రోడ్డుకి అవతలివైపు వెళుతున్న కార్లు ఆగుతాయి. డ్రైవర్లు దిగుతారు. వోనర్లు కిటికీలోంచి తల బయట పెట్టి ఆసక్తిగా చూస్తుంటారు. సీన్ దిగులుగా ఎన్ జాయ్ చేసి వెళ్ళిపోతున్న వాడ్ని అవుతారు.
"ఏమయింది?" అని ప్రశ్న! శవమా, కాదా? అన్న ఆతృత! శవం అని తెలియగానే అందరూ దిగి గబగబ రైలింగ్ వైపు పరిగెడతారు.
ఒక్కోసారి వాళ్ళకి నిరుత్సాహం కలిగేటట్లు, "ఏం లేదన్నా! గణేష్ బొమ్మని నీళ్ళలో వదిలిండ్రు!" అంటాడు ఒకడు, చూడాల్సిన పసందైన సీన్ ఏమీ లేదన్నట్లు.
"అంతేనా" అంటూ కదలిపోతారు జనం, కొద్దిగా డిసప్పాయింట్ అయి.
అది రాక్షసత్వపు ఛాయకాదా ?
ఎక్కడో రోడ్డుమీద యాక్సిడెంట్ అవుతుంది. "బాగా దెబ్బలు తగిలాయా? ఎవళ్ళయినా చచ్చిపోయారా?"
అదీ ప్రశ్న! ఆ ప్రశ్నలో బాగా దెబ్బలు తగిలి ఉండాలనీ, ఒకళ్ళిద్దరు పోయి ఉండాలనీ వాళ్ళకే తెలియని సబ్ కాన్షస్ కోరిక!
అందరి మాటా ఏమోగానీ, తనలో మాత్రం ఆ స్ట్రీక్ వుంది. అది తనకు తెలుసు. అది మరెవ్వరికీ తెలియదు. తెలియనివ్వడు తను. పెద్దమనిషిలాగానే చెలామణి అయిపోతాడు.
'చెయ్యకూడదు' అన్న పనులు చెయ్యడం సరదా తనకు! 'వద్దు' అన్నవి చెయ్యడంలో తిరుగుబాటు ఉంది. ఆ తిరుగుబాటు తన కిష్టం!
చిన్నప్పట్నించీ తనకి ఒక కోరిక ఉండేది.
ఒక పిల్లిని చంపాలని!
పిల్లిని చంపితే పంచమహా పాతకాలూ
పిల్లిని పీకనొక్కి చంపడం సాధ్యంకాదు! గుడ్లు పీకి నిన్నే చంపుతుందది!
అందుకని దాన్ని చేతుల్లో ఎత్తుకుని ముద్దు చేస్తూ బావి దగ్గరికి తీసుకెళ్ళి హటాత్తుగా వదిలేశాడు.
"మ్యావ్!.....మ్యావ్...వ్!" అనే దాని హృదారవిదారకమైన అరుపు 'దబ్' అనే శబ్దంతో కలిసిపోయింది.
పిల్లి నీళ్ళలో మునిగింది.
దాని ప్రాణాలు గాలిలో తేలాయి.
ప్రాణాలు పోయేముందు అది కాసేపు తేలుతూ బావి గోడని పట్టుకుని పైకెక్కడానికి ప్రయత్నిస్తూ, జారుతూ, ఎక్కుతూ, వెక్కుతూ పిల్లి భాషలోనే ఏడుస్తూ వుంటే....తను నిశ్శబ్దంగా చూశాడు.
ఇదంతా ఎప్పుడూ? తన పదో ఏట!
సీతాకోక చిలుకలను పట్టుకుని వాటి రెక్కల్ని తుంచెయ్యడం, తూనీగల్ని పట్టుకుని వాటితోకల్లో గుండుసూదులు గుచ్చడం, బొద్దింకల్ని పట్టుకుని బ్లేడుతో వాటి తల నరికెయ్యడం - ఇవన్నీ చిన్నప్పుడు తనకి సరదాగా ఉండేవి.
అసలు తను మెడిసన్ లో చేరడానికి సగం కారణం ఆ సరదానే!
బొద్దింకల్ని డిసెక్ట్ చెయ్యొచ్చు. కప్పల్ని కొయ్యవచ్చు. వానపాముల్ని చీల్చవచ్చు. ఆ తర్వాత-తర్వాత.. శవాల్నీ, మనుషుల్నీ కూడా!
మళ్ళీ పుస్తకంలో తల దూర్చాడు.
సినిమా స్టార్ ని.....నలుగురు....రేప్....మానభంగం.
అతని చేతుల మీది రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
రేప్!
ఎలా ఉంటుందా ఎక్స్ పీరియన్స్ ?
ఆడది గిలగిల తన్నుకుంటూ ఉంటే, డిసెక్ట్ చెయ్యబోయే తెల్లపావురాయిని పిన్నులతో బోర్డుకి గుచ్చినట్లు రెండు చేతులతో రెండు చేతులూ, రెండు కాళ్ళతో రెండు కాళ్ళూ తొక్కిపట్టేసి..
ప్రాక్టికల్ గా, ఎక్స్ పెరిమెంట్ లా చేసి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే?
అవును! స్వయంగా చూడాలి! అప్పుడుగానీ కుతూహలం తీరదు. కాక్రోచ్ ని డిసెక్ట్ చేస్తే. లోపల డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ - ఎలా ఉంటాయో ప్రతి టెక్స్టులోను రాసే వుంటుంది.
ఫలాని కెమికలూ, ఫలాని కెమికలూ కలిపితే ఏం వస్తుందో ప్రతి టెక్స్టులోను వివరించే వుంటుంది.
అయినా ప్రతి స్టూడెంటూ స్వయంగా డిసెక్ట్ చేసి, ప్రయోగాలు చేసి విషయలు గ్రహిస్తాడు.
రేప్ అంటే ఎలా వుంటుందో శతకోటి రచనల్లో చదివాడు తను. లెక్కలేనన్ని సినిమాల్లో చూశాడు.
స్టిల్...
ఆ సమయంలో ఆడదాని కళ్ళలో భయం, దుఃఖం, నిస్పృహ, విడిపించుకోవాలనే విశ్వప్రయత్నం స్వయంగా చూస్తే -