Previous Page Next Page 
సంకల్పం పేజి 5

   

     "ఏమ్మా.... బావగారు ఇంట్లోలేరా....?" వచ్చి అరుగుమీద కూర్చున్నాడు.
   
    పిల్లలందరూ వచ్చి పలకరించారు. బండిలోంచి అరబస్తా బియ్యపు మూటను తెచ్చి, వరండాలో పెట్టి బండివాడు వెళ్ళిపోయాడు.
   
    ఆ బియ్యపు మూటను చూడగానే యింట్లోవాళ్ళకి సత్తువ వచ్చి నట్టయింది.
   
    అందుక్కారణం నిన్నరాత్రి ఆ యింట్లో వాళ్ళెవరూ భోంచెయ్యలేదు!
   
    గబగబా బియ్యం తీసి ఎసరు పెట్టింది విశ్వనాధం భార్య కామేశ్వరి. కామేశ్వరి తమ్ముడు చయనులు.
   
    చిన్నప్పుడే పట్నం వెళ్ళిపోయాడు. ఏం పనిచేస్తాడో ఎవడికీ తెలీదు. అతను చెయ్యని పని కూడా లేదు.
   
    అప్పుడప్పుడు తుఫానులా వస్తాడు. అక్కా, బావా, పిల్లలకు చేతనైన సహాయం చేసి వెళ్ళిపోతాడు.
   
    "పుట్టినూరని వుండటం తప్ప.... ఇక్కడేం వుందక్కా... పట్నం వచ్చేయండి... ఎన్నిసార్లు పోరుతున్నా బావ వినడు..... నువ్వు రావు" నిష్టూరంగా అన్నాడు చయనులు.
   
    "నేనేం చేసేదిరా.... ఆయన మనమాట వింటేనా....? పెద్దోళ్ళు ముగ్గురూ పెళ్ళిళ్ళకొచ్చారు... పరిస్థితా అంతా దరిద్రంగా వుంది.... రెండో సంబంధమైనా చూడరా.... పెద్దదానికి చేసేద్దాం" ఆర్తిగా అందావిడ.
   
    "రెండో పెళ్ళివాడికైనా ఎంతో కొంత ఇచ్చుకోవాలి గదా..... చూద్దాం....ఏం జరుగుతుందో?"
   
    అదే సమయంలో విశ్వనాధం లోపలికొచ్చాడు.
   
    "ఏం రా చయనులూ! ఎక్కడినుంచి రాక' పలకరించాడు.
   
    "మామూలే ఎలా వున్నావ్ బావా?" ఆప్యాయంగా పలకరించాడు చయనులు.
   
    ఇద్దరూ భోజనానికి కూర్చున్నప్పుడు-
   
    "ఎక్కడా సంబంధాలు దొరక్కపోతే పెద్దదాన్ని నీకిచ్చి పెళ్ళి చేసేస్తాను. తర్వాత నీ ఇష్టం."
   
    "నాకా.... వున్న దాంతోనే వేగలేక చస్తున్నాను. దీన్ని కట్టుకుంటే అంతే మరి" జోగ్గా అన్నాడు చయనులు.
   
    "పరిహాసానికి కాదురా చయనులు... పెళ్ళి కాదన్న బెంగతో అది ఏ నుయ్యో, గొయ్యో చూసుకుందనుకో అప్రతిష్ట దానికంటే ఇదే ఉత్తమం" సీరియస్ గా అన్నాడు విశ్వనాధం.
   
    ఆ మాటకు కామేశ్వరి కళ్ళొత్తుకుంది.
   
    చయనులు ఏం మాట్లాడలేకపోయాడు.
   
    ఆ మాటను పక్కగదిలో కూర్చున్న పెద్దకూతురు కళ్యాణి విందన్న విషయం మాట్లాడుకుంటున్న అక్కడివాళ్ళకు తెలీదు.
       
    అదే సమయంలో వూళ్ళోంచి పరుగు పరుగున వచ్చాడు వికాస్.
   
    అభిమానంగా మేనమామ పక్కకెళ్ళి కూర్చున్నాడు.
   
    "వీన్నేం చేద్దాం అనుకుంటున్నావ్ బావ?"
   
    "వీడా... చెడపుట్టాడు. వదిలేసిన ఆంబోతులా వూరంతా తిరగడం, రావడం... చదువా వంటబట్టలేదు. ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు?" విసుక్కున్నాడు విశ్వనాధం.
   
    "నాతో పంపించెయ్యకూడదూ....నాతోనే వుంటాడూ" అక్కవేపు చూస్తూ అడిగాడు చయనులు.
   
    "ఒక్కగానొక్క నలుసు..... మరి బతకలేకపోతే.... నువ్వే దిక్కు" అంది కామేశ్వరి నిర్లిప్తంగా.
   
    "అమ్మా! మావయ్యతో వెళ్తానే...." గోముగా అడిగాడు వికాస్.
   
    "ఈసారి వచ్చినప్పుడు వెళ్దూగానిలే" తల్లి అనడంతో వూరుకున్నాడు వికాస్.
   
    మధ్యాహ్నం భోజనాలయ్యాక చయనులు గుడి అరుగుమీద కూర్చుని బీడీ కాల్చుకుంటున్న సమయంలో-
   
    "పట్నంలో నువ్వేం చేస్తావ్ మావయ్యా?" అని ఆసక్తిగా అడిగాడు వికాస్.
   
    "నేనా....ఏ పని దొరికితే ఆ పని చేస్తాను.....దాన్ని బిజినెస్ అంటార్లే."
   
    "బిజినెస్ అంటే?"
   
    "బిజినెస్ అంటే వ్యాపారం..... ఎంత చిన్నదయినా వ్యాపారమే చెయ్యాలిరా. ఈ ఉద్యోగాలు లాభం లేదు. నేను చూడు.... ఏ సీజన్ కి ఆ సీజన్ వ్యాపారం ఒరిస్సాలో చింతపండు చవక. అక్కడ కొంటాం..... ఇక్కడమ్ముతాం. చింతపిక్కల సీజన్ లో చింతపిక్కల వ్యాపారం. బెల్లం సీజన్ లో చెరుకు వ్యాపారం. దేనికీ సీజన్ లేదనుకో పాత రేడియోలు కొంటాం- ఎవడి చేతో బాగు చేయిస్తాం అమ్ముతాం. తలచుకుంటే ఎన్నో బిజినెస్ లు చెయ్యొచ్చురా కష్టపడటం మనొంతు. కష్టం వున్నచోట అదృష్టం అదే వుంటుందిరా మీ నాన్నలా బేవర్సులా వుంటే ఇల్లు మట్టయిపోద్ది తప్ప మరేం జరగదు."
   
    జీవితంలో మొట్టమొదటిసారి వ్యాపారం గురించి చెప్పినవాడు మేనమామ చయనులు.
   
                      *    *    *    *    *

   
    హోటల్ జయా ఇంటర్నేషనల్.
   
    రూం. నెం. 105.
   
    స్నఫ్ కలర్ తెల్లగీతల షర్ట్, బ్రౌన్ కలర్ ఫేంట్. అద్దంలో రెండు మూడుసార్లు చూసుకున్నాడు- టై సర్దుకున్నాడు.
   
    స్టేషన్కొచ్చి రిసీవ్ చేసుకున్న వ్యక్తి....
   
    "సరిగ్గా పదిన్నరకొస్తాను. చైర్మెన్ తో మీ అపాయింట్ మెంట్ పదకొండు గంటలకు" అని చెప్పి వెళ్ళాడు.
   
    ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాడు.
   
    సరిగ్గా పదిన్నరకు కాలింగ్ బజర్....
   
    "వెళ్దామా సార్..."
   
    "ఐయామ్ రెడీ"
   
    బయటికొచ్చారు ఇద్దరూ.
   
    పోర్టికోలో జింఖానా 1000కారు.
   
    తన కంపెనీ తయారుచేసిన లేటెస్ట్ కారులో చైర్మెన్ ని కలవడానికి వెళ్తున్నాడు.
   
    ఊహించని అనుభవం.
   
    ఎక్సయిటింగ్ గా వుంది వికాస్ కి.
   
    "మీరు హైద్రాబాద్ రావడం ఇదే మొదటిసారనుకుంటాను" ఆ వ్యక్తి అడిగాడు.
       
    "అవునండి"
   
    "అయితే ప్రస్తుతానికి మీ గైడ్ ని నేను"
   
    నవ్వాడు వికాస్!
   
    కారు అబిడ్స్ చౌరస్తానుంచి పబ్లిక్ గార్డెన్స్ దగ్గరకొచ్చింది.
   
    "ఇదే పబ్లిక్ గార్డెన్స్.... ఆ పక్కన అసెంబ్లీ.....ఎదురుగా కొంచెం ముందుకెళ్తే రవీంద్రభారతి- కుడిపక్కనే ఫేమస్ బిర్లామందిర్, దీన్నే లిబర్టీ సెంటర్ అంటారు.....ఇదే టాంక్ బండ్.... అటు ప్రక్క ఆ కోలాహలం చూశారు కదా.... మునిగిపోయిన బుద్దుడు విగ్రహాన్ని తీస్తున్నారు.... ఇవ్వన్నీ ఎన్టీఆర్ టైంలో ప్రతిష్టించిన విగ్రహాలు ...." చెప్పుకుపోతున్నాడు గైడ్.
   
    వికాస్ అటూ ఇటూ చూస్తూ వింటున్నాడు.
   
    టాంక్ బండ్ దాటి, కారు రాష్ట్రపతి రోడ్ వేపు వెళ్తోంది. అయిదారు మలుపులు.
   
    అక్కడ విశాలమైన ఓపెన్ ప్లేస్.
   
    జింఖానా మోటార్ కంపెనీ.
   
    మెయిన్ గేటుకి ఎడం ప్రక్కన సెక్యూరిటీ రూం. కుడిప్రక్కన వెహికల్స్  పార్కింగ్ ప్లేస్.
   
    కారు పార్కు చేశాక సెక్యూరిటీ రూం కొచ్చారు ఇద్దరూ.
   
    సెక్యూరిటీ గార్డు వికాస్ పేరు రాసుకున్నాక, విశాఖ నుంచి ఏం పనిమీదొచ్చారు. అని అడిగాడు.
   
    "చైర్మెన్ పిలిపించారు...." పక్కనున్న వ్యక్తి చెప్పడం, ఆ గార్డు ముఖమెత్తి వికాస్ ని విస్మయంగా చూశాడు. కొన్ని నెలల్లో ఆ గార్డు రిటైరవబోతున్నాడు....బహుశా అతని సర్వీస్ లో అతనెప్పుడూ అంత విస్మయపడి ఉండడు.
   
    వికాస్ కళ్ళల్లోకి చూశాడు అప్రయత్నంగా గార్డ్.
   
    "ఆ అబ్బాయి కళ్ళు చూశావా.....చాలా అందంగా వున్నాయి.... చాలా అదృష్టవంతుడు ...."ఉర్దూలో ప్రక్కనున్న వ్యక్తితో అన్నాడు గార్డు.

    సెక్యూరిటీ రూంలోంచి బయటికొస్తూ "ఏవంటున్నాడతను...." ప్రక్కనున్న వ్యక్తిని అడిగాడు వికాస్. ఉర్దూలో అతనేవన్నాడో చెప్పాడు.
   
    వికాస్ పెదిమల మీదకో నవ్వొచ్చింది.
   
    మెయిన్ బిల్డింగ్ ఏడంతస్తుల భవనం. దాని కానుకుని వెనకపక్క అయిదెకరాల స్థలం..... అక్కడన్నీ షెడ్లే వున్నాయి.
   
    అటూ, ఇటూ అశోకవృక్షాలు, ఎడం ప్రక్క అందమైన గార్డెన్. చాలా నీట్ గా, ఆహ్లాదంగా వుంది ఆ ప్రదేశమంతా, మెయిన్ హాల్లోకి నడిచారు. ఒక ప్రక్క రిసెప్షన్. రిసెప్షన్ కి కొంచెం దూరంలో 'లిఫ్ట్'.

 Previous Page Next Page