ఒక్కతే!
తనని ఇక్కడే వదిలేసి!
హఠాత్తుగా అతనికి అదో విధమైన ఉత్సాహం, సంతోషం కలిగాయి.
తల్లి పక్కకి వెళ్ళగానే పిల్లాడు అల్లరి చేయడానికి నిశ్చయించుకున్నట్లు అతను లేచాడు.
ఇదీ ఒకందుకు మంచిదే! అప్పుడప్పుడు భార్య దగ్గర లేకుండా ఆటవిడుపులా ఉంటే తప్ప, శశి తండ్రి సంపాదించిన, శశి సంపాదిస్తున్న లక్షలు తను ఎంజాయ్ చేసేదెప్పుడు?
అందుకనే ఇవాళ ఒక అడ్వెంచర్ చెయ్యాలి.
మూడువేలు ఖర్చుపెట్టి, ముద్దులొలికే ఒక అమ్మాయి అందాన్ని ఇవాళ కొనాలి.
'అందమైన' అంటే, శశి అంత అందమైన అని కాదు అర్ధం!
శశి అతిలోకసుందరి.
స్టిల్...
వెరైటీ ఈజ్ ద స్పయిస్ ఆఫ్ లైఫ్.
రోజూ మీగడ పెరుగేసుకు తిన్నా, బోర్ కొడుతుంది. ఒక్కోరోజు నిమ్మకాయ కలిపిన నీళ్ళ మజ్జిగ వేసుకోవాలనిపిస్తుంది తనకు.
లేచి మంచంమీద కూర్చుని, మృదువైన రగ్గు భుజంమీదుగా కప్పుకుంటూ, టెలిఫోన్ ఎత్తాడు సుధీర్. ఒక నంబరు రింగ్ చేశాడు. ఆ నంబరు అతనికి కళ్ళ ముందు కనబడుతోంది. డిజిటల్ వాచీలో చుక్కలు కనబడి, ప్రతి సెకండుకీ మాయమయి, మళ్ళీ కనబడుతున్నట్లు, అతని గుండె చప్పుడుతో లయగా ఆ ఫోన్ నంబరు తాలూకు అంకెలు మనోఫలకం మీద వెలిగి ఆరిపోతున్నాయి. ఎక్కడా ఆ నంబరు నోట్ చెయ్యలేదు తను. నోట్ చెయ్యొద్దని మరీమరీ చెప్పాడు ఆ నంబరిచ్చిన క్లబ్బు మెంబరొకడు. "చాలా రిస్కు, బ్రదర్! కొంపలు మునిగిపోతాయి. సంసారాలు కూలిపోతాయి. వీళ్ళు కూలీ నాలీ చేసుకునే మనుషులు కారు. అయినింటి ఆడపడుచులూ - కాలేజీలో చదువుకునే అమ్మాయిలూ, ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళూను. కొంతమంది బతికి బట్టకట్టడంకోసం చేస్తే, ఇంకొందరు ఖరీదైన బట్టలు కట్టడం కోసం, సరదాకోసం చేస్తారు. డేంజర్! జాగ్రత్త!" అన్నాడు.
చాలా సేపటి తర్వాత ఎవరో ఫోన్ ఎత్తారు. స్త్రీ కంఠం.
"ఎవరు?" అంది ఆ గొంతు కంగారుగా, భయంగా.
తనపేరు చెబితే ఆమె గుర్తుపట్టదు. అందుకని "రంగారావ్ మీ నంబరుకి ఫోన్ చెయ్యమని..." అని చెప్పబోయాడు.
ఆమె హడావుడిగా "పోలీస్ రెయిడింగ్ జరుగుతోంది...సారీ! మరోసారి.." అంటూ ఫోన్ పెట్టేసింది.
పొంగుతున్న ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లయింది సుధీర్ కి.
అతను రిసీవర్ పెట్టెయ్యలేదు - విసురుగా పడేశాడు.
చెయ్యని నేరానికి ఉరి తీయబడ్డ ఖైదీలా అది విషాదంగా వైరుకి వేళ్ళాడుతోంది. నిస్సహాయత, చేతకానితనం అతని మనసుని చిరాకు చేసిపారేశాయి. అదుపులో పెట్టుకోలేని కోపం వచ్చిందతనికి.
తనకి చిన్నప్పట్నుంచీ అంతే! మానసికంగా బాధ కలిగితే , తను అనుకున్నది జరక్కపోతే వెర్రి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం, ఆ చిరాకు ఇంక దేనిమీదయినా చూపిస్తే తప్ప, ఆరాటం తగ్గదు. చిన్నప్పుడు టీచరు తనని కోప్పడితే, తర్వాత చాటుగా ఆ కోపం పలకమీద చూపించి, దాన్ని విరక్కొట్టేవాడు.
నిలబడి నేలను గట్టిగా కాలితో తన్నాడు. మళ్ళీ..మళ్ళీ....తన్నాడు.
తర్వాత రొప్పుతూ షెల్ఫు దగ్గరికి నడిచి, తను సాయంత్రం కొని పుస్తకాల వెనక దాచిన 'బ్లాక్ అండ్ వైట్' విస్కీ బాటిలు తీశాడు. గ్లాసులు తియ్యలేదు. మూత ఓపెన్ చేసి, అలాగే బాటిల్ ఎత్తి పెదిమలకానించి గటగట అయిదారు గుక్కలు తాగాడు విస్కీ అతని పెదిమల పక్కనుంచి కారి చుక్కలుగా షర్టుమీద పడుతోంది.
'చక్కని చుక్కతో తీరాల్సిన దాహం - విస్కీ చుక్కతో తీరుతుందా!' అనుకున్నాడు.
ఓహ్! పొయిట్రీ మందు పని చేస్తుందన్నమాట!
రగ్గు తీసి కింద పారేసి మంచంమీద పడుకుని మళ్ళీ 'ఫాన్ క్లబ్బు' అందుకున్నాడు.
సినీతార.....రేప్...మానభంగం!
అప్పటిదాకా ఉక్కగా ఉన్న వాతావరణం హఠాత్తుగా పెనుగాలులు వీచడంతో చల్లబడిపోయి ఆకాశంలో ఎవరో మహాకాయుడు తాగుతున్న మద్యం పీపాకు చిల్లులు పడినట్లు పెద్ద పెట్టున వర్షం పడడం మొదలెట్టింది.
లేచి కిటికీ తలుపు తీశాడు.
పక్కింటి శర్మగారి మేడమీద కిటికీ అద్దాలు మూసి ఉన్నాయి.
శర్మగారి కూతురు, అల్లుడూ ఉండే గది అది.
వాళ్ళు లైటు ఆర్పలేదు. మర్చిపోయారో.....ఏమో మరి.....ఆ అమ్మాయి కిటికీకి, లైటుకీ మధ్య ఉంది.
ఆ అమ్మాయి బట్టలు మార్చుకోవడం నీడలా కిటికీ మీద కనబడుతోంది.
ఒళ్ళు వేడెక్కింది సుధీర్ కి.
హఠాత్తుగా అతని మెదడులో ఉన్న గ్రేసెల్స్ లోని కొన్నింటిలో అనుకోని చైతన్యం వచ్చి, మెరుపులా ఒక ఆలోచన రూపు దిద్దుకుంది. అంతటి ఆలోచన తనకు తట్టినందుకు మెదడు చాలా సంతోషించి, తన సంతోషాన్ని పంచుకోమని శరీరంలోని ప్రతి అణువుకీ ఆర్డరు జారీచేసింది.