Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 5

    మన పెళ్ళెప్పుడని?
   
    దానికి ఆయన నెగిటివ్ గా రియాక్ట్ అవుతాడనుకున్నాను. కానీ కాలేదు__
   
    ఏం...... ఈ గోడచాటు శృంగారమ్మీద మొహం మొత్తిందా? అని నవ్వుతూ అడిగాడు.
   
    నేను సీరియస్ గా అడుగుతున్నాను అనన్నాను.
   
    భార్గవీ...... ఐ లవ్ యూ..... ఎందుకో నాకు తెలీదు..... ఇంకా ఇరవయ్ ఏళ్లు కూడా నీకు లేవు. అప్పుడే పెళ్ళెందుకు చెప్పు..... నీ హేపీ..... నా దగ్గర్నించి నీకేం కావాలో తీసుకో...... మనం ఇక నుంచీ గెస్ట్ హౌసుల్లో కలుసుకోవడం లేదు. నీ కోసం యూసఫ్ గూడాలో ఓ ఫ్లాట్ నీ పేరు మీదే తీసుకొంటున్నాను. ఇలా కొన్నాళ్ళు జరగనీ-డోంట్ బీ హర్రి యంగ్ లేడీ! అని నన్ను తన మీదకు లాక్కున్నాడు.
   
    నేనేం మాట్లాడలేకపోయాను.
   
    మరొక నాలుగు నెలలు గడిచాయి.
   
    ఏదో తెలీని అసంతృప్తి__
   
    అప్పటికే మా ఇద్దరి సంబంధం విషయం ఆఫీసులో తెలిసి పోయింది.
   
    ఆ విషయం తెల్సి అందరూ నన్ను గౌరవిస్తారనుకున్నాను. గొంగళిపురుగులా చూడడం ప్రారంభించారు.
   
    కొంతమంది నన్ను హెచ్చరించారు కూడా.
   
    ముసలాడ్ని పట్టినందుకు డబ్బులు వస్తాయి..... గానీ.....పెళ్ళి జరగదు...... నీలాంటి వాళ్ళను పెళ్ళి చేసుకుంటే అతనికిప్పుడు మూడు వందల అరవయ్ ఇళ్లుండేవి__
   
    ఆ మాటలలోని వ్యంగ్యానికి నా మనసు కుత కుత లాడింది. అయినా నా కళ్ళ ముందు నా తమ్ముళ్ళూ చెల్లెళ్ళు నిస్సహాయంగా కనిపించేసరికి తగ్గిపోయాను.
   
    నేను మోసపోతున్నానా? మోసపోయానా? ఆయన్నెప్పుడూ నేను ఒక మోసగాడిలా వూహించలేదు. అలా ఎప్పుడూ ఆయన నా దగ్గర ప్రవర్తించలేదు.
   
    మరి......? ఎందుకో నాలో విచిత్రమయిన పట్టుదల బయలుదేరింది.
   
    ఇంకా నేను నలుగురిలో నవ్వులపాలు కాకముందే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను.
   
    నాకై నేను నాకొక ప్రెస్టేజియస్ ఐడెంటిఫికేషన్ కావాలని బాగా ఆరాటపడిపోయాను.
   
    సరిగ్గా__
   
    నీకీ ఉత్తరం రాస్తున్న సమయానికి నలభయ్ ఎనిమిది గంటల ముందు__
   
    నేను జ్వాలాముఖిరావుతో గెస్ట్ హౌస్ లో ఉన్నాను.
   
    మన విషయం చాలామందికి తెలిసిపోయింది నన్ను అందరూ అదోలా చూస్తున్నారు__ అని అన్నాను నాందిగా__ దానికి ఆయన నవ్వాడు.
   
    రహస్యం ఎప్పుడూ దాగదు అన్నాడాయన కూల్ గా.
   
    మనది రహస్య సంబంధమేనా? అనడిగాను.
   
    రహస్యంగా కలుసుకోవడంలో థ్రిల్లు లేదా.... అందులోనూ నాలాంటి మిడిల్ ఏజ్డ్ మేన్ ని..... నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు ఆయన.
   
    నేను మన కలయిక గురించి మాట్లాడడం లేదు..... మన పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను..... అన్నాను ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.
   
    పెళ్ళి నీకు అంత అర్జంటా? నవ్వుతూ అడిగాడాయన.
   
    అవును అన్నాను స్థిరంగా.
   
    నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి అన్నాడాయన.
   
    మీరు ఇదే మాట చాలాసార్లు చెప్పారు. నేను మీ మాట నమ్మను. అన్నాన్నేను కోపంగా.
   
    అప్పుడే నమ్మకం పోయిందా? అని జ్వాలాముఖిరావు నన్ను దగ్గరగా తీసుకోబోతున్న సమయంలో__
   
    నేను దూరంగా జరిగాను.
   
    మన పెళ్ళి ఎప్పుడో చెప్పండి గట్టిగా అడిగాను నేను.
   
    నిన్ను నేను పెళ్ళి చేసుకోవాలనే రూలుందా? తాగుడు నిషాతో అడిగాడు జ్వాలాముఖిరావు.
   
    నాకెందుకో ఆ క్షణంలో కోపం వచ్చింది.
   
    అంటే మీ డబ్బుతో నన్ను ట్రాప్ చేసి, నన్ను మీ పడక సుఖానికి ఉపయోగించుకున్నారు. మీ మనస్తత్వం నాకెప్పుడో తెలుసు. మీరుపెద్ద ఇండస్ట్రయలిస్టని, పవర్ ఫుల్ మేన్ అని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని బజారు కీడ్చి, మీచేత నలుగురి మధ్య తాళి కట్టించుకోవడం నాకు పెద్ద సమస్య కాదు. అందుకు నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. ఆ క్షణంలో నా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం నావల్ల కాలేదు__అందుకే అలా ఆవేశపడిపోయాను.
   
    నా మాటలు విని ఆయన చాలా బిగ్గరగా నవ్వాడు- నవ్వి, నవ్వి అలిసిపోయి మరో పెగ్గు తాగి-
   
    ఇంతకు పూర్వం నీ విషయంలో నా ఆలోచన వేరేగా ఉండేది-తొందరపడ్డావ్..... నా విషయంలో తొందరపడినవాళ్ళను ఉపేక్షించను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవ్. నేను తల్చుకుంటే రేపు ఇదే సమయానికి..... నువ్వు.... నామరూపాల్లేకుండా పోతావ్...... ఆడపిల్లవు.... ....అందుకే కనికరిస్తున్నాను..... వెళ్ళిపో..... అని ఒక లక్ష రూపాయలు టీపాయ్ మీదకు విసిరాడు.
   
    అతనలా అనేసరికి నేను ఉక్రోషంగా ముందుకు దూకి అతని చొక్కా పట్టుకుని నోటి కొచ్చినట్లు తిట్టాను.
   
    అతను బలవంతంగా నన్ను బయటకు తోసేసి గెస్ట్ హౌస్ తలుపులు వేసేసుకున్నాడు.
   
    నిస్సహాయంగా ఏడవడం తప్ప నేనేం చెయ్యలేకపోయాను.
   
    ఏడ్చుకుంటూ రోడ్ మీద కొచ్చాను. కాసేపటికి అతని కారు నా పక్కనుంచే వెళ్ళిపోయింది.
   
    అదే కారులో రెండు గంటల క్రితం ఆనందంగా వెళ్ళిన నేను అదే కారు వేపు కన్నీళ్ళతో చూసాను.
   
    అతని మీద ఏదో తెలియని కసి, పగ.....
   
    నేను దారుణంగా మోసపోయానని నా మనసు చేస్తున్న హేళనని భరించలేకపోయాను.
   
    అతని గురించి పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలా? నలుగురిలో అతడిని నిలబెట్టి చేసిన మోసం గురించి చెప్పాలా?
   
    రెండో పద్దతే నాకు నచ్చింది.
   
    మర్నాడు ఉదయం నేరుగా నా సీనియర్ కొలీగ్ దగ్గరికెళ్ళి ఆమె సహాయాన్ని అడిగాను.
   
    కానీ అప్పటికే జరిగిన విషయం ఏమిటో తెలుసా?
   
    ఆఫీసులో నీ కాండక్ట్ బాగాలేదని చాలా కంప్లయింట్స్ వచ్చాయని, నీలాంటివాళ్ళు ఉండడంవల్ల ఆఫీసు వాతావరణం పాడైపోతుంది కావున నిన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేస్తున్నామన్న లేఖ_నాకిచ్చి నన్ను మర్యాదగా గెంటేసారు ఆఫీసు నుంచి.
   
    మయూషా!
   
    ఈ స్థితిలో నా పరిస్థితిని ఒకసారి వూహించు- నేను పిరికిగా ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నానో, నా నిస్సహాయత ముందు నేను ఓడిపోయానో నువ్వొక్కసారి ఆలోచించు_
   
    ఎన్నో ఆశలతో ఏ హైద్రాబాద్ వచ్చాను. హైద్రాబాద్ నాకిచ్చిన కానుక ఆత్మహత్య.
   
    మయూషా!
   
    ఒక స్నేహితురాలిగా నిన్ను నేనొక కోరిక కోరుతున్నాను.
   
    నాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయగలవా? ఆ జ్వాలాముఖిరావు నాకు చేసిన అన్యాయం నలుగురికీ తెలియాలి-

 Previous Page Next Page