'హు- దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫంటే పుస్తకాలు, సినిమాలల్లోలా వుంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పి కొడితే యింకెవరు అసలు రారు. అప్పుడే యిరవై ఎనిమిది వచ్చాయి. తనకు తోచదు చెపితే అర్ధం చేసుకోదు.' వాసంతి ఆవేదనగా అంది.
"పోనీ తనంతట తాను నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకోవచ్చుగా, అమ్మావాళ్ళేం వద్దనలేదుగా' దమయంతి అంది.
'అమ్మ, నాన్న యింక సంబంధాలు చూడడం మానేస్తే సరి అపుడు తెలిసొస్తుంది.'
'నాన్న యింకో రెండు మూడేళ్ళకి రిటైరవుతారు. దాని పెళ్ళి అయితే యింకా నీవున్నావు దానివల్ల నీకూ ఆలస్యం అవుతుంది, 'వాసంతి చెల్లెలితో అంది, అంతే తలోమాట అనుకుని భోజనాలకి లేచి వెళ్ళారు.
* * *
సాయంత్రం ఐదున్నరయింది. జయంతి కాగితాలు సర్ది, బ్యాగులో టిఫిను డబ్బా పడేసుకుని వెళ్ళడానికి తయారవుతుండగా 'ఎక్స్ క్యూజ్ మీ' అని వినపడి వెనుదిరిగింది, గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు. తెల్లపోయి చూసింది. జయంతి! మీకు ఓ చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను' అంటూ ఓ ప్యాకెట్టు ముందుకి చాచాడు అతను. జయంతి ఆశ్చర్యంగా ఏమిటిది. నా కెందుకు కెందుకివ్వడం' తడబడుతూ అంది.
"తీసుకోండి, విప్పి చూడండి. ఎందుకు? ఏమిటి? అన్నది మీకు తెలుస్తుంది....' 'అదోరకంగా తమాషాగా నవ్వి అన్నాడు. జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్టు అందుకుంది.
"విప్పండి" అన్నాడతను.
జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టెలో అద్దం వుంది. జయంతి అర్ధం కానట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. "ఏమిటది అద్దం నాకెందుకిది..." ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో, ఇలాంటి ప్రెజంట్లకా పడిపోతాననుకున్నాడు గాబోలు హేళనగా అనుకుంటూ ప్యాకెట్టు విప్పిన జయంతి, అద్దం వుండటంతో ఆశ్చర్యపడింది, చుట్టుపక్కల టేబిళ్ళ దగ్గిర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళు యిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు. గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వు నవ్వి 'ఈ అడ్డం లొ ప్రతిరోజూ మీరు మీ ముఖం చూసుకోవాలని నా కోరిక...' జయంతి మొహం కళ తప్పింది. కోపంగా ప్యాకెట్టు అతని చేతిలోకి విసురుగా పెట్టేసి' నామొహం చూసుకోవడానికి మా యింట్లో చాలా అద్దాలున్నాయి' తీక్షణంగా అంది.
'ఆ అద్దాలున్నా, యిది నేనిచ్చిన అద్దం, యిందులో ప్రతి పెళ్ళికొడుకుని రిజక్ట్ చేసే ముందు మీరే మాత్రం అందంగా వున్నారో చూసుకోమని గుర్తు చేస్తుంది....' హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్టు ఆమె చేతికి అందించాడు. జయంతిక ఆప్యాకెట్టు విసురుగా విసిరేయబోయింది 'హౌడేర్' అంటూ.
"ఆ....ఆ...ఆ అద్దం విసిరేస్తే బద్దలయితే.....బద్దలయిన ఆ అద్దంలో మీరూపం యింకా వికృతంగా కనిపిస్తుంది..... ఒక చిన్న ఉచిత సలహా. అద్దం జారి బద్దలవుతే ఫరవాలేదు. కానీ, జీవితం చేజార్చి ముక్కలు చేసుకోకు...'
"యూ.....గెటౌట్...ఎంత ధైర్యం నీకు.... యిలా వచ్చి నన్ను అవమానించడానికి....' కోపంతో మాటలు తడబడ్డాయి.
'ఇతరులని అవమానించే హక్కు మీ వొక్కరికే వుందనుకోకండి. మీకున్న రూపానికి యీ ఉద్యోగం జతగా లేకపోతే ఏ పెళ్ళి కొడుకు చేసుకోడానికి మాటదేముడెరుగు చూడటానికి కూడా రాడు అని తెలుసుకోండి గుడ్ బై....' విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ జయంతి మొహం గుర్తు పట్టడానికి వీలులేనంతగా నల్లబడింది. జయంతి అంటే సదభిప్రాయం లేని వాళ్ళు జరిగిందానికి మనసులో సంతోషించారు. 'కావాల్సిందే ఆవిడగారి కున్న పొగరుకి' అనుకున్నారు. పైకిమాత్రం 'ఎవరండి అతను, ఏమిటలా అన్నాడు. ఏమయిందసలు?' ఏం అర్ధం కానట్టు నటిస్తూ ఒకరిద్దరు అడిగారు. జయంతి అవమాన భారంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడి జవాబివ్వడం యిష్టం లేనట్టు తల తిప్పుకుని బ్యాగు చేతిలోకి తీసుకుని బయటికి నడిచింది.
'జయంతీ ఆగు వస్తున్నాను.....' గేటు దగ్గర వెనక నించి ఉషారాణి పిలుస్తూ వచ్చింది.....' వుండు వెళ్ళిపోతున్నావేమిటి? నేను వస్తున్నాగా' అంది.
ఉషారాణి, జయంతి ఆ బ్యాంక్ లో అవివాహిత యువతులు అవడం, ఉషారాణి మంచి మాటకారి, హుషారుగా తనలాగే పుస్తకాలు అవి బాగా చదవడం, స్వతంత్రభావాలు వెలిబుచ్చడం అది చూసి జయంతికి ఆమె నచ్చింది. యిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది.