పైకి చిరునవ్వు చిందిస్తూనే తన చేతిలో బలంగా యోగేష్ నాలుగు వేళ్ళను బిగించి చటుక్కున చూపుడు వేలిని అందుకున్నాడు.
అప్పటికే ఏదో ప్రమాదాన్ని శంకించిన యోగేష్ తన చేతిని లాక్కునే ప్రయత్నంలో వుండగానే, అతని చూపుడువేలిని త్రినాధ్ బొటనవేలు కర్కశంగా వెనక్కు వంచేసింది.
యోగేష్ చూపుడువేలు పుల్లలా విరిగిపోవడం, ఆ బాధని తట్టుకోలేక అతను కెవ్వున కేక వేయడం- ఆ కేకకు సభ్యులు ఉలిక్కిపడడం అంతా కనురెప్పపాటులో జరిగిపోయింది.
"వాట్ హేపెన్డ్ మిస్టర్ యోగేష్..." అని పైకి వినిపించేలా ఆందోళనగా అని- "నా గురుదేవుల వంటిమీద కేవలం నీ చూపుడువేలు మాత్రం ఆనటం నీ అదృష్టం. కొండల్ని పిండిచేసిన ఉక్కు పిడికిళ్ళునావి. వాటికి ఇనుప గుండెల్ని ఛిద్రం చేయగల శక్తి వుంది. ఏం జరిగిందో రసాభాస చేస్తే మరొక అరగంటకే నిన్ను సాక్ష్యాధారాలు లేకుండా సమాధిచేస్తాను. ఏంలేదంటూ ఇక్కడినుంచి కామ్ గా వెళ్ళిపో."
అని యోగేష్ కే వినిపించేలా అంటూ "ఇటీవలే చేయి బెణికిందట. తెలియక నేను గట్టిగా, ఆప్యాయంగా పట్టుకొనే సరికి బాధేసిందట. అంతే..." అన్నాడు అందరికీ వినిపించేలా.
త్రినాధ్ కళ్ళలో కనిపిస్తున్న ఎరుపుజీరకు జంకిన యోగేష్ పైకేమీ చెప్పకుండా వడివడిగా వెళ్ళిపోయాడు.
* * * *
మరుసటి రోజే తల్లి వద్దంటున్నా వినకుండా ఓ పెద్ద బంగ్లాను అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చేశాడు త్రినాధ్.
* * * *
తనకు వ్యాపారవేత్తగా ఇష్టం లేకున్నా, కన్నతండ్రిగా కూతుర్ని బాధ పెట్టడం ఇష్టంలేని సుదర్శన్ రావు ప్రియాంకను చైర్ పర్సన్ గా తన స్థానంలో నామినేట్ చేయించాడు ఆ రోజే.
స్టార్ హోటల్ సూట్ లా విశాలంగా వున్న అతి విలాసవంతమైన ఆ గదిలో ఎప్పుడూ సుదర్శన్ రావు కూర్చునే కుర్చీలో ఇప్పుడు ప్రియాంక కూర్చుని దాన్ని అటూ ఇటూ కదిలిస్తోంది.
షార్ప్ గా చెక్కిన జపాన్ మేడ్ పెన్సిల్ లెడ్ చివర ఆమె క్రింద పెదవిపై మెల్లగా కదలాడుతోంది.
సరీగ్గా అప్పటికి తనూ, త్రినాధ్ పరస్పరం ఛాలెంజ్ చేసుకుని సంవత్సరం పూర్తయింది.
ఈ సంవత్సరంలోనే తిమ్మడు త్రినాధ్ అయ్యాడు. త్రినాధ్ త్రినేత్రుడు కావటానిక్కూడా ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు.
తను కావాలనే పదవిలోకి వచ్చింది. తన తెలివితేటలు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
అతి త్వరలోనే త్రినాధ్ వేగానికి మొట్టమొదటి బ్రేక్ పకడ్బందీగా వేయాలి... ఎలా? ఎక్కడ...?
త్రినాధ్ కి ప్రస్తుతం బాగా లాభాలు తెచ్చిపెడుతున్న వ్యాపారం హెచ్.బి.ల్యూబ్. దాని మార్కెటింగ్ వైపు దెబ్బకొట్టడం సాధ్యం కాని పని... ప్రొడక్షన్ వైపు..."
ఆమె ఓ క్షణం ఉలిక్కిపడింది.
ఏమిటీవేళ తనకు ఇలాంటి ఆలోచనలొస్తున్నాయ్...? తను కూర్చున్న సీటు ప్రభావమా...? ఇది విక్రమార్కుడి సింహాసనం లాంటిదా...?
ఆ ఆత్మ విమర్శ ఆమెలో ఎంతోసేపు నిలవలేదు.
క్షణాల్లో సివంగిలా మారిపోయింది.
బెల్ కొట్టి సెక్రటరీని పిలిపించింది.
"నాకిప్పుడు ఇమ్మీడియెట్ గా సైంటిస్ట్ కావాలి" అంది సీరియస్ గా అతనివైపు చూస్తూ.
* * * *
వసుంధరా ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డాఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది.
అప్పటికే ఇంజనీర్, హిందూ, బోస్, వసుంధరాదేవి, విజయ రామారావు, రామచంద్ర, మిసెస్ ఛటర్జీ వచ్చేశారు.
ఇంక రావల్సింది మాలిని మాత్రమే.
అందరూ హాల్లో కూర్చున్నారు.
త్రినాధ్ లోపల ఫస్ట్ బోర్డు మీటింగ్ లో చర్చించాల్సిన ఐటమ్స్ పై గుప్తాతో సమాలోచన జరుపుతున్నాడు.
బోస్ హిందూతో చనువుగా మాట్లాడుతుండటాన్ని మిసెస్ ఛటర్జీ గమనించింది. తన కొడుకులో కేవలం సంవత్సరంలోనే అంత మార్పు రావడం ఒక ప్రక్క ఆశ్చర్యపరుస్తుంటే- మరోపక్క అమ్మాయితో అంత సామరస్యంగా మాట్లాడుతుండడం మరింత విస్మయానందాన్ని కలిగించింది. ఆమె మనస్సు త్రినాధ్ కి నమస్కరించింది- కృతజ్ఞతగా. ప్రక్కనే వున్న వసుంధరాదేవి వేపు తడిదేరిన కళ్ళతో చూస్తూ, "అలాంటి కొడుకును కన్నందుకు మీ జన్మ ధన్యమైందమ్మా" అంది ఆనందంతో పూడుకుపోయిన గొంతుకతో.
ఆ వాతావరణాన్ని, అక్కడ పేరుకొన్న క్రమశిక్షణను, అక్కడున్న సిబ్బంది పనిచేసుకుపోతున్న విధానాన్ని చూసిన వసుంధరాదేవి అప్పటికే ఆనందోద్వేగంలో మునిగిపోయి వుంది.
సరీగ్గా ఆ సమయంలో మిసెస్ ఛటర్జీ అన్న మాటలు ఆమెను గతంలోకి తీసుకెళ్ళాయి ఓ క్షణం.
త్రినాధ్ కి ఐదారేళ్ళ వయస్సులో వున్నప్పుడు ఓ రోజు తన భర్త మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు. "మరో కన్నతల్లి నిన్ను మనస్పూర్తిగా నీ కడుపు పండిందమ్మా- అలాంటి కొడుకును కన్నందుకు అని మన బాబును చూసి అన్నప్పుడే నాకానందం వసుంధరా. నేను మునిగిపోతున్న పడవను- కనుక ఈ జీవన మహాసాగరాన్ని, నిన్ను దాటించగలనన్న నమ్మకం నా మీద పెట్టుకోకు. నీ అన్న దుష్టుడు. వాడికి దూరంగా మన బాబును పెంచి, పెద్దచేసి ప్రయోజకుడ్ని చెయ్. వాడి ప్రయోజకత్వం నీకు ఉపయోగపడితే అది స్వార్ధం. నలుగురికీ ఉపయోగపడాలి. కనుక ఈ రోజు నుంచి నువ్వు ఒక అనామకురాలిగా మారిపో. అడ్రస్సు లేకుండా బ్రతుకు. ఇలా చివరి మాటలు అంటున్నానని నేనేదో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాననుకోకు. నేను పిరికివాణ్నికాదు. కాకపోతే బావమరిదిని నమ్మి దారుణంగా మోసపోయాను. ఆ మోసమే నన్ను కుదిపివేస్తోంది. పిడికిడంత గుండె- తట్టుకోలేదేమో. ఆ పైన భర్త కళ్ళవెంట నీళ్ళు... చూస్తూ, చూస్తూ మిమ్మల్ని నడిసముద్రంలో వదిలేశానా-? మీ భవిష్యత్తును అంధకారం చేశానా...? నన్ను క్షమించరూ" అన్నట్లుగా దీనంగా తనవైపు చూసిన ఆఖరి చూపు... ఆమె గుండెని పిండినట్లయింది.
తప్పదిక... ఈరోజు గతాన్ని కన్నబిడ్డ ముందుంచాల్సిందే... కసి తీర్చుకోవాల్సిందే... ఆమె ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది.
సరీగ్గా 10.30కి మాలిని వచ్చింది.
ఆమెను చూస్తూనే అందరూ గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు.
ఆమె అందరివైపు చూసి, రెండడుగులు ముందుకేసి అక్కడే వున్న కుర్చీలో కూర్చుండిపోయింది.
ఆమె ప్రవర్తన అక్కడున్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
నిజానికి ఆమెకు ఎలాంటి పర్మిషన్, ఎపాయింట్ మెంట్ లేకుండానే బాస్ రూమ్ లోకి వెళ్ళగల అర్హత వుంది.
అక్కడున్న అందరికీ తెలుసు ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి అని, కొండ రాళ్ళను సయితం కోవెలలోని దేవుడిగా మలచగల నేర్పరి అని.
ఐదునిమిషాలకి అందరికీ పిలుపు వచ్చింది. త్రినాధ్ రూమ్ లోనే వసుంధరా ఇండస్ట్రీస్ కంపెనీ చారిత్రాత్మకమైన మొట్టమొదటి బోర్డు మీటింగ్ జరుగబోతోంది.
ఆఫీసంతా నిశ్శబ్దంగా వుంది.
అందరూ త్రినాధ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా గుప్తా లేచాడు... గౌరవనీయులైన డైరెక్టర్స్ కి జనరల్ మేనేజర్ గుప్తా నమస్సుమాంజలులు అర్పిస్తున్నాడు..." అని అందరికీ ఓసారి నమస్కరించాడు.
"ఎజెండాలోని మొదటి అంశం- చైర్మన్ ఎన్నిక... కంపెనీ చీఫ్ ప్రమోటర్ గా వున్న త్రినాధ్ చైర్ మెన్ గా ఎన్నిక కావటం" అంగీకార సూచకంగా అందరూ చప్పట్లు కొట్టారు.
"ఇక రెండవది... అమెరికన్ స్టైల్ లో కంపెనీకి ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలనేది చైర్మన్ గారి అభీష్టం. అందుకు వారు సూచించిన పేరు మాలినీదేవి" అంటూ డైరెక్టర్స్ వైపు చూశాడు.
దానికి అందరూ అంగీకార సూచకంగా చప్పట్లు కొట్టారు.
మాలిని గంభీరంగా వుంది.
ఆమె ముఖంలో ఎలాంటి భావమూ వ్యక్తం కావటం లేదు. ఇప్పుడెవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు" అంటూ గుప్తా హిందూకి సైగ చేశాడు.
హిందూ షార్ట్ హేండ్ బుక్ ని, పెన్సిల్ ని పైకి తీసి పట్టుకొంది.
ముందుగా ఇంజనీర్ లేచాడు.
"గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి, డైరెక్టర్స్ కి నా వందనాలు. మంచి మంచి వ్యాపారాలు చేపట్టి, రోజు రోజుకి మన కంపెనీ అభివృద్ధి చెందుతూ దక్షిణ భారతదేశంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆ ఆకాంక్ష. భారీ ఎత్తున ప్రారంభం కాబోతున్న ఈ మహా యజ్ఞానికి నేనో సమిధను కావాలన్నదే నా కోర్కె..." అంటూ కూర్చుండిపోయాడు.
తరువాత బోస్ లేచాడు.
"మన కంపెనీ కేవలం వ్యాపారాభివృద్ధి సాధిస్తే చాలదని నా అభిప్రాయం- దారుణమైన అవమానానికి గురైన ఒకప్పటి ఓ అమానకుడు మన చైర్మన్. జరిగిన అవమానానికి ప్రతీకారమే ఈనాడు మనలో పట్టుదలగా మారింది. ఆ ప్రతీకారం నెరవేర్చుకోవాలి. లేనిదే నాకు మనశ్శాంతి వుండదు. నాలాగే మన చైర్మన్ గారు కోరుకుంటుండవచ్చు. కనుక మన లక్ష్యం రెండు ప్రధాన విషయాలతో ముడిపడి వుంది. ఒకటి మనం వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిపోవడం... రెండు... డబ్బుతో మదించి, మందమతితో అవమానించిన ఆ ప్రియాంకకు, సుదర్శనరావుకు బుద్ధి చెప్పటం...." బోస్ లో మరలా చాలా కాలానికి ఆవేశం కట్టలు త్రెంచుకొంది.
అప్పటికే వసుంధరాదేవి షాక్ అయింది.
ఆమె కొడుకువైపు నిజమా అన్నట్టుగా చూసింది. త్రినాధ్ ముఖం మీద చిరుమందహాసం ఓ క్షణం కదలాడింది. వసుంధరాదేవి లేచింది.
"నేనీనాడు విధవరాల్ని, దేవుడులాంటి భర్తను కోల్పోయిన నిర్భాగ్యురాల్ని, ఒకప్పుడు పట్టుపరుపులపై పరుండిన నా బిడ్డ త్రినాధ్ చింకి చాపలపై సేదతీరటం లాంటి దౌర్భాగ్యపు సంఘటనల్ని ఎన్నో చూశాను" ఆమె ఆవేశంలో మాటలు తడబడుతున్నాయి.
అందరూ ఆమెవైపే విస్మయంగా చూస్తూ, ఆమె చెప్పేది వింటున్నారు.
"ఒకప్పుడు నా భర్త తన స్వశక్తితో ఒక బిజినెస్ ఎంపైర్ ని సృష్టించి వేలాదిమందికి బ్రతుకుతెరువు చూపించి భళిరా అనిపించుకున్నారు. అలాంటి నా భర్త తన ఆఖరి సమయంలో భార్య గురించి, కొడుకు గురించి.... వార్ని బ్రతికించాల్సిన పట్టెడన్నం గురించి వ్యధ చెందటం మీరు నమ్మలేకపోవచ్చు. కాని నిజం. నా జీవిత ధ్యేయం సుదర్శనరావు పతనం."
ఆమె చెప్పేది వింటుంటే వారిలో అంతకంతకు ఆశ్చర్యం పెరిగి పోతోంది.
"నా కొడుకును, ఎందుకూ పనికిరాడనుకుని నిస్పృహతో వదిలేసిన నా కొడుకును ఒక వజ్రాయుధంలా తయారుచేసిన దేవత మాలిని. ఆమె వయస్సులో నాకన్నా చిన్నదైనందున... ఆమె మరింత కాలం నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతికి మరికొందరి జీవితాలకు వెలుగు చూపించాలని కోరుకుంటున్నందువల్ల చేతులెత్తి నమస్కరించలేకపోతున్నా. ఆ మహ నీయురాలికి నా శతకోటి వందనాలు. ఇప్పుడు ఆమె శిష్యుడైన త్రినాధ్ ని కన్న తల్లిగానే కాక ఈ కంపెనీ బోర్డాఫ్ డైరెక్టర్ గా ఒక కోర్కె కోరుతున్నాను. అది సుదర్శన్ రావు పతనం- నాశనం."
ఒక్క త్రినాధ్ తప్ప మిగతా వాళ్ళంతా శిలా ప్రతిమలైపోయారు.
అప్పుడు తలెత్తాడు త్రినాధ్.
ఓసారి మాలినివైపు చూసి తల్లివైపు తిరిగాడు.
"ఆ సుదర్శన్ రావు ఎవరన్నది కూడా చెప్పేయమ్మా. ఇంకెందుకు దాపరికం-?" త్రినాధ్ మామూలుగా అన్నా అతని కంఠంలో తొంగి చూసిన ఒకింత కర్కశత్వాన్ని అక్కడున్న అందరూ గ్రహించారు.