ఆలశ్యం అన్నింటా అనర్ధకమే అని తెలిసిన వాడయి తను వచ్చినపని తన బాధగాధ మూడుముక్కల్లోచెప్పి "అర్జంట్ గా తనకా ఖాళీవాటా యివ్వకపోతే మరణమే శరణ్యం" అని చెప్పేశాడు మదన్ గోపాల్.
వైజయంతి ఈతఫా కుండలో నీళ్ళు తీసుకురాక స్టీలు బిందెలో వేడిగావున్నా నీళ్ళు తెచ్చింది. మదన్ గోపాల్ ఆనీళ్ళే గబుక్కున అందుకుని తాగి" ప్రాణం లేచొచ్చింది" అన్నాడు.
"ఆ ఖాళీవాటా చూపించి అద్దె అదీ చెప్పమ్మా జయంతీ!" అంది సౌభాగ్యమ్మ.
"ఆవాటా అద్దెకిచ్చేది లేదమ్మా" అంది వైజయంతి.
"మీరలా అనటం న్యాయం కాదండీ!" వైజయంతితో అని సౌభాగ్యమ్మవేపు తిరిగి "పెద్దవారు ఆడినమాట తప్పరు. నాకు తెలుసు. మీ అంత వుత్తముల యింట్లో వుండటమే మహాభాగ్యం. వాటాచూసేదేముందిలేండి. అద్డెంతో చెప్పండి అడ్వాన్స్ యిచ్చి వెళతాను" అని జేబులో చెయ్యిపెట్టాడు మదన్ గోపాల్.
"పిచ్చిఅమ్మ ఏం తెలియదు. నే అలా మంచినీళ్ళు తేవటానికి వెళ్ళినప్పుడు ఏదో చెప్పివుంటాడు. కన్నీళ్ళే పెట్టుకున్నాడో, కాళ్ళే పట్టుకున్నాడో అమ్మ కరిగిపోయింది. అద్దెకెవరికివ్వాలో తను చూసుకుంటానంది కదా! అమ్మకంతా తొందర" అనుకుని "తాను తొందరపడకపోతే లాభంలేదు రంగంలోకి దిగాలి" అనికూడా అనుకుని పెదవి కదిపింది.
"మీరు బ్యాచిలరేకదా?" అంది వైజయంతి.
"ఏం పెళ్ళి చేస్తారా?" కొంటెగా వైజయంతివేపు చూశాడు మదన్ గోపాల్.
"నీకెందుకే" అంది సౌభాగ్యమ్మ.
"అనవసరంగా ఎదురుప్రశ్న వేయకండి. అడిగిందానికి జవాబు యివ్వండి. ఆ... అంతే మీరు బ్యాచిలరేనా?"
"అవునండి."
"అమ్మయ్య... ఆ మా యిల్లు సంసార్లు కితప్ప బ్రహ్మ చారుల కివ్వం."
"అదేమిటండీ సంసారంలో ఓ మనిషేకదండి బ్రహ్మ చారంటే పెళ్ళిగాని అమ్మాయిలున్నారని పెళ్ళికాని అబ్బాయి లున్నారని వాళ్ళు సంసార్లు కాకుండానే పోతారుటండీ, అదీ గాక ఇంటివాళ్ళింట్లోనే పెళ్ళిగాని అబ్బాయో, అమ్మాయో వుండివుండవచ్చు. అలా అని ఎవరం అద్దెకి దిగమంటే అర్ధముందా? అలాగే అద్దెకి దిగేవారి ఫామిలీలో అబ్బాయో, అమ్మాయో వుండివుండవచ్చు. వాళ్ళు వుండటమే పాపమయి నట్లు. వాళ్ళకి పెళ్ళికాకపోవటం ఓ శాపమయినట్లు ఎవరూ అద్దెకివ్వమంటే వాళ్ళేమయిపోవాలి."