Previous Page Next Page 
ముగ్ధ పేజి 5

  

     "చూడు పిచ్చిపిల్లా! ఆడపిల్ల పిలిచి, నిన్ను ప్రేమిస్తున్నానంటే, ఏ మగవాడు సాధారణంగా కాదనడు. అప్పటికీ ముగ్గురు భార్యలున్న మగవాడయినా ఇంకో ఆడది తనని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నదంటే ఆ అవకాశాన్ని జారవిడుచుకోడు. పెళ్ళి చేసుకోడానికి జంకినా, ఆమెతో గడపడానికి మాత్రం ఏమాత్రం సందేహించడు. మైడియర్ ఫ్రెండ్స్ మగవాళ్ళ గురించి మీకేం బెంగక్కరాలేదు" మగవాడు అనే సబ్జెక్టు గురించి పూర్తిగా పరిశోధనచేసిన ఏకైక ఆడపిల్లలా చెప్పింది ముగ్ధ.
    
    "మరి నేను ఆల్ రడీ ఓ వ్యక్తిని సెలక్టు చేసుకున్నాను కదా మూడు చీటీలువేస్తే సరిపోతుంది కదా" సురభి అంది.
    
    "శ్రీధర్ ని నువ్వు సెలక్టుచేసుకున్నట్టేకదా మళ్ళీ తర్వాత ఏమీ అనగూడదు తెల్సిందా" నీలిమ అంది సురభి అలాగేనన్నట్లు తలూపింది.
    
    హేండ్ బేగ్ లోంచి నోట్ బుక్ ని తీసుకుని, అందులోంచి ఒక పేజీని చింపింది ముగ్ధ.
    
    "ముందు మనం చెయ్యాల్సింది నాలుగు భిన్నమైన వ్యక్తిత్వాల మనుషుల లిస్టురాయాలి చెప్పండి" అంటూ మిగతా ముగ్గురివేపు చూసింది ముగ్ధ.
    
    "నాకు సురేష్ ఓబ్రాయ్ లా, హేండ్ సమ్ కుర్రాడు అదీ లక్షాధికారై ఉన్నవాడు కావాలి" గబగబా అంది అలక.
    
    "తల్లీ సురేష్ ఓబ్రాయో, రాజ్ బబ్బరో, నీకు కావలసిన లక్షణాల కుర్రాడు గురించి చెప్పమానడం లేదు. వ్యక్తిత్వాలగురించి నీకు రాజ్ బబ్బర్ దొరుకుతాడు కానీ, ఇన్ సాఫ్ కా తరాజ్ లోని రాజ్ బబ్బర్ లాంటోడిని చూడు" నీలిమ అంది.
    
    "అంటే రేపిస్టు ఖూనీకోరు దొరుకుతాడంటావా" బుంగమూతిపెట్టి అంది అలక.
    
    "ఎలాంటివాడు దొరికినా వాడ్ని గొప్పవాడ్ని చేయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి" మళ్ళీ హెచ్చరించింది ముగ్ధ.
    
    "చదువుండి, సంస్కారం వుండి ఏమ్చేయ్యాలో తోచక, ధైర్యం లేక అమాయకంగా వుంటారుకదా, వాళ్ళు మొదటివర్గం రెండు అపారమైన తెలివి తేటలు, ధైర్యం, సాహసం, చురుకుదనం, మేధస్సు అన్నీ ఉన్నా ఎవరూ కనీసం వాళ్ళగురించి మాట్లాడుకాకపోతే, ఎవ్వరూ కనీసం వల్ల మేధస్సుకు గుర్తింపు నివ్వకపోతే, వాళ్ళు తీవ్రమయిన నిరాశా నిస్ప్రుహలతో గురయిపోయుంటారు. వాళ్ళు రెండోవర్గం. మూడు, ఒక లక్ష్యం, ఒక గమ్యంలేకుండా ఎందుకు బతుకుతున్నామో తెలీకుండా జూదగాళ్ళుగా, నేరస్తులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, సవాలక్ష అవలక్షణాలతో, బలహీనతలతో శక్తినీ, తెలివితేటల్ని వృధాచేసుకునే వర్గం నాలుగు, చదువు, సంస్కారం, మేధస్సు, తెలివితేటలు, ఆలోచనా అన్నీ వున్నా ఉద్రేకం, విప్లవం అంటూ తాత్కాలిక నిర్ణయాలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకునేవాళ్ళు ఎలావుంది విభజన చెప్పండి" ముగ్గురివేపు చూస్తూ అంది ముగ్ధ.
    
    "ప్రపంచంలో లక్షలక్షలు మగవాళ్ళు కన్పిస్తారు. ఇంతేనా అసలు నాలుగు రకాలేనా." ఆశ్చర్యంగా అంది నీలిమ.
    
    "వీటిని బేసిక్ ఫ్యాక్టర్స్ అంటారు. మనుషులు బంగారంతోనో, వెండితోనో పుట్టలేదు కదా ఏ ఫీలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా వుంటే, ఆ ఫీలింగ్ తో ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి. అందుకే అందరూ బుద్దులు కారు. అందరూ చార్లెస్ శోభరాజులూ కారు. ప్రతివ్యక్తిలోనూ ఎంతో కొంత నేరప్రవృత్తి ఉంటుంది. అపారమైన కరుణాప్రవృత్తి వుంటుంది ఒ.కే. కదా. అయితే ఇందులో శ్రీధర్ ఏ ఫాక్టర్ కి చెందినవ్యక్తో చూడండి" సురభివేపు చూస్తూ అంది ముగ్ధ.
    
    "శ్రీధర్ రెండోవర్గానికి చెందిన వ్యక్తి అవునా" అంది సురభి. కాగితాన్ని నాలుగు ముక్కలుగా చేసింది ముగ్ధ. ఒక ముక్కను పారేసి మిగతా మూడింటిమీద వరసగా పేర్లు రాసింది.
    
    మొదటి దానిమీద అమాయకుడు.
    
    రెండో ముక్కమీద తెలివితేటల్ని నేరప్రవృత్తికోసం ఉపయోగించుకొనే వాడు.
    
    మూడో ముక్కమీద ఉద్రేక స్వభావి సరిపోయింది కదా" అని ఆ మూడు కాగితాల ముక్కల్నీ చుట్టాలుచుట్టింది. రెండు చేతుల్నీ మొగ్గలా చేసి వాటిని మూడు నాలుగుసార్లు కలిపింది. పర్ణేష్ ఉద్విగ్నతా అంచులకు చేరుకున్నాడు.
    
    "ఇప్పుడు మన ఫ్రెండ్స్ చేత ఎవరిచేతో ఈ కాగితాల్ని తీయిస్తాం" తలెత్తి చుట్టూచూసింది ముగ్ధ.
    
    అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలక, నీలిమ, ముగ్ధ బయటకు నవ్వుముఖాలతోవున్నా వాళ్ళ మనసు హైటెన్షన్ తో నిండిపోయింది.
    
    తనకు ఎలాంటి వ్యక్తివస్తాడు? ఎలాంటి వ్యక్తి?
    
    "పర్ణేష్ కి ఈ చాన్సిద్దామా" అన్నట్టు మిగతావాళ్ళవేపు చూసింది ముగ్ధ.
    
    ఎవరూ వద్దనలేదు.
    
    మూడుచుట్టల్ని గిలకొట్టి నేలమీద వేసింది ముగ్ధ.
    
    అందరూ పర్ణేష్ వేపు చూస్తున్నారు.
    
    టెన్షన్ తో పర్ణేష్ వేపు చూస్తున్నారు.
    
    టెన్షన్ తో పర్ణేష్ ముందుకడుగేసాడు. వంగోని చెయ్యిసాచి ముందుగా ఒక కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
    
    ముగ్ధ చేతిలో మొదటి కాగితాన్ని పెట్టాడు. రెండో కాగితాన్ని తీసి అలక చేతిలో పెట్టాడు. మూడో కాగితహాన్ని నీలిమ చేతిలో పెట్టాడు.
    
    అలక వెంటనే ఆ కాగితాన్ని విప్పబోయింది.
    
    "ఒక్క నిమిషం ఆగు" ముగ్ధ సీరియస్ గా అంది.
    
    "మైడియర్ ఫ్రెండ్స్! ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇవాళ మనం ఆషామాషీగా అనుకున్న ఒక నిర్ణయాన్ని రేపు ఆచరణాత్మకం చేయబోతున్నాం. ఇదొక నలుగురు అమ్మాయిలు చేపట్టిన ఉద్యమం దీంట్లో లాభాలెంత వున్నాయో, నష్టాలూ అంతే వున్నాయి. మనం ఏమాత్రం తప్పటడుగు వేసినా, అది మన జీవితాలకే శాపంలా అవుతుంది. ఇది మనలోని ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, ఒక కొత్త అధ్యాయానికి నాంది కావాలి. దీన్ని నేను ఉద్యమం అని ఎందుకన్నానంటే, ఇద్దరు అపరిచిత స్త్రీ, పురుషుల పరస్పర అవగాహన ద్వారా విలక్షణమైన వివాహ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ఒకకొత్త ప్రణాళికకు మనం నలుగురం సూత్రధారులమవుతున్నాం. పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా కులాలు, ఆచారాలు, మతాలు, పట్టింపులు, కట్నాలు, లాంఛనాలు, లక్షలతో చేసే పెళ్ళిళ్ళు, ఈ ఆడంబరాలకు స్వస్తిపలుకుతున్నాం అందుకే మనకు నచ్చిన అబ్బాయిని ప్రయోజకుడ్ని చెయ్యడానికి మనం చిత్తశుద్దితో అహర్నిశలూ కృషిచెయ్యాలి. పిరికితనంతో నీరసపడకూడహ్డు. ఈ మగవాళ్ళ ప్రపంచం ఎలాంటిదో మనకు తెలుసు అదొక అండర్ వరల్డ్ ఆ అండర్ వరల్డ్ తో పోరాడాడానికి మన ఆత్మవిశ్వాసమే మనకు ఆయుధం కావాలి."
    
    ముగ్ధ మాటలు వింటున్న ఆ ముగ్గురిలో ఏదో మార్పు కన్పిస్తోంది, ఏదో ఒక కొత్త ప్రయోగానికి సంకల్పించిన శాస్త్రజ్ఞుల్లా వున్నారు వాళ్ళు చుట్టూ కూర్చున్న అబ్బాయిలు, అమ్మాయిలందరూ ఓ నలుగురు పిచ్చివాళ్ళని చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరిలో ఏమాత్రం చలనం లేదు.
    
    అక్కడ గాలిలోకూడా చలనం లేదు. గంభీరమైన నిశ్శబ్దం సాక్షిగా నిలిచింది.
    
    "ఓ.కే.ఒన్...టూ....త్రీ...చీటీలు విప్పండి" ముగ్ధ నోటి నుంచి ఆ మాట రాగానే మూసుకున్న ముగ్గురు కుడి అరచేతులూ తెరుచుకున్నాయి.

 Previous Page Next Page