Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 6

   

     పెద్దమనిషి ముసుగుచాటున అతను ఎంతమంది అమ్మాయిల జీవితహలతో ఆడుకున్నాడో ప్రపంచానికి తెలియాలి-
   
    కోర్టు అతన్ని శిక్షించాలి.
   
    మయూషా! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ నాకు న్యాయం జరగాలి.
   
    ఆ జ్వాలాముఖిరావు శిక్షింపబడేవరకూ నా శపథం తీర్చేవరకూ నువ్వు నాకోసం పోరాడుతావని కన్నీళ్ళతో వేడుకుంటున్నాను.
   
                                                                                                                                 ఉంటాను
                                                                                                                                        నీ
                                                                                                                                     భార్గవి.
   
    ఆ ఉత్తరం ఆసాంతం చదివిన మయూష కన్నీటి ప్రతిమలా నిలబడిపోయింది.
   
    పేదరికంలోంచి, ఆకలిలోంచి, అనేక బాధలలోంచి వచ్చిన భార్గవి భవిష్యత్తు గురించి పేర్చుకున్న ఊహలు, తనతో చెప్పిన సంగతులూ....అన్నీ గుర్తుకు వస్తున్నాయి మయూషకు. ప్రపంచంలోని దుర్మార్గం కాటుకు భార్గవి బతుకు బలయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదామె. ఏదో ఆవేశం ఏదో ఉక్రోషం, ఏదో కసి-
   
    భార్గవి రాసిన లేఖను మడతపెట్టి జాకెట్లో పెట్టుకుని వడివడిగా డ్యూటీ రూమ్ లోంచి బయటకు వచ్చింది.
   
    వేగంగా రిసెప్షన్ వైపు నడిచి టెలిఫోన్ రిసీవర్ తీసింది.
   
    ఆమెకు కావల్సిన నెంబరును ప్రెస్ చేసింది-నో రిప్లయ్ వరసగా రెండు మూడు నెంబర్లకు డయల్ చేసింది.
   
    అప్పుడు ఆమెకు కావలసిన ఇన్ ఫర్ మేషన్ దొరికింది.
   
    "ఎవరు....మీరు....ఆయనతో మీకేం పని....."
   
    అటుపక్కనుంచి అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పకుండా రిసీవర్ ని కోపంగా పెట్టేసి వెనుదిరిగింది మయూష.
   
                                              *    *    *    *
   

    ఇరవైనిమిషాలు గడిచాయి.
   
    "పోస్టుమార్టాన్ని గంటసేపు వాయిదా వెయ్యండి. భార్గవి శవం నాకు కావాలి" అలా అడుగుతున్న మయూషవేపు ఆశ్చర్యంగాచూసింది లేడీ డాక్టర్.
   
    డాక్టర్ రూమ్ బయట మయూష వెనక దాదాపు రెండొందల మంది కాలేజీ స్టూడెంట్స్ గుమిగూడారు.
   
    అప్పటికే వారిలో కొంతమందికి భార్గవి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల్ని వివరించి తను చేయబోయే కార్యక్రమానికి వారి సహాయాన్ని కోరింది మయూష.
   
    "మయూషా.....ప్రొసీడ్ గవర్నర్ రెసిడెన్స్ కు రావడానికయినా మేం రెడీ.....భార్గవి ఆత్మహత్యకు కారకుడయిన జ్వాలాముఖిరావు అంతుచూడనిదే విద్యార్ధి లోకం నిద్రపోదు" అంటూ విద్యార్ధిలోకం యుద్దానికి సిద్దమైపోయింది.
   
    అప్పటికప్పుడు విద్యార్ధులు స్లోగన్లు తయారుచేసారు ప్లేకార్డ్స్ తయారుచేసారు.
   
    "అబలల జీవితాలతో ఆడుకొనే జ్వాలాముఖిరావును వెంటనే అరెస్టు చేయాలి....."
   
    భార్గవి ఆత్మకు శాంతి కలగాలంటే జ్వాలాముఖిరావును శిక్షించాలి....."
   
    "ఎన్నాళ్లీ అతివలపై అమానుష చర్యలు.....ఇంకానా.....ఇకపై సాగవు....."
   
    "మళ్ళీ మరొక భార్గవి మోసపోకూడదు....అందుకే.....కోరుతున్నాం న్యాయం......"
   
    "నిస్సహాయంగా భార్గవి దీర్ఘనిద్ర పోయినా, విద్యార్దిలోకం నిద్రపోదు....."
   
    నర్సింగ్ హోమ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.
   
    సమీప పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సబ్ యిన్ స్పెక్టర్ వచ్చాడు.
   
    మయూష ఆధ్వర్యంలో, విద్యార్ధినీ విద్యార్ధులు చేయబోయేది తెలుసుకొన్న ఎస్.ఐ. నిరుత్తరుడయ్యాడు.
   
    "మిస్ మయూషా..... మీరు కంప్లయింట్ చెయ్యండి...... ఆ విషయాన్ని నేను హయ్యర్ ఆఫీషియల్స్ దగ్గరకు తీసికెళతాను......" అనునయంగా అన్నాడా ఎస్.ఐ   
   
    "మాకు ఈ పోలీస్ వ్యవస్థమీద నమ్మకంలేదు........." ఎవరో విద్యార్ధి ఉద్రేకంగా అరిచాడు మిగతావాళ్ళు దానికి వంతపాడడంతో, ఎస్.ఐ.మరేం మాట్లాడడానికీ అవకాశం లేకపోయింది. మరో గత్యంతరంలేక ఆయన విద్యార్ధుల డిమాండ్ కు వప్పుకున్నాడు.
   
    అప్పుడు సమయం మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటింది.
   
    నర్సింగ్ హోమ్ ముందు అంబులెన్స్ వచ్చి ఆగింది.
   
    భార్గవి శవాన్ని తిరిగి నర్సింగ్ హోమ్ కి అప్పగిస్తామని హామీ పత్రం మయూష రాసిచ్చిన మీదట విద్యార్ధులకు అప్పగించింది లేడీ డాక్టర్.
   
    భార్గవి శవాన్ని విద్యార్ధులు స్ట్రెచర్ తో తీసికొచ్చి అంబులెన్స్ లో పెట్టారు.
   
    అంబులెన్స్ వెనకాముందు నినాదాలతో ప్లేకార్డ్స్ ప్రదర్శిస్తూ ఓకే ప్రవాహంలా కదిలారు స్టూడెంట్స్.
   
    అంబులెన్స్ లో డ్రయివర్ సీటు పక్కన కూర్చుంది మయూష.
   
    "ఇప్పుడు మనం ఎక్కడకు వెళ్ళాలి మేడమ్" అడిగాడు డ్రయివరు.
   
    "బంజారాహిల్స్ లోని కృష్ణా ఓబ్రాయ్ హోటల్ కి....." అంది మయూష.
   
    గంభీరంగా చెప్పిన మయూష ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు డ్రయివర్.
   
                                                                  *    *    *    *
   
    సరిగ్గా 1.15 నిమిషాలు.
   
    ఊరేగింపు దారిలో వున్న సమయంలోనే ఈ వార్త తెలిసిన మిగతా కాలేజీ స్టూడెంట్స్ అంచెలంచెలుగా వూరేగింపులో చేరారు. యాభైమందితో ప్రారంభమయిన వూరేగింపు రెండువేల మంది స్టూడెంట్స్ తో పెద్ద ఊరేగింపుగా తయారవడంతో ముందు జాగ్రత్త చర్యగా, పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేసారు.
   
    "జ్వాలాముఖిరావు ఒక కాలేజీ అమ్మాయికి అన్యాయంచేసాడట- ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్, ఆ అమ్మాయి శవాన్ని అతనిదగ్గరకు తీసుకెళుతున్నారు" పోలీసు వర్గాల్లో ఆ న్యూస్ చాలా సంచలనం సృస్టించింది.
   
    "ది గ్రేట్ ఇండస్ట్రియిలిస్ట్ జ్వాలాముఖిరావుమీద విద్యార్ధుల తిరుగుబాటా?!" పొలిటికల్ వర్గాలు విస్మయం వ్యక్తం చేసాయి.
   
                                             *    *    *    *
   
    సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు.
   
    కృష్ణా ఓ బ్రాయ్ హోటల్లోని ఏ.సీ కాన్ఫరెన్స్ హాలు-సూది కింద బడితే వినబడేటంత నిశ్శబ్దం అలుముకొని వుందా హాల్లో.
   
    హోస్ట్ సీట్లో కూర్చున్న జ్వాలాముఖిరావు కళ్ళకున్న కార్టియర్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుని సర్దుకుని తన ఎదురుగా రెండు వరసల్లో అటూ యిటూ కూర్చున్న విదేశీ ప్రతినిధులవేపు చూశాడు.
   
    ఆంద్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతంలో దాదాపు ఎనిమిది వందలకోట్ల రూపాయల్తో ప్రారంభించే ఫ్యాక్టరీకి సంబంధించి అమెరికన్ ప్రతినిధులతో జరుపుతున్న అతి ముఖ్యమయిన సమావేశం అది__
   
    జ్వాలాముఖిరావుకు యాభయ్ ఆరేళ్ళు దాటి పదిహేనురోజులే అయింది. పచ్చటి విగ్రహం-గుండ్రటి ముఖం-దృఢమైన దేహం-ఎదుటివాడి మనోభావాలను అవలీలగా పసిగట్టగలిగిన పులిచూపులు, జ్వాలాముఖిరావును ఇండస్ట్రయల్ వర్గాలలో జెమ్ అని, జె.ఎమ్.అని- జె ఎమ్ రావ్ ని అంటుంటారు ఇటు పారిశ్రామిక వర్గాలు అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జెమ్ కి అసాధారణమయిన పలుకుబడి, పరువు ప్రతిష్టలున్నాయి.   

 Previous Page Next Page