Previous Page Next Page 
సంకల్పం పేజి 6

  

      చైర్మెన్ ఛాంబర్ అయిదో అంతస్తులో ఉంది.
   
    "ఈయన మిస్టర్ వికాస్.... విశాఖ నుంచి వచ్చారు...." చైర్మన్ పి.ఏ.కి అప్పగించేసి, తను వెళ్ళిపోయాడు.
   
    పి.ఏ.కి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు వికాస్.
   
    అప్పటికి సమయం సరిగ్గా 10-50 నిమిషాలైంది.
   
    వికాస్ గుండెల్లో ఏదో ఆందోళన, వళ్ళంతా సన్నగా వణుకుతున్నట్లనిపించింది. గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుగా వుంది.
   
    ఒక గ్లాసు మంచినీళ్ళు తెప్పించుకుని తాగాడు. అయినా ఏదో దాహం....
   
    ఇంటర్ కమ్ మోగింది పి.ఏ. ఎత్తాడు.
   
    "ఎస్...సర్.... అలాగే సార్... ఓ.కే. సార్..." ఫోన్ పెట్టేసి....
   
    "ఇంపార్టెంట్ మీటింగ్ లో వున్నారు.... ఒక్క ఫిఫ్టీస్ మినిట్స్ వెయిట్ చెయ్యాల్సి వుంటుంది...." చెప్పాడు పి.ఏ.
   
    "ఓ.కే.....ఇట్సాల్ రైట్...."
   
    అక్కడ ఏ.సి. చప్పుడు తప్ప మరే శబ్దమూ లేదు.
   
    ఏ.సి.చల్లగా చక్కగా తాకుతోంది.
   
    అయినా వికాస్ కి ఉక్కగా వుంది....జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఉద్విగ్న క్షణాలు.....
   
                                *    *    *    *    *
   
    ప్రతీ రోజూ లాగానే ఆ రోజు కూడా నది గట్టుకెళ్ళాడు వికాస్.
   
    రావిచెట్టు దగ్గర నిలబడి, నిక్కరు విప్పుకుంటూ, ఎదురుగా కన్పించిన దృశ్యానికి భయపడి కెవ్ మని కేకేసుకుంటూ వూర్లోకి పరుగు పరుగున వచ్చాడు.
   
    అతని వళ్ళంతా చెమట్లు పట్టేశాయి. సరాసరి ఇంట్లోకెళ్ళి తల్లి దగ్గర నిలబడ్డాడు.
   
    "అమ్మా.... పెద్ద....క్క..."
   
    అంతే... ఒక్క క్షణంలో ఇల్లంతా శోకాలతో నిండిపోయింది.
   
    "ప్రపంచంలో పెళ్ళి కాలేని వాళ్ళంతా.... ఇలాగే నూతుల్లోపడి చస్తున్నారు.... ఆ చచ్చేదేదో.... పెళ్ళి లేకపోతే బతకలేను నాన్న.... అని చెప్తే....ఆ పీక పిసికేసి నేనే చంపేసేవాణ్ణి కదా..... ఇది చచ్చి.... ఖర్చు పెంచింది....." శవాన్ని ఎత్తుకొని వచ్చి.
   
    గుమ్మం ముందు పెడుతూ తండ్రి అన్న మాటలవి.
   
    అప్పటికే తండ్రంటే ఆ వూళ్ళో వారందరికీ అసహ్యం. ఆ విషయం పెద్దక్క చావు దగ్గర బయటపడింది.
   
    డబ్బులిస్తేనేగానీ శవాన్ని మోయడానికి ఎవరూ రారు. తంతే దమ్మిడీ లేదు ఇంట్లో.
   
    ఆఖరికి పాడెని రెండో అక్క, మూడో అక్క వెనక మొయ్యగా, నాన్నొక్కడూ ముందు మోశాడు. కర్రలకీ, నిప్పుకీ ఖర్చులేదు...
   
    శవదహనం అయిపోయింది.
   
    అంతకు రెండ్రోజుల ముందు, పెద్దక్క దగ్గరే పడుకొన్నాడు వికాస్.
   
    ఏదో ఏడుపు వినబడితే మెలుకువొచ్చింది వికాస్ కి.
   
    "అక్కా! ఏడుస్తున్నావా...." తన నోరును మూసేసి మెల్లగా-
   
    "ఒరే తమ్ముడూ.... నువ్వు పెద్దయ్యేసరికి ఏ అక్కా నీకుండదురా. ఇక్కడుంటే నువ్వూ మాలాగే ఛస్తావురా....నువ్వు మావయ్య దగ్గర కెళ్ళిపో.....అక్కడ రోజూ నీకు అన్నం వుంటుంది.... ఇలా పస్తులుండవురా...."
   
    "మూడు పూట్లా అన్నం వుంటుందా...." అమాయకంగా అడిగాడు వికాస్.
   
    అక్క చచ్చిపోయిన వారం రోజుల తర్వాత ఓ అర్ధరాత్రి-
   
    ఆ రోజు తండ్రి చాలా ఆలస్యంగా వచ్చాడు.
   
    "ఇదిగో బియ్యం.... అన్నం వండు...."
   
    వెంటనే వండింది తల్లి.
   
    "పిల్లల్ని లేపుతాను..... రెండు రోజుల్నించి ఒక్క మెతుకు లేదు."
   
    పిల్లలవేపు వెళ్ళబోతున్న తల్లిని, తండ్రి గట్టిగా పట్టుకుని లాగి-"ఒసేయ్ వెర్రిదానా.... ఈ బియ్యం కొన్నవి కాదే.... ఎత్తుకొచ్చినవి......ఎందుకెత్తుకొచ్చాననుకున్నావ్.... ఆకలి... ఆకలి... ముందు ణ యాకలి తీర్చుకోనీ..... తర్వాత... మిగిల్తే నువ్వు తిను.... తర్వాతే.... వాళ్ళు......" గిన్నెడన్నమూ లాక్కుని తినేశాడు.....ఒక్క మెతుకు వుంచలేదు.
   
    తండ్రా! రాక్షసుడా!
   
    తన గుడ్లను తనే తినే పాము విశ్వనాధం.
   
    ఆకలి... ఆకలి.... ఆకలి.... ఆకలి.... ఆకలి...
   
    అప్పుడు రాత్రి ఎంతయిందో తెలీదు వికాస్ రెండో అక్క దగ్గర్నించి లేచి బయటికొచ్చేశాడు.
   
    అప్పుడు వాడికి ఒక్కటే జ్ఞాపకం వుంది. పెద్దక్క కళ్యాణి చెప్పిన మాట.....
   
    మావయ్య దగ్గర మూడుపూటలా అన్నం దొరుకుతుంది....
   
    మూడు పూటలా అన్నం దొరుకుతుంది.
   
    అన్నం దొరుకుతుంది.
   
                          *    *    *    *    *

    "చైర్మెన్ రమ్మంటున్నారు సర్....." పి.ఏ. చెప్పాడు లేచి చైర్మెన్ ఛాంబర్ డోర్ మీద నెమ్మదిగా చెయ్యి వేశాడు. ఆ డోర్ చల్లగా వుంది.
   
    "గెటిన్..." ఆ గొంతు గంభీరంగా వుంది.
   
    "వికాస్ ఫ్రమ్ విశాఖ..."
   
    ఆ ఛాంబర్ విశాలంగా వుంది. క్రింద అతి ఖరీదైన వెల్వెట్ కార్పెట్.....అర్ధచంద్రాకారపు టేబిల్ వెనుక చైర్మెన్ భానోజీరావు.....
   
    దృఢంగా పొడవుగా ఉన్నాడాయన.... తెల్లటి షర్టూ, ఫేంటు....సింపుల్ గా వున్నారు.
   
    దూరంగా రెండు సోఫాసెట్లు... మధ్య టీపాయ్..
   
    "నువ్వీ కంపెనీలోకొచ్చి ఎనిమిది నెలలైంది కదూ...." సూటిగా వికాస్ వేపు చూస్తూ అడిగాడాయన.
   
    "ఎస్....సర్...." నిలబడే వున్నాడు వికాస్.
   
    "డిజైనింగ్ డివిజన్లో వుంటే నీ కెరీర్ బాగుంటుందని అనుకుంటున్నావా నువ్వు...."
   
    "ఎస్.... సర్...."
   
    "మరి... మీ ఏరియా మానేజర్ని ప్రొసీడ్ కాలేదా....?"
   
    "ట్రైనింగ్ పీరియడ్ అయ్యాక చూద్దామన్నారు."
   
    "ఎదిగేవాళ్ళు తొందరపడకూడదు...." అని ఆగి "కూర్చో" అని అన్నాడాయన.
   
    "దేశంలో మనకెన్ని యూనిట్లున్నాయో తెల్సా?"
   
    "తెల్సు సార్! ఇరవై ఐదు"
   
    "ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారో తెల్సా?"
   
    "దాదాపు ఐదు లక్షలమంది"
   
    "అందులో నీలాంటివాళ్ళు ఎంతమంది ఉంటారనుకుంటావ్?"
   
    "చాలామంది ఉండొచ్చు."
   
    "మరి వారందరికీ అవకాశాలు ఒక్కసారే రావాలంటే కుదరదు కదా?"
   
    "ఎస్....సర్"
   
    "నీ జీవితంలో నువ్వు పనిచేసే కంపెనీ చైర్మెన్ని నువ్వెప్పుడైనా కలుసుకోగలవని వూహించావా?"
   
    "లేదు."
   
    "మరి ఈ అవకాశం నీకే ఎలా వచ్చింది?"
   
    "తెలీదు."
   
    "నా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి నా దగ్గర డిటైల్స్ వుంటాయన్న విషయం నీకిప్పటికే అర్ధమైందనుకుంటాను."
   
    తనెక్కడివాడు.... ఇంతకు పూర్వం ఏ పని చేశాడు? క్వాలిఫికేషన్స్ ఏమిటి? ఇలాటి వివరాలు ఎందుకడగలేదో యిప్పుడు అర్ధం అయ్యింది వికాస్ కి.
   
    "ఇమ్మీడియట్ గా నీకు ప్రమోషన్ ఇస్తాను. సంస్థకేం చేస్తావ్?" అడిగాడు భానోజీరావు.
   
    భానోజీరావు నుంచి ఆ ప్రశ్న రాగానే, జవాబేం చెప్పాలో ఆలోచనలో పడ్డాడు ఒక్కక్షణం.
   
    "సేల్స్ ని టార్గెట్ దగ్గరకు తీసికెళ్తాను..." స్థిరంగా చెప్పాడు వికాస్.
   
    "ప్రతీ ఎంప్లాయ్ చేసే పనే అది. అదనంగా నువ్వేం చేస్తావ్?"
   
    ఆలోచనలో పడ్డాడు వికాస్.
   
    "ఇంకో ప్రశ్న.... మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన జింఖానా 1000 మీద నీ అభిప్రాయం?"
   
    "డోంట్ థింక్ అదర్వైజ్ సర్! ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్" తన మాట వినగానే చైర్మెన్ షాక్ తిని మండిపడతాడనుకున్నాడు వికాస్.
   
    చైర్మెన్ ఆ మాటకు షాక్ తిన్న మాట నిజమే. కానీ యిలాంటి వాళ్ళని చాలామందిని చూసిన వ్యక్తి- తన కొత్త ప్రోడక్ట్ ప్లాపన్న విషయం మొదటి నెలలోనే గ్రహించాడాయన- 'కూల్ ఆపరేషన్' ఆయన బిజినెస్ లో ఏకైక టెక్నిక్!
   
    సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్ కి ఫస్ట్ క్వాలిఫికేషన్ అదే!
   
    "మన జింఖానా 1000 ఫులప్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందో నీ దగ్గరేదైనా ఐడియా ఉందా?"

 Previous Page Next Page