Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 4


    ఆ ఒక్క మాటతో అతనికి కళ్ళు తిరిగిపోయాయి. స్పృహ తప్పింది.


    ఇంకొక పడుచు జంట ఆ వెనక సీట్లో నే ఉంది. ఆమె ఒళ్ళో ఒక పసిపాప.


    చావు దగ్గరవుతోందని తెలియగానే ఆ మాతృమూర్తికి కలిగిన తోలి స్పందన.....
.

    పాపకి పాలు ఇవ్వాలి.......


    ఈ జన్మకి చివరిసారిగా......


    సజల నయనాలతో ఆమె తన బిడ్డను పమిట చాటుకి తీసుకుంటే ఆమె భర్త "జన్మజన్మలకి నేను నీకు తోడు!" అన్నట్లు ఆమె భుజం చుట్టూ తన చెయ్యి వేశాడు.


    ముందు వరసలో....


    సింహాసనం లాంటి సీట్లోకుర్చుని ఉన్న విక్రమదేవరావు కూడా తనకి చావు ముడిందని గ్రహించాడు.


    తక్షణం అతనికి తన తాత ముత్తాతలు గుర్తొచ్చారు. తన పూర్వికులు గుర్తొచ్చారు. తన రాచరికపు ఘనమైన గత వైభవం ఫ్లాష్ బ్యాక్ లా మనసులో మెదిలింది.


    విక్రమదేవరావుకి అనిపించింది.


    తన బంధువుల్లో ప్రతివాడు ఈ బ్రహ్మాండమైన జెట్ విమానంలోనే ఉన్నాడు.


    గ్రహాచారం బాగుండక ఇప్పుడీ విమానం నిజంగానే కూలిపోయి అందరూ చనిపోతే?


    తన బంధువుల్లో ఒక్కడూ బతికి బట్టకట్టకపొతే?


    అప్పుడెలా?


    ఘనమైన తన వంశం ఏమయిపోతుంది?


    గుండెలు పిండేసినట్లయింది విక్రమదేవరావుకి.


    అంతలోనే అతనికి తను ఇదివరకే రాసి ఉంచిన వీలునామా గుర్తుకు వచ్చింది.


    ఆ వీలునామా విపరీతపు పోకడలతో ఉందని అందరూ అన్నారు.


    అయినా సరే తను లెఖ్ఖచెయ్యలేదు!


    ఈ ఆస్తిలో ప్రతిపైసా తన స్వార్జితం! కేవలం తన కష్టార్జితం! అందుచేత తను తన విల్లులో రాసినట్లే అక్షరాల జరుగుతుంది - జరిగి తీరుతుంది.


    రాజశాసనంలా! ష్యూర్!


    తనేవారు?


    రాజా విక్రమదేవరావు!


    తన పుర్వికులేవరు?


    రాజాధిరాజా , రాయగండరగండ , రాజమార్తాండ సింహుడికి వారసుడు తను!


    ఆ తర్వాత రాజాధిరాజ రాజ పరమేశ్వర ప్రచండ భైరవుడు రాజాధిరాజ, అరివీరభయంకర విక్రమాదిత్యుడు, సోమభూపాలుడు, సంగ్రామ సింహుడు, ఇంకా తర్వాత రాజా రామేశ్వర్, కుమార భూపతి, నరసింహ భూపతి, ఆ తర్వాత తను........ది గ్రేట్ మీ!

    
    రాజా విక్రమాదేవరావ్!


    రాజా ఆఫ్ రాణీపురే!


    ఓ.బీ.యి. ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపయిర్!

    
    ద ఫెయిత్ ఫుల్ అల్లే ఆఫ్ బ్రిటీష్ ఎంపయిర్!

    
    అయన మళ్ళీ ఇంకోసారి-

    
    "రాజా ఆఫ్ రాణీపురే!" అని సొంత స్తోత్రం మొదలెట్టేలోగానే, అయన వెనకాలే ఉన్న ఎయిర్ హోస్టెస్ అంజలికి అనిపించింది. "ఎలాగూ చస్తున్నాం! చచ్చేలోగా ఈ ముసలాడి భేషజం వదిలేలాగా నాలుగు తిట్టి, రెండు తగిలిస్తే!


    అలా అనుకుని-


    "ఛీ! నోర్ముయ్!" అనబోయింది. అంజలి.

    
    అంతలోనే -


    అప్పటిదాకా ఆమె అందాలని కళ్ళతోనే జుర్రేసుకుంటున్న పురోహితుడు కట్లు తెంపుకు లేచి నిలబడినట్లు ఒక్కసారిగా నిలబడి, అంజలి అధరాలని, తన పెదవులతో గట్టిగా ముసేశాడు.


    అతగాడి నెత్తి పగిలేటట్లు బలంగా కొట్టింది అంజలి.


    "ఇంక చచ్చినా ఫర్లేదు!" అనుకున్నాడు ఆ పరమభాగోవతోత్తముడు.


    విమానం ఒక్కసారిగా గాల్లో జర్రున జరుతున్నట్లు కిందికి దిగడం మెదలెట్టింది.


    హోటల్ పక్కనే ఉన్న బురద మైదానంలో విమానాన్ని సురక్షితంగా దింపాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు పైలట్ సంజీవి.


    అప్పటికే-


    మైదానం పక్కనే ఉన్న పారడైజ్ హోటల్లోని జనం అంతా కళావికలై పారిపోయారు. ఒక్క డైమండ్ రాజా తప్ప!


    హోటల్లో పొరపాటున ఇంకా ఎవరైనా మిగిలిపోయారేమోనని అంతా కలియదిరుగుతూ గాలిస్తూనే ఉన్నాడు డైమండ్ రాజా.


    అతనికి తెలియకుండానే అతని మనసులో ఒక భావం మెదులుతోంది.


    ఈ ఆఠీన్ రాణి అనే పిల్ల వెళ్ళిపోయిందా? ఇంకా ఇక్కడే ఉందా?


    అతను అలా వెదుకుతూ ఉండగానే.......

    పైలట్ సంజీవి విమానాన్ని మైదానంలో దింపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ, కోపైలట్ ని అలర్ట్ చేశాడు.

    
    ఈసారి అదృష్టం బాగున్నట్లే ఉంది!


    విమానం హోటల్ బిల్డింగ్ మీదగా, మైదానంలోకి దిగడం మొదలెట్టింది.

    
    అప్పుడప్పుడు బండికి కట్టిన ఎద్దులు మొరాయించి, కదలనని భీష్మించి, లేకపోతే ఇంకోదారిలోకి మళ్ళీ సతాయించి, కాసేపటి తర్వాత మళ్ళీ బందివాడి మాట విని బుద్దిగా ముందుకు సాగినట్లు విమానం సంజీవి చెప్పినట్లు చెయ్యడం మొదలెట్టింది.


    "వీ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్!" అన్నాడు సంజీవి కో పైలట్ తో. అతని మోహంలో ఎంతో ఆత్మవిశ్వాసం కనబడుతోంది.


    ఇంక కొద్ది క్షణాలు.......

    
     ఆ తర్వాత లాండింగ్........


    మహా అయితే  విమానం బురదలో కురుకుపోతుంది.


    ఆ తర్వాత ఎమర్జెన్సి డోర్లు తెరవాలి!


    క్షణాల్లో అందరూ కిందికి దిగిపోతారు! సేఫ్ గా.


    ఆ తరవాత తను షాంపేన్ తాగి సెలబ్రేట్ చేసుకుంటాడు.

    
    భూమిని సమీపించింది విమానం.


    "వీ మేడ్ ఇట్!" అన్నాడు సంజీవి ఎక్జయిటేడ్ గా.

    
    అండర్ కారేజ్ అనే విమానం తాలూకు టైర్లు మైదానాన్ని తాకబోతు వుండగా........

 

    ముందు సీట్లో కూర్చుని వున్న విక్రమదేవరావుగారి ఖరీదైన బ్రీఫ్ కేసులో వున్నా టైం బాంబ్ హటాత్తుగా ఎక్స్ ఫోడ్ అయింది!

    
    చెవులు చిల్లులు పడేంత శబ్దం!

    
    ఆ తర్వాత విమానం బ్లాస్ట్ అయిపొయింది!


    ఆ ఇంపార్ట్ కి పారడైజ్ హోటల్ లోని కొంతభాగం కొలాప్స్ అయి, కుప్పకూలిపోయింది.

 


                                                                      * * *

    శ్మశానంలో...........

    
    ఇసుక వేస్తె రాలనంతమంది జనం గుమిగూడి వున్నారు.


    అందరూ ఎగ్జయిటేడ్ గా మాట్లాడుకుంటూ వున్నారు. జరుగుతున్న దానిని కుతూహలంగా చూస్తున్నారు చాలా మంది. అతి కొద్దిమంది మంది మాత్రం సానుభూతిగా నిలబడి చూస్తున్నారు.

    
    అప్పటిదాకా హడావుడిగా అటూఇటూ తిరిగి, కర్ర పెత్తనం చేసిన కరటక దమనకుల్లాంటి ఇద్దరు పెద్ద్దలు ఒక కారు దగ్గరికి చేరారు. వాళ్ళు కార్లో కూర్చోగానే కారు కదిలింది.


    వాళ్ళలో ఒకాయన నల్లదొరలాగా సూటు బూటు తో ఉన్నాడు. రెండో అయన ధోవతి కట్టుకుని, ఫుల్ షర్టు కండువాతో వున్నాడు.


    సూటూవాలా పేరు సుందరం.

    
    ధోతీవాలా పేరు సద్గుణం.


   సుందరం తన ఆనందాన్ని ఆపుకుంటూ చిన్నగా అన్నాడు.


    "ఒక్క దెబ్బతో మొత్తం వంశం సఫా! రబ్బరుతో తుడిచేసినట్లు తుడిచి పెట్టుకుపోయింది రాజా విక్రమదేవరావు కుటుంబం అంతా! ఇలా జరగడం అంటే మాటలు కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాల్సిన వింత ఇది!"


    "జరిపించిన వాడివి నువ్వే గదా! ఇంతకీ విమానం కూలిపోయింది విమానం ఇంజన్లు చెడిపోవడం వల్లనా, లేకపోతె మనం పెట్టించిన టైం బాంబ్ వల్లనా?"

 

    "రెండూ కాదు.......ఆ దేవుడి దయవల్ల అనుకోరాదు!" అన్నాడు సుందరం.


    "అంతేలే! శివుడి అజ్ఞలేకుండా చీమ అయినా కుడుతుందా ఏమిటి గాని..........ఇంతకీ ఆ బాంబ్ కి డబ్బులిచ్చేశావా?"

    
    "బాంబర్ ఎవరూ?"

 

    "బ్రీఫ్ కేసులో బాంబు పెట్టిన వాడులే! వాడికివ్వల్సింది ఇచ్చేశావా? లేకపోతే రచ్చ చేస్తాడు.

 Previous Page Next Page