1. రాత్రిళ్ళు పుట్టు హరిద్ర, భ్రుంగ, ఇంద్రా వరుణి ఓషధులారా! మీరు కుష్ఠురోగపు అవయవమును, తెల్లని వెండ్రుకలను, పుండ్లను మాన్పి దానికి మీ వంటి రంగు కలిగించండి
2. ఓషదీ! నీవు పుండును, తెల్లని వెండ్రుకలను దూరము చేయుము. నష్టపరచుము. రోగికి ముందుండిన ఎరుపు రంగు కలుగును గాక. తెలుపూను మరల తాకకుండునట్లు దూరము చేయుము.
3. నీలి ఓషధీ! నీవు నలుపు నీవు పుట్టిన చోటు నలుపు. నిన్ను ఉంచిన పాత్ర నలుపు. కావున లేపనాదుల ద్వారా రోగి పుండును మాన్పుము. ఫలిత కేశములను వేరుచేసి నష్టపరచుము.
4. ఈ మంత్ర ప్రయోగమున ఎముకల మీద, చర్మము మీద, ఎముకలలోని, మాంసము నందలి కుష్టును నాశము చేయుచున్నాను. శత్రువుల చేత కల్పించబడిన కృత్య వలన ఏర్పడిన తెలుపును సహితము నాశనము చేయుచున్నాను.
మూడవ సూక్తము - 24
వినియోగము - పూర్వ సూక్తము వలెనే.
(నీల ఓషధి ప్రభావము చెప్పుచున్నాడు.)
1. నీల ఓషధీ! తొలుత నీవు సుపర్ణుడగు గరుడుని వద్ద 'పిత్త' రూపమున ఉంటివి. అప్పుడు 'ఆసురి' అను ఆడది గరుడునితో యుద్దము చేసి నిన్ను గెలిచినది. గెలిచి నీకు ఓషధి రూపము కలిగించినది.
2. ఆసురి తొలుత భేషజము చేసినది. అది కుష్ఠునందలి పుండును నాశనము చేయునది అయినది. దీనిని ప్రయోగించుట వలన పుండు మానినది. అచట ఏర్పడిన మచ్చపోయి మామూలు చర్మము ఏర్పడినది.
3. ఓషధీ! నీ తల్లి చక్కనిది. తండ్రి చక్కనివాడు. నీవు చక్కదనము తేగలదానవు. ఈ వ్యాధిగ్రస్తుని చక్కని రూపము వానిని చేయుము.
4. ఓషధీ! నీవు నేల నుండి ఆవిర్భవించిన దానవు. నల్లని దానవు. తెలుపూను పోగొట్టు దానవు. ఈ పుండును మాన్పుము. మచ్చ లేకుండ చేయుము. ముందటి రూపము కల్పించుము.
నాలుగవ సూక్తము - 25
వినియోగము:-
1. నిత్యజ్వరము, చలిజ్వరము, సంతతిజ్వరము, వేళ తప్పక వచ్చు జ్వరములకు ఈ సూక్తమును జపించవలెను.
2. గొడ్డలిని నిప్పులో కాల్చి నీళ్ళలో వేయవలెను. ఆ నీటితో రోగికి స్నానము చేయించవలెను.
1. అగ్ని దేవుడు కాలిన గొడ్డలితో నీళ్ళలో ప్రవేశించినాడు. బ్రతుకు దుర్భరము చేయు జ్వరమా! ఆ నీరు పడిన దేహమును వీడుము. అగ్నియందు హవిని హోమము చేయు విద్వాంసులు నీ జన్మము అగ్ని యందు కలిగినదని వర్ణించుచున్నారు.
(అగ్ని నుంచి వచ్చినావు. అగ్నిలో ప్రవేశింపుమని.)
2. దుఃఖకారక జ్వరమా! నీ గుణము ఉష్ణము. నీవు దేహ తపనుడవు. నీ పుట్టుక కట్టెల మంటలో జరిగినది. నీవు దేహమున పసుపు రంగును చేర్చువాడవు. అందుకే నీ పేరు "రూఢు" అయినది. కావున నీవు అగ్నిని తెలిసిన వాడవు. వేడి నీళ్ళు పడిన మా దేహమును విడువుము. అగ్నితోనే వెడలి పొమ్ము.
3. జ్వరమా! నీవు బయటి తాపమవు. లోపలి తాపమవు. పాపులను శిక్షించు వరుణుని పుత్రుడవు.
నీవు దేహమునకు పసుపు రంగు కల్పింతువు. అందుకే నీ పేరు "రూఢు" అయినది. నీవు అగ్నిని తెలిసిన వాడవు. వేడినీళ్ళు పడిన దేహమును విడువుము. అగ్నితోనే వెడలి పొమ్ము.
4. చలితో వచ్చు జ్వరమునకు నమస్కారము. చలి తగ్గి వచ్చు జ్వరమునకు నమస్కారము. రోజు విడిచి రోజు వచ్చు జ్వరమునకు నమస్కారము. రెండు రోజులకు, మూడు రోజులకు, నాలుగు రోజులకు, వచ్చు జ్వరమునకు నమస్కరించుచున్నాను.
ఐదవ సూక్తము - 26
వినియోగము :-
1. ఖడ్గాది సంపూర్ణ శస్త్ర నివారణకు హోమమునందు.
2. దాడి చేయుటకు వచ్చు శత్రువును చూచి జపించుట.
3. దుశ్శకునము, కాకుల మైథునము, అద్భుత దర్శనములందు జపించుట.
4. విజయ స్వస్త్యయన కర్మమున ఘ్రుతాహుతి ఇచ్చి ఖడ్గ శస్త్రాదులను సంపాతిత, అభిమంత్రణము చేయవలెను.
5. విజయము కోరువాడు ఈ సూక్తమును జపించి, ముఖము తుడుచుకొని రాత్రిపూట పడుకొనవలెను. ఉదయము లేచునపుడు దీనిని జపించి మూడు అడుగులు వేసి లేవవలెను.
1. దేవతలారా! మీ అనుగ్రహమున దూరము నుండి శత్రువు మా మీదకు ప్రయోగించు ఆయుధము మాకు తగులక దూరమున పడిపోవును గాక.
శత్రువులారా! మీరు వేయు రాళ్ళు మున్నగునవి మాకు దూరమున పడు గాక.
2. ఆకసమందు దర్శన మిచ్చు సూర్యుడు మాకు మిత్రుడు అగును గాక. ఇంద్రుడు, భగుడు సవిత, చిత్రరాధుడు మాకు మిత్రులు అగుదురు గాక.
3. సూర్యకిరణము జలములను పీల్చగా అకాల వర్షము కలిగించక మేఘ మండలమున నిలుపు పర్జన్యుని, సప్త మారుతముల తేజస్సు సూర్య సమానమగును. మీరందరు మాకు బహు సుఖములను విశాల గృహములను ప్రసాదించండి.
4. దేవతలారా! శత్రువుల ఆయుధములు మా అమీద పడనీయకండి. మాకు మా సంపాతమునకు సుఖములు కలిగించండి.
ఆరవ సూక్తము - 27
వినియోగము:-
1. అయిదవ సూక్తము వలెనే.
2. మార్గమందు శుభమునకు నాలుగవ మంత్రముచే పాదములకు అభిమంత్రించి ఆయుధము అందించవలెను.
1. మనకు కనిపించు సర్పములందు ఇరువది యొక్క జాతులు ఉన్నవి. ఆ సర్పములు దేవతాసములు. అవి భూలోకమునకు ఆవల నాగలోకమున ఉండును. వానికి మావి వలె చుట్టుకున్న కుబుసములుండును. ఇతరులకు హాని తలపెట్టువారి, యుద్దమున నిలిచిన శత్రువుల నేత్రములను కుబుసములతో మూసి వేయుదుము.
2. పినాకము శివుని విల్లు. శత్రువు అట్టి ఆయుధములు ధరించి ఉన్నారు. పరసేనను గడగడలాడించుచున్నారు. అట్టి శత్రుసేన భయపడి నలువైపులకు పారిపోవలెను. అట్టి శత్రుసేన మరల కూడినను వారికి మతి భ్రమించును గాక. ధన విహీనులు అగుదురు గాక.
1. అగ్ని రోగనాశకుడు. హింసక రాక్షస సంహారకుడు. స్వర్గనివాసి. నోటి దురుసుదనము, హింసాతత్త్వము గలవారిని, ఆతురత గల వారిని, రంద్రాన్వేషులను, బాధలు కలిగించు వారిని, రాక్షసులను అగ్ని భస్మము చేయుచు ఉద్విగ్నుని వద్దకు వచ్చుచున్నాడు.
3. ఒకతి శపించునది. ఒకతి పాపమే మూలముగా గలిగి పాపములను ఆచరించునది. ఒకతి పుట్టిన బిడ్డ రక్త రసమును పీల్చునది. వీరిలో ఒకర్తె తన సంతానమును, మా శత్రువుల సంతానమును మ్రింగును గాక.
వ్యాఖ్య - సాయణుడు వీరిని రాక్షసిలుగా చెప్పినాడు. ఇవి క్రిములు కావచ్చునని నా ఆలోచన. క్రిములే తమ సంతానమును నాశము చేసిన క్రిములుండని ఆదర్శ ఆరోగ్య లోకము ఉండును కదా!
4. యాతుధాని - యాతనలు కలిగించు స్త్రీ - తన సంతానమును తినును గాక. తన అక్క చెల్లెళ్ళను తినును గాక. తన పౌత్రుల సంతానమును తినును గాక. తదుపరి ఒకరి జుట్లు ఒకరు పట్టుకొని కొట్టు కొని వారు చత్తురు గాక. దానమునకు అడ్డువచ్చు యాతుధానులు ఒకరిని ఒకరు కొట్టుకొని చత్తురు గాక.