జేబులోంచి బిల్లు తీశాడు కార్తిక్. "ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బయ్ ఏడు. నీ దగ్గర డబ్బు లేదా?" అన్నాడు కంగారుగా.
భుజాలు ఎగరేసి చిన్నగా నవ్వాడు శశికాంత్.
"ఇవాళ లేదు. కానీ రేపు వస్తుంది. ఆ ట్రాన్స్పోర్టు కంపెని చెక్కు రేపు క్లియర్ చేసుకునే సరికి ఎలాగో అకొంట్ లో డబ్బు వచ్చేస్తుంది. నధింగ్ టు వర్రీ!" అన్నాడు శశికాంత్.
"ఇటీజ్ నో యూస్ శశి!" అన్నాడు కార్తిక్ విసుగ్గా" ఆ ట్రాన్స్ పోర్టు కంపెని వాళ్ళు ఇప్పుడే ఇక్కడినుంచే నీ ఫోన్ ఉపయోగించే వాళ్ళ బ్యాంక్ మేనేజర్ ని కాంటాక్టు చేసి చెప్పారు. నీకు ఇచ్చిన చెక్కు అనర్ చెయ్యవద్దని."
"షిట్! అన్నాడు శశికాంత్ ఇప్పుడెలా?"
"ఎలా?" అన్నాడు కార్తిక్ అయోమయంగా.
"కార్తిక్! నెక్ట్స్ వీక్ నువ్వు సింగపూర్ వెళతానాన్నవు. కొత్త వీసిఅర్, విడియో కేమెర తెమ్మని యాభై వేలు ఇచ్చాను నీకు. ఆ డబ్బుతో ఈ బిల్ పే చేసేయ్. తరువాత సంగతి తరువాత చూసుకుందాం" అన్నాడు శశికాంత్.
భుజాలు తడుముకున్నట్లు ఇబ్బందిగా కదిలాడు కార్తిక్. 'ఆ డబ్బా! సారీ శశి! మొన్న మీ కంపెని తాలుకు బాకి ఏదో తీర్చమని బాంబే సెట్ ఒకతను వచ్చి గొంతు మీద కూర్చుంటే ఆ అమౌంట్ అటూ మళ్ళించి మీ బాకి తిర్చేశాను. లేకపోతే మీ కంపెని ప్రేస్టేజి , నీ పరువూ కూడా దెబ్బతింటాయి కదా! ఈ సంగతి నీతో చెబుదామనుకుంటూనే ఉన్నాను కుదరనే లేదు" అన్నాడు ఎటో చూస్తూ.
ఇంకా ఏదో సంజాయిషీ చెబుతూనే ఉన్నాడు కార్తిక్. కానీ కార్తిక్ చెబుతున్న మిగతా విషయాలు శశికాంత్ చెవికి ఎక్కడం లేదు.
అతను ఇందాక మాట్లాడిన మాటలే ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. మీ కంపెని, నీ పరువు-
కార్తికేనా ఈ మాటలు అంటోంది! కార్తిక్! తన మిత్రుడు, తన సచివుడు! తన బంధువు.
అంతా బుల్ షిట్!
అసలైన అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది ఎవరు ఎవరో , ఎవరికి ఎవరు ఏమవుతారో!
మీ కంపెని, నీ పరువూ......ఒక గంట క్రితం దాకా మన కంపెని, మన పరువూ, మన పర్సు, అన్నట్లు మాట్లాడిన ఈ బేవార్సుగాడేనా ఇప్పుడిలా మాట మర్చేస్తోంది?
శశికాంత్ పెదాలు బిగుసుకు పోయాయి.
కార్తిక్ ఇంకేదో చెబుతూనే ఉన్నాడు. అతన్ని కట్ చేస్తున్నట్లు ఉజ్వల వైపు తిరిగాడు శశికాంత్.
ఆ అమ్మాయి కూడా అతనికి దూరపు బంధువే. వరసకు మరదలు అవుతుంది. ఈ పార్టి అటెండ్ కావడానికి ప్రత్యేకంగా బాంబే నుంచి వచ్చింది తను.
"ఇదంతా చూసి నువ్వు చాలా ఇబ్బందిగా ఫీలయు ఉంటావు ఉజ్వలా!" అన్నాడు శశికాంత్ ఉజ్వలతో.
చిన్నగా నవ్వింది ఉజ్వల.
"అబ్బే! అలాంటిదేమీ లేదు. కష్టాలనేవి అందరికి వస్తూనే వుంటాయి. శశి! అంతేకాదు కష్టాలు కలకలం నిలవవు కూడా. ఇందాక వాళ్ళతో చెప్పిన మాటల్లో ఒకటి నాకు నచ్చింది. టైము ఇవ్వండి. ఎవరికి రావలసిన డబ్బు వాళ్ళ మొహన కొట్టేస్తానన్నావు. యుద్ధం చేసేవాళ్ళకి ఉండవలసింది శౌర్యం. ఇలాంటి బిజినెస్ వార్స్ లో ఇరుకున్న వాళ్ళకి కావలసింది ధైర్యం. అది నీకు పుష్కలంగా ఉంది. బకప్ బాస్టర్డ్ ! నువ్వు గెలిచి తిరతావ్!
ఆమె వైపు కొద్ది క్షణాలు తదేకంగా చూశాడు శాశికాంట్.
ఏం మాట్లాడినా చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది ఉజ్వల. ఆ అమ్మాయికి అన్నీ వున్నాయి - అందచందాలు, ఆస్తిపాస్తులు, అమెరికన్ డిగ్రీలు- అన్నీ. అందుకనే తన మీద తనకి అచంచలమైన విశ్వాసం ఉంది ఉజ్వలకి. అది అప్పుడప్పుడూ అహంభావంలా కనబడుతుంది చేసేవాళ్ళకి.
"థాంక్స్ ఉజ్వలా! నా హితవు కోరుకునే నీ లాంటి వాళ్ళు కొందరైనా వున్నారని తెలిస్తే నేను అద్భుతాలు చెయ్యగలను. థాంక్స్ ఎగేయిన్!" అన్నాడు శశికాంత్ సిన్సియర్ గా.
"యూ ఆర్ వెల్ కమ్!" అని నవ్వి చిన్న చిన్న వజ్రాలు పొదిగిన వాచ్ వైపు చూసుకుంది ఉజ్వల.
"నేను వెళ్ళి వస్తాను శశీ!
"అప్పుడేనా? ఎక్కడికి వెళుతున్నావ్!" అన్నాడు శశికాంత్ ఆశ్చర్యంగా.
"ఆ సిమ్లా కాన్ఫరెన్స్ ఎగ్గోట్టేసి రెండ్రోజులు ఇక్కడే ఉండిపోవచ్చుననుకున్నానా? కానీ కాన్ఫరెన్స్ లో నా పేపరు నేనే స్వయంగా చదవక తప్పదని టెలెక్స్ మెసేజ్ ఇచ్చారు. ఐ హావ్ టు లీవ్ శశీ! ఎట్ వన్స్! ఐ కాంట్ హెల్ప్ ఇట్!" అంది తన అసహాయతను సూచిస్తూ. చేతులు కొద్దిగా చాచి , భుజాలు ఎగరేసి.
నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు ఆమె వైపు చూశాడు శశికాంత్. అతని మనసు మండిపోయింది.
నువ్వు కూడానా ఉజ్వలా! నువ్వు కూడానా! ఎందుకు ఉజ్వాలా అందమైన ఈ అసత్యాలు!
ఎందుకు ఉజ్వలా, ఈ కపటాలు! ఈ నాటకాలు! ఈ బూటకాలు!
కానీ మనసులో మెదులుతున్న భావాలు మొహంలో కనబడకుండా చిరునవ్వు పెదిమలకు అంటించుకున్నాడు శశికాంత్ - ఒకే దెన్! సియూ ఉజ్వలా!" అన్నాడు ఉదాసినంగా.