ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది!
టైమ్ చూశాడు.
రాత్రి పదవుతోంది.
తను ఒక్క రౌండ్ కొట్టి పేషంట్లందర్నీ చూసి రావాలి - ప్రమీలని తోడుగా తీసుకుని. శశి ఉంటే అన్నీ తనే చూసుకుంటుంది. కాని శశి ప్రస్తుతం చాలా.....చాలా......దూరంలో...
ఏం చేస్తుందో? ఒక్కతే వెళ్ళింది ! ఎలా ఉంటుందో!
శశి లేకపోయినా, నర్సు ప్రమీల రొటీన్ విషయాలు తనే చూసుకోగలదు - వీరభద్రరావుతో సంప్రదింపులు జరుపుతూ.
తన నెవ్వరూ సంప్రదించరు!
డాక్టరుగా విలువలేదు తనకు.
భర్తగా, ప్రియుడుగా శశి నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తుంది తనని.
డాక్టరుగారి భర్తగా, బిజినెస్ మాగ్నెట్ గారి అల్లుడిగా గౌరవిస్తుంది నర్స్. వూళ్ళో అందరూ అంతే! డాక్టరుగా మాత్రం కాదు.
నిజమే! తను డాక్టరుగా ఫ్లాప్! పుస్తకాలన్నీ తల్లకిందులుగా అప్పచెప్పెయ్యగలడు గానీ, పేషెంటుని ఎదురుగా పెట్టుకుని జలుబంటే అది టి.బి. అవుతుంది. టి.బి. అని తెలిస్తే అది పడిశెపు దగ్గవుతుంది.
తన హస్తవాసి అలాంటిది!
లేచాడు.
ప్రస్తుతం నర్సింగ్ హోమ్ లో అరడజనుమంది ఇన్-పేషెంట్స్ ఉన్నారు. అందరూ డబ్బున్న పేషెంట్లు! డబ్బు జబ్బులూనూ ఒక్క రిక్షా రాములికి, ఆ మేడమీద రూంలో వున్న శంకర్రావు భార్యకీ తప్ప! ఆ అమ్మాయికి డబ్బూలేదు, జబ్బూ లేదు! మామూలు తలనొప్పే అని వీరభద్రరావు తేల్చాడు.
రౌండ్సు కెళ్ళాడు. నర్సు పక్కనే నడుస్తూంది. కింద ఆరు గదులూ, పైన రెండు గదులూను. అన్ని గదుల్లో యాంటీ సెప్టిక్ వాసన. ఆ వాసనంటేనే అసహ్యం డాక్టర్ సుధీర్ కి.
అందుకే గంట కోసారి యూడికొలోన్ ఒంటిమీద వంపేసుకుంటూ ఉంటాడు.
క్రింద రూమ్స్ లో అందర్నీ చూడడం పూర్తయింది. అనాసక్తిగా, అయిష్టంగా రొటీన్ చెకప్ చేశాడు పేషెంట్లని.
పైన నాగరత్నమ్మ, శంకర్రావు పెళ్ళాం ఉన్నారు. సుధీర్ మేడెక్కాడు. నాగరత్నమ్మ టెంపరేచర్ చూసి, రెండు కాంపోజు టాబ్లెట్లిచ్చి, తర్వాత శారద గదిలోకి వచ్చాడు.
అక్కడ ఉన్న మేగజైనులు తిరగేస్తూంది శారద. అవన్నీ తనెప్పుడూ చూసి ఎరగదు. కూడబలుక్కుని చదివింది. రీడర్స్ డైజెస్ట్, ఇమ్ ప్రింట్, పంచ్, సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్, టైం మేగజైన్.
'ఏవైనా తెలుగు పత్రికలుంటే బావుండు!' అనుకుంటూ వూరికే బొమ్మలు చూసింది శారద. అడుగుల శబ్దం విని తలెత్తి చూసింది.
పలకరింపుగా కళ్ళెగరేశాడు సుధీర్.
శారద మొహమాటంగా చిరునవ్వు నవ్వి, పమిట సవరించుకుని, లేచి నిలబడింది.
"శంకర్రావు వెళ్ళిపోయాడా?"
శారద జవాబు చెప్పేలోపలే - "ఇప్పటిదాకా ఇక్కడే ఉండి. ఇప్పుడే వెళ్ళాడు" అంది నర్సు.
సుధీర్ ప్రొఫెషనల్ గా శారదని పరికించి చూశాడు. తర్వాత దగ్గరకొచ్చి, 'అసంకల్పిత ప్రతీకార చర్య' లాగా అప్రయత్నంగా, అలవాటుగా శారద చెయ్యి పట్టుకుని 'పల్స్' చూశాడు. నార్మల్ గా వుంది. ఆ అమ్మాయివైపు చూశాడు. నార్మల్ గా- మామూలుగా వుంది. ముక్కు మాత్రం చాలా బావుంది. కళ్ళలో అదో రకమైన దిగులు. డబ్బు కష్టాలా?
ఆడదాన్ని చూడగానే అందచందాలు బేరీజు వెయ్యడం చాలామంది మగవాళ్ళకి ;అసంకల్పిత ప్రతీకార చర్య' కాబట్టి అతని చెయ్యి డాక్టర్ లా ప్రవర్తిస్తుండగా, అతని కళ్ళు మగవాడిలా వాడిగా చూస్తున్నాయి.
'చాలా మామూలు అందం' అనుకున్నాడు సుధీర్.
ఏ ఆడది కనబడినా, శశితో పోల్చి చూసుకోవడం కూడా సుధీర్ కి అలవాటు.
శశితో పోలిస్తే, ఈమె అందం శశి మోచేతి కింద వున్న పుట్టుమచ్చ అందానికి సరిపోతుంది. అలాంటి 'అందమైన పుట్టుమచ్చలు శశి ఒంటిమీద నాలుగు చోట్ల ఉన్నాయి.
శశి దేవకన్య! ఈ అమ్మాయి.....ఫర్వాలేదు, బాగానే వుంది. కొద్దిగా అందంగా ఉందేమో కూడా!
ఒక్కక్షణం నుదురు చిట్లించి ఆలోచించాడు సుధీర్. తర్వాత నర్సు చేతిలో వున్న ట్రేలోనుంచి సిరంజి తీసుకుని శారద భుజంమీద ఇంజెక్షన్ ఇచ్చాడు.
నొప్పికి కళ్ళు మూసుకుని, పెదిమలు కొద్దిగా తెరిచింది శారద.
రౌండ్సు పూర్తయిపోయాయి. గదిలోకి వచ్చి, బట్టలు మార్చుకుని, మంచంమీద ఒరిగిపోయాడు సుధీర్. పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు.
మృదువుగా శశి వళ్ళు తగలలేదు.
శశి కేరళ వెళ్ళింది.