ఆయన తెల్సి అడుగుతున్నాడో, టెస్ట్ చెయ్యాలని అడుగుతున్నాడో అర్ధం కాలేదు వికాస్ కి. కానీ తన అభిప్రాయం తను ధైర్యంగా, స్పష్టంగా చెప్పాలనుకున్నాడు.
కానీ ఆ అభిప్రాయమే తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఊహించలేదు వికాస్.
తన జవాబు....
ఒక ఛాలెంజ్ అవుతుందని,
ఒక రిస్క్ అవుతుందని,
ఒక టాస్క్ అవుతుందని,
ఊహించలేదు వికాస్.
"జింఖానా 1000 ప్రొడక్షన్ ఆపేస్తేనే మంచిది.....లాస్ వస్తున్న ప్రొడక్ట్ కి ప్రొడ్యూస్ చేస్తే కంపెనీ అతి త్వరలో సిక్ యూనిట్ అవుతుంది.
జింఖానా 1000 కారు ద్వారా, ఆటోమోబైల్ ఇండస్ట్రీకి కింగ్ గా నిలవాలనుకున్నాడు భానోజీరావు కానీ ఆశించిన రిజల్ట్ రాలేదు.
దాన్నెలాగైనా నిలబెట్టాలని ఆలోచన.
దానికోసం అహోరాత్రులు ఆలోచిస్తున్నాడాయన.
వికాస్ మాటకి ఆయన ప్రసన్నమైన ముఖంలో కొంత చికాకు తొంగి చూసింది. దాన్ని గమనించే స్థితిలో లేడు వికాస్.
"మా కంపెనీ ప్రెస్టేజీయస్ కార్ జింఖానా థౌజండ్.... ఆ విషయం నీకు తెల్సా?" కోపాన్ని అణుచుకుంటూ అడిగాడాయన.
ఒకప్పుడు ఒంటరివాడైన భానోజీరావు తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి, ప్రతి వ్యాపారపు ఎత్తులోనూ తన నిర్ణయం విజయవంతం కావటం మూలంగా సహజసిద్దమైన హ్యూమన్ ఇగో, ఆయన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. విజయాల పరంపరలో ఎన్నో ఎత్తులకు ఎదిగిన వ్యక్తి అహాన్ని అనుభూతించే అర్హత ఉంటుంది చాలామంది విషయంలో సినిమా దర్శక, నిర్మాత అలాగే వారిది అపజయమైనా, అదే చెబితే ఆగ్రహిస్తారు-హర్ట్ అవుతారు. తన అపజయాన్ని సైతం విజయంగానే ఇతరులు అభినందించాలానే ఆత్మవంచనకు లోనవుతారు. ఇదే ఇప్పుడు జరిగింది.
"ఐనో సర్... దాన్ని క్రియేట్ చేసిన డిజైనర్ కి మీరెంతిచ్చారో తెలుసు. దాని లైసెన్స్ కోసం ఏ స్థాయిలో ఫైనాన్స్ మినిస్టర్ తో చెప్పించారో తెలుసు. టయోటా కంపెనీ కోపరేషన్ తో ఇంటర్నేషనల్ మార్కెట్లోకి జింఖానా థౌజండ్ ని నిలబెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు తెలుసు. దాన్ని రిలీజ్ చేసే ముందు పదికోట్ల మీడియా మీద ఖర్చు చేశారని కూడా తెలుసు.....మీరెన్ని చేసినా ఈ జనరేషన్ కస్టమర్ కి ఏం కావాలో తేల్చుకోకుండా చేశారు. ఇదే కేపిటల్ నా దగ్గరుంటే- నా కారు మోటార్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా వుండేది"
ఏదో చెప్పబోతూ ఆ మాట విని టక్కున ఆగిపోయాడు వికాస్.
"స్టాపిట్...." భానోజీరావు గొంతులో వచ్చిన మార్పును గమనించాడు వికాస్.
"ఇన్ని తెలిసినవాడివి.... నాదగ్గర పదిహేనువందల రూపాయలకు ఎందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది?" ఆ అడగటంలో ఎగతాళి ధ్వనించింది వికాస్ కి.
"టైమ్ రాక" టక్కున చెప్పాడు వికాస్.
"చూడు మిస్టర్ వికాస్-చేతకానివాడు టైమ్ కోసం చూస్తాడు- తెలివైనవాడు తన టైమ్ అందుబాటులోకి తెచ్చుకుంటాడు. ఇందులో నువ్వేం తరహాలోకొస్తావో నీకు తెల్సా?"
"నేనే తరహాలోకొస్తానో నాకు తెల్సు.... కానీ..."
"కానీ లేదు, గీనీ లేదు.... ఒక నోవెల్ ప్రొడక్ట్ ని ఇన్వెంట్ చెయ్యడం, మానుఫాక్చర్ చెయ్యడం, దాన్ని మార్కెట్లో నిలబెట్టడం ఎంత కష్టమో నీకు తెలీదు. దాన్ని చాలా ఈజీ అనుకుంటున్నావ్ కదూ" తీసి పారేస్తున్నట్టుగా అన్నారాయన.
"నాకు కష్టం కాదు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది...." ఎక్కడలేని ధైర్యం వచ్చింది వికాస్ కి.
"అయితే నీదైన నీ ప్రోడక్ట్ ని రెండేళ్ళలో నువ్వు మార్కెట్లోకి తేవాలి. సక్సెస్ చేయగలగాలి.... చెయ్యగలవా... ఛాలెంజ్"
తెల్లటి పాలరంగు భానోజీరావు చుబుకం ఎర్రగా మారిపోయింది.
మానవ మనస్తత్వం విశ్లేషణకు అందనిది. ఒక్కోసారి ఎంతో పెద్ద అవమానానైనా తేలిగ్గా తీసుకోవటం - ఎంత పెద్ద విమర్శనైనా స్పోర్టివ్ గా తీసుకోవటం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆ తరహా వ్యక్తుల మధ్య సమస్య చల్లబడిపోతుంది - ఘర్షణ చచ్చుబడిపోతుంది. ఇంకొన్నిసార్లు అభిజాత్యం అహం ఎక్కువ ఉన్న వ్యక్తుల మధ్య అతి చిన్న మాటే గాయపారుస్తుంది. గంభీరతను సంతరించుకుంటుంది. ఛాలెంజ్ కి దారి తీస్తుంది. అప్పుడే చిన్న సంఘటన, ఏ ప్రాముఖ్యతా వుండని అతి చిన్న సంఘటన పెద్ద మలుపులకి హేతువవుతుంది. భానోజీరావు వెనుక ఉన్న అపార సంపద ఆయనలోని అహాన్ని రెచ్చగొడితే వికాస్ లోని ఆత్మ విశ్వాసం అతని చేత నిజాల్ని చెప్పించింది.
"వృత్తి ఛాలెంజ్ లో మజా వుండదు..... బెట్....గా ఏదైనా పెట్టండి...." వికాస్ లోని అపారమైన తెలివితేటలు అతన్ని దారి తప్పించాయి.
"బెట్.... ఓ.కే. యంగ్ మాన్.... నేనేం బెట్ పెడుతున్నానో నువ్వు తెల్సుకుంటే.... నీ గుండాగి పోతుంది.... విను-" ఒక్కసారి భానోజీరావు లేచి నిలబడ్డాడు. గదిలో అటూ ఇటూ అసహనంగా ఒక్క క్షణంపాటు తిరిగి-
"నువ్వు గనుక సక్సెస్ అయితే... ఈ జింఖానా కంపెనీకి చైర్మెన్ వి అవుతావు..."
ఆ మాటకు వికాస్ కు చెమటలు పట్టేశాయి. గొంతు తడారిపోయింది.
"నౌ యూ కెన్ గో" ఆ మాట విసురుగా వచ్చింది భానోజీరావు నోటినుంచి.
మరేం మాట్లాడాలో తెలీలేదు వికాస్ కి. వెనక్కి తిరిగాడు.
"మిస్టర్ వికాస్..... ఒన్ మినిట్.... ఈ ఛాలెంజ్ నీకూ నాకూ మధ్యే గుర్తుంచుకో ఇక నుంచీ నువ్వు నా రైవల్ వి. గుర్తుంచుకో.....రైవల్ ని నేనెలా హెరాస్ చేస్తానో నీకింకా తెలీదు.... కదూ? తెలుసుకుంటావ్."
గమ్మత్తయిన నవ్వు నవ్వుతూ భానోజీరావు తన ప్రైవేట్ రూంలోకి వెళ్ళిపోయారు.
పులిబోనులాంటి ఆ గదిలోంచి బయటపడ్డాడు వికాస్.
* * * * *
అదే రోజు సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ లో వైజాగ్ వెళ్ళిపోయాడు వికాస్.
తనెందుకు వెళ్ళాడు? చివరికేమయింది? అనవసరంగా అహం భావముతో ది గ్రేట్ ఆటో మోబైల్ లో ఎంపరర్ ని రెచ్చగొట్టాడా?
మర్నాడుదయాన్నే ఆఫీసుకెళ్ళాడు.
అప్పటికే ఏరియా మేనేజర్ కి, హెడ్డాఫీసు నుంచి ఓ మెసేజ్ వచ్చింది.
"ఏం జరిగింది వికాస్? నిన్ను సర్వీస్ నుంచి 'వూస్ట్' చెయ్యమని ఆర్దర్సొచ్చాయి. నీకు రావల్సిన బాలెన్స్ కూడా తీసుకో" ఏరియా మేనేజర్ విచారంగా చెప్పాడు.
ఆఫీసు నుంచి వస్తూ లిఖితకు ఫోన్ చేశాడు. ఆవిడ దొరకలేదు.
అనుకున్నదొకటి. అయిందొకటి.
భానోజీరావ్ తో సవాల్ చేస్తున్నప్పుడు బాగానే వుంది.
మరిప్పుడు...
కానీకి ఠికానా లేని ఒంటరి.
పిచ్చి, పిచ్చిగా తిరిగి రాత్రి రెండు గంటలకు రూంకి వచ్చాడు.
నిద్రలో ఏదో కల.... ఆ కలలో ఎటో పరుగెడుతున్నట్టుగా.....పొందాలంటే ముందు వారిని బాగా మెచ్చుకోవాలి. వాళ్ళు అసమర్ధులయినా, వెధవలయినా, మీరు చాలా గొప్పవాళ్ళంటూ మొదలెట్టాలేమో?
వ్యాపారవేత్తకు ఏ వ్యాపారం చేయాలి? ఎలా చేయాలి? ఎలా అమ్ముకోవాలి? అనే విషయాలతోపాటు ఎవర్ని ఎలా డీల్ చేయాలన్నది కూడా మానసిక శాస్త్రవేత్తకి తెలిసినంతగా తెలియాలి.
ఐ.సీ.... ఎవ్విరీ బిజినెస్ మెన్ షుడ్ హేవ్ ది సైకాలజిస్ట్ థింకింగ్, ఏ వ్యాపారం ఎవరు చేసినా మనుష్యులతోనే గదా! అందుకే మానవ మనస్తత్వం ఎరిగి వుండాలి.
* * * * *
If he's bigger than you are, don't fight back. Use your head in stead of your fits.
గమ్యం లేదు ఆ పరుగుకి. రెండో అక్క దగ్గర్నించి లేచినవాడు చీకట్లో రాళ్ళమీద, గుట్టలమీద, ముళ్ళ వెంబడి పరుగెడుతూనే వున్నాడు.
తండ్రి వెనకనుంచి తరుముకొస్తాడనే భయం.
ఎన్ని మైళ్ళు పరిగెట్టాడో తెలీదు..... ఎన్ని వూళ్ళు దాటాడో తెలీదు.....పరిగెత్తి, పరిగెత్తి ఆగాడు.
ఓ టెంట్ హౌస్ కనబడింది. వాల్ పోస్టర్ మీద, గుర్రం మీద వెళ్తున్న ఓ రాకుమారుడు ఆ రాకుమారుడు ఎన్టీరామారావని, ఆ సినిమా అగ్గిపిడుగని తెలీదు.
ఆశ్చర్యంగా రంగు, రంగుల పోస్టర్ వేపు చూస్తూ నిలుచున్న సమయంలో-
ఏదో తెల్సిన గొంతు వినబడి, తలతిప్పి చూశాడు.
అల్లంత దూరంలో మేనమామ చయనులు.... అతని ముందు గుట్టగా పోసిన పాత ఫేంట్లు.