"మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తావా" అడిగిందావిడ.
మాట్లాడలేదు త్రిభువనేశ్వరి.
"పిన్నీ... నువ్వు నన్ను అడగాలనుకొంటున్నది... ఇదేనా" ఖాళీ పాలగ్లాసుని ఆమె చేతికిస్తూ ఆమె ముఖంలోని భావాలను పసికట్టడానికి ప్రయత్నిస్తూ అంది త్రిభువనేశ్వరి.
"అది కాదమ్మా! మీ చిన్నాన్న...." ఏదో చెప్పబోయిందావిడ.
అంతవరకూ ప్రసన్నంగా ఉన్న త్రిభువనేశ్వరి ముఖంలో కోపం ప్రవేశించింది.
"చూడు- పిన్నీ....బాధ్యత మరిహ్చిపోయిన వాళ్ళకోసం భయపడి పారిపోయిన వాళ్ళ కోసం... బాధ పడడం మన తెలివి తక్కువ.....అయినా కాశీ, రామేశ్వరాలు నా జ్యూరిస్ డిక్షన్ లో లేవు....వెతికించడానికీ" లేచి తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది త్రిభువనేశ్వరి.
అవాక్కయిపోయి అల అచూస్తూ నిల్చుండిపోయింది సుందరమ్మ.
మరో అరగంట గడిచింది.
అడుగుల శబ్దం....వినబడగానే లేచి నించున్నాడు హేమాద్రి శర్మ...
కర్టెన్ తీసుకొని హాల్లో కొచ్చింది త్రిభువనేశ్వరి దేవి.
"గుడ్ మార్నింగ్ మేడమ్" హేమాద్రిశర్మ విష్ చేశాడు.
త్రిభువనేశ్వరి దేవి...
ముఫ్ఫై ఏళ్ల త్రిభువనేశ్వరి దేవి....అయిదడుగుల, ఆరంగుళాల ఎత్తు...బలమైన, దృఢమైన శరీరం మేరీలో స్ట్రీప్ లాంటి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు- ఆమె మెరిసే కళ్ళలో ఎప్పుడూ చిరునవ్వు- ఆమె అందం ఇతరుల్ని తక్కువగా ఆలోచింపజేసేదికాదు.... ఈమె తన జీవిత భాగస్వామి అయితే బాగుండన్న హుందాతనంతో కూడుకున్న కోరిక....అదో అద్భుతమైన ఆకర్షణ-వీటన్నిటింనీ మించిన గ్రేస్....ఎంతటి వారినయినా, తన వాగ్ధాటి ద్వారా శాసించగలిగే నేర్పు-
తండ్రి సుభాష్ చంద్ర గాంధేయవాది....స్వాతంత్రోద్యమంలో, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్ష అనుభవించి, అనేక రకాలయిన చిత్రహింసలకు గురైన వ్యక్తి.
ఆంద్రరాష్ట్రం ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 1955లో ఏర్పడ్డ తొలిమంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి ఆ తర్వాతః చాలాకాలం పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయనకు ఎనభై ఏళ్ళు - ప్రస్తుతం స్వంత వూళ్ళో కృష్ణాజిలా నందిగామలో వుంటున్నారు.
త్రిభువనేశ్వరి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తండ్రి సుభాష్ చంద్రే.
ఎనిమిదేళ్ళపాటు పార్టీలో సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్ గా ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిత్వం త్రిభునేశ్వరిదేవిది.
పార్టీలో ఒక్కసారిగా అధికారం కోసం చెలరేగిన కుమ్ములాటల్లో ఇద్దరు ప్రధనమైన నాయకుల మధ్య ఏర్పడిన స్పర్ధ, అసమ్మతి రాజుకోవడంతో నాటకీయ పరిణామాల్లో త్రిభువనేశ్వరీ దేవిని అదృష్టం వరించింది.
హైకమాండ్ త్రిభువనేశ్వరి దేవికి చీఫ్ మినిస్టర్ పట్టం కట్టింది.
ఆరునెలల కాలంలో తనను తాను రుజూవు చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది త్రిభువనేశ్వరీ దేవి.
జలపాతంలాంటి జుత్తు, విశాలమైన నుదురు- ఆ నుదుటిమీద సూర్యబింబంలాంటి బొట్టు, బెనారస్ పట్టుచీర....ఎడంచేతికి వాచీ, కుడిచేతికి రెండు బంగారు గాజులు....ఎంతో సాదాసీదాగా ఉంటుంది. ప్రస్తుతం విశాలమైన సోఫామీద కూర్చుంది త్రిభువనేశ్వరీదేవి! లోన్నించి పనిమనిషి కొన్ని ఫైల్స్ ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.
వాటిలోంచి ఓ ఫైల్ ను అందుకుంది సి. ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి.
"ఫైల్స్ అన్నీ వెరిఫై చేశాను.....మద్యాన్ని నిషేధించడానికి నిర్ణయించుకొన్నాను" సీరియస్ గా అంది త్రిభువనేశ్వరీ దేవి.
"మరోసారి ఆలోచించండి.... పాత గవర్నమెంట్స్ తెచ్చిన జి.వోలు, ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్.... అన్నీ మీకు విపులంగా తెల్సే ఉంటాయి.
ఇంకా కొన్నాళ్ళాగితే....బాగుంటుందని నా సలహా" హేమాద్రి శర్మ చెప్పాడు.
"నిన్న రాత్రి కూడా...మీరిదే చెప్పారు....ఒక కార్యకర్తగా నేను పార్టీలో పని చేస్తున్నప్పటి నుంచి....మీకు తెలుసు....మా డాడీ ఆశయం మీకు తెల్సు...మా డాడీలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్, నా నుంచి, నా ప్రభుత్వం నుంచి ఏవాశిస్తున్నారో మీకు తెలుసు- జి.వో తేవడంతో నేను చేతులు దులుపుకుని ఊరుకోను. "ప్రాక్టికల్'గా ఇంప్లిమెంట్ చేసేవరకూ నిద్రపోను... నా పదవి పోయినా ఫర్వాలేదు- మద్యాన్ని నిషేధిస్తాను. పేద ప్రజల్ని కాపాడతాను."
"ఒక ఐ.ఎ.ఎస్...ఆఫీసర్ గా, ఒక సి.ఎమ్ తో స్పష్టంగా ఒపీనియన్ని చెప్పుకోలేక పోవచ్చు- కానీ....చిన్నప్పట్నించీ మిమ్మల్ని ఎరిగిన, ఒక వెల్ విషర్ గా...నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదనుకుంటాను.
ఇవాళ మనదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం... కేవలం ఎక్సయిజ్ రెవిన్యూ ఆదాయం మీదే ఆధారపడుతున్నాయి. సారా కంట్రాక్టర్లు ఇవాళ పార్టీలకు గానీ, ప్రభుత్వాలకు గానీ అనఫీషియల్ బ్యాంకులుగా తయారు కావడానికి ఎవరు కారణం... సారా వాళ్ళకు తెస్తున్న ఆదాయమే. ప్రతీ ఏటా పెరుగుతున్న మద్యం వినియోగం.... రెవెన్యూ పెరుగుదలల్ని ఒక్కసారి గమనించండి.
1960-61లో కేవలం ఏడుకోట్ల మూడులక్షలున్న ఎక్సైజ్ రెవెన్యూ ఈ ఎక్సైజ్ సంవత్సరం నాటికి 950 కోట్ల రూపాయలకు పెరిగింది. 1970-71లో రు. 29 కోట్ల 79 లక్షలు. 1980-81లో 152 కోట్ల 40 లక్షలు, 1990-91లో 780 కోట్లు, 1991-92 లో రు. 850 కోట్లు ఎక్సయిజ్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. సారా ఐ.ఎం.ఎల్. షాపుల సంఖ్య కూడా ఈ మూడు దశాబ్ధాలలోనే అధికంగా పెరిగాయి. 1970లో 8669 సారా షాపులు, 2305 బ్రాందీ షాపులుండగా, 1980లో సారా షాపులు 14,274, బ్రాందీ షాపులు 4566కు పెరిగాయి. 1990 నాటికి 16,436 సారా షాపులు 6503 బ్రాందీ షాపుల స్థాయికి ఈ సంఖ్య చేరింది.
మనం సారాని నిషేధిస్తాం....కాని కల్తీ సారాను నిషేధించలేం. మద్యాన్ని నిషేధిస్తాం....కానీ బార్లను, వైన్ శాపుల్నీ నిషేధించలేము" వినయంగా చెప్పాడు హేమాద్రిశర్మ.
ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరీ దేవి.
"మొత్తం మత్తును నిషేధించడం కేంద్ర ప్రభుత్వం పని... భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం.... దేశంలోని ప్రతి పౌరునికీ, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అధికారంలో కొచ్చే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెపుతున్న దేవిటి? మద్యపాన నిషేధము, రాష్ట్రాల పరిధికి చెందిందని.... కేంద్ర ప్రభుత్వం... ఏ చర్యా తీసుకోలేదని అంటోంది- రాజ్యాంగ పరంగా, మద్యపాన నిషేధాన్ని దేశమంతా అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉన్న కారణంగా, కేంద్ర ప్రభుత్వం 12 సూత్రాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపి, చేతులు దులుపుకుంది. ఆ పథకంలో మద్యపాన నిషేధం గురించి మహాత్మాగాంధీ జరిపిన పోరాటాల స్ఫూర్తిగా, దేశంలోని మద్యపాన నిషేధాన్ని అమలు చెయ్యాల్సి వుంది. అంచెలంచెలుగా ఈ లక్ష్యాన్ని సాధించాల్సి వుంది. మద్యం గురించి ప్రకటనలు నిషేధించడం, విద్యా సంస్థలు, మత పరమైన పవిత్ర ఆలయాలు, పారిశ్రామిక కర్మాగారాలు వంటి వాటి దగ్గర మద్యం అమ్మే దుకాణాలను బంద్ చేయడం, ఆల్కహాల్ డ్రింకుల తయారీకి కొత్త లైసెన్స్ లు జారీ చేయకపోవడం వంటి చర్యలు తీసుకోవాలని 1975 గాంధీ జయన్తి నుండీ ఈ కార్యక్రమం ప్రారంభించాలని 1978 నుంచి ఏడాదికి రెండువారాల పాటు మద్యంలేని వారాలుగా అమలుచేసి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ 1981 నాటికి దేశమంతా మద్యపానాన్ని నిషేధించి అమలు చేయాలని కేంద్రం ఆశించింది.
కానీ ఆచరణలో ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించండి.
ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ, ఎప్పుడు, ఏ కల్తీ సారాయి, నకిలీ మద్యంవంటివి తాగి వందల్లో ప్రజలు మృతులయితే చాలు- ఒకసారి ఆ పాత ఆదేశాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి, తన బాధ్యత పూర్తయిందని భావిస్తోంది. చట్టాలు చేసే ప్రభుత్వాలకు వాటిని అమలుచేసే అధికారులకు చిత్తశుద్ధి లేకపోతే జరిగేది ఇదే కాదంటారా..."