Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 4

 

    అది వింటున్న సత్తిపండుకు నవ్వు, ఏడుపు రెండు కలసి వచ్చాయి.


    "ఓ మైగాడ్" అనుకుంటూ ఆ జంట గబగబా లోపలికి దిగి రెండు బిస్లరి బాటల్స్ కొత్తవి ఓపెన్ చేసి అందులోని నీళ్ళు పారబోసి హుస్సేన్ సాగర్ నీళ్ళు నింపుకున్నారు.


    ఆ ఆంగ్లో ఇండియన్ కొన్ని నీళ్ళు తీసుకుని నోట్లో పోసుకోబోయింది.


    "ఏం చేస్తున్నారు?" కంగారుగా అడిగాడు శ్రీచంద్ర.


    "నాకు ఉబ్బసం.....ఈ నీళ్ళు తాగితే....."


    గతుక్కుమన్నాడు శ్రీచంద్ర.


    ఆ నీళ్ళు తాగితే చచ్చురు కుంటారు ఎలా చెప్పాలో తెలియలేదు. ఆ నీళ్ళు తాగితే జబ్బులూ తగ్గడం కాదు, వస్తాయి అని చెప్పాలని నోటిదాకా వచ్చినా అసలు విషయం తెలిస్తే తనని, సత్తిపండుని హుస్సేన్ సాగర్ లో తోసేస్తారని అర్ధమైంది.


    "మేడమ్! ఈ నీళ్ళు ఇప్పుడు తాగకూడదు. ఓన్లి సమ్మర్ సీజన్ లో వీటికి ఆ శక్తి వస్తుంది. సమ్మర్ నేను మీ అడ్రస్ కు నీళ్ళు సీసాల్లో నింపి ప్యాక్ చేసి పంపిస్తాను" చెప్పాడు సిన్సియర్ ఎక్స్ ప్రేషనిస్తూ.


    "నువ్వు చాలా మంచివాడివి" అన్నడావిడ భర్త.


    "నీ మొహం మండా" అచ్చాతెలుగులో అనుకున్నాడు శ్రీచంద్ర.


    "ఏంటి ఏదో అంటున్నావు?" అడిగింది లేడి టూరిస్ట్ అతని తెలుగు అర్ధం కాక.


    "మీ మొహం చాలా బావుంది. మీరు స్వీట్  సిక్స్ టీన్ గా వున్నారని అంటున్నాను" అన్నాడు.


    ఆమె పొంగిపోయి తన హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టి ఓ అయిదువందల నోటు తన మొగుడు చూడకుండా ఇచ్చింది.


    అలా అరగంటపాటు అక్కడ విగ్రహాల గురించి, టాంక్ బండ్ గురించి తనకు తోచినట్టు చెప్పేసి ఆయాసపడిపోయాడు.


    అసలు విషయం తెలియని ఆ జంట మహాదానందపడిపోయింది.


    "నీకు చాలా విషయాలు తెలుసు. నీలాంటి గైడ్ దొరకడం మా అదృష్టం ఎక్కువ టైమ్ లేదు. ఈ వేళ ఈవినింగ్ ప్లయిట్ కి వెళ్ళిపోతున్నాం. థాంక్యూ నైస్ గై" అంటూ ఓ అయిదువందల నోటు శ్రీచంద్ర చేతిలో కుక్కాడు అతడు.


    శ్రీచంద్రకు నడిరోడ్డుమీద డాన్స్ వేయాలనిపించింది.


    ఆ టూరిస్ట్ జంట మరోసారి శ్రీచంద్రకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.


    ఆ జంట వెళ్ళిపోయాక అరగంటపాటు తనలో తానే పిచ్చి నవ్వు నవ్వుకుని ఇందాకా ఆ లేడి ఇచ్చిన అయిదువందలు, ఆవిడ భర్త ఇచ్చిన ఐదువందలు కలిపి చూసుకుని 'యాహు' అని అరిచాడు.


    "ఏంటి గురూ! అంతలా అరిచావు. నీ అరుపు ఆ టూరిస్టు జంటకు వినబడి వెనక్కు వచ్చి అసలు విషయం తెలుసుకుంటే మన ఎముకలలో సున్నం కూడా మిగలదు" అన్నాడు కాస్త భయంగా సత్తిపండు.


    "ఏడ్చారు. వాళ్ళు తిరిగిరారు" అన్నాడు శ్రీచంద్ర.


    "ఒకవేళ వాళ్ళకు అసలు విషయం తెలిస్తే?"


    "చచ్చినా తెలియదు"


    "తప్పు కదూ గురూ పాపం.....వాళ్ళు అవన్నీ నిజమని నమ్మారు ఎందుకంటావ్?" అని అడిగి శ్రీచంద్ర వైపు చూసి నోరు మూసుకున్నాడు.


    "తప్పదు పండు. ఒకటి.......వాళ్ళు కంపు కొట్టి నీళ్ళ గురించి తెలుసుకుని ఛి అనుకోకుండా ఈ కంపు నీళ్ళగురించి గొప్పగా చెప్పా. మనవాళ్ళు రోజు ఇలా టాంక్ బండ్ నుంచి వెళ్తారు గానీ ఒక్కసారి కూడా ఈ బుద్ద విగ్రహం వైపు చూడ్డంగానీ, ఈ బుద్ద విగ్రహం గొప్పతనం తెలుసుకోవడం గానీ చేస్తారా? ఆ బుద్దుడి కద తెలుసుకుంటారా? ఉహూ? తెల్సుకోరు. కానీ ఎక్కడ్నుంచో వచ్చిన వాళ్ళకు ఎంత ఇంట్రస్టు? ఇలా చెబుతూ చెబుతూ మనమైన ఏదో ఓరోజు బుద్దుడి గురించి తెలుసుకుంటాం. ఇంకా మోసమంటావా? ఎదుటి వ్యక్తికీ నష్టం లేకుండా మనం బ్రతకితే చాలు. అయినా పాపం పుణ్యం, కష్టం నష్టం ఆలోచిస్తూ వుంటే మన పొట్ట బక్కచిక్కి చచ్చిపోతుంది. పద హాయిగా భోంచేద్దాం..."


    "వెరైటి....కృష్ణ ఒబరాయ్ కు వెళ్దామా?" సత్తిపండు ఆశగా అడిగాడు.


    "డిల్లీలో హోటల్ షేరాటాన్ కు వెళ్దాం. లేకపోతే మౌర్యకు వెళ్దాం. మొన్ననే జయలలిత వెళ్ళొచ్చింది. ఆ గదులే అద్దెకు తీసుకుని వెరైటిగా ఓ రోజుండి వద్దాం" వళ్ళు మండి అన్నాడు శ్రీచంద్ర.


    "అదేంటి గురూ......ఏదో ఓ రోజు మనం కృష్ణ ఒబరాయ్ లో భోజనం చేయకపోతామా?" అన్నాడు సత్తిపండు.


    "కదా! పోనీ అమ్మేస్తాడేమో కనుక్కుందాం అడ్వాన్స్ గా ఈ వెయ్యి ఇచ్చేద్దాం."


    శ్రీచంద్ర సెటైర్ అర్ధమైంది సత్తిపండుకు.


    శ్రీచంద్రలో నచ్చే గుణం ఇదే సత్తిపండుకు.


    ప్రతి విషయాన్ని ఈజీగా , సరదాగా తీసుకుంటాడు. ఈ రోజు గురించి బాధలేదు. రేపటి గురించి బెంగపడడు. ఆత్మవిశ్వాశాన్ని వదులుకోడు. అత్మభిమానాన్ని చంపుకోడు.


    జీవితమంటే టేకిటిజీ అంటాడు.


    "ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తెరగా తింటున్నానని తండ్రి ఒక మాటన్నందుకు అన్నం మిద కూచున్న శ్రీచంద్ర అలాగే లేచి బయటకు వచ్చాడు.


    అప్పట్నుంచి ఇంట్లో భోం చేయడం మానేశాడు. మార్నింగ్ టిఫిన్ కాఫీలు తప్ప ఇంట్లో భోజనం మానేసి మూడు నెలలు అయింది.


    కొడుకు పట్టుదల తెలిసిన తల్లి కామ్ గా వుండిపోయింది. ఓ రోజు బామ్మ ఆ విషయమే అడిగితే......


    "ఒసే ముసలి బామ్మా.....నాకు నాన్న మిద ద్వేషం, అమ్మ మీద కోపం లేదు. అసలు నాకేవరి మీదా కోపము లేదు. ఈ అన్నం మీదే కోపం. అయినా నా ఒక్కడికి నేను అన్నం సంపాదించుకోలేకపోతానా? ఏమి చదువుకొని ముష్టివాడు అన్నం అడుక్కుని బ్రతుకుతున్నాడు. ఇంట చదివిన నేను నా అన్నం సంపాదించుకోలేనా? చూద్దాం. ఇవ్వాల్టి నుంచి కనీసం రెండు పూటలా కాకపోయినా ఒక్క పూటయినా అన్నం సంపాదించుకుంటాను" అన్నాడు.


    ఆ రోజు నుంచి ఇంట్లో అన్నం తినడం మానేశాడు. ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఆ పూటకు అన్నం తింటున్నాడు.

 

            
                                                                    * * *

 

    శ్రీచంద్రను చూస్తే ముచ్చటేస్తుంది సత్తిపండుకు.


    "గురూ.....నువ్వు అన్నం తినడమే కాదు, నీ పక్కనున్న వాడూ అన్నం తినాలని వాడి కడుపూ నిండాలని ఎంత తాపత్రయపడతావు. అందర్నీ నవ్వించే నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి గురూ. నాకు అమ్మ లేదు. నన్ను పెంచింది నాన్న నా ప్రయోజకత్వం చూడకుండా కన్నుమూశాడు. నాకేంటి దిక్కని దిక్కు తోచక ఏడుస్తుంటే నన్ను ఒదార్చావ్. నాకు దిక్కయ్యావు. నా దైవమయ్యావు. థాంక్యూ గురూ.....ఎందుకంటావ్?" ఏడుస్తూ చేతులు జోడించి అన్నాడు.


    శ్రీచంద్ర అతని భుజం తట్టాడు. అతని కళ్ళు అప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి.


    "మెలో డ్రామా డైలాగులోద్దు ఫ్రెండ్.. అన్నం ముందు కంట తడి పెట్టొద్దు. ఏ బాష, ఏ కులం, ఏ మతం లేనిది అన్నమే. ఎదుటి వ్యక్తీ కడుపు నింపడమే తెలుసు. కష్టాలన్నీ మన ఇష్టాలనుకున్నప్పుడు ఆ ఇష్టాలే మన కష్టాలను దాచి పెట్టినప్పుడు మన దారి ఎప్పుడూ రహదారే.......కానిరా ముందు ఆత్మారామున్ని సంతుప్తిపర్చు."

 Previous Page Next Page