Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 4

    ఏదో గజ్జికుక్క మొరిగినట్టు అరుపు నినబడితే సేతురాజు, పోతురాజు బెదిరిపోయి నలువేపులా చూశారు.

    "నేనే..అయిడియా వచ్చింది..." అన్నాడు వీర్రాజు.

    "చెప్పు..."

    "రోటీ, కపడా ఔర్ మకాను మనకు ఫ్రీగా కావాలంటే, మనం ఎంచక్కగా దొంగలుగా మారిపోవాలి..."

    "దొంగలు...అంటే...చోర్..."

    "ఎస్...మనం దొంగతనం చేస్తామన్నమాట...పోలీసులకు దొరికిపోతాం....పోలీసులు మనల్ని జైల్లో పెడతారు...జైల్లో మనకి తిండి....బట్ట....గూడు...ఫ్రీ"

    "ఒరేయ్ నీ మెదడును గాడ్ బ్రహ్మ, బంగారంతో చేసుంటాడ్రా! పొగిడాడు సేతురాజు.

    "మనం స్టేషనులో ఏం చోరీ చేస్తాం....ఇక్కడ అస్సలు మానవజాతే లేదు..." పెదవి విరుస్తూ అన్నాడు పోతురాజు.

    "స్టేషనులో స్టేషను మాస్టర్ ఉంటాడు..."

    "ఆఁ...వాడి దగ్గరేముంటాయి...టిక్కెట్లు, చిల్లర పైసలూ ఉంటాయి...వాటిని దొంగతనం చేస్తే, మనల్ని తనని వదిలిపెట్టేస్తారు తప్ప, జైల్లో పెట్టరు.." విచారంగా అన్నాడు సేతురాజు. "మనం పెద్ద దొంగతనం చెయ్యాలి...సినిమాలోల్లా....పోలీసులు మనల్ని కాచ్ చెయ్యడానికి జీపు తీసుకొని పరుగెత్తాలి...వాళ్ళకి దొరక్కుండా మనం డబ్బాల మీంచి, మొండి గోడలమీంచి, బజారుల్లో పరుగెత్తాలి..."

    "అలా పరిగెడితే మనం ఎలా జైలు కెళ్తాం...?"

    "అవును...మనం కొంతదూరం పరుగెత్తి, ఆ తర్వాత ఆగిపోయి పోలీసులకు దొరికిపోతాం...పోలీసులు మనల్ని జైల్లో పెడతారు....అక్కడ మనం..ఏ పాప్పా...ఏ పాప్పా...ఎపాప్పా...అంటూ డ్యూయెట్లు పాడుకుంటూ..."

    "ఇడియట్...అది డ్యూయట్ కాదు...పాయింట్ కు రండి....మనం ఇప్పుడు...ఈ కాచిగూడ స్టేషను నుంచి వెళ్ళే ట్రైనులో కెక్కి, ఒక మంచి పాసింజర్ ని చూసుకొని దొంగతనం చేస్తాం...రైల్లోంచి దూకి పరిగెడతాం... ఆ తర్వాత మిగతా కథ మామూలుగా జరుగుతుంది. కథ కంచికి మనం జైల్ కి..."

    ముగ్గురూ మరోసారి ఆ అయిడియా గురించి ఫర్ ఫెక్ట్ గా థింక్ చేసినా వారై ఉత్సాహంగా లేచి, మరింత ఉత్సాహంగా స్టేషను మాస్టర్ రూమ్ వేపు నడిచి ఆయన్ని అడిగారు__

    "ఇప్పుడు మద్రాసుగానీ, బెంగుళూరుగానీ వెళ్ళే ట్రైయ నొస్తుందా.." ఆ ప్రశ్నకు సంతోషంగా ఉన్న ముఖాన్ని చిరాగ్గా మార్చుకుని స్టేషను మాస్టరు ముగ్గురి మొఖాలవేపుచూసి చెప్పాడు.

    ఇక్కడకు లోకల్ ట్రైన్సే వస్తాయి..."

    "మద్రాసు, బెంగుళూరు కాకపోతే...లోకల్...ఏదో ఊరు....మనకీ ట్రైను ముఖ్యం...కదరా ..." అన్నాడు సేతురాజు.

    "ఆ ట్రైను ఎన్ని గంటలకి వస్తుందండి..."అడిగాడు వీర్రాజు
   
    "పదకొండు గంటలకు....వస్తుంది ఒక ట్రైను..."

    "ఈ స్టేషన్ లో ట్రైయిన్లు టైంకి వచ్చేస్తాయన్నమాట..." ఆశ్చర్యంగా అన్నాడు సేతురాజు.

    "కాదు...ఆ ట్రైను నిన్న పదకొండు గంటలకు రావాల్సింది..." నెమ్మదిగా చెప్పాడు స్టేషను మాస్టరు.

    అయినా ఆ ముగ్గురూ అక్కడ్నించి కదలలేదు.

    రెండు మూడు సార్లు, డబ్బు లెక్కపెట్టు కొంటూ తలెత్తి చూశాడు స్టేషను మాస్టరు రూమ్ బయట నేలమీద కూర్చుని తనవేపే, కన్నార్పకుండా చూస్తున్న ఆ వ్యక్తిని "చిల్లంగి పెట్టేవాడిలా ఏంటలా చూస్తున్నావ్..." గట్టిగా అడిగాడతను. విచిత్రంగా ఓ నవ్వు నవ్వాడు తప్ప, జవాబు చెప్పలేదు వీర్రాజు.

    "మూగవాడివా....?" అని మళ్ళీ అడిగాడు.

    "కాదు..."

    "మరి ఎందుకలా చూస్తున్నావూ...అలాగా చూడకూడదు...వెళ్ళి సిమెంట్ బెంచీ మీద కూర్చో..."

    "ఎందుకలా ఉలిక్కిపడతావ్? నీవేపు ఎవడు చూశాడు...నీ వెనక గోడకున్న గడియారం వేపు చూస్తున్నా...ఇంకా ఒక్క నిముషమే వుంది..." తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు వీర్రాజు.

    "ఒక్క నిముషమా....దేనికి?" బాంబు పెట్టాడేమో అనే అనుమానంతో భయపడుతూ చూశాడు స్టేషన్ మాస్టర్.

    ఒక్క నిముషం అయిపోగానే గోడ గడియారం పదకొండు గంటలు కొట్టడం, సరిగ్గా అదే టైముకి ట్రైన్ టంచన్ గా పెద్ద చప్పుడు చేసుకొని రావడం ముగ్గురూ ముందుకు పరుగెత్తడం జరిగిపోయింది.

    "ఒరేయ్...ఇది ప్యాసింజరు బండి కాదురా, గూడ్సు బండి..." ముఖం అదోలా పెడుతూ అన్నాడు పోతురాజు.

    "ఆ స్టేషన్ మాస్టరు మన్ని మోసం చేశాడు....ఆడ్ని మనం దెబ్బతియ్యాలి..." ఉక్రోషంగా స్టేషను మాస్టరు వేపు చూస్తూ అన్నాడు వీర్రాజు.

    "దెబ్బతియ్యాలే....పొడవాలే....నరకాలే కాదు...ట్రైన్ ప్రోగ్రాం మిస్సయ్యింది గదా...జర రెండో ప్రోగ్రామ్ సోచాయించండీ....మనం అర్జంటుగా జైలుకెళ్ళాలి..." తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు సేతురాజు.

    "అయిడియా..." కెవ్వుమనకుండా అన్నాడు వీర్రాజు.

    "ప్రతిసారీ అయిడియా అని అనక్కర్లే....చెప్పి తగలడొచ్చు..." తీరుబడిగా బీడీ తీసి వెలిగిస్తూ అన్నాడు జక్కన్న.

    రెండు నిమిషాల్లో అయిడియానంతా చెప్పేసాడు వీర్రాజు.

    "మనల్ని జైలుకి తీసికెళ్ళాడానికి, ఇక్కడెక్కడా రైల్వే పోలీసులు లేరు కదా..." డౌటును వ్యక్తం చేశాడు సేతురాజు.

    "కాసేపు నీ డౌట్లు కట్టెయ్...లేకపోతే నీ మూతిని కుట్టేస్తాను..." గట్టిగా కసిరి ముందుకు అడుగేస్తూ "ఫాలో మీ!" అన్నాడు వీర్రాజు.

    దిష్టిబొమ్మల్లా నుంచున్న ముగ్గురి వేపూ పటకాయించి చూస్తూ అడిగాడు స్టేషన్ మాస్టర్.

    "ఏం కావాలి?"

    "టిక్కెట్లు...."చెప్తూ, సగం తెరచిన టేబుల్ డ్రాయర్లోంచి కనబడుతున్న నోట్ల కట్టవేపు చూస్తున్నాడు పోతురాజు.

 Previous Page Next Page