్కడ తిరుగుతోందట.... మనుషుల్ని తినే ఆటవికులు కూడా వున్నారట."

 

    "అయినా ఫర్వాలేదు" అతని భయానికి చిన్నగా నవ్వుకుని, థాంక్స్ చెప్పి, రోడ్డుమీదకొచ్చాడు మైత్రేయ.

 

    అంతటి భయంకరమయిన అడవిలో రాజేంద్రకుమార్ వుండడానికి గల కారణం ఏమిటి?

 

    మోహితను పట్టుకోవడం కోసం తను ఎలాంటి సాహసం చెయ్యడానికైనా వెనుకాడదు.

 

    మోహిత మిస్టరీ లేడీ! తనను హంతకుడిగా ముద్ర వేయించిన మోహితను పోలీసులకు పట్టివ్వాలి. తను నిర్దోషినని నిరూపించుకోవాలి. సీరియస్ గా నిర్ణయించుకున్నాడతను.

 

                                            *    *    *

 

    నందిగామ.....

 

    ఆకుపచ్చదనాన్ని నింపుకున్న పంటపొలాలు, విశాలమయిన కార్పెట్స్ లా వున్నాయి. దూరంగా మునేరు..... ఆ పక్కనే మేట వేసిన లంక దిబ్బలపై ఏపుగా ఎదిగిన మామిడితోట..... మరోపక్క పల్లగిరి గట్టుమీద వెలసిన దేవాలయం, చర్చి...... నీటిపాయలమీద తేలుతున్న కొంగలు, ఎర్రటి కలువపూలు.... చల్లగా వీస్తున్న గాలి..... పంటచేల మధ్యనున్న గట్టుమీద పక్క పక్కనే నడుస్తున్నారు ఇందుమతి, ఆమె స్నేహితురాలు సరోజ.

 

    "మావాళ్ళు నాకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు" హుషారు లేని గొంతుతో చెప్పింది సరోజ.

 

    "పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానన్నావ్" అడిగింది ఇందు.

 

    "విధి ఒక విషవలయం.... విషాద కథలకు అది నిలయం" అని ఆ మధ్యాహ్నమే వచ్చిన పాతసినిమా మాతృదేవతలోని పాట పాడి....

 

    "మనం ఒకటి అనుకుంటాం. దేవుడు ఇంకొకటి సీరియస్ గా అనేసుకుంటాడు. చివరికి తలవంచి మూడుమూళ్ళూ వేయించుకోవాల్సింది మనమేగానీ, దేవుడు కాదుగదా అని మా బామ్మ అంటుంటుంది. సో" ఏదో    ఇంకా చెప్పబోయింది సరోజ.

 

    "ఆఖరికేమయిందో పాయింట్ కి రా......" అంది ఇందు అసహనంగా.

 

    "ముచ్చటగా మూడు సంబంధాలు రెడీగా వున్నాయి. ఆ ముగ్గురిలో ఒకర్ని స్వయంవరంలో, అంటే పెళ్ళిచూపుల్లో ఇష్టపడాలి. తప్పుతుందా?"

 

    "పెళ్లెక్కడ జరుగుతుంది......?" అమాయకంగా అడిగింది ఇందుమతి.

 

    "పెళ్లిచూపులూ లేవు..... పెళ్ళికొడుకెవడో సెలక్ట్ కాలేదు.....మ్యారేజ్ హాలుని బుక్ చేసాట్ట.... నీలాంటి వాడెవడో" నవ్వుతూ అంది సరోజ.

 

    "మరి నీ  విషయం ఏమిటి?" అడిగింది సరోజ.

 

    "నాదంతా సస్పెన్స్ సినిమాలా వుందే" నీరసంగా అంది ఇందు.

 

    "అంటే.....?" ప్రశ్నించింది సరోజ.

 

    "అంటే.... నేనేమో నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటాను. మా నాన్న వద్దంటారు.... మా అమ్మ  నేను చెపితే  మీ నాన్న వింటారేమిటి? అని తప్పుకుంటుంది" చెప్పింది ఇందు.

 

    "పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా, మనం ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా.... మొగుడు చెప్పినట్టుగా విని, డబుల్ కాట్ బెడ్  ఎక్కాలి గదా.... అంచేత పెళ్ళి చేసెయ్యమని చెప్పు. నీకెలాగూ మీ బావ మైత్రేయ రెడీగా వున్నాడు గదా" అంది సరోజ.


    
    "మా బావ గురించే చెప్పావులే! రెండేళ్ళకో, మూడేళ్ళకో వస్తాడు. ఎన్ని లవ్ సిగ్నల్స్ ఇచ్చిన అందుకోడు. లెటర్స్ కి జవాబివ్వడు, ఫోన్ చేస్తేమూడుముక్కలు మాట్లాడి పెట్టేస్తాడు.... నా బాధ అతనికి  అర్థంకాదు. ఏం  చెప్పమంటావ్" మనసు విప్పి చెప్పింది ఇందుమతి.

 

    "బెండకాయలా ముదిరిపోవద్దని ఘాటుగా ఉత్తరం వ్రాయి.... లేదా నువ్వే డైరెక్ట్గా వెళ్ళిపోయి తేల్చేసుకో" సలహా యిచ్చింది సరోజ.

 

     "నేను హైదరాబాద్ వెళ్ళడమా? అయ్యాబాబోయ....! మా నాన్న చంపెయ్యరూ" భయం వ్యక్తం చేసింది ఇందుమతి.

 

    "మనం పూర్వకాలపు ఆడపిల్లలం కాదు.... పెళ్ళి దగ్గర, శోభనం దగ్గర మనం భయపడకూడదని మా బామ్మ చెప్పింది. ఇంతకీ నిన్ను, మీ బావకిచ్చి పెళ్ళి చెయ్యాలని మీ నాన్నగారికుందా?" అడిగింది సరోజ.

 

    "ఆయన మనసులో ఉద్దేశ్యం నాకు తెలీదు. బావంటే ఆయనకి కూడా ఇష్టమే."

 

    "ఇష్టమే... అని నువ్వనుకుంటే ఎలా? అదేదో త్వరగా తేల్చుకుంటే మంచిది. లేకపోతే బోలెడు గొడవలు జరిగిపోతాయ్."

 

    "గొడవలా.... గొడవలెందుకు....?" అమాయకంగా ప్రశ్నించింది ఇందుమతి.

 

    "మీ బావ మైత్రేయ ఎక్కడుంటున్నాడు.....? హైదరాబాద్ లాంటి మహా నగరంలో.... అక్కడ నీలాంటి, నాలాంటి ఇన్నోసెంట్ గర్ల్స్ వుండరు..... జగజ్జెంత్రీలు వుంటారట.... మగవాళ్ళను మూసు నిముషాల్లో మూడ్ లోకి తెచ్చేసి, చెడుగుడు ఆడిస్తార్ట..... మా బామ్మ చెప్పింది....." అంది సరోజ.

 

    "నిజమా!" ఆశ్చర్యపోయింది ఇందుమతి.

 

    "ఇప్పటికే ఆలస్యమయిపోయింది. ఆలసించిన ఆశాభంగం..... మీ బావ మరో అమ్మాయితో ప్రేమలో పడకముందే..... నువ్వు రంగంలోకి దూకు.... రేపే మీ నాన్నని అడిగేయ్...." హుషారుగా సలహా ఇచ్చింది సరోజ.

 

    "నేను డైరెక్ట్ గా  అడగాలా....." అయోమయంగా అంది ఇందుమతి.

 

    "నీకు భయమయితే..... మీ అమ్మతో అడిగించు. నెమ్మదిగా నీ ఇష్టాన్ని కూడా మీ నాన్నకు తెలియజెయ్యి.... ఆ తర్వాత విషయం హుషారుగా చూసుకుంటాడు!"

 

    "సలహా బావుంది, మా అమ్మను నేడే కాకా పడతాను" హుషారుగా అంది ఇందుమతి.

 

    అప్పటికి ఇద్దరూ చెరువు దగ్గరున్న శివాలయం దగ్గరకొచ్చారు. గుళ్ళోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టుకుని యింటి ముఖం పట్టారు.

 Previous Page Next Page