"నేను అయిదురోజులు శలవు పెట్టాను. ఈ అయిదురోజులు అయినా నాకు దూరంగా ఉండాలని ప్రయత్నించకు!"
"మీరిలా మాటాడితే నేను థీసిస్ రాయటం మానేయాలి తప్పదు".
నీ భర్తకు చెడ్డపేరు రావడం నీకిష్టమేనా డార్లింగ్!" వారి సంభాషణ కొనసాగకుండా పని మనిషి ప్రత్యక్షమయింది.
"ప్రొఫెసర్ సమతా బెనర్జీగారొచ్చారు. మీ కోసం హాలులో కూర్చున్నారు" అంటూ ఒక వార్తా వడ్డించి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
"రండి పరిచయం చేస్తాను" అంది తులసి!
"విత్ ప్లెజర్!" అంటూ లేచి ఆమె వెంట నడిచాడు శివరాజ్!
మెరిసే కళ్ళతో మెట్లు దిగి వస్తున్న నవ దంపతుల వంక చూచి తృప్తిగా తల ఊగించింది బెనర్జీ!
"ప్రయాణానికి కారు సిద్దం చేసి మీ మమ్మీ హడావుడి పడుతోంది!" అంది.
పరిచయాలు పూర్తయ్యాక! తులసి సిగ్గుపడి తల దించుకుంది.
"నేను సిద్దంగా ఉన్నాను." అన్నాడు శివరాజ్ నవ్వుతూ!
"ఆడపిల్లలు సిద్దపడేందుకు కొంత సమయం పడుతుందిలె త్వరపడకు! ఏ వూరు వెళ్ళాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది.
"ఒక వూరనేముంది? పోలీస్ కంట్రోల్ రూంకి తప్ప ఎక్కడికయినా వెళ్ళాలనేవుంది!" అన్నాడు. బెనర్జీ పెదవులు చిరుదరహాసంతో వొంపు తిరిగాయి. కారులో సామాను సర్ధించి లోపలకు వచ్చింది తల్లి!
"రాహుకాలం వస్తోంది! మరింక బయలుదేరాలి!" అంది.
"మేడమ్! మీరు ఒక చోటు చెప్పండి!"
"ఇది జూలాజికల్ స్టడీ టూర్ కాదుకదా! నేను చెప్పేందుకు?"
"అందుకు కూడా ఉపయోగపడేలాగానే చెప్పండి మేడమ్!"
ప్రొఫెసర్ రెండు క్షణాలు మౌనంగా వుండి చెప్పటం ప్రారంభించింది.
రిస్క్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను."
"థ్రిల్ కావాలంటే కొంతయినా రిస్క్ చేయాలి ప్రొఫెసర్" అంటూ కొండంత ఉత్సాహాన్ని చూపించాడు శివరాజ్!
"అయితే ఒక చోటు చెప్తాను. నల్లమల కొండలలో అంత తేలికాగా గుర్తించటానికి వీలుకాని చోటు అది! నాగార్జున కొండలో మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు?"
"హైదరాబాద్ నుంచి తిరిగివస్తూ రెండు రోజులు!"
"అయితే అక్కడ ఆర్కెయాలజీ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ క్యూరేటర్ గా పని చేస్తున్న భాను ప్రసాద్ ని కలవండి!
అతడే నాకు ఆ చోటు చూపించాడు. చాల వినయ విధేయతలు కలవాళ్ళు. నా శిష్యుడు! యువకుడు మీకు చక్కని ఆతిధ్యమిస్తాడు. మీరు వెళ్ళే ముందుగానే టెలిఫోన్ లో అతనికి మీ వివరాలు అందిస్తాను. నందికొండ నుంచి శ్రీశైలం వరకూ ఉన్న పర్వత సాణువుల్లో ఉన్న చోటు అది! అతని సాయం లేకుండా వెళ్ళకండి!" అన్నదామె!
తల్లి గోడగడియారం వంక చూచి మరింత తొందరించింది.
"రాహుకాలం రావటానికి మరో అయిదు నిమిషాలు మిగిలున్నాయి" అంది.
ప్రొఫెసర్ పాదాలకు నమస్కరించి ముందుగా వచ్చి కారులో కూర్చుంది తులసి! తల్లి ఆమెకు ఓ పర్స్ అందించింది.
"అవుసరం వస్తుందిలే వాడుకో!" అంటూ!
దాన్ని ప్రక్క నుంచి శివరాజ్ కోసం ఎదురు చూస్తోంది.
ప్రొఫెసర్ కి వీడ్కోలు యిచ్చి అతను డ్రయివింగ్ వైపు వచ్చాడు! డోరు తెరిచి పట్టుకుని సీతులోకి రాబోతూ ముందుకు చూచి నిలచిపోయాడు! ప్రొఫెసర్ వెనుకగా నిలబడి వుంది!
"ఎవరు నువ్? కారుముందు సెటిల్ అయిపోయావ్" శివ ప్రశ్నించాడు.
"ద్రవిడ మహేశ్వరులం! దండాలు చెల్లించుకో! దండిగా వరాలు కురిపిస్తాము. మ్రొక్కులుంటే చెప్పుకోరా! మోజు తీరుస్తాము" అంటూ హఠం వేసి కారు బానెట్ ముందు కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి ఢమరుకం మ్రోగించటం ప్రారంభించాడు.
ఉలికిపడి అతనివైపు చూచింది తులసి!
"వరాలిస్తావా? ఇంకా ఏ యుగంలో బ్రతుకుతున్నావు? అవతలకు దయచెయ్యి! కావాలంటే చిల్లర డబ్బులిస్తాను" అన్నాడు శివ.
"ద్రవిడ మహేశ్వరులం! కించపరిచి మాటాడకరా! కొండదొరలకు కోపమొస్తాది! కొరనోములు నోచినావే తల్లి! కోతి మర్కటం నీ మొగుడైనాది!" అన్నాడు తులసి వంక చూస్తూ!
తల్లి లెంపలు వాయించుకుని అతన్ని పిలిచింది.
"క్రొత్తగా పెళ్ళయినవాళ్ళు బాబూ! వాళ్ళని శపించకు. నీకు కావలసింది ఏమిటో నేనిస్తాను. ఇలారా!" అంది బ్రతిమాలే స్వరంతో.
"భిక్ష అర్ధించానని బింకం చూపకురా! ద్రవిడ మహేశ్వర మూర్తులం! కన్నెర్రచేసినామంటే భస్మమైపోతావు" అన్నాడు ద్రవిడ మహేశ్వరుడు! అతని కంఠస్వరం మేఘాల ఉరుముని పోలి ఉంది.
ముందుకు మోకాళ్ళవరకు అంచు వ్రేలాడేవిధంగా ఒక గోచిపాత మాత్రమే ధరించాడు. ఆజానుబాహువు, గడ్డం పెరిగి గుండెల్ని దాటి క్రిందకు దిగింది.
మర్రిపాలతో దట్టంగా అట్టలు కట్టించిన సుదీర్ఘ కేశాలను తలమీదికి శిగలా మలిచాడు. అది ఈశ్వరుని జుటాజూటాన్ని తలపిస్తోంది. శరీరమంతా విభూది రేకలున్నాయి.
ఒక చేతిలో త్రిశూలం అతనికన్నా పొడవుగా వుంది. మరొక చేతిలోవున్న ఢమరుకాన్ని నిర్విరామంగా మ్రోగించటం ప్రారంభించాడు. ముఖంలో దివ్యమైన తేజస్సు ఉన్నది.
కాని డొక్కలు పల్చగా అంటుకుపోయి ఉన్నాయి. కొన్ని వారాల క్రితమో నెలల క్రితమో ఎంగిలిపడిన మనిషిలా కన్పించాడు.