అయిదవ ఖండము
ఋషులు :- 1,4. శ్రుత కక్షి 2. వసిష్ఠుడు. 3. మేధాతిథి 5. ఇరిమిఠి. 6,10 మధుచ్చందుడు. 7. త్రిశోక కణ్వుడు. 8. కుసీదుడు. 9. శునశ్శేపుడు.
1. ఇంద్రుడు శత్రు తిరస్కర్త శతక్రతు నరులకు ధనదాత. సోమపాయి. ఋత్విజులారా! అట్టి ఇంద్రుని విశేషముగ స్తుతించండి.
2. మిత్రులారా! హర్యశ్వుడు, సోమపాయి అగు ఇంద్రుని ప్రసన్నుని చేయు స్తోత్రములను గొప్పగా గానము చేయండి - "ప్రగాయత"
3. ఇంద్రా! మేము నీ మిత్రులము. నీకు అంతేవాసులము కాదలచి నిన్ను మాత్రమే స్తుతించుచున్నాము. కణ్వగోత్రజులు సహితము నిన్నే నుతింతురు.
4. ఇంద్రుడు ప్రసన్నస్వభావి. అతని కొరకు అభిషుత సోమమును, మా స్తుతులను సమర్పించుచున్నాము. తదుపరి స్తోతలు సోమమును పూజించుచున్నారు.
5. ఇంద్రదేవా! నీ కొరకు సోమము సిద్దమైనది. పవిత్ర కుశలపై ఉంచబడినది. రమ్ము. అచటికి చేరుము. సోమపానము చేయుము.
6. ఇంద్రుడు చక్కని రూపము వాడు. చక్కని పనుల వాడు. పాలు పితుకుటకని గోవును పిలుతుము కదా! అట్లే రక్షించుమని ఇంద్రుని నిత్యము ఆహ్వానించుచున్నాము.
7. వరదా! ఇంద్రా! సోమము అభిషుత మైనది. విచ్చేయుము. సేవించుము. ఆనందించుము.
8. ఇంద్రా! నీవు ఈశ్వరుడవు. సోమము సిద్దమైనది. చమస, గ్రహ పాత్రలందు నింపి ఉంచినాను. దానిని నీవు తప్పక సేవించుము.
9. ప్రతి ఆరంభమునకు, ప్రతి యుద్దమునకు బలశాలియగు ఇంద్రుని మమ్ము రక్షించు మని మిత్రులముగా ఆహ్వానించుచున్నాము.
10. స్తోతలగు ఋత్విజులారా! రండి రండి. త్వరగా రండి. కూర్చోండి. ఇంద్రుని గొప్పగా స్తుతించండి.
ఆరవ ఖండము
ఋషులు :- 1. విశ్వామిత్రుడు. 2. మధుచ్చందుడు. 3. కుసీదుడు 4. ప్రియమేధ 5,8. వామదేవుడు 6,9. శ్రుత కక్షి 7. మేధాతిథి 10. బిందుఋషి.
1. ఇంద్రా! నీవు ధనస్వామివి. స్తుతి యోగ్యుడవు. బలశాలివి. బలమున పిండిన సోమమును వెంటనే పానము చేయుము.
3. ఇంద్రుడు మావాడు. అతడు బలవంతుడు. గుణవంతుడు. వజ్రవంతుడు. అతనికి మహిమలు కలుగును గాత. అతని ద్యులోక సేవ ప్రసిద్దమగును గాక
4. గోపతి, యజ్ఞపుత్రుడు, పరిపాలకుడగు ఇంద్రుని అతనికి తెలియనట్లుగా గొప్పగా స్తుతించండి.
5. ఇంద్రుడు నిత్యము వర్ధిల్లువాడు. విచిత్ర గుణవంతడు. మిత్రుడు అతడు ప్రత్యక్షమగుటకు ఎట్టి కర్మలు ఆచరించవలెను? ఏ రీతిగా ప్రవర్తిల్లవలెను?
6. స్తోతలారా! ఎందరినో లెక్కచేయని వాడు, సకల స్తుతులందు వ్యాపించి ఉన్నవాడగు ఇంద్రుని మమ్ము రక్షించుటకు మాకు అభిముఖునిగ పంపండి.
7. మేధావి, అద్భుతుడగు ఇంద్రునాకు ప్రీతిపాత్రుడు, ఇంద్రుని అభిలషించు వాడగు సదసత్పతి దేవతను చేరుకున్నాను.
8. ఇంద్రా! ద్యులోకపు దిగువున ఉన్న దారులను తెలిసికొన్నాను. ఆ దారుల సకల లోకములను చేరుకున్నాను. ఆ మార్గమును, మేము ఉన్న చోటును యజమానులు తెలిసి కొందురు గాక.
9. ఇంద్రదేవా! శతక్రతూ! మాకు శుభములు, శుభములే కలిగించుము. బలము కలిగించు అన్నము ప్రసాదించుము. మాకు సుఖముల నిచ్చు ధనము నిమ్ము.
10. ఇది సోమము. దీనిని మేము సంస్కరించినాము. దీనిని స్వయంప్రకాశకులగు మరుత్తులు ప్రాతః కాలమున సేవింతురు. అశ్వినులు సహితము అప్పుడే సేవింతురు.
ఏడవ ఖండము
ఋషులు :- 1. ఇంద్రమాతలు దేవజామయ ఋషికలు 2. గోధుడు. 3. దధ్యంగుడు. 4. ప్రస్కణ్వుడు. 5. గోతముడు. 6. మధుచ్చందుడు. 7. వామదేవుడు. 8. వత్సుడు. 9. శునశ్శేపుడు. 10. వాతాయనుడు.
1. ఇంద్రుని స్తుతించు వారును, తమ కర్మఫలమును కోరువారును అగు ఇంద్రమాతలు ప్రత్యక్షమైనారు. వారు ఇంద్రుని ఉపాసింతురు. శౌర్య ధనమును పొందుదురు.
2. దేవతలారా! మీకు మేము ఎటువంటి హానియు తలపెట్టము. అతిగా పొగడి విసిగించము. మంత్రములందు ఉన్నట్లే కీర్తింతుము. కర్మలను ఆచరింతుము.
3. బృహద్గాయకుల వలనను, వెలుగు నడకల దధ్యంగ అధర్వణఋషి వలనను లోపము జరిగి ఉండవచ్చును. వాని నివారణార్ధము సవితా దేవుని స్తుతించుచున్నాము.
4. ఈమె ఉష. అందరిని అలరించునది. రాత్రులందు కనిపించినది. ఆమె దివి నుండి దిగి వచ్చినది. చీకట్లను తరిమినది. అశ్వినులారా! మిమ్ము మరింత స్తుతించుచున్నాను.
5. ఇంద్రుడు ఎదురు లేని వాడు. అతడు దధీచి వెన్నెముకతో అనేకమంది వృత్రులను వధించినాడు.
6. ఇంద్రా! ఈ కర్మకు విచ్చేయుము. సమస్త సోమములను సేవించుము. అన్నములను ఆరగించుము. ఆ బలముచే శత్రువులను తిరస్కరించుము.
7. వృత్రహంత ఇంద్రా! వడివడిగా మావద్దకు రమ్ము. మహా బలశాలుడవు అగుము. మాకు రక్షణ కలిగించుము.
8. ఇంద్రుని బలము ప్రఖ్యాతము. అతడు తేజస్వి. ఇంద్రుడు తోలు తిత్తిని వలె ద్యావాపృథ్వులను తనచేత పట్టినాడు.
9. ఇంద్రా! ఇదిగో సోమము. ఇది నీ కొరకు సిద్దమైనది. కపోతము గర్భము ధరించు కపోతిని కలుసు కొనునట్లు ఆ సోమమును, మా స్తుతులను కలసి కొనుము.
10. వాయువు మాకు రోగశాంతి కలిగించునట్టియు, సుఖములు ప్రసాదించునట్టి ఓషధులను ప్రసాదించును గాత. మా ఆయుష్యములను పొడిగించును గాక.
ఎనిమిదవ ఖండము
ఋషులు :- 1. కణ్వుడు. 2,3,9 వత్సుడు. 4. శ్రుత కక్షి 5. మధుచ్చందుడు. 6. వామదేవుడు 7. ఇరిమిఠి 8. సత్య ధృతి.
1. జ్ఞానియగు వరుణుడు, మిత్రుడు, ఆర్యమ రక్షణలుకల వానిని ఎంతటి వాడును హింసించజాలడు.
2. ఇంద్రదేవా! నీవు ఇంతకు ముందు వలెనే మాకు గోవులను ఇచ్చుటకు, అశ్వములను ఇచ్చుటకు, రథములు ఇచ్చుటకు, కీర్తి కరమగు ధనము ఇచ్చుటకు విచ్చేయుము.
3. ఇంద్రా! గోవులు నీకు సంబంధించినవి. యజ్ఞమును వర్ధిల్లచేయునవి. అవి పాలను చుక్కలుగా రాల్చుచు ధారలుగా ఈ బిందెను నింపును.
4. ఇంద్రదేవా! నీ పేర్లు అనేకములు. నిన్ను స్తుతించువారు అనేకులు. నీవు మేము చేఇస్న ప్రతి సోమయాగమునకు వచ్చినావు కదా! అప్పుడు మేము గోవులను ఇమ్మని కోరినాము.
5. సరస్వతి పావక. అన్నదాయక శక్తి. ధనదాత్రి. ఆ తల్లి అన్న సహితమై మా యజ్ఞములకు విచ్చేయును గాత.
6. ఏ మానవుడు ఈ ఇంద్రుని సంతృప్తుని చేయగలడు? అట్టి ఇంద్రుడు మా యజ్ఞమున సంతృప్తుడు అగును గాత. మాకు ధనములను అందించును గాక.
7. ఇంద్రా! రమ్ము రారమ్ము నీ కొరకు సోమమును అభిషనించినాము. నీ కొరకు కుశాసనము పరచినాము. ఆసీనుడవగుము. సోమపానము చేయుము.
8. మిత్రుడు, వరుణుడు, ఆర్యమ ఈ ముగ్గురి రక్షణలు ఎదురు లేనివి. మాకు వారి రక్షణలు లభించును గాక.
9. బహు ధనవంత, కర్మప్రేరక, హర్యశ్వవంత ఇంద్రా! మేము నీ వారలము అగుదుము గాక.
తొమ్మిదవ ఖండము
ఋషులు :- 1. ప్రగాథుడు. 2. విశ్వామిత్రుడు. 3,10. వామదేవుడు. 4,6. శ్రుతకక్షి. 5. మధుచ్చంధుడు. 7. గృత్సమదుడు. 8,9 భరద్వాజుడు.
1. ఇంద్రా! సోమము నీకు మహదానందము కలిగించును గాక. వజ్రధరా! మాకు ధనము లను ప్రసాదించుము. బ్రహ్మ ద్వేషులను హతమార్చుము.
2. ఇంద్రా! నీవు స్తవనీయుడవు. మేము సమకూర్చిన సోమమును సేవింపుము. నీవు మాదక సోమధారలచే తడుపబడువాడవు కదా! నీవు శుద్ది చేసిన అన్నమే మమ్ము చేరుచున్నది.
3. ఋత్విగ్యజమానులారా! ఇంద్రుడు సర్వదా మీ వద్ద ఉండును. మీచే యజ్ఞకర్మలు చేయించును. మేము అర్చించు ఇంద్రుడు దేవతలందు శూరుడు అగుచున్నాడు.