Previous Page Next Page 
జనపదం పేజి 4

 

    ఓరి మీ అమ్మల....దొరా, దాత మరచిపోయినారు. కాల్మక్త , భాంచను, అను. నడువ్ లంజకొడక . భూములు పంచుకొంటర్లె , ఊ నడువ్ బే" అని బలంగా తన్నాడు బలరామయ్య.
    జగ్గయ్య బోర్లా పడ్డాడు. పోలీసులు రెక్క పట్టి లేపారు. తంతూ, గుద్దుతూ గడీకి తీసికెళ్ళారు.
    గడీకి వచ్చిం తరువాత కర్ర అందుకొని బాదసాగాడు. "చెప్పు గాడ్ది కొడక వాళ్ళెక్కడున్నారో " ఇదేం ప్రశ్న. "తెల్వదుండ్రి , కొట్టుండ్రి, చీల్చుండ్రి , తెల్వంది యాడ్నుంచి చెప్పుత" ఇదే జవాబు.
    "బాంచను, అనవేమిర గాడ్ది కొడక " అని కొంతసేపు బాదాడు.
    "తెల్వదు , బాంచను, కాల్మొక్త కొట్టకున్రి."
    బలరామయ్య గెలిచినట్లు వళ్ళు విరిచాడు. చేతిలోని కర్ర పారేసి "కుక్క లోలె పడుండాలే గాడ్ది కొడుకులు, యామనుకుంటన్రో దొరంటే, తిన్నయ్యన్ని కక్కాలే, ఒక్కొక్కాన్ని యాపచేట్టుకు యెల్లెడతీసి తోళ్ళు లోస్తా." అని ఏదో స్పురణకు రావడంతో "నడువ్ కుక్కలా కొడక, గది ఊడ్చి సాఫ్ చెయ్యి" అని మెడ పట్టుకొని గడీ వైపు నెట్టాడు. ఆ తోపుకు కొన్ని అడుగులు ముందుకేసి నుంచుండిపోయాడుజగ్గయ్య. జగ్గయ్యకూ కోపం వచ్చింది. వళ్ళు మండింది. దొరలు, దొంగలు , దోచుకునేవాళ్ళు అనే విషయం అతని నరనరాల్లో జీర్ణించి పోయింది. ఈ పెత్తనం నశింప చేసిన వాళ్ళలో తనూ ఒకడు ఒక్కడు తుపాకి సైతం లేకుండా గొడ్డలితో ముగ్గురు రజాకార్లను నరికిపారేశాడు. మొదటనే దొర తోక ముడిచాడు. ముందు బస్తీ వెళ్ళి తరువాత బెజవాడ పోయాడు. అప్పుడు దొరికుండాల్సింది దొర- ముక్కల కింద నరికేసేవాణ్ణి . కానీ మళ్ళీ దొరతనం నెత్తిన పెట్టుకొని దిగాడు. బలరామయ్య. మళ్ళీ తనను బానిసను చేశాడు. తనతో ఊడిగం చేయించ చూస్తున్నాడు. చేయాలా? చేసినా ఫరవాలేదు. వాళ్ళ రహస్యం బయట పెట్టరాదు. ఈ దొర ఎన్నాళ్ళు ఉంటాడు? ఈ పోలీసులు ఎన్నాళ్ళు ఉంటారు?
    ఆలస్యం సహించలేకపోయాడు బలరామయ్య. పోలీసులకు సంజ్ఞ చేశాడు. తుపాకీ మానుతో వీపున గుద్దాడు. కాస్త తూలి పడబోయి సర్దుకున్నాడు జగ్గయ్య. మౌనంగా మెట్లేక్కడు. పోరకట్ట అందుకొని ఊడ్పు సాగించాడు.
    పెద్దగా నవ్వాడు బలరామయ్య. వికటంగా నవ్వాడు. గడీ ప్రతిధ్వనించేట్టు నవ్వాడు. ఆ నవ్వుకు దిగ్భ్రమ చెందారు పోలీసులు. చుట్టూ చూసి వింతగా అతడ్నే చూడసాగారు. ఇంకా నవ్వుతూనే వున్నాడు బలరామయ్య. విజయగర్వంతో నవ్వుతున్నాడు. అవును అతడు ఒకణ్ణి బానిసను చేశాడు! మళ్ళీ దొరతనం చలాయించాడు. అదీ అతని విజయం . అదీ అతని గర్వం!
    కొంతసేపు నవ్వి చాలించాడు బలరామయ్య. జగ్గయ్య మన్నంతా మూలకు తోసి మరోకగదికి వెళ్ళాడు. పోలీసులు అప్రమత్తంగా వున్నారు. బలరామయ్య జూస్తూనే ఉన్నాడు. జగ్గయ్య ఊడుస్తున్నాడు. కుప్పాలి తోస్తున్నాడు. లంకంత ఇల్లు ఉడ్చేది ఒక్కడు. దెబ్బలతో వళ్ళు హూనం అయింది. వంగిన నడుము లేవడం లేదు. చివరి గదిలో ఊడుస్తున్నాడు. కిటికీ కనిపించింది. దానికి చువ్వలు కాదు ఛత్రం సహితం లేదు. కిటికీ లోంచి దూకి పారిపోదామనుకున్నాడు చూశాడు, కిటికీ లోంచి ప్రహరీ కనిపించింది. ఎత్తుగా వుంది. ఎక్కడం కష్టం. దాన్ని కూల్చక విడిచినందుకు విచారించాడు తిట్టుకున్నాడు. ఎక్కలేక పడిపోతే ప్రమాదం. కాని పారిపోవాలి? ఎలా? ఎంతో ఆలోచించాడు. ఆలోచిస్తూనే కసువు ఎత్తాడు పగిలిన కుండలోకి. "అది నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు . ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. గాలి విసురుగా వీస్తుంది. మబ్బులను అదరగొట్టి పారేస్తుంది. అవి బెదిరి బెదిరి పారిపోతున్నాయి. ఆ గాలికి పగిలిన కుండలోని మట్టి లేచింది. అరుగు మీద నుంచున్న బలరామయ్య కళ్ళలో పడ్డది. కళ్ళు నులుముకుంటూ జగ్గయ్యను తిట్టాడు. జగ్గయ్య పట్టించుకోలేదు! సాగిపోతున్నాడు. పోలీసులు తుపాకులు పట్టుకొని నుంచున్నారు. వారిని దాటి దుమ్ము ఎత్తి పోశాడు. గాలి దుమ్మును మబ్బుగా లేపి పోలీసుల మీదకి తోలింది. అది వారి కళ్ళలో పడింది. అంతా కళ్ళు నల్చుకొసాగారు. జగ్గయ్య పగిలిన కుండ చేత్తో పట్టుకొని వెనక్కి చూశాడు. సమయం బాగుంది ఎవడూ చూడ్డం లేదు. పారిపోదామనుకున్నాడు. ఒక అడుగు వేయమన్నది మనస్సు. వేసింది మేధస్సు. బలరామయ్య గర్జన విన్నాయి చెవులు. ముందుకు వేసిన అడుగు వెనక్కి పడ్డది. మళ్ళీ అదే కుండతో గడి మెట్లేక్కాడు. మళ్ళీ కసువులు ఎత్తిపోశాడు. గడీ మొత్తం శుభ్రం చేశాడు. బలరామయ్య గుడిసేలన్నీ వెతికించి మంచాలు, కుర్చీలు, పగిలిన నిలువుటద్దాలు , పటాలు, చెంబు తప్పాల అన్నీ జగ్గయ్యతో తెప్పించి గడీ నింపుకున్నాడు. నీళ్ళు తోడించాడు. కట్టెలు కొట్టించాడు. చాకిరి యావతూ చేయించాడు. ఆ రాత్రి చీల్చి చెండాడాలనుకున్నాడు. తుపాకుల వాళ్ళ రహస్యాలన్నీ లాగాలనుకున్నాడు. వారి మీద దాడి చేసి అందరినీ కాల్చేయలనుకున్నాడు. తన కొడుకును కాల్చి చంపిన పగ తీర్చుకోవాలనుకున్నాడు. పట్టే మంచం మీద పడుకొని ఆలోచిస్తుండగానే దీపాలు పెట్టారు గడీ హడావుడిగా వుంది. పోలీసులు గడీలోకి మారారు. నిన్నటి గుబులు గానీ, బోసితనం గానీ లేదు. గడీకి జీవం వచ్చింది. జగ్గయ్య వల్లనే ఇదంతా జరిగింది. ఊరంతా జనంతో నిండాల అప్పుడు గాని కళకళలాడదు. జగ్గయ్యను హింసిస్తే వచ్చేవాడు బెదిరిపోతాడనుకున్నాడు. జగ్గయ్య భోజనాన్ని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఆ రాత్రి గడీలోనే పడుకోమన్నాడు జగ్గయ్యను. తన గుడిసెకు పోతానన్నాడు జగ్గయ్య. వద్దనలేదు బలరామయ్య. ఆగలేదు జగ్గయ్య.
    భోజనానంతరం సిగరెట్లు కాలుస్తూ శయనించిన బలరామయ్యకు అమృతవాణి గుర్తుకు వచ్చింది. రాత్రి నుంచి ఆమె జాడ తెలియలేదు. ఎంత మంచిది! ఊరు యావత్తూ తన సొమ్మంతా దోచుకున్నారు. పూచిక పుల్ల ముట్టలేదు. అదే గుడిసెలో పడి వుంది. ఎంత మారిపోయింది! రోగం ఆమెను పీల్చేసింది. ఏవో పూర్వ స్మృతులు మనసులో మెదిలాయి బలరామయ్యకు. ఆమె పుత్తడి బొమ్మ .  తాను ఉరుకులు పెడుతున్న పరువంలో ఉన్నాడు. తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అనందం దోసిళ్ళతో తాగించింది. అమృతాన్ని కళ్ళలో అందించింది. ఇప్పుడు చిక్కి శల్యంగా మారింది. అతనికి తెలీకుండానే అడుగులు గుడిసె వేపుగా సాగాయి. ఇంతలో తన ముందు నుంచి జారిపోతున్న పాము గుర్తుకు వచ్చింది. వెనక్కి వచ్చి లాంతరు అందుకొని సాగాడు. గుడిసెలో కుక్కి మంచం మీద ప్రాణం ఉన్న జాడ కనిపించని ప్రాణి పడి వుంది. లాంతరు పెట్టి ముఖం చూశాడు. లోతుగా వున్న కళ్ళు, ముడతలు పడి వికృతంగా ఉన్న ముఖం కనిపించాయి.
    "అమృతవాణి " పిలిచాడు బలరామయ్య.
    కళ్ళు తెరిచింది వాణి. "దొరా, వచ్చినావా?" అని లేచి కుర్చోబోయింది. లేవలేకపోయింది. నిన్నటి సత్తువ సైతం లేదు. అయినా లేచి కూర్చుంది.

 Previous Page Next Page