"నాలుగో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని మా ఆయన నన్నొదిలేసి వేరే పోయాడు. కడుపు చేయటం ఆయనవంతు, కనటం న వంతు ఆడో మగో నా చేతుల్లో వుందా?" నడిమింటి నాంచారమ్మ పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ అంది.
"కాపురాలుచేసి పిల్లలని కనటంవేరు. రేపుల సంగతేమిటిరేపులు" అరుణ వర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర అగ్నిగోళాల్లా కళ్ళెర్రచేసి అడిగింది.
"అన్నెం పుణ్యం ఎరుగని వక బాలికని మభ్యపెట్టలేకి దౌర్జన్యం గానో ఒక మగవాడు హాయిగా రేప్ చేసి పారేస్తాడు. అప్పుడా అమాయకురాలు ప్రెగ్నెంటయి వాడి పాపభారం తన కడుపులో మోస్తూ ఇంటా బయటా నిందలపాలై ఆత్మహత్యకన్నా పూనుకుంటుంది లేక ఓ బిడ్డకి తల్లయి-ఆపై ఆమె తండ్రి తన కూతురు బిడ్డను కుప్పతొట్టి పాలు చేయగా వాడో అనాథగ...ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..."
మహారచయిత్రి మహాదేవి "అనగనగ లాగ కధలాగ...లెక్చరిస్తున్న ధోరణిలోలాగ...." చెపుతుంటే ఆమె రెక్క పుచ్చుకుని ఒక్క లాగు ఇవతలకి లాగి "ఈ కధలు పనిగట్టుకుని యీయనగారికేం వినిపించనక్కరలేదు. కుంతిని సూర్యుడు రేప్ చేస్తేనేకదా కర్ణుడు పుట్టింది. మగాడు రేప్ చేయటం ఆడవాళ్ళు రేప్ కి బలి కడుపులు తెచ్చుకోటం....ఇది ఈ నాటి కథ! తరతరాలుగా, యుగయుగాలుగా...."అంటూ గడ గడ లొడ లొడ స్పీచ్ అందుకుంది రచయిత్రి కాంచనమాల.
"రెండక్షరాల రేపు రెండు క్షణాల రేపు.
స్త్రీ పాలిట రేపు శిక్షకదా మాపు
రేపు మాపు వలదు వలదు రేపు ఆపు."
పిల్లకవయిత్రి ప్రీతి గంగూలి కవిత చదివింది.
దాంతో సినిమా పాటల ధోరణిలో పాటలుకట్టి పాటలు పాడే పాపాయమ్మ నుదుట చేతిని ఆనించుకుని భారంగా, బాధగా ఆరునొక్క రాగంతో గళమెత్తి పాట అందుకుంది.
"ఆగదూ రేపు ఆగదు.
ఆగదులే ఈ నిముషము రేపులూ
ఆగినా సాగదులే మాకు రేపు చేయటం."
ఆ పాట పూర్తి అయిందో లేదో అందరి కళ్ళల్లో నీళ్ళు జలపాతాల్లాగా ఉరికాయి. ముక్కురంధ్రాల్లోంచి దారాపాతంగా పిల్లకాలవలు పారాయి అందరి పిడికిళ్ళు ఆవేశంగా బిగుసుకున్నాయి. చేతులు పైకి లేచాయి. కంచుకంఠాలు ఖంగుమన్నాయి.
"రేపులు ఆగాలి!"
"రేపు మాపు రేపులు ఆగాలి."
"రేపు చేసే హక్కు నశించాలి."
"రేపు చేసే హక్కు మాకూ వుండాలి."
"అవును వుండాలి."
నారదమునీంద్రులవారి బుర్ర ఈ అరుపులతో, నినాదాలతో దిమ్మెత్తి కొత్త ఆలోచనలు వచ్చాయి. "ఆగండి తల్లులారా!" అంటూ చేతులతో నోటితో ఒకేసారి అడ్డు తగిలాడు.
అంతా సైలెన్స్ అయిపోయారు.
"మీ సమస్య ఏమిటో నా కర్ధం అయింది తల్లులారా!"
"అయిందా! ఎలా అయింది?" భ్రుకుటి అనుమానంగా ముడేసి అనుమానం అనుమానంగ అడిగింది అప్పాయమ్మ.
"మీ ఆక్రందన అర్ధం అయింది." విషయం తనకి తెలిసిపోయిందని సంతోషపడుతూ మాటని సస్పెన్స్ పెడుతూ చెప్పాడు నారదమహర్షి.
"అమ్మయ్య! మేము చెప్పకుండానే అర్ధం చేసుకున్నారు. నేను చెప్పాలా ఈయన అందరిలాంటి మొగవాడుకాదని__ "సంతోషమ్మ సంతోషం ప్రకటిస్తూ అంది.
"పాపం మంచి మగవాడు" అంటూ జాలిపడింది రంగనాయకి.
లీడర్ లీలారాణికి మాత్రం అనుమానం వచ్చింది "ఏమిటి అర్ధమైంది?" అంటూ ప్రశ్నించింది.
"మీరందరూ ఇంతకుముందే కదమ్మా దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు... రేపు చేసే హక్కు మాకూ వుండాలని__ఇదేగా మీ కోరిక? ఇదేగా మీ సమస్య! ఇదేగా..." ఆ తర్వాత ఏం మాట్లాడాలొ తెలియక ఆగిపోయారు నారదమునీంద్రులవారు.
ఆడంగులందరూ ఒక్కసారిగా కిలకిల కిచకిచ నవ్వేశారు.
దాంతో నారదులవారు చింతపిక్కంత ముఖం చేసుకున్నారు.
"మా సమస్యలో ఇది అణుమాత్రం భాగం మాత్రమే. అసలు సమస్య అసలు కోరిక చాలా పెద్దదే వుంది. సాధించిందాకా ఎవరం నిద్రపోము" లీడర్ లీలారాణి చెప్పింది.
"పోము పొమ్మన్నా పోము." అందరూ కోరస్ గా అరిచారు.
మూడుకొప్పులు ఒకచోట కలిస్తే సమరం తప్పదంటాను. కలియుగంలో ఈ మాటకూడా తప్పిపోయిందా? జడలు ముడులు కొప్పులు డిప్పలు (నిగ్గులు) సవరాలు రెండుజడలు, నానారకములయిన ముడులు ఇవి చాలక కత్తిరింపులు. రింగులు ముంగురులమీద పడేలా తిప్పుకోటాలు చీరలకి మేచింగ్ అయ్యేలా కురులకి రంగులు__ఇందరు ఆడవాళ్ళు ఇన్ని రకాల తలలు (కొప్పులు) ఒకేసారి కలిసికట్టుగా రావటం గాక...ఒక కొప్పుతై అంటేమిగతా కొప్పులన్నీ "తైతై!" అంటూ ఒకామెగారు 'జై' అనంగానే పక్కనున్న అందరూ 'జైజై' నాటో జయజయ ధ్వనులు చేస్తూ ఇందరు ఆడవాళ్ళు ఒకేబాటమీద పయనిస్తూ ఒకేమాట పట్టుకుని వేలాడుతూ....
నారదమునీంద్రులవారికి క్షణకాలం ఇది కలా నిజమా అనిపించి చేతిమీద గిల్లుకుని చూశాడు. చెయ్యి నెప్పి పుట్టింది.
"అబ్బే ఇది కలకాదు" అనుకుని క్షణకాలం ఆలోచించి" కలియిగం అంతమయేముందు చాలా వింతలు విచిత్రాలు జరుగుతాయని అంటారు. కొంపదీసి కలియుగం అంతం కాబోతున్నదా ఏమిటి?"
అని ఆలోచించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని బొటనవేలును వంచి చిటికెల వేలునుంచి కణుపులు లెక్కపెట్టుకుంటూ లెక్కలుకట్టి "కలియుగం అంత కావటానికి అబ్బో చాలాకాలం వుంది" అనుకున్నాడు.
"ఏమిటి మహర్షీ! లెక్కలు కడుతున్నారు? లెక్కలు కట్టటానికి కాలిక్యులేటర్ వుండగా వేళ్ళమీద లెక్కలేంటి?" అంటూ ఓ చిగురుబోణి కిలకిల నవ్వింది.
"ఏదోలే తల్లి! పాతతరం వాడిని" అంటూ రవ్వంత సిగ్గుపడ్డాడు నారదమహర్షి.
"అవునుమరి ముసలితనం....నారదులవారు ఈ యుగంవారా ఏమిటి? యుగయుగాలనుంచి కలికి బలపం కట్టుకుని తుంబుర మీటుతూ లోకాలు-కాదు కాదు ముల్లోకాలు తిరగటమే కదా వారి పని" అంటూ రంగనాయకి బోలెడు జాలిపడుతూ అంది. ఆమెది మహా జాలి హృదయం.