"అదిగో మళ్ళీ ప్రశ్నలేస్తున్నారు. జవాబు మాత్రమే నే అడిగింది. మా కిష్టం లేదన్నాము. వేరే యిల్లు చూసుకోండి."
"నేనేం పాపం చేశానండి, వేరే యిల్లెతుక్కుమ్తూ పొమ్మన్నారు. ఇంతకన్నా ఓ గుక్కెడు విషమిచ్చి తాగమంటే కూల్ డ్రింక్ లా తాగేవాడని కృష్ణలో దూకమంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ ఎండలో అట్లపెనంలా మాడిన తారురోడ్డుమీద నడిచివెళ్ళి మళ్ళీ దూకేవాడిని."
వైజయంతికి నవ్వొచ్చింది. కాస్త ప్రయత్నించి బిగపట్టుకుంది.
"ఒక్క మనిషికి రెండు గదులెందుకండి. మీ కనవసరం పైగా అద్దె తొంభై రూపాయలు. పంపు వగైరాలకి పదిరూపాయలు మొత్తం..."
వైజయంతి మాట పూర్తిచేయకముందే జేబులోంచి గబుక్కున పర్స్ తీసి "అడ్వాన్స్ ఎంతివ్వమంటారు? ఎన్ని నెలల కివ్వమంటారు?" అన్నాడు మదన్ గోపాల్.
సౌభాగ్యమ్మకి మనసులో వకటిపైకొకటి వుండదు.
"ఆ భాగం డెబ్బై అయిదే కదే" అంది.
"విజయవాడలో ఎండ రోజుకో డిగ్రీ పెరుగుతుంది అద్దిళ్ళు గంటకోరేటు ఫిరాయిస్తాను. అందరికీ తెల్సిందే కదండి. నే వచ్చిన ఈ పదినిమిషాలలో పాతిక పెరగటం ఆశ్చర్యమేమీకాదు." సౌభాగ్యమ్మతో అని వైజయంతి వేపుతిరిగి "అడ్వాన్సు విషయం చెపితే యిచ్చి వెళతాను" అన్నాడు మదన్ గోపాల్.
పళ్ళు కొరుక్కుంది వైజయంతి. "బ్రహ్మచారికి రెండు గదులెందుకండీ వేషాలు?' అంది.
"ఒకగదిలో పడుకోటానికి మరో గదిలో దొర్లటానికి" అని చెప్పలేదు "పిల్లది వేడిమీదుంది జోకిస్తే చీపురు అందుకుంటుంది" అని గ్రహించినవాడయి అతి వినయంగా అంత కన్నా నెమ్మదిగా "నే ఒక్కడినే కాదండి. నాతోపాటు మా నానమ్మగారు వుంటారు, వంటా అదీ చేయటానికి" అన్నాడు మదన్ గోపాల్.
"ఈ ఘటం వదిలేరకంకాదు" అనుకుంది వైజయంతి.
"మీ బామ్మగారు నీతో వుంటారా?" అంటూ వాళ్ళ సంసారం గురించి వివరం అడిగింది సౌభాగ్యమ్మ.
తల్లి తండ్రి పల్లెటూరిలో వుంటారని....తనకి అన్నా వదినా ఓ అక్కా వున్నారని....ఈ వూళ్ళో తనకి వుద్యోగం రావటంవల్ల హోటల్ భోజనం ఎన్నాళ్ళు అంటూ నాన్నమ్మ గారు వండిపెడుతూ తన దగ్గరే వుండదల్చుకున్నారని... చాలా నిదానంగా చెప్పాడు మదన్ గోపాల్.
సౌభాగ్యమ్మ సంతోషించి ఇంటిపేరు అడిగింది.
మదన్ గోపాల్ "అన్నంరాజు" అంటూ చెప్పాడు.
"ముందే చెప్పావ్ కాదేంబాబూ! అన్నంరాజువారా, సరి సరి" అంటూ బంధుజనాన్ని అడిగింది సౌభాగ్యమ్మ.
చెప్పాడు మదన్ గోపాల్.
సౌభాగ్యమ్మ మరోసారి సంతోషించి పాత బంధుత్వమంతా తిరగదోడి బీరకాయ పీచుసంబంధంలా ఏమూలో తనకీ వాళ్ళకీ బంధుత్వం కలిసే వుంటుందని తేల్చింది. "మీ బామ్మ గారు వస్తే తేలుతుందిలే" అని కూడా తేల్చింది. "అబ్బాయి మనకి కావల్సినవాళ్ళే అయివుంటారు. ఇల్లు చూపించు మంచి రోజు వచ్చి చేరుతారు. పరాయివాళ్ళ కిచ్చేబదులు అయిన వాళ్ళకివ్వటం మంచిది" అని తేల్చేసి నడుం వాల్చటానికి ఇంట్లోకి వెళ్ళిపోయింది.
"అమ్మ ఎప్పుడూ యింతే, ఈవిడ అమాయకత్వంగాదు గాని నా ప్రాణానికొచ్చింది. బాదరాయణ సంబంధాలు వెలికి తీయటం తప్ప మరేం పనిలేదు" అనుకుంది వైజయంతి. ఏకులా యింతకుముందేవచ్చి మేకులా అంతలోనే తయారైన మదన్ గోపాల్ మీద కోపం వచ్చింది. "ఇదిగో" అంది.
"నన్నేనా?" అన్నాడు మదన్ గోపాల్.
"మిమ్మల్నే ఇదిగో ముందే చెపుతున్నాను. మా అమ్మ పాతకాలం మనిషి. ఆ యిది చూసుకుని ఏదో బంధుత్వం తేల్చి పిచ్చిగా ప్రవర్తిస్తే వూరుకోను. అద్దెకుండేవాళ్ళు అద్దెకున్నట్లే మెలగాలి. ఆ...!" అంది వైజయంతి.
"అద్దెకున్నవాడిని అద్దెకున్నట్లు మెలగక అల్లుడిలా మెలుగుతానుటండీ. అద్దె అడ్వాన్సు వగయిరాలు చెపితే యిచ్చిపోతాను" బుద్దిమంతుడిలా అన్నాడు మదన్ గోపాల్.