"ష్యూర్ .....ఆ మాట అడగాలా ....పదండి.
"చాలా థాంక్స్ అండీ. మరోసారి తప్పకుండా వస్తాను. మీరు.....మీ శ్యామ్ నాన్నగారు లేరండి...." అంది కుతూహలంగా. శ్యామ్ తండ్రిని చూసి శ్యాం ఎవరి పోలికో చూడాలనుకుంది.
ఆమె గొంతులో కుతూహలం శ్యామ్ గుర్తించాడు. ఆమెకి జవాబివ్వడానికి రాధాదేవి తడబడింది. అది గుర్తించిన శ్యామ్ ....."అమ్మా! రేఖ ఎందుకడిడిందో తెలుసా, నీ వంత చక్కగా వుంటే నీ కొడుకు ఇలా వున్నాడు. తండ్రి పోలికా అని చూడ్డానికి అడిగింది. అవునా రేఖా. నీ అంచనా తప్పు. మా నాన్నగారూ తెలుపే.....మా యింట్లో నేనే అనాకారిని...." హాస్యంగా అన్నా అతని మోహంలో భావం చూసి రేఖ నొచ్చుకుంది. తన భావం గుర్తించి నందుకు పట్టుబడ్డ దొంగలా తలదించుకుని "సారీ శ్యామ్ .....అందుకడగలేదు. ప్లీజ్ . పాత సంగతులు మరచిపో.... ఐయామ్ ఎషెమ్ డ్ ఆఫ్ మై సెల్ఫ్" అంది బాధగా.
వింటున్న రాదాదేవికి సగం సంగతి అర్ధమైంది. రేఖని తీసుకొచ్చినప్పుడు కొడుకు మోహంలో కాంతి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలో వెలిగే సంతోషం, ఆమెకి సాయపడ గల్గినందుకు గర్వం.....ఎప్పుడూ లేనంతగా శ్యామ్ మోహంలో కాంతిని చూసి, ఇప్పుడు రేఖ మాటలు విని శ్యాం తన రూపుని తను ఎందుకు ఈసడించుకుంటున్నాడో అర్ధం అయింది. అందాల రేఖని తను కళ్ళేత్తి కూడా చూసే యోగ్యత లేదని బాధపడ్డాడు ఇన్నాళ్ళు. రేఖ కాస్త కృతజ్ఞతగా మాట్లాడితే యెంత సంబరపడుతున్నాడు పిచ్చివాడు.
"రేఖా.....చూశావా వాడి మాటలు.....వాడిలో ఈ యిన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టాలని నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. రేఖా! అందం అనేది మనసుకి వుండాలి గాని, శరీరానికి లేనంత మాత్రాన కించపడాలా? అందం చూసేవాళ్ళు కళ్ళను బట్టి , మనసుని బట్టి వుంటుంది. నా మట్టుకు నాకు శ్యామ్ ఆ నీలిమేఘశ్యామ్ లా కన్పిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాను. మనకు ఒక వ్యక్తి మీద యిష్టం వున్నప్పుడు కూరూపితనం కనపడదు. నీవూ చెప్పమ్మా ఆ మాట "రాధాదేవి కావాలనే రేఖకి అందం ప్రధానం కాదు అన్నట్లు చెప్పింది. ఆ మాటలకి రేఖ సిగ్గుపడి తలదించుకుంది. శ్యామ్ రూపుని తను ఎంత హేళన చేసిందో గుర్తుకు వచ్చి ఆ సహ్రుదయులైన తల్లీ కొడుకుల ముందు తలవంచుకుంది.
"టేకిట్ యిజీ రేఖా.....నేను హాస్యంగా అన్నాను, పద వెళ్దాం" శ్యామ్ అన్నాడు.
రేఖ సంస్కారం చేసి కదిలింది. గుమ్మంలో నిలబడి యుద్దర్ని చూస్తూ నిట్టూర్చింది రాధాదేవి. శ్యామ్ మనసులో కోరిక తీరేది కాదు. చూస్తూ చూస్తూ రేఖే కాదు ఎవరూ శ్యామ్ ని చేసుకోవడానికి ఇష్టపడరు. రేఖలో శ్యాం పట్ల కృతజ్ఞత తప్ప ఇంకేం వుంటుంది? ఉంటుందని ఆశించనూ కూడదు అనుకుంది.
"శ్యామ్ ....మీ అమ్మాగారూ ఎంతందంగా వున్నారు! బాగా చదువుకున్నారా?" త్రోవలో అడిగింది రేఖ.
"మా అమ్మ నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్" అన్నాడు గర్వంగా.
"నిజం?" రేఖ ఆశ్చర్యంగా అంది. శ్యామ్ ని చూసి ఏదో తక్కువ జాతివాడని , ఏ బీదవాడోననుకుంది. ఆ తల్లి, ఆ యిల్లు, ఆ సంస్కారం , ఆ అభిమానం అన్నీ చూసి ఒక్కసారిగా తన అభిప్రాయం మార్చుకుంది. శ్యామ్ పట్ల కుతూహలం పెరిగింది. "సారీ శ్యామ్ ! తెలియక నిన్ను గురించి ఏదో వాగాం.... క్షమించు. మీ అమ్మాగారి మీద నాకెందుకో ఎంతో గౌరవం కల్గింది. మీ నాన్నగారేం చేస్తారు?" కుతూహలంగా అడిగింది.
శ్యామ్ మొహంలో రంగులు మారాయి. "ఆయనా లెక్చరర్ గా ఉండేవారుట" ముభావంగా అన్నాడు. రేఖ అర్ధం కానట్టు చూసింది. "ఆయనా మా అమ్మా ఒకే కాలేజిలో లెక్చరర్లుగా ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు..... కాని తరవాత ఎందుకో యిద్దరికీ పడక విడిపోయారు. ఆ తరవాత అయన సంగతి మా అమ్మ తెలుసుకోలేదు...." ఎందుకో అతనికి రేఖ దగ్గిర నిజం దాచాలనిపించక వున్న సంగతి చెప్పాడు. ఇవాళ కాకపోయినా రేపయినా తెలుస్తుందిగా అనుకున్నాడు.
"ఐసీ....సారీ శ్యామ్ , తెలియక అడిగాను. అయితే మీ యిద్దరే వుంటారన్నమాట. మీ అమ్మగారే జాబ్ చేసి యిల్లు నడుపుతున్నారన్నమాట. అలా వంటరిగా వుండి నిన్ను పెంచుకుంటున్న ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి."
"నిజంగానే మెచ్చుకోవాలి రేఖా! మా అమ్మ ఎంతో దక్షతగా సంసారం నడుపుతూ , నన్ను క్రమశిక్షణలో పెంచిందో తెలుసా? మేం ఏనాడు మగ అండ లేదేనని బాధపడలేదు. ఆవిడ వ్యక్తిత్వం మెచ్చుకోవాలి ఎవరన్నా. మా నాన్నతో ఎందుకు పడలేదో ఆ కారణం చెప్పలేదు ఎన్ని సార్లడిగినా. ఎంతో బలవంతపు కారణం వుంటే తప్ప మా అమ్మలాంటి సౌమ్యురాలు భర్తని వదిలి రాదనీ మాత్రం అర్ధం చేసుకున్నాను. అందుకే ఆ తరువాత అడగడం మానేశాను."
మాటలమధ్యలో రేఖ ఇల్లు వచ్చింది. "బై రేఖా. ఆ రౌడీల పుణ్యమా అని నీతో పరిచయం కల్గింది. రేఖా ప్లీజ్! నన్ను అసహ్యించుకోకు. నేను నీనుండి ఏదీ ఆశించను. అని అభయం యిస్తాను. జస్ట్ - బీ ఫ్రెండ్లీ విత్ మీ....దట్సాల్.... నీతో మాటలాడే ఆనందాన్ని , నీ స్నేహాన్ని మాత్రం కోరుతున్నాను. నా పరిధి నాకు తెలుసు, నిన్ను కోరెంత సాహసం కలలో కూడా చేయను. ప్లీజ్ ....నీ స్నేహం కావాలి నాకు అంతే."
రేఖకి తన మనస్సులో మాట చెప్పకపోతే తనేదో ఆశిస్తున్నాడని అనుకుంటే అసలే దూరం అవుతుందన్న భయంతో ఉద్వేగంతో అనేశాడు.
"నో.... శ్యామ్ .......నన్నింకా నీ మాటలతో చిన్నపుచ్చకు . చెప్పానుగా ఐయాం సారీ ఫర్ ది పాస్ట్. మనిద్దరం ఈరోజు నుంచి స్నేహితులం. నేను మీ యింటికి వస్తుంటాను. మీ అమ్మగారు చాలా నచ్చారు నాకు. బై శ్యామ్ . ఆలస్యం అయింది. ఇంటికెళ్ళు....మరోసారి కలుద్దాం. గుడ్ నైట్" అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది.
2
మరి రెండు రోజుల తరువాత .....ఉదయం కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తున్న రాధాదేవి ఓ వార్త చదివి అదిరిపడి "శ్యామ్" అంటూ గావుకేక పెట్టి పేపరుతో కొడుకు గదిలోకి పరిగెత్తింది. "శ్యామ్....శ్యామ్ ,,," నిద్రపోతున్న శ్యామ్ ని కుదిపి లేపింది. బద్దకంగా కళ్ళు విప్పిన శ్యామ్ బద్ధకం తల్లిని చూడగానే ఎగిరిపోయింది. గాభరాగా లేచి "ఏంటమ్మా....ఏమిటి?" అన్నాడు తెల్లపోయి చూస్తూ.